కళ్ళు లేని బామ్మ దొంగను పట్టుకుంది!
x

కళ్ళు లేని బామ్మ దొంగను పట్టుకుంది!

మా అమ్మని పాడమని అడగని వాళ్ళు పాపాత్ములు. అడిగిందే తడువుగా మా అమ్మ ఎన్ని పాటలు పాడేదో!


అమ్మ చెప్పిన ముచ్చట్లు - 3

-రాఘవ శర్మ

"మా బామ్మ (నాయనమ్మ)కు కళ్ళు లేవు.

అయినా దొంగను పట్టుకుంది.!" అంటూ ఒక ఆసక్తికర విషయం చెప్పడం మొదలు పెట్టింది మా అమ్మ.

"మా బామ్మ పేరు నరసమ్మ.

మా ఇంట్లోనే ఉండేది.

నేను చదువుకుంటున్న రోజుల్లోనే ఆమెకు తొంభై ఏళ్ళుండేవి.

సన్నగా రివటలా ఉండేది.

మా తాతయ్య పోయాడు.

విధవ రాలయ్యింది.

నీకు తెలియందేముంది! వైధవ్యం వస్తే తెల్లచీర కట్టిస్తారు.

బొట్టు, గాజులు, నగలు తీసేస్తారు.

గుండు కొట్టించి, తలపై కొంగు క ప్పిస్తారు.

ఇదీ మా బామ్మ రూపం.

ఇప్పుడెవరూ గుండు కొట్టించుకోవడం లేదు కానీ, సంప్రదాయ కుటుంబాల్లో విధవరాలికి గుండు కొట్టించేవారు.

అలా గుండు కొట్టించకపోతే మడివంట చేయడానికి పనికిరాదనేవారు.

అందుకుని పాపం మా బామ్మకు గుండుకొట్టించారు.

ఆమె ఎన్ని పాటలు పాడేదో!

ఆమెతో కలిసి నేను కూడా పాడేదాన్ని.

మా బామ్మ పాడిన పాట ఇప్పటికీ నాకు గుర్తుంది" అంటూ మా అమ్మ ఆపాట వినిపించింది.

ఆ పాటను రికార్డు చేశాను.


పాట పాడుతున్న ఆలూరు విమలాదేవి



పల్లవి: లేవే మాయమ్మా..

లేవే ముద్దుల గుమ్మా..

లేవే బంగరు బొమ్మా లేవే..

లేచియు రాముని లేపవేగమింక

లేవలేదింకను లేవే..

చరణం: తెల్లవార వచ్చేనూ..

కాకులన్నియు కలిసి కావు కావు అనుచు

కూయు చున్నది వేగా లేవే..

తల్లి కాకాసురు మీద కోపగించితివేమో

చిలుక పలుకుల తల్లీ లేవే..

పల్లవి: లేవే మాయమ్మా..

చరణం: చిలుకలన్నియు లేచి

చిరునవ్వు నవ్వు చూ

నిను చూడగోరుచున్నవి లేవే

తల్లి చేయిమీద ఎక్కించుకు

జామ ఫలములన్నీ

చేత్తో పెడుదువు గానీ లేవే

పల్లవి లేవే మాయమ్మా..

లేవే ముద్దుల గుమ్మా..

లేవే సీతమ్మా లేవే..

చరణం: రామలక్ష్మణ భరత శత్రజ్ఞులు

వారన్నదమ్ములూ..

వారంతా లేచిరి లేవే..

అత్తవారిల్లిది లేవే..

జనకునింట నీవు ఎపుడైనా ఈలాగా

జాగు చేసితివా లేవే

జలతారు నీ కొంగు జారవిడుచుకు వేగా

జాగు చేయక నిదుర లేవే..

పల్లవి : లేవే మాయమ్మా..

లేవే ముద్దుల గుమ్మా..

లేవే సీతమ్మా లేవే..

లేవే మాయమ్మా..

లేవే ముద్దుల గుమ్మా

లేవే బంగరు బొమ్మా లేవే..” అంటూ మా అమ్మ పాడింది.

నా చిన్నతనం నుంచి తరుచూ ఈ పాట పాడడం నాకు బాగా గుర్తు.

మా కాముడు పెద్దమ్మ (రెండవ పెద్దమ్మ కామేశ్వరమ్మ) కూడా ఈ పాట పాడేది.

ఆమె వయసిప్పుడు 98 ఏళ్ళు.

ఇప్పటికీ చెలాకీగా ఉంది.

పిల్లలతో కలిసి డ్యాన్సులేస్తుంది.

మా అమ్మని పాడమని అడగని వాళ్ళు పాపాత్ములు.

అడిగిందే తడువుగా మా అమ్మ ఎన్ని పాటలు పాడేదో!

వాళ్ళ బామ్మ గురించి చెప్పడం మళ్ళీ మొదలు పెట్టింది.

"మా బామ్మ నరసమ్మకు కళ్ళు లేవు, అక్షరం తెలియదు.

వాళ్ళ పెద్ద వాళ్ళనుంచి ఈ పాట నేర్చుకుంది.

ఎవరు రాశారో తెలియదు.

ఎన్ని తరాల నుంచి ఈ పాట వస్తోందో తెలియదు.” అని చెప్పింది.

మన చుట్టూ ఉండే మనుషుల గురించి, కుటుంబ సభ్యుల గురించి ఏదైనా చెప్పాలనుకుంటే పౌరాణిక పాత్రల పేరుతో పాట రూపంలో ఇలా చెప్పే వారు.

మేలుకొలుపులే కాదు, నిద్రపుచ్చడానికి పవళింపులు, కృష్ణుడి మీద పెట్టి లాలి పాటలు, జోల పాటలు పాడుకోవడం అలా వచ్చిన అలవాటే.

"మా చిన్నప్పుడు ఇంటి పనులన్నీ మేమే చేసుకునే వాళ్ళం.

చెయ్యకపోతే మా అమ్మ కొట్టేది, నెత్తిన మొట్టేది.

మా నాయనమ్మ అన్నం తిన్నాక తడుముకుంటూ తడుముకుంటూ వెళ్ళి తన కంచం తానే తీసుకెళ్ళి బయట పడేసేది.”

"మా నాయనమ్మకు కళ్ళు లేవని చెప్పాను కదా!

తొంభై ఏళ్ళ వయసులో కూడా తన పనులు తానే చేసుకునేది.

రాత్రి పూట భోజనాలు చేశాక, కంచం బైటపడేయడానికని పెరట్లోకి వెళ్ళింది.

ఏదో అలికిడి వినిపించి, తడుముకుంటూ తడుముకుంటూ అడ్డం వచ్చిన దాన్ని పట్టుకుంది.

అదొక చెయ్యి.

ఆ చెయ్యి వదలకుండా 'దొంగా దొంగా..' అని పెద్దగా అరిచేసింది.

నలువైపుల నుంచి అంతా వచ్చి ఆ 'దొంగ'ను పట్టేసుకున్నారు.

'గుడ్డిది కదా! ఏం పట్టుకుంటుందిలే' అని పారిపోకుండా పాపం తాత్సారం చేశాడతను.

నలుదిక్కుల నుంచీ వచ్చేసరికి పట్టుబడిపోయాడు.

మా నాన్న మనిషితో కబురంపే సరికి పోలీసులు వచ్చి ఆ దొంగను పట్టుకుపోయారు.

పోలీసులు ఆ ‘దొంగ ' కోసం చాలా కాలం నుంచి వెతుకుతున్నారట.

కళ్ళు లేని తొంభై ఏళ్ళ ముసలామె దొంగను పట్టుకోవడమేమిటి!? అంటూ అంతా ఆశ్చర్యపోయారు.

పోలీసులు వచ్చి మా బామ్మను మెచ్చుకున్నారు.” అంటూ వివరించింది.

"మా చిన్నప్పుడు పుట్టిన రోజు వచ్చిందంటే మహా సందడిగా ఉండేది.

ఊళ్ళో అందరినీ పేరంటానికి పిలిచి భోగి పళ్ళు పోసే వాళ్ళు.

భోగి పళ్ళంటే రేగిపళ్ళ లో చిల్లర డబ్బులు కలిపి తలపై పోయడం.

పేరంటానికి పెద్ద వాళ్ళ కంటే పిల్లలే ఎక్కువగా వచ్చే వాళ్ళు." అంటూ మా అమ్మ చెపుతోంది.


వేమవరంలో రచయిత రాఘవ శర్మ, వేమవరపు గౌతమ్, చంద్రశేఖర్.


“ఒక సారి ‘ఉప్పినీ గాలి” (ఉప్పెనతోపాటు వచ్చిన ఈదురు గాలి) వచ్చింది.

వేమవరంలో పూరిళ్ళన్నీ పడిపోయాయి.

కొన్ని ఇళ్ళకు పెంకులు లేచిపోయాయి.

మా మండువా ఇంటికి కూడా కొన్ని పెంకులు లేచిపోయాయి.

ఇంట్లో బట్టలు, కాయితాలన్నీ తడిసిపోయాయి.

మేం పుట్టినప్పుడు (తెలుగు) సంవత్సరం, పాదం, వారం, తిథి, నక్షత్రం వివరాలతో జాతకాలు రాసేవారు.

మా జాతకాల కాయితాలన్నీ తడిసిపోయాయి.

దాంతో ఎవరు ఏ సంవత్సరంలో పుట్టారో, వారి జాతకం ఏమిటో తెలియకుండా పోయింది.

మానాన్న జమా బందీలెక్కలు కూడా కొంత తడిసిపోయాయి.

మా ఇంట్లో నా ఒక్కదాని పుట్టిన తేదీనే గుర్తుండి పోయింది.

ఎందుకంటే నేను ఉగాది రోజు పుట్టాను కనుక.

నా పుట్టిన తేదీని, సంవత్సరాన్ని బట్టి మిగతా వారి పుట్టిన సంవత్సరాన్ని లెక్కేశారు.

ఒక్కొక్కళ్ళకీ మూడేళ్ళ తేడా.

నేనలా ఉగాది నాడు పుట్టినందుకు మాకొక మేలు జరిగింది.” అంటూ ముగించింది.

మా అమ్మ ఉగాది నాడు పుట్టింది కనుక ఇప్పటికీ మేం ఉగాదిని జరుపుకుంటాం.

అదొక వేడుక.

(గమనిక : పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి గారి సూచన మేరకు 'అమ్మ జ్ఞాప కాలు' అన్న ఈ శీర్షికను 'అమ్మ చెప్పిన ముచ్చట్లు' గా మారుస్తున్నాం)

(ఇంకా ఉంది)


(ఆలూరు రాఘవశర్మ, జర్నలిస్టు, రచయిత, తిరుపతి)

Read More
Next Story