వందేళ్ల కిందట పెళ్లి రాజకీయాలేలా ఉండేవంటే...
x

వందేళ్ల కిందట పెళ్లి రాజకీయాలేలా ఉండేవంటే...

నాకు నచ్చిన నాటకం: డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి (కాళ్ళకూరి నారాయణ రావు గారి 'వరవిక్రయం' విశ్లేషణ)


హాస్యం, వ్యంగ్యం, అంతర్లీనంగా వేదన కలగలిసిన నాటకం



-డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి


నాటకం శ్రవ్య, దృశ్య మాధ్యమం. ఈ సినిమాలు, టీ. వీ. లు లేని రోజుల్లో పౌరాణిక పద్య నాటక ప్రదర్శనలు చూసి ప్రజలు అమితానందాన్ని పొందే వారు. ఆ రోజుల్లో అదే వినోద కాలక్షేపం. ఏ నాటక ప్రక్రియ ద్వారా ప్రజలు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పొందుతున్నారో, ఆ నాటకం ద్వారానే ప్రజలలో చైతన్యాన్ని, హేతుబద్ధ ఆలోచనని కలిగించే ప్రయత్నం సంఘ సంస్కరణోద్యమ కాలం లో జరిగింది.

19వ శతాబ్దం లో తెలుగు సమాజాన్ని పట్టి వేధించిన కన్యాశుల్కం, బాల్యవివాహం, వితంతు సమస్య, మద్య పానం, వేశ్యా సమస్య ఇత్యాది సమస్యలను శక్తిమంతంగా రచయితలు నాటకాలుగా రచించి తెర కెక్కించారు. తమ ప్రదర్శనలతో ఒక చైతన్యపూరిత వాతావరణాన్ని సమాజం లో తీసుకువచ్చారు. ఆనాడు కన్యాశుల్కం, బాల్య వివాహం, వితంతు సమస్య ఇంటింటి సమస్యలు. ప్రతి ఇంటా ఒక బాల వితంతువు, ఒక కన్యాశుల్క వివాహం తప్పక ఉండేది. స్టేజి పై ప్రదర్శించిన నాటకాలను చూసి ప్రజలు తమ ఇంటి విషయమే కదా అన్నట్లు పాత్రలతో తాదాత్మ్యం చెందేవారు. కవిత్వం, కథ, నవల వంటి ఇతర సాహిత్య ప్రక్రియల కన్న నాటకం ఇంకా శక్తీమంతమైనది. ప్రదర్శనను చూస్తూ,వింటూ అందులోని విషయాన్ని ఎక్కువగా గ్రహించటానికి అవకాశం ఉంటుంది. అందుకే సంస్కర్తలు తమ భావ వ్యాప్తికి, సమాజాభ్యుదయానికి నాటకాన్ని ప్రధాన సాధనం గా ఎంచుకున్నారు.

బాల్య వివాహాలను ఖండించటంలో, వితంతు పునర్వివాహాలు చేయటంలో ఆచరణాత్మక కృషి చేసిన ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం. ఆయన ఒక వ్యక్తి కాదు, శక్తి. అన్ని ప్రక్రియలలోనూ అసంఖ్యాక రచనలు చేసారు. సమకాలీన సంఘ దురాచారాలను నాటకాలుగా, ప్రహసనాలుగా రచించి, నాటక సమాజాన్ని స్థాపించి, ప్రజల ముందు ప్రదర్శించారు.కందుకూరి పుట్టినరోజు ఏప్రిల్ 16న ప్రతి ఏడు తెలుగు నాటక రంగ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం.


1892లో గురజాడ అప్పారావు గారు తమ కన్యాశుల్కం నాటకాన్ని, విజయనగరం లో జగన్నాధ విలాసినీ నాటక సభ లో ప్రదర్శింప జేశారు. సమకాలీన సంఘ దురాచారాలను బహిర్గతం చేయటానికి నాటకాన్ని మించిన సాధనం లేదని వారు చెప్పారు. ఆ నాటక ప్రదర్శనను ఆనాటి పత్రికలు గొప్పగా సమీక్షించాయి.

కన్యాశుల్కం అంటే వరుడు, కన్యాదాతకు అంటే ఆడపిల్ల తండ్రికి శుల్కమిచ్చి, కన్యను పెళ్ళాడటం. చిన్న పిల్లలను వయసు మీరిన వృద్ధులకిచ్చి పెళ్లి చేసేవారు. కన్యాశుల్కం అంతరించే దశ లో సమాజంలో వరకట్నం వచ్చింది. ఆడపిల్ల తండ్రి వరుడికి కట్నం ఇచ్చి, కూతురు పెళ్లి జేసే పద్ధతి ఇది. కన్యాశుల్కం, వరకట్నం రెండూ పరస్పర విరుద్దాలుగా కన్పించినా రెండింటిలో స్త్రీలే బాధితులు.


సుప్రసిద్ధ నాటక కర్త కాళ్ళకూరి నారాయణ రావుగారు 1923లో వర విక్రయం నాటకం రచించారు. 1871ఏప్రిల్ 28 వీరి జననం. కళాశాల అధ్యాపకులుగా కొన్నాళ్ళు పని చేసారు. న్యాయ వాద వృత్తి ని కూడా చేసారు.


కాళ్ళకూరి వారు నాడు సమాజం లో ప్రబలంగా ఉన్న వర కట్నం గురించి వర విక్రయం,మద్య పానం గురించి మధుసేవ, వేశ్యా సమస్య గురించి చింతామణి అనే మూడు ప్రసిద్ధ నాటకాలను రచించారు. ఇంకా అనేక నాటకాలు రచించారు. వీరు స్వయంగా నటులు కూడా. సంస్కరణ భావాలతో రచనలు చేయటమే కాదు, ఆచరణలో కూడా చూపించిన వ్యక్తి. కందుకూరి వారి ఆశయాల స్ఫూర్తి తో వీరు కట్నం లేకుండా వివాహం చేసుకున్నారు. బాల వితంతువైనతన సోదరికి పునర్వివాహం చేయాలనుకుని, తండ్రి అంగీకరించక పోవటం వల్ల ఇల్లు విడిచి వెళ్లిపోయారు.సామాజిక దురాచారాలను అద్భుతమైన నాటకాలుగా మలిచి ప్రదర్శించి సమాజ క్షేమాన్ని కాంక్షించిన వీరు 1927లో జీవిత నాటక రంగం నుంచి నిష్క్రమించారు.

వర కట్న సమస్య ను చిత్రించిన రచనలలో కాళ్ళకూరి వరవిక్రయం ప్రసిద్ధి పొందిన రచన.

పుణ్యమూర్తుల పురుషోత్తమరావు సంఘసంస్కరణాభిలాషి. జాతీయొద్యమ భావాలు కల వ్యక్తి. వారి కుటుంబ సభ్యులందరు రోజూ రాట్నం వడుకుతారు. ఈయనకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి కాళింది కి 13ఏళ్ళు. చిన్నమ్మాయి కమలకు 12ఏళ్ళు. తండ్రి ఆశయాలను, ఆదర్శలను పూర్తిగా అనుసరించేవారు. చదువన్నది లోక జ్ఞానాన్ని, హేతు బద్ధ ఆలోచనను కలగజేయాలన్న మాటకు వీరిద్దరూ నిలువెత్తు తార్కాణం. ఆనాటి ఆడపిల్ల లందరి లాగే వీళ్ళు తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్, హిందీ,సంగీతం నేర్చుకున్నారు. కుట్లు, అల్లికలు వచ్చు. ఆనాడు పెళ్లికూతుళ్ళ అర్హతలివి.

పురుషోత్తమ రావు గారు తన కూతుళ్ళకు కట్నం లేని వివాహం చేద్దామనుకుని, శాయ శక్తులా ప్రయత్నించి, సాధ్యం కాక, భార్య ప్రోత్సాహం తో, పెళ్లిళ్ల పేరయ్య చెప్పిన సంబంధానికి ఒప్పుకుంటాడు. సింగరాజు లింగరాజు గారబ్బాయి బసవరాజు వరుడు. కట్నం కోసంపురుషోత్తమ రావు పదెకరాల పొలం అమ్మి 5,500కట్నండబ్బు పెళ్ళికి ముందే ఇస్తాడు. అలా ఇవ్వకపోతే లింగరాజు ఊరుకోడు.కాళింది కి ఈ కట్నం ఇచ్చే పెళ్లి ఇష్టం లేదు. తల్లిదండ్రులతో చెప్పినా ప్రయోజనం లేదు. వార్తా పత్రిక లో వరకట్న బాధితురాలైన ఒక యువతి ఆత్మహత్య కథనం చదివి,ఆ ప్రేరణ తో కాళింది తాను తల్లిదండ్రులకు ఒక ఉత్తరం రాసి, పెరటి బావిలో దూకి మరణిస్తుంది. లింగరాజు, తీసుకున్న కట్నం ఇవ్వడు.

అప్పుడు చిన్నమ్మాయి కమల, అక్క మరణానికి కారణమయిన వరకట్న దురాచారాన్ని ప్రతిఘటిస్తూ, లింగరాజు కు బుద్ధి చెప్పటానికి, బసవరాజు ను తాను పెళ్లాడి, నాటక మంతా నడిపిస్తుంది.పరమలోభి లింగరాజు, తమ శుభలేఖలు కూడా ఆడపెళ్లి వారినే అచ్చు వేయించమంటాడు. ఇది అదునుగా తీసుకుని కమల శుభలేఖలలో "కమలకు బసవరాజు నిచ్చి "అని అచ్చు వేయించి కోర్టు లో ఆ శుభలేఖ లను చూపి భర్తే తన ఇంటికి వచ్చి తాను చెప్పినట్లు వినాలంటుంది. లింగరాజు, కొడుకు పెళ్ళిలో కోడలికి తన దగ్గర ఎవరో తాకట్టు పెట్టిన నగలు పెడతాడు.వెంటనే తీసేసు కోవచ్చనుకుంటాడు. అవి తనకు పెట్టిన నగలు కాబట్టి తనవే అంటుంది కమల. కోర్టు కమలకి అనుకూలంగా ఉంటుంది. కోర్టు సీను ఉత్కంఠ భరితంగా ఉంటుంది. లింగరాజు లోభగుణం, కమల యుక్తి కరమైన మాటలు, నవ్వు పుట్టించే వెంగళప్ప అవివేకపు మాటలు, నాటకం చదువుతున్నా, చూస్తున్న అనుభూతి కలుగుతుంది. వరుడు బసవరాజు మంచి వ్యక్తి, మృదు స్వభావి. తన తండ్రి వరకట్న దాహాన్ని కోర్టు లో బహిరంగ పరచి, కమల వెంట వెళ్ళటానికి సిద్ధపడతాడు. లింగరాజు కు బుద్ధి రావటం తో సందేశాత్మకంగా నాటకం ముగుస్తుంది.

ఈ నాటకం లో 12ఏళ్ల కమల, తండ్రీ ఆశయాల మార్గం లో నడుస్తూ,పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని,వరకట్న దురాచారాన్ని ఎదిరించటానికి ఎన్నుకున్న మార్గం పాఠకులను ఆశ్చర్య చకితులను చేస్తుంది.కాళింది కట్నం ఇచ్చి చేసుకునే పెళ్లి ఇష్టం లేక ప్రాణ త్యాగం తో ఆత్మగౌరవాన్ని చాటుకుంది. ఇద్దరు ఆడపిల్లలు వరకట్నమనే సామాజిక దురాచారం పై పోరాడి సాధించిన విజయ గాధ వరవిక్రయం నాటకం. ఆడపిల్లల ఆత్మగౌరవాన్ని చాటిన కథ ఇది.

ఈ నాటకం సమకాలీన పరిస్థితులను పాఠకుల కళ్ళ ముందు నిలబెడుతుంది. మగవాళ్ళు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా నాటి సమాజం అమోదించింది. అలా లింగరాజు మూడవ పెళ్లి చేసుకున్న సుభద్ర ఈ నాటకంలో మరో భాధిత స్త్రీ. వయసు లో హెచ్చు తారతమ్యం వల్ల ఆమె ఎవరితో మాట్లాడినా భర్తకు అనుమానం దానికి తోడు పిసినిగొట్టు తనం. ఆమెకు ఏ సంతోషం దక్కదు.


లింగరాజు పాత్ర ప్రభావం తో తెలుగు సినిమాలలో కొన్ని పాత్రలు రూపు దిద్దుకున్నాయి.

ఇది పద్య గద్య నాటకం. కాళ్ళకూరి వారి పద్యశైలి సరళంగా ఉండి ఎటువంటి వారికైనా ఇట్టే అర్థమవుతాయి. సీస పద్యాలు, ఉత్పలమాల, చంపకమాల, తేట గీతి ఇలా పలు ఛందస్సులలో తేట తెల్లంగా ఉండే పద్యాలు ఇవి. చదవటం మొదలుపెట్టాక ఆపకుండా చదివించే నాటకం ఇది.

హాస్యం, వ్యంగ్యం, అంతర్లీనంగా ఉండే వేదన కలగలిసిన గొప్ప నాటకం కాళ్ళకూరి నారాయణ రావు గారి వరవిక్రయం నాటకం.


(డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గురజాడ అప్పారావు రచనలపై పరిశోధన చేసారు. మహాకవి గురజాడ అప్పారావు, మహాకవి జాషువా జీవితం --సాహిత్యం అనే రెండు పుస్తకాలు రచించారు. చెంగల్వ పూలు 'అనే కథల సంపుటాన్ని ప్రచురించారు. ప్రస్తుతం దిన పత్రికలలో ఆధ్యాత్మిక వ్యాసాలు రాస్తున్నారు. అంతర్జాల పత్రికలలో కథలు, సాహిత్య వ్యాసాలు రాస్తున్నారు.)

Read More
Next Story