ఏర్పేడు దగ్గిర ఉత్తేడి కోనకు పాదయాత్ర
x

ఏర్పేడు దగ్గిర ఉత్తేడి కోనకు పాదయాత్ర

ఒక అనుభూతి నుంచి ఆధ్యాత్మిక వారసత్వం వైపు మనసును మళ్లించే కఠిన పరీక్ష పెడుతుంది కోన బాట


ఈ మధ్య తిరుపతికి దగ్గరలోని ఏర్పేడు సమీపాన వుత్తేడి కోన సందర్శించాను. ఈ ప్రదేశం గురించి తెలిసినవారు చెప్పగా ప్రకృతి ప్రేమికులమైన మా “గ్రీన్ సోల్స్” బృందంతో కలిసి ఒక శనివారం మధ్యాహ్నం తిరుపతి నుంచి బయలుదేరాము. అడవిలో ఐదు–ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ కోనకు చేరుకునే మార్గమే ఒక ఆత్మీయ అనుభవం.

ఎగుడు దిగుడు రాళ్ల మధ్య, ముళ్లకంపలతో నిండిన దారిలో అడుగులు వేస్తూ మేము ముందుకు సాగాము. ప్రతి అడుగు ఒక జాగ్రత్త, ప్రతి కదలిక ఒక సహనం. నేల మీద నీటి జాడ ఎక్కడా లేదు; ఎండిన మట్టి పగుళ్లు వేసుకుని, దాహంతో నిట్టూర్చుతున్నట్టు కనిపించింది. తలపై మండుతున్న భానుడి కిరణాలు చురుక్కుమంటూ శరీరాన్ని తాకుతుండగా, చెమటబిందువులు నుదిటి నుంచి జారిపడుతున్నాయి. వేడి గాలి ఊపిరి పీల్చుకోవడానికే భారంగా అనిపించింది.

రాళ్లపై జారి పడకూడదనే జాగ్రత్త, ముళ్లకంపలు చర్మాన్ని గుచ్చుతాయనే అప్రమత్తత, దాహంతో ఎండిపోయిన గొంతు — ఇవన్నీ కలిసి ఆ ప్రయాణాన్ని ఒక శారీరక పరీక్షగా మార్చాయి. ప్రతి అడుగు ఒక కఠిన సాధనలా అనిపించింది. ప్రకృతి తన సౌందర్యాన్ని సులభంగా అందించదు; ముందుగా మన సహనాన్ని, మన నిబద్ధతను పరీక్షిస్తుంది అన్న భావన కలిగింది.

ఆ భానుడి ప్రతాపానికి ప్రత్యక్ష సాక్షులమై, చెమటతో తడిసిన దేహంతో, దాహంతో ఎండిన పెదవులతో, కానీ మనసులో మాత్రం ఒక అచంచల తపనతో మేము ముందుకు నడిచాము. ఆ కఠిన దారే మాకు వినయాన్ని నేర్పింది. ఆ దాహమే నీటి విలువను గుర్తుచేసింది. ఆ వేడిగాలే చెట్టు నీడ మహిమను తెలియజేసింది.

ఇలా శ్రమతో, సహనంతో, ప్రకృతి పరీక్షను దాటుతూ చివరకు కోనలోకి ప్రవేశించాము. ఆ ప్రవేశం ఒక సాధారణ అడుగు కాదు — ఒక సాధన అనంతరం లభించిన దర్శనం. ప్రకృతి కఠినత వెనుక దాగి ఉన్న కరుణను, కష్టాల వెనుక ఉన్న దివ్యతను అర్థం చేసుకున్న క్షణం అది.

మార్గమధ్యంలో ఒక గ్రామస్థుడు చెప్పిన కథనం మాకు మరింత భక్తి భావాన్ని కలిగించింది. ఎప్పుడో ఒక సాధుపుంగవుడు అక్కడ నివసించేవాడని, ఎగుడు దిగుడుగా ఉన్న భూమిని తన చేతులతో సరిచేసి ఆరాధనకు అనువుగా తీర్చిదిద్దాడని ఆయన వివరించాడు. అదే కోనలో ఒంటరిగా నివసిస్తూ దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించాడని విన్నపుడు ఆ మహనీయునిపై మాకు అపార గౌరవం కలిగింది. ఆయన తపస్సు ప్రకృతితో ఏకమై ఉండి ఉండాలి; ఆయన ధ్యానం ఆ నేలలోనే ప్రతిధ్వనించి ఉండాలి.

సాయంత్రం అయిదు గంటల సమయంలో కోనలోకి అడుగుపెట్టాము. ఇటీవల శివరాత్రి జరగడంతో చుట్టూ ప్రక్కల గ్రామాల భక్తుల సందర్శన ఆనవాళ్లు కనిపించాయి. అయితే ఎక్కడ చూసినా ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు — ప్రకృతి పట్ల మన నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపించాయి. ఆ దృశ్యం మనసును కలచివేసింది. దేవుని దర్శించడానికి వచ్చిన మనిషి, దేవుని సృష్టినే కలుషితం చేయడం ఎంత వ్యతిరేకమో ఆ క్షణంలో బలంగా అనిపించింది.

మేమందరం ప్రకృతి ప్రేమికులము; ప్రకృతిలోనే దైవాన్ని దర్శించే వారము. అందుకే మా హోదాలు, ఆర్థిక స్థితులు అన్నీ పక్కనపడ్డాయి. రిటైర్డ్ FRO ప్రభాకర్ రెడ్డి, మెడికల్ ఏరియా మేనేజర్ విశ్వనాథ్‌, ఇన్సూరెన్స్ సీనియర్ మేనేజర్ నాదముని, టెలికాం డీఈ వేణుగోపాల్ రెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైసర్ బాలచంద్ర — ఎవరూ తమ హోదాలను గుర్తు చేసుకోలేదు. ఆ క్షణంలో మేము కేవలం ప్రకృతి సేవకులమాత్రమే.

అరగంటలో ఆ ప్రాంతాన్ని శోభావిహీనం చేస్తున్న వ్యర్థాలను ఒక చోట చేర్చాము. అది చిన్న గుట్టలా మారింది. చుట్టూ ఉన్న చెట్లకు, హాని కలగకుండా జాగ్రత్తగా చెత్తను తొలగించాము. ఆ శ్రమ మాకు కేవలం శుభ్రపరిచే కార్యం కాదు; అది ప్రకృతి దేవికి అర్పించిన పుష్పార్చన. ప్రకృతిని కాపాడడం కూడా భక్తిలో భాగమని మేము ఆచరణలో చూపించాము.

ఆ ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు మరో ప్రత్యేకత గమనించాము. చుట్టుపక్కల ఐదు లేక ఆరు కిలోమీటర్ల పరిధిలో నీటి జాడ కనిపించలేదు. అయితే కోనలో మాత్రం కొద్దిపాటి నీటి ఆనవాళ్లు కనిపించాయి.

అందుకే కావచ్చు — చీకటి వేళల్లో అటవీ జంతువులు ఒక్కొక్కటిగా నీటిని త్రాగడానికి అక్కడికి చేరుతున్నాయి. ఆ నీరు వాటికి జీవనాధారం; ఆ కోన వారికి ఆలయం.

రాత్రి మరింత గాఢమవుతున్న కొద్దీ అడవి తన అసలైన స్వరాన్ని విప్పింది. మృదువైన అడుగుల శబ్దాలు దగ్గరగా వినిపించాయి. పొదలు కదిలిన సవ్వడులు, ఎక్కడో దూరంగా వినిపించిన జంతువుల స్వరాలు — ఇవన్నీ కలిపి ప్రకృతి ఒక మౌన సంగీతాన్ని ఆలపిస్తున్నట్టుగా అనిపించాయి. చీకటిలో ఒక్కసారిగా మెరిసిన కళ్ల జ్యోతి మనల్ని గమనిస్తున్న ప్రకృతి సాక్ష్యంలా అనిపించింది.

కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే — ఆ జంతువుల కదలికల్లో భయం కనిపించలేదు. మేము అక్కడ ఉన్నామనే అవగాహన ఉన్నప్పటికీ అవి వెనక్కి తగ్గలేదు. ఒకసారి తలెత్తి చూశాయి, కాసేపు ఆగి మళ్లీ తమ దారిలోనే సాగిపోయాయి. అది మనిషిని చూసిన అపరిచిత జీవి ప్రతిస్పందనలా కాకుండా, చాలాకాలంగా అలవాటైన దృశ్యాన్ని చూసిన సహజ స్వభావంలా అనిపించింది.

ఆ దృశ్యం ఒక ఆలోచనను రేకెత్తించింది — బహుశా శుభదినాలలో, పండుగ సందర్భాల్లో, ముఖ్యంగా శివరాత్రి వంటి పుణ్యకాలాల్లో భక్తులు ఆలయ ప్రాంగణంలోనే రాత్రి బస చేయడం వీటికి అలవాటై ఉండవచ్చు. మనిషి ఉనికి వీటికి అపూర్వం కాదు; సాధారణం. ఆలయ పరిసరాలు వీటికి భయంకర ప్రదేశం కాదు; సురక్షితమైన స్థలం.

అలా మనుషులు, అటవీ జీవులు ఒకే ప్రాంగణంలో, ఒకే ఆకాశం కింద, ఒకరినొకరు అంగీకరించినట్లుగా సహజీవనం చేస్తున్న దృశ్యం మనసుకు ఒక గొప్ప సందేశం ఇచ్చింది. ప్రకృతి ఒడిలో మనిషి అధిపతి కాదు; సహజీవి మాత్రమే. అక్కడ భయం కన్నా పరస్పర అవగాహన ఎక్కువగా కనిపించింది. అదే ఆ రాత్రి మాకు లభించిన అద్భుతమైన అనుభూతి.


మేముఆ రాత్రి గుండెల్లో ధైర్యాన్ని దాచుకుని నిద్రపోయాము. భయం కంటే ఎక్కువగా వినయం మనసులో ఉండింది — ఈ భూమి అసలైన యజమానులు వారు; మనం అతిథులమే అన్న జ్ఞానం.

నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద, గాలి మృదువైన స్పర్శలో, అటవీ జీవుల మధ్య గడిపిన ఆ రాత్రి మా జీవితంలో ఒక ఆధ్యాత్మిక దీక్షగా నిలిచిపోయింది. అది కేవలం ఒక బస కాదు — ప్రకృతిలోనే పరమాత్మ ఉన్నాడని ప్రత్యక్షంగా అనుభవించిన క్షణం.

నా దృష్టిలో దివ్యస్థలాల మహిమ ఇదే —

దైవం రాతి గోడల్లో మాత్రమే కాదు,ఆకుల సవ్వడులలోను వుంది;

గర్భగుడిలోనే కాదు,

అడవి నిశ్శబ్దంలోనూ పారే సెలయేళ్లలోనూ ఉంది.

ఒక మహనీయుని తపస్సులో పుట్టి,

ఒక మనసులో ప్రారంభమై,

సమాజ విశ్వాసంగా విస్తరించి,

యుగయుగాలపాటు నిలిచే ఆధ్యాత్మిక కేంద్రమవడమే దివ్యస్థలాల అసలు అర్థం.

ఒకప్పటి చిన్న గుడులు పెద్ద దేవాలయాలుగా రూపాంతరం చెందడానికి కొన్నిటికి పదుల సంవత్సరాలు పడితే, మరి కొన్నింటికి వందల సంవత్సరాలు పడుతుంది. కానీ ఆ రూపాంతరం వెనుక ఎప్పుడూ ఒక హృదయం, ఒక తపస్సు, ఒక విశ్వాసం — ప్రకృతిపట్ల గాఢమైన భక్తి — తప్పక ఉంటాయి.

వుత్తేడికోన ఎక్కడ ఉంది

ఈ కోన తిరుపతి నుండి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఏర్పేడుకు దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరంలో వెంకటంపల్లి అడవులలో ఉంది. తిరుపతి నుంచి రహదారి మార్గంలో ముందుగా ఏర్పేడు చేరాలి. అక్కడి నుంచి స్థానిక మార్గదర్శకులతో లేదా దారులు తెలిసిన వారి సహాయంతో వెంకటంపల్లి అటవీ ప్రాంతంలోకి ప్రయాణించాలి. చివరి ఐదు–ఆరు కిలోమీటర్లు అడవి మార్గమే కావడంతో వాహనం ఒక దశ వరకు మాత్రమే వెళ్లగలదు. తరువాత కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది. అడవి ప్రాంతం కావడంతో ముందస్తు అనుమతులు తీసుకోవడం, తగిన జాగ్రత్తలు పాటించడం అవసరం.


ప్రతి మనిషి జననం నుంచి మరణం వరకు అనేక ప్రదేశాలను సందర్శిస్తుంటారు. నా అనుభవంలో జీవన యాత్రలో అడుగుపెట్టే ప్రతి నేల ఒక ప్రత్యేక స్పందనను ఇస్తుంది. కొన్ని ప్రదేశాలు మనసులో అసౌకర్యాన్ని, అపరిచిత భయాన్ని మిగులుస్తాయి. మరికొన్ని కేవలం ప్రయాణంలో ఒక దశగా మాత్రమే మిగిలిపోతాయి. అయితే చాలా అరుదుగా కొన్ని స్థలాలు మాత్రం మనసును మౌనంగా ఆకట్టుకొంటాయి . అక్కడ అడుగుపెట్టిన క్షణమే హృదయంలో ఒక తెలియని ప్రశాంతత ఉప్పొంగుతుంది. ఆ గాలి, ఆ నేల, ఆ నిశ్శబ్దం — ఇవన్నీ కలిపి ఒక దివ్య స్పందనను కలిగిస్తాయి.

నా భావనలో అలాంటి అనుభూతినే మనిషి దైవ కటాక్షంగా భావిస్తాడు. ఆ కృతజ్ఞతతో అక్కడ ఒక చిన్న విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. అక్కడే పూజలు ప్రారంభమవుతాయి. కాలక్రమేణా ఆ చిన్న ఆరాధన స్థలం ఆలయంగా మారుతుంది. ఒక మనసులో పుట్టిన అనుభూతి తరువాత కాలంలో సమాజ విశ్వాసంగా విస్తరిస్తుంది. తరతరాలకు అది ఆధ్యాత్మిక వారసత్వంగా నిలుస్తుంది. భక్తి కాలంతో కలిసి నడుస్తుంది; పాలకులు మారినా, రాజ్యాలు మారినా — విశ్వాసం మాత్రం పదిలంగా నిలిచి ఉంటుంది.

Read More
Next Story