జయహో, చార్మినార్!
x
నవాబు దుస్తుల్లో రచయిత భూమన్

జయహో, చార్మినార్!

హైదరాబాదంటే నాకు చార్ మినార్ (Charminar). ఎన్ని పదులసార్లు ఆ నిర్మాణం చుట్టూ తిరిగి వుంటానో? అయినా పాతబడ లేదు. ఎట్టాంటి అయస్కాంతపు ఆకర్షణ?


ఎన్నిమార్లు హైదరాబాదు వచ్చినా చార్మినార్ ప్రాంతం ఆకర్షణ ఎంత మాత్రమూ తరగడం లేదు. 70వ దశకంలో నా విద్యార్థి దశలో కవి జ్వాలాముఖిని కలుసుకునేందుకు ఓల్డ్ సిటి కాలేజీకి కి వచ్చేది. జ్వాలా ఆ ప్రాంతంలో ఒక చోట ఒక తిండి, మరొక చోట మరొక తిండి, ఇరానీ ఛాయ్, రాం ప్యారీ పాన్ రుచులన్నిటినీ నేర్పించింది ఇక్కడే. పూ రీలోకి తీపులు తినటం నేర్పించింది ఇక్కడే. ఏం మనిషి అతను. ఎంతటి స్నేహశీలి. వయసు తేడా లేకుండా హైదరాబాదును సన్నిహితంగా పరిచయం చేసిన మహానుభావుడు జ్వాలా. నయాగరా బిర్యానీ, మదీనా పాయా, నాంపల్లి లతా థియేటర్ లో పాకీజా సినిమాను పరిచయం చేసిందీ జ్వాలానే. అబిడ్స్ లోనే రాత్రంతా తిప్పి గల్లీ గల్లీ చరిత్ర నంతా విప్పి చెబుతూండే వాడు. బషీర్ బాగ్ బ్లూడైమండ్ (Blue Diamond) లో మంచి తిండి తినిపించి హైదరాబాదును నా అక్కున చేర్చిన ప్రియ బాంధవుడు జ్వాలా. అంతేనా ఇంటికి పిల్చుకుపోయి గొప్ప ఆతిథ్యం పంచి పెట్టి స్నేహ పరిమళాలను వెదజల్లినవాడు.

అదిగో అప్పటి నుండి హైదరాబాదంటే నాకు చార్ మినార్ (Charminar). ఎన్ని పదులసార్లు ఆ చుట్టూ తిరిగి వుంటానో? అయిన పాతబడ లేదు. అట్టాంటి అయస్కాంతపు ఆకర్షణ?




మేం అత్యవసర పరిస్థితి రోజుల్లో ముషీరాబాదు జైల్లో ఉండగా Osmania hospital GandhI Hospital, Mental, Chest ఆసుపత్రులు, వాటి వైభోగం చూసి ఆశ్చర్యపోయేవాణ్ణి. సికింద్రాబాదు రైల్వేస్టేషన్ ఆకృతి, నాంపల్లి స్టేషన్ అందం ఆల్ఫాఛాయ్ అప్పటి నుండి ఆకట్టుకుంటూనే ఉన్నాయి.

చార్మినార్ ను కనులారా చూడటం, పరవశించటం ఒక గొప్ప అనుభూతి. కులీకుతుబ్ షా 1591 లో ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా నిర్మించిన ఈ చార్మినార్ ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక ఐకాన్. చార్మినార్ పైన మసీదును చూడటం అక్కడ నుండి చూసినంత దూరం నగరపు మిరుమిట్లు ఒక అద్భుతం.




పక్కనే వున్న మక్కా మసీదు, యునానీ ఆసుపత్రి, 1592 లో కట్టబడిన చార్మినార్ కమాన్ కాలికమాన్, మచిలీ కమాన్, షీర్ ఏ బాతుల్ కమాన్లు చూపరులను అబ్బుర పరుస్తాయి. చార్మినార్ ను ఉత్తర వీధిలో ఉన్న లాద్ బజార్లో తిరగటమే ఒక జీవిత సాఫల్యం, రకరకాల ఆడవాళ్లు, గాజుల గల గలలు, రకరకాల రంగుల మైకం అది.




చార్మినార్ చుట్టూ వుండే మార్కెట్ ఒక అద్భుత ప్రపంచం. దొరకని వస్తువంటూ, రుచికందని తిండి అంటూలేదు. పగడాల అంచున, అత్తర్ల మైకంలో అనుభవించాల్సిందే. ఆ బజారు జీవితాన్ని దారి పొడవునా పూల అమ్మకందార్లు, ఆ వాసనలు, చిత్ర విచిత్రపు పాదరక్షలు, షేర్వాణీలు, గౌన్లు, అల్లికలు, తోపుడు బండ్లు, హెన్నా, గంధపు చెక్కలు, ఖర్జూరలు అహో చెప్పనలవి కాని అందాలవి. విజయవగర కాలపు నాటి బజార్లకు పోటీగా నా అన్నట్టుంది.


చార్మినార్ కింద ప్రస్తుతం ఉన్న దేవాలయం 1957 వరకు లేదు. The Hindu వివరంగా చెప్పింది. మత సామరస్యానికి ఏ ఢోకా లేకుండా ఈ Charminar విరాజిల్లాలి.

CHARMINAR పై భాగంలో ఉన్న నాలుగు వైపులా నాలుగు గడియారాలు 1889 లో లండన్ నుండి ఆలీఖాన్ తెప్పించినాడు.

ఆ రోజుల్లో జ్వాలాముఖి తర్వాత ఓల్డ్ సిటిలో లో నేను వెళ్లిన ఇల్లు ఎం. టి ఖాన్ ది. ఎంటి ఖాన్ సర్వజ్ఞాని. ముబ్దాం దగ్గర నుంచి రియాసత్ వరకు ఎన్నో సంగతులు చెప్పేవాడు.

తర్వాత ఓల్డ్ సిటి వాడు అశోక్. ఎమర్జీన్సీలో జైల్లో మాతో పాటూ ఉన్నఆర్ఎస్ ఎస్ (RSS) కార్యకర్త. చాలా ప్రేమగా తన ప్రాంతానికి పిల్చుకు పోయి, కస్తూర్భా స్కూల్లో ఒక సమావేశం ఏర్పాటు, అనేక కబుర్లు చెప్పినాడు.

ఈ మారు నిమ్రాకేఫే ఛాయ్, ఉస్మానియా బిస్కట్ తిని నడుచుకుంటూ పోయి షాదాబ్ లో బిర్యానీ తినటం ఒక మంచి అనుభవం.




ఇంకో అత్యంత ముఖ్యమైన సంగతేమిటంటే తెలంగాణ టూరింజ వాళ్లు వాళ్లు చార్మినార్ హెరిటేజ్ వాక్ (Charminar heritage walk) న నడుపుతున్నారు. ఐదేళ్ళ క్రితమే నాలుగు సార్లు చేసేసినాము. ప్రతి నెలా ప్రతి ఆదివారం ఉంటాయి. ఉదయం 7 గంటలకు చార్మినార్ చేరుకోవాలి. ఒక ఆదివారం చార్మినార్ నుండి బాద్ షాహి అశ్రుఖానా , ఇంకో ఆదివారం చార్మినార్ నుండి పురానా హవేలీ, చివరి ఆదివారం స్టేట్ సెంట్రల్ లైబ్రరీ (State central library) నుండి సిటి కాలేజీ (City colege) వరకు ఫీజు 100 రూపాయలు, వాక్ పూర్తి కాగానే మంచి రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ టీ ఆ 100 రూపాయల్లోనే, ఒక మంచి గైడ్. దాదాపు ఉచితమే ననుకోండి. అదొక అద్భుతమైన ఏర్పాటు. ఉపయోగించుకునే వాళ్ళే కరువు. ఆ రోజుల్లో మాతో పాటూ పదంటే పదిమందే ఉండేవారు. అదీ పరాయి దేశస్థులు. దారి పొడవునా విశేషాలు వివరిస్తూ పోయే ఈ కాలి నడకలు గొప్ప విజ్ఞాన వీచికలు.

గొప్ప జీవితానందాన్ని ప్రసాదిస్తున్న చార్మినార్ జయహో !


Read More
Next Story