అడవిలో వెలసిన ఆనంద బృందావనం!
x

అడవిలో వెలసిన ఆనంద బృందావనం!

ఎక్కడ, ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు?


‘ఇక్కడ అడుగు పెడితే. వేదనలన్నీ మర్చిపోతాం. ఈ ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా బతకడంలోనే అసలైన ఆనందం ఉంది. ఇదే మా ప్రపంచం! ఈ జీవితమే మేం కోరుకున్నది, ప్రత్యేక ప్రపంచంలో ఉన్న అనుభూతి కలుగుతుంది.’ అంటారు, తామర పూల కొలను దగ్గర ఉన్న ఒక వృద్ధ జంట పరవశంగా!

‘ ఇంత గొప్ప ప్రకృతమ్మ తోడుంటే మేం అనాధలం ఎలా అవుతాం?’ అని అమాయకంగా నవ్వుతారు చిన్నారులు.

అకుపచ్చని గొడుగుల్లా ఎదిగిన జీలుగ చెట్లు, ఆ పక్కనే చేమంతులు, బంతులు... కాస్త దూరంలో నన్నుచూడమంటూ పనసపండ్లు పలకరిస్తాయి. మామిడి తోటల్లో గుత్తులుగా వేలాడే కాయలను చూస్తూ, ఉత్సాహంతో పక్కకి తిరిగితే, అలల కొలనులో గలగలా నవ్వుతూ తామరలు కదలాడుతాయి. నేలంతా గడ్డితివాచీ పరిచినట్టుంటుంది. అక్కడ చదువుతూ, ఆడుకుంటూ కనిపిస్తారు చిన్నారులు. పాలరాతి కాలిబాటలో కబుర్లాడుతూ నడుస్తుంటారు వృద్దులు.

ఇదంతా ...

అడవి మధ్య వెలసిన అందమైన ఈ బృందావనం. తెలంగాణలో, సిద్ధిపేట జిల్లా, కొండపాక శివారులోని కొమురవెళ్లి కమాన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది, పేరు ఆనంద నిలయం, ఇదెలా సాధ్యమైందంటే గతంలోకి వెళ్లాలి.

సుధా జనార్దన్‌ కర్నాటక లోని ఒక ప్రముఖ ఛార్టెడ్‌ ఎకౌంటెంట్‌ భార్య. దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ, తిరుపతి చేరుకున్నారు.

2009లో అప్పటి ఇఓ కెవి రమణాచారిని కలిసి ఆమె భర్త పేరుమీద తిరుమల తిరుపతి దేవస్ధానానికి భారీ విరాళం అందచేశారు.

ఆ క్రమంలో ఆమె చేస్తున్న ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాలను ఈవోకి వివరించారు.

‘మాధవ సేవతో పాటు మానవ సేవ కూడా చేస్తే సమాజంలో కొందరి కష్టాలు తగ్గుతాయమ్మా!’ అని రమణాచారి ఆమెకు సూచించారు. దానికి ఆమె ఆంగీకరించి ‘ ఏదైనా ప్రాజెక్టు ఉంటే చెప్పండి సాయం చేస్తాను ’ అన్నారు.

సిద్ధిపేట సమీపంలో ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తున్నాం, మీరు వెళ్లి చూసి, సానుకూలంగా ఉంటే తోచిన సాయం చేయండి అని ఆమెకు వివరాలు చెప్పారు. అడవిలో సహజ ప్రకృతి మధ్య వృద్దులకు నీడ కల్పించాలనే వారి సంకల్పానికి ఫిదా అయిన ఆమె విరాళం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అలా 2010లో ఆమె చేతుల మీదుగా ‘ఆనందనిలయం’ ప్రారంభమైంది.

కనిపించే దైవాలకు సేవ

‘‘ దేవుడు ఎక్కడో లేడు. తల్లిదండ్రుల్లోనే ఉన్నాడు. వాళ్లే మనకు కనిపించే దైవాలు. నిరాదరణకు గురై తల్లడిల్లే వృద్ధులకు చేయూతగా నిలువాలని, వేదపండితులను సత్కరించుకోవాలనేది నా జీవితాశయంగా గా ఓ పత్రిక ఇంటర్యూలో చెప్పాను. అది చూసిన సిద్దిపేట టీచర్‌ పెద్ది వైకుంఠం వచ్చి వృద్ధాశ్రమం పెడుతున్నాం సహకరించ మని కోరడంతో ఈ మహాకార్యంలో పాలు పంచుకున్నాను.

2009లో సుధా జనార్ధన్‌ మా ప్రాజెక్ట్‌ని చూసి, రూ.50 లక్షలు విరాళం ఇవ్వడంతో నా చిరకాల స్వప్నం ఫలించి, ఇపుడు కోట్ల విలువైన ఆనందనిలయంగా మారింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఇదే ఆవరణలో అష్టాదశ శక్తిపీఠ సహిత రామలింగేశ్వరాలయాన్ని నిర్మించాము. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న వృద్ధులు, చిన్నారులు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలన్నదే మా తాపత్రయం.’’ అన్నారు ఈ ఆశ్రమాన్ని తీర్చిదిద్దిన మాజీ ఐఎఎస్‌ అధికారి కేవీ రమణాచారి.

మమతల నిలయంగా...

‘‘దశాబ్దం క్రితం ఇదంతా దట్టమైన అడవి. పంటలకు పనికిరాని భూమి అని రైతులు వదిలేశారు. వారికి సరిహద్దులు కూడా తెలీదు. అదంతా వెతికి వారి నుండి 93 ఎకరాలు సేకరించి వృద్ధులకు నిలయంగా మార్చాము. మాతో మరికొంత మంది సేవాభావం ఉన్నవారు కలిసి తాము సంపాదించే దాంట్లో కొంత ఆ ఆశ్రమానికి కేటాయించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇక్క ఉండాలనుకునే వృధ్దుల వద్ద నామమాత్రంగా కొంత రుసుం తీసుకుంటున్నాం. తల్లితండ్రులు లేని పిల్లలకు ఉచితంగానే ఇక్కడ ఆశ్రయం కల్పించాం. వారిని స్కూల్‌కి తీసుకెళ్లడానికి బస్‌ సౌకర్యం ఉంది. రామ్‌కీ ఫౌండేషన్‌ ఆంబులెన్స్‌ని సమకూర్చారు. ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని చూసిన కొందరు సినీ షూటింగ్‌లకు అడిగినప్పటికీ మేం ఇవ్వలేదు. ఇక్కడున్న వృద్ధుల ప్రశాంతతకు భంగం కలిగించ కూడదని.. ’’ అంటారు ఈ ప్రాజెక్ట్‌కి భూమిని సేకరించిన రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు పెద్ది వైకుంఠం. లతా రమణాచారి ఆనంద నిలయం ట్రస్టు చైర్మన్‌గా ఇక్కడి అభివృద్ధి పనులు చూస్తున్నారు. ఆశ్రమంలో గార్డెన్‌ని నిర్వహించడానికి ప్రత్యేకంగా ఒక కుటుంబానికి ఇక్కడే వసతి కల్పించారు.

అమ్మ ఒడిగా...

ముదిమి మీద పడిన వాళ్లకి ప్రేమ కావాలి. ధైర్యం చెప్పే తోడు కావాలి. మంచాన పడితే అమ్మలా సేవచేసి, నాన్నలా నడిపించాలి. అవన్నీ చేస్తోంది ఆనంద నిలయం. అందుకే అది ఆశ్రమం కాదు, అమ్మ ఒడి అంటారు అక్కడ ఉంటోన్నవారు. వాళ్ల మాటల్లో నిజముంది. ఎందు కంటే ఆ ఆశ్రమం వాళ్లను నిజంగా అలానే చూస్తోంది. వాళ్లకి ఎటువంటి లోటూ లేకుండాచ మూడు పూటలా రుచి కరమైన, ఆరోగ్యకరమైన ఆహారం, సకల వసతులూ ఉన్న గదులు, అనాధ బిడ్డల కాలక్షేపం కోసం ఆట వస్తువులు, అద్భుతమైన గార్డెన్‌ ఉంది.

దేవుని ధ్యానంలో గడపాలనుకునే వారికి ఆశ్రమంలోనే కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని కట్టారు. ప్రతి నెలా ఆరోగ్య పరీక్షలు, ఆంబులెన్స్‌ సౌకర్యం, ఆరోగ్యం గురించి చింత వద్దంటూ భరోసా ఇస్తున్నాయి.

జీవితంలోని ప్రతి క్షణాన్నీ బిడ్డల కోసమే వెచ్చించి, చివరికి ఇక్కడ చేరిన వారందరిదీ ఒకటే కథ. గుండెల్లో పెట్టుకుని పెంచిన పిల్లలు గుండెలపై గుద్ది వెళ్లి పోయిన వ్యధ. కానీ బిడ్డల మీద మమకారంతో ఎవరూ బయటకు చెప్పుకోరు. వారి కథను మార్చి వారిలో అంతులేని సంతోషాన్ని నింపింది ‘ఆనంద నిలయం’.

అయితే, ఆనంద నిలయం సేవ ఇక్కడితో ఆగిపోలేదు. సేంద్రియ పద్ధతుల్లో పండ్లతోటలు, కూరగాయల్ని పండిస్తోంది. ఒక టీషర్ట్‌మేకింగ్‌ యూనిట్‌ని పెట్టి చుట్టుపక్కల గ్రామాల మహిళలకు ఉపాధిని కల్పిస్తోంది. ఈ సేవల్ని మరింత విస్తరించబోతున్నారు.

ఆనందం నిలయంలో అటు వృద్ధాశ్రమం, ఇటు బాల సదన్‌, దేవాలయం, సమీపంలోనే సత్యసాయి బాలికల విద్యాసంస్థలు ఏర్పాటు కావడం ఈ ప్రాంతానికి అదృష్టమంటారు ఇక్కడి ప్రజలు!

ఆనంద నిలయానికి ఎలా వెళ్లాలి?

హైదరాబాద్‌ నుండి సిద్ధిపేటకు వెళ్లేదారిలో కొమర వెళ్లి దేవాలయం దగ్గరలో జాతీయ రహదారి మీదనే ఎడమ వైపు ఆనందనిలయం కమాన్‌ కనిపిస్తుంది, కరీంనగర్‌ వైపు నుండి వచ్చేవాళ్లు కొమర వెళ్లి దేవాలయం దగ్గర ఆగి , ఎవరిని అడిగినా చెబుతారు. మరిన్ని వివరాలకు (పార్ధసారధి, 6281983314 ) ఫోన్‌లో సంప్రదించండి.



Read More
Next Story