అంధయుగం నాటక సమీక్ష
x
‘ఆంధయుగం’ నాటక ప్రదర్శన ఫైల్ ఫోటో

'అంధయుగం' నాటక సమీక్ష

నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా యుద్ధ బీభత్సాన్నికళ్ళముందు నిలిపిన నాటకం 'అంధయుగం'


తెలుగు నాటక వికాసానికి తొడ్పడాలనే ఉద్దేశ్యంతో 1993 లో ఏర్పడిన రసరంజని సంస్థ ఏన్నో ఉత్తమ స్థాయి, ఉన్నత ప్రమాణాలు ఉన్న నాటకాలను ప్రదర్శింపజేసింది. తాజాగా సంస్థ 33వ వార్షికోత్సవాల సందర్భంగా ప్రస్తుతం మూడు రోజుల నాటకోత్సవాలను నిర్వహిస్తోంది. వాటిలో భాగంగా మార్చి 26 న రవీంద్రభారతిలో బి స్టూడియో థియేటర్ గ్రూప్ ప్రదర్శించిన అంధయుగం నాటకం అందరి ప్రశంసలు అందుకుంది. ప్రదర్శించిన నాటక బృందంలోనూ, ప్రేక్షకులలోనూ 90శాతం మంది యువత ఉండటం విశేషం. ఇది మంచి నాటకానికి ప్రోత్సాహం తగ్గలేదన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది.

గతాన్ని, చరిత్రనీ, కావ్యగాధలను.. సమకాలీన సమస్యలకు అన్వయించి వర్తమానంలో ఉన్న కొత్త దృష్టితో ప్రదర్శింప చేయటం నాటకాల కళకు నేటి తరం చేస్తున్నచేర్పు. అది ఆహ్వానించవలసిన మార్పు. పురాణాలను యధాతధంగా కాక నేటి అవసరాలకనుగుణంగా వ్యాఖ్యానించటం, చాలాకాలంగా ప్రజలకు తెలిసిన, ప్రచారంలోవున్న కథలను, కథనాలను ఆధునిక దృష్టితో చూపడం, వాటిని ఒక పాఠంగా, కొన్నిసార్లు గుణపాఠంగా నేటి తరానికి అందించటం కవులు, రచయితలు, కళాకారులు నిర్వహించవలసిన ఒక గురుతరమైన బాధ్యత. దానికి ఒక సముచిత ఉదాహరణ ఈ ‘అంధయుగం’ నాటక ప్రదర్శన.

‘ధర్మ వీర్ భారతి’ అనే రచయిత హిందీలో రచించిన ప్రసిద్ధ నాటకానికి దివంగత ఆచార్య మొదలి నాగభూషణ శర్మ చేసిన తెలుగు అనువాదం ఈ నాటకం. మహాభారత యుద్దం ఆధారం చేసుకుని యుద్ధాలు కలిగించే నష్టం, ప్రాణనష్టం, కలిగించే విషాదం, వినాశనం, జీవన విధ్వంసం, నిరాశ, నిస్పృహ, కక్ష, కార్పణ్యం, పగ- ప్రతీకారం వీటికి లొంగిపోయిన వారిలో కలిగే వికృత మనస్తత్వం,రాక్షస ప్రవర్తన, అమానవీయ అరాచక ధోరణులు ఫలితంగా వచ్చే మానవీయ విలువల పతనం ఆయా పాత్రల ద్వారా అత్యద్భుతంగా ఆవిష్కరించారీ నాటకంలో.

ముఖ్యంగా గాంధారి, అశ్వత్థామ పాత్రలలో చెలరేగిన మానసిక కల్లోలం తదనుగుణంగా ఏర్పడిన విపరీత మనస్తత్వం, విచక్షణ కోల్పోయి చేసిన కిరాతక చర్యలు మనపై కొరడా దెబ్బలై విరుచుకు పడుతుంటాయి. ఆవేదన, కోపావేశం మనిషిని ఎంత దిగజార్చగలవో, ఎంత మారణకాండకు ప్రేరేపించగలవో నగ్నంగా బయట పడుతుంది. ఇక్కడ కథంటూ ఏమీ లేదు. కురుక్షేత్ర యుద్దంలో పాండవులు విజయ యాత్ర చేస్తుంటే,కౌరవ పక్షంలో ఒక్కొక్క వీరుడూ మరణించి పోతూవుంటే మిగిలిన వారి కుటుంబాలలో, కుటుంబ సభ్యులలో ఉత్పన్నమైన అల్లకల్లోలం, సంక్షోభం నాటక కథనమయ్యింది.

ఈ పరిస్థితిలో వారు ఏమి చేశారు? ఏమయ్యారు అనేదే నాటకం. తన తండ్రి ద్రోణాచార్యుణ్ణి ధర్మరాజు అర్ధసత్యంతో అస్త్ర సన్యాసం చేయించగా దృపదుని కుమారుడు ద్రుష్టద్యుమ్నుడు తల నరికి చంపాడని తెలుసుకున్న అశ్వత్థామ కోపంతో రగిలిపోతూ “ఏమి చేయాలి? ఏమి చేయాలి?” అని పిచ్చివాడిలా తిరుగుతూ అత్యంత క్రూరునిగా మారి, అర్ధరాత్రి పాండవ శిబిరంలో దూరి, నిద్రిస్తున్నద్రుష్టద్యుమ్నున్ని ఆయుధంతో కాకుండా చేతులతో గొంతు నులిమి చంపేస్తాడు. ఆయుధం చేతలేని తన తండ్రిని అధర్మంగా వధించాడు కనుక ద్రుష్టద్యుమ్నునికి ఆయుధంతో మరణించే అర్హత లేదని అతను భావిస్తాడు. చివరగా పాండవ వంశాన్ని నిర్మూలించాలనే ఉద్దేశ్యంతో బ్రహ్మశిరో నామక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అర్జనుడు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించ బూనుకుంటాడు.

ఈ రెండు అస్త్రాలు [నేటి అణ్వాయుధాల వంటివి] ఢీకొంటే మొత్తం భూమండలమే సర్వ నాశనం అయిపోతుందని, రాబోయే తరాలు కూడా మనజాలవని, అస్త్రాన్ని ఉపసంహరించు కోమని కోరినా “నా తండ్రి అస్త్రం ప్రయోగించడమే నేర్పాడు కాని ఉపసంహరించడం నేర్పలేదు. ఇది ఉత్తర గర్భాన్ని ఛేదించక మానదు’’ అంటాడు. అప్పుడు కృష్ణుడు ఏదో చక్రం అడ్డు వేసి, పరీక్షిత్తును [ఉత్తర గర్భాన్ని] భావి తరాన్ని కాపాడుతాడు. అశ్వత్థామ ను నిర్వీర్యుణ్ణి చేసి అడవుల పాలుచేస్తాడు.

ఇది జరుగుతున్నంత కాలం పుత్రులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన గాంధారి మహోత్సాహంతో, సమధిక సంతోషంతో, తనకు జరిగిన నష్టానికి పరిహారం లభిస్తున్నట్లుగా, అపాండవం కావటం ఆమెకు ఒక సాంత్వనగా భావిస్తూ, అశ్వత్థామను ప్రోత్సాహ పరుస్తూ వుంటుంది. ధృతరాష్ట్రుడు తన పిల్లలకు తమ్ముని పిల్లల కు జరిగిన యుద్దం తన అంధత్వం వల్లనే సంభవించినదని, ఎందరు పెద్దలు వారించినా ‘సుయోధన మహారాజుకు జయం జయం” అన్న పలుకులు నమ్మటం వల్లనే ఈదారుణ స్థితి సంభవించినదని ఆలోచిస్తుంటాడు.

పాండవ విజయం ఒక శ్మశానవాటికలో వెలసిన భస్మ సింహాసనంలా కనిపిస్తుంది. ధృతరాష్ట్రునికి గాంధారి దాసి అయిన సుఖదకు జన్మించిన యుయుత్సుడు [100 మంది కౌరవులలో ఒకడు]పాండవులదే ధర్మమని భావించి వారి తరఫున యుద్దం చేస్తాడు. చివరికి బతికివున్న కౌరవ పుత్రుడు అతనొక్కడే. అతను యుద్ధానంతరం ధర్మ సంకటంలో పడతాడు. తండ్రి, గాంధారి అతనిని వ్యంగ్య భాషణలతో మహా ఇరుకున పెడతారు. అతని మీద ద్వేషం వెలిగక్కుతారు. అతనో అర్ధంకాని స్థితిలోకి వెళతాడు. ఉండలేక, వెళ్లలేక సందిగ్ధంలోనే తండ్రికి తోడుగా నిలుస్తాడు చివరికి సోదరులకు అంత్యక్రియ లు అతనే నిర్వహిస్తాడు.మిగిలిన యోధులంతా తమ అస్త్రాలు విసర్జించి శాంతి ప్రార్థన చేస్తుండగా తెరపడుతుంది నాటకానికి. వెనుక తెర మీద “నో వార్, స్టాప్ వార్” అని పెద్ద అక్షరాలు మెరుస్తుంటాయి.

“ఒక్కొక్క వీరుడు, యోధుడు వొరిగిపోయినప్పుడల్లా వొణికిపోయింది నా హృదయమే. ఒక్కొక్క మనిషి మృత్యువాత పడినప్పుడల్లా మృతి చెందింది నా శరీరం లోని ఒక్కొక్క కణమే. యుద్దక్షేత్రం లో కారిన నెత్తురు, చీము, కన్నీళ్ళు అన్నీ నాలోనుంచి ఉబికి వచ్చినవే.” అన్న కృష్ణుని పలుకులతో విశ్వమానవ సంవేదన అర్ధమవుతుంది. మృత్యు భీకర హేల మిగిల్చిన శ్మశానం వంటి రాజధాని నగరంలో అనుజులను ఆత్మజులను,ఆత్మీయులను, బంధువులను, మిత్రులను, సర్వం కోల్పోయిన సామాన్య సైనికులు, కాపాలా దారులు “మనం ఎవరిని కాపాడుతున్నాం? ఎవరికి కాపలాగా వున్నాము? దేన్నిరక్షిస్తునాము? రక్షించ టానికి ఇప్పుడు ఇక్కడ ఏమున్నది? అసలు మనం చేస్తున్నది ఏమిటి ? ఈ అంధ రాజ్యాన్ని ఇంకా అంధయుగం లోకి నడిపించటమా” అని విషాదంతో, నిర్వేదంతో అంతర్మధనంతో నలిగిపోతున్న దృశ్యంతో ఆరంభమయ్యే నాటకం ఎంతో ఆలోచనా స్పోరకంగా ఆద్యంతం శాంతి ఆవశ్యకతను పరోక్షంగా ప్రబోధిస్తూ సాగుతుంది.

యుద్దం యొక్క న్యాయాన్యాయాలు గాని, ధర్మాధర్మాలు గాని పెద్దగా చర్చలోకి రావు. ధర్మ పరిరక్షణార్ధం యుద్దం జరిగినా ఫలితం విధ్వంసమే. యుద్ధమే ఒక సమస్య అది ఏ సమస్యనవో పరిష్కరించజాలదు అని మానవాళి అనుభవం ఎలుగెత్తి చాటు తొంది. అయిన ఈనాటికీ యుద్ధాలు ప్రజ్వరిల్లుతూనే వున్నాయి. ఈ నాటకంలో యుద్ధమనేదే ఒక గొప్ప మానవ విషాదం.యుద్ధమనేదే సర్వ వినాశకరం అన్న విషయమే నొక్కి చెప్పబడింది. అంతకు మించి యుద్దం పడగ నీడలో పెచ్చరిల్లే మానవ దౌర్జన్యం, విస్తరించే దౌర్బల్యం, పెరిగిపోయే అవగుణాలు, విజ్ఞులు కూడా అవలోకనంలో సమతుల్యతను కోల్పోయే సందర్భాలు, ఆవేశంలో చేసే నిర్ణయాలు వాటి విపరిణామాలు వాస్తవాల పట్ల అంధత్వం, మానవ జీవితం పట్లనే తృణీకారం వంటి అంశాల పై దృష్టి కేంద్రీకరించారు. విదురుడు, కృపాచార్యుడు, కృతవర్మ పాత్రలను ఇవి వివరించటానికి ఉపయోగించారు.

ఇక ప్రదర్శనలో ఆధునిక సాంకేతికత నుపయోగించి వెనుక తెరపై వీడియో ప్రొజెక్షన్ ద్వారా అనేక విషయాలు సునాయసంగా ప్రేక్షకుని మదిలోకి, ఆలోచనల్లోకి చొప్పించారు. దర్శకుని విశేష ప్రతిభే కాక, దర్శకుని సమకాలీన దృక్కోణం, గతాన్ని ప్రస్తుతానికి అన్వయించి రంగస్థలాన్నిక్షణంలో మార్చుకున్న తీరు ఈ నాటకానికి గొప్ప ప్రాసంగికతను, సమకాలీనతను కలిగించింది.

ఆధునిక యుద్దాలను, ఉక్రెయిన్, పాలస్తీనా గాజా దృశ్యాలు, ఇప్పుడు ఇరాన్ పై జరుగుతున్న పాశవిక దాడులు,జరుగుతున్న విధ్వంసా లు, ప్రాణ నష్టాలు, డ్రోన్లు, బాంబర్లు, యుద్దనౌకలు, విమానాలు, క్షిపణులు, అణ్వాయుద్ధ ఆయధాల తరలింపు వంటి దృశ్యాలను నేపధ్యంలో చూపిస్తూ రావటం, ట్రంప్, నేతన్యాహూ వంటి వారి చిత్రాలను రంగస్థలం మీద జరుగుతున్న సంభాషణల కనువుగా సందర్భోచితంగా చూపించటం, నాటకాన్ని ఒక విశిష్ట ప్రదర్శన గా రూపుదిద్దాయి. అలాగే ధ్వని, కాంతి సమన్వయంతో రంగస్థలాన్ని క్షణంలో యుద్ధ భూమిగా చూపించటం, మరుక్షణంలో విస్ఫోటనాలు,కంపనాలతో నగరాలు శిధిలాలుగా మారట న్ని దర్శింప జేయటం ఒక గొప్ప విషాదఅనుభూతిని కల్పించాయి. ఆధునిక సాంకేతికతను ప్రయోగ్యంగానే కాదు చక్కగా ప్రయోజనకరంగా ఉపయోగించారు.

స్వార్ధ ప్రయోజనం కోసం, ఆధిపత్య నిరూపణ కోసం, జారిపోతున్న ప్రభావాన్ని నిలబెట్టుకోవటం కోసం కొన్ని దేశాలు రగిలిస్తున్న యుద్ద జ్వాలలలో మొత్తం మానవాళి సౌఖ్యం, సౌభాగ్యం,శాంతియుత జీవనం భస్మమైపోతూ, అణుయుద్ద భయంతో నిస్చేతనంగా మారిపోతున్న సందర్భాన్ని ఈ వెనుక తెర చిత్రాలు ముందుకు తెచ్చాయి. యువ దర్శకుడు డాక్టర్ షేక్ జాన్ బషీర్ తో పాటు బి స్టూడియో బృందం మొత్తం దాదాపు30 మంది యువతీ యువకులు చేసిన కృషి,వారి సృజనాత్మకత, సామాజిక స్పృహ అడుగడుగునా ప్రతిఫలించాయి.వారి సాధన, కృషిలోసమన్వయం ఈ ప్రదర్శనకు మూల స్తంభంగా నిలిచాయి.వారికి పేరుపేరునా అభినందనలు తెలపాలి. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భం గా జరుగుతున్న ఉత్సవంలో ఈ నాటకం ప్రదర్శించడం నేటి తరం కళ పట్ల ఎంత నిబద్దంగా వుందో, ఎంత సోయి తో కృషి చేస్తున్నదో చెప్పకనే చెబుతున్నది.

Read More
Next Story