విశాఖ సిగలో మరో టూరిస్ట్ అట్రాక్షన్
విశాఖ సిగలో మరో కలికి తురాయి చేరనుంది. దేశ విదేశీ పర్యాటకులకు ఇప్పటికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విశాఖ సాగరతీరం మరో అట్రాక్షన్ తో మెరవనుంది.
(తంగేటి. నానాజీ, విశాఖపట్నం.)
విశాఖపట్నం పేరు వినగానే ఎవరికైనా ఫస్ట్ గుర్తొచ్చేది సాగరతీరమే....విశాలమైన సాగర తీరం విశాఖ సొంతం. గోవా, ముంబై బీచ్ అంత ఫేమస్ కాకపోయినా వైజాగ్ బీచ్ లోను ఓ ఆకర్షణ ఉంది. అందుకే పర్యాటకుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఫిషింగ్ హార్బర్ మొదలుకొని భీమిలి వరకు యారాడ బీచ్ నుంచి రేవు పోలవరం వరకు విశాఖ జిల్లాలో 135 కిలోమీటర్ల పొడవునా సాగర తీరం విస్తరించి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 974 కిలోమీటర్ల విస్తీర్ణంలో సాగర తీరం ఉండగా విశాఖ తీరం పర్యాటకంగా అగ్రస్థానం. విశాఖ తీరంలో పలు బీచ్లను అభివృద్ధి పరిచి పర్యాటక కేంద్రాలుగా మార్చారు. వాటిలో ముఖ్యంగా భీమిలి, ఋషికొండ, ఆర్కే బీచ్, పామ్ బీచ్, యారాడ, గంగవరం, పూడిమడక, ముత్యాలమ్మ పాలెం, రేపు పోలవరం బీచ్లు పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. విశాఖ సాగర తీరాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (విఎంఆర్డిఏ) ప్రణాళికలు రూపొందించింది.
దేశంలోనే రెండోో డెక్ ఇది..
సిటీ ఆఫ్ డెస్టినీ గా... పర్యాటక రాజధానిగా విరాజిల్లుతున్న విశాఖ మరింత అభివృద్ధి చెందనుంది. ప్రతిష్టాత్మక "ఓషన్ డెక్" ప్రాజెక్టును విఎంఆర్డిఏ విశాఖ సాగర తీరంలో చేపట్టనుంది. ఓషన్ డెక్ ప్రాజెక్ట్ ముంబై బీచ్ తర్వాత దేశంలో రెండవదిగా విశాఖలోనే ఏర్పడనుంది. 8 కోట్ల రూపాయల వ్యయంతో రెండంతస్తుల ఓషన్ డెక్ ను వుడా పార్కు సమీపంలో ఏర్పాటు చేయనున్నారు. 90 మీటర్ల పొడవు ఉండే ఈ డెక్.. 50 మీటర్లు ఉపరితలంలో ఉండగా 40 మీటర్లు సముద్రంలో మునిగి ఉంటుంది. ఈ డెక్ లో రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ తో పాటు, వ్యూ పాయింట్, పర్యాటకులకు పలు రకాల అనుభూతులను ఇచ్చే వాటర్ గేమ్స్ ఏర్పాటు చేయనున్నారు. నగరానికి వచ్చే పర్యాటకులు ఒక రోజంతా డెక్ లో గడిపే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకోగా.... టెండర్లు పిలిచే ప్రక్రియ మొదలు పెట్టామని, 10 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేసి విశాఖ టూరిజాన్ని మరింత అభివృద్ధి పరుస్తామన్నారు విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున్.