అంతర్భాష ( ఆదివారం కవిత)
విశేషణాలు అవసరం లేకుండా మూగవేదన లోతులను డాక్టర్ రామలక్ష్మి ఈ కవితలో ఆవిష్కరించారు. బాధితులు బయటకు వినిపించని అంతర్భాషలో ఏమ్మాట్లాడుతుంటారో గొప్పగా చెప్పారు.
అంతర్భాష
-డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి*
అందరనుకునేది
మా ఆలోచనలు, భావాలు ఒక్కటే
మా ఇద్దరి మాటా ఒక్కటే,ఎవరిపై ఎవరికీ
అధికారం ఉండదు
కొత్తగా పెళ్లయిన వాళ్ళకి మేమాదర్శం!
కొంచెం నేనింటా, బైటా ఎక్కువ పని చేస్తాను
తను మాట్లాడటమే ఎక్కువ చేస్తాడు
రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు అన్న అమ్మ మాట గుర్తు పెట్టుకుని బుద్ధిగా కాపురం చేసుకుంటా.
మా అమ్మ అత్తింట భక్తి గౌరవాలతో
మెలగాలని సుద్దులు చెప్పి పంపింది
నా భర్త కొంచెం భయం కూడా నేర్పి నన్ను
పరిపూర్ణవతి ని చేసాడు
మా వారికి కొంచెం సంస్కారమెక్కువ
మా ఇంట్లో టీవీ కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ అన్నీ
నా పేరు తోనే ఉంటాయి
అంతా ఆవిడదే...
మా ఇంటి మహారాణి అంటాడు నా భర్త
ఇంటికి వచ్చిన వాళ్లతో గొప్పగా!
ఆయనకు నేనంటే ప్రేమెక్కువ
డబ్బులెక్కువ పెట్టుకుంటే పోగొట్టుకుంటావ్
నీ కెప్పుడు కావాలన్నా నేనిస్తాగా అని రోజూఆఫీస్ కి సిటీ బస్ లో వెళ్ళటానికి చిల్లర బ్యాగ్ లో పెట్టి పంపుతాడు
నోట్ల కట్టలు నా ముఖం పై రెప రెప లాడిస్తూ
నువ్వు నా ఎ. టి. ఎం. కార్డువి అని విలాసంగా అన్నప్పుడల్లా
లోపలి మంటను లోపలే దాచేసి, ముఖం పై
శాంతాన్ని అలాగే నిలబెట్టేస్తా
అమ్మ చెప్పిందిగా.... రెండు చేతులూ కలిస్తేనే....
అందుకే బుద్ధిగా కాపురం చేసుకుంటా
లోకానికి తెలియని ఓ అంతర్భాష
మా ఇద్దరి మధ్య
నడుస్తూ ఉంటుంది.
(డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి, గురజాడ రచన లపై ph. D. చేసారు. విజయవాడ లో తెలుగు లెక్చరర్ గా చేస్తున్నారు)
Next Story