Anthropic hits IT sector stocks
x

ఐటీ రంగానికి దడ పుట్టిస్తున్న ఆంథ్రపిక్ ఏంటి?

ఒక్క ఏఐ ప్లగిన్ ప్రపంచ ఐటీ రంగాన్ని అధఃపాతాళానికి తొక్కాయ్. ఐటీ సంస్థలకు సింహస్వప్నంలా మారిందీ టూల్. ఇంతకీ ఈ టూల్ ఏంటో తెలుసా..!


ఆంథ్రపిక్.. ఐటీ రంగానికి పీడకలలా మారింది. ఒకే ఒక్క ప్రకటనతో ఐటీ స్టాక్స్‌కు అధఃపాతాళానికి తొక్కేసిందీ ఆంథ్రపిక్. ఆ ప్రకటనలో ఏవో రహస్యాలు లేవు.. కేవలం కొన్ని ఏఐ టూల్స్ ఉన్నాయ్ అంతే. అవే ప్రపంచ స్టాక్ మార్కెట్లను 285 బిలియన్ డాలర్ల నష్టాల పాలు చేసింది. ఒకే ట్రేడింగ్ సెషన్‌లో సాఫ్ట్‌వేర్, లీగల్ టెక్, ఫైనాన్షియల్ సేవల రంగాల్లో సుమారు $285 బిలియన్ మార్కెట్ విలువ ఆవిరైంది. ఈ పరిణామాన్ని విశ్లేషకులు ‘SaaSpocalypse’గా పేర్కొన్నారు.

అసలు ఈ ఆంథ్రపిక్ ఏంటి?

ఆంథ్రపిక్ అనేది అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ. మానవ విలువలు, భద్రత, బాధ్యతాయుత వినియోగం కేంద్రంగా కృత్రిమ మేధ(AI) టెక్నాలజీని అభివృద్ధి చేయడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. క్లాడ్(Claude) అనే ఏఐ మోడల్ ద్వారా టెక్స్ట్ రాయడం, విశ్లేషణ చేయడం, క్లిష్ట పనులను సులభంగా పూర్తి చేయడం వంటి సామర్థ్యాలను అందిస్తోంది. సాధారణ యూజర్ నుంచి పెద్ద కార్పొరేట్ సంస్థల వరకు ఉపయోగపడేలా ఏఐని రూపొందించడం ఈ కంపెనీ ప్రత్యేకత. టెక్నాలజీ వేగంగా ఎదుగుతున్న ఈ కాలంలో, మనుషుల స్థానాన్ని భర్తీ చేయకుండా, మనుషుల పనిని మరింత సులభం చేసే దిశలో AIని నడిపించాలనే ఆలోచనతో ఆంథ్రపిక్ ముందుకు సాగుతోంది.

క్లాడ్ కోవర్క్ అంటే ఏమిటి?

ఆంథ్రపిక్.. ఈ ఏడాది జనవరి ప్రారంభంలో క్లాడ్ కోవర్క్(Claude Cowork) అనే ఏజెంటిక్ AI అసిస్టెంట్‌ను విడుదల చేసింది. దీనిని కోడింగ్ పరిజ్ఞానం లేని ఉద్యోగులు కూడా ఉపయోగించుకునేలా రూపొందించారు. యూజర్ అనుమతితో ఫైళ్లను చదవడం, ఫోల్డర్లను నిర్వహించడం, డాక్యుమెంట్లు తయారు చేయడం, మల్టీ-స్టెప్ పనులు పూర్తి చేయడం వంటి సామర్థ్యాలు దీని సొంతం. ఇది డెవలపర్ల కోసం రూపొందించిన క్లాడ్ కోడ్‌కు నాన్-టెక్నికల్ వెర్షన్‌గా చెప్పబడింది.

11 ప్లగిన్లు… ఒక్క లీగల్ ప్లగిన్‌తోనే కలకలం

జనవరి 30న ఆంథ్రపిక్ సంస్థ క్లాడ్ కోవర్క్ కోసం 11 ఓపెన్ సోర్స్ ప్లగిన్లను ప్రకటించింది. ఇవి ప్రొడక్టివిటీ, సేల్స్, మార్కెటింగ్, ఫైనాన్స్, డేటా అనాలిసిస్, కస్టమర్ సపోర్ట్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, బయాలజీ రీసెర్చ్ విభాగాలకు సంబంధించినవి.

లీగల్ వర్క్‌ఫ్లో ప్లగిన్ మార్కెట్లను ఎక్కువగా భయపెట్టింది. ఈ ప్లగిన్ కాంట్రాక్ట్ రివ్యూ, ఎన్‌డీఏ ట్రయాజ్, అనుమతి తనీఖీలు, లీగల్ బ్రీఫింగ్స్ వంటి పనులను ఆటోమేట్ చేస్తుందని ఆంథ్రపిక్ వివరించింది. ఇది లీగల్ సలహా ఇవ్వదని, లైసెన్స్ ఉన్న లాయర్లు అవుట్‌పుట్‌ను పరిశీలించాలని స్పష్టం చేసింది. అయినా పెట్టుబడిదారుల ఆందోళన తగ్గలేదు.

ఎందుకు అంతటి భయం?

విశ్లేషకుల ప్రకారం ఈ లీగల్ ప్లగిన్ ప్రత్యేకంగా ట్రెయిన్ చేసిన లీగల్ మోడల్ కాదు. ఇది ప్రాంప్ట్‌లు, వర్క్‌ఫ్లో కాన్ఫిగరేషన్ల సమాహారమే. అయినా ఆంథ్రపిక్ మోడల్ అమ్మకం నుంచి నేరుగా వర్క్‌ఫ్లోలను అందించే దశకు వెళ్లిందనే సంకేతం మార్కెట్‌ను కలవరపెట్టింది. ఇంతవరకు సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఏఐ మోడళ్లపై తమ టూల్స్ నిర్మించేవి. ఇప్పుడు అదే ఏఐ సంస్థలు రెడీ మేడ్ సొల్యూషన్లు విడుదల చేయడం పోటీగా మారుతుందనే భయం పెరిగింది.

భారీగా పడిపోయిన గ్లోబల్ స్టాక్స్

ఆంథ్రొపిక్ చేసిన ఈ ప్రకటన తర్వాత థామ్సన్ రాయిటర్స్ షేరు 15.83 శాతం పడిపోయింది. RELX 14 శాతం తగ్గింది. లీగల్ జూమ్(LegalZoom) షేర్లు దాదాపు 20 శాతం క్షీణించాయి. అమెరికా సాఫ్ట్‌వేర్ స్టాక్స్‌ను ట్రాక్ చేసే ETF ఏప్రిల్ తర్వాత అత్యంత బ్లాక్ రోజును చూసింది. నస్‌డాక్(Nasdaq) 1.4 శాతం పడిపోయింది. S&P 500 కూడా దిగజారింది. డోకుసైన్(DocuSign) 11 శాతం, సేల్‌ఫోర్స్(Salesforce) దాదాపు 7 శాతం, అడోబే(Adobe) 7 శాతం, సర్వీస్‌నౌ(ServiceNow) 7 శాతం తగ్గాయి. బ్లూ ఔల్ కాపిటల్ కార్ప్(Blue Owl Capital Corp) 13 శాతం పడిపోయి వరుసగా తొమ్మిదో రికార్డ్ డిక్లైన్‌ను నమోదు చేసింది.

భారత IT స్టాక్స్‌కూ దెబ్బ

వాల్ స్ట్రీట్ అమ్మకాల ప్రభావం భారత మార్కెట్లకూ విస్తరించింది. ఇన్ఫోసిస్ ఏడీఆర్‌లు 5.5 శాతం పడిపోయాయి. విప్రో దాదాపు 5 శాతం తగ్గింది. భారత మార్కెట్లలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ సుమారు 3 శాతం పడిపోయింది. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహింద్ర, విప్రో వంటి సంస్థల స్టాక్స్ ప్రారంభ ట్రేడింగ్‌లో భారీ నష్టాలను చూశాయి.

ఆంథ్రొపిక్ ఎందుకు భయపెడుతోంది?

లీగల్ ఏఐ రంగంలో ఆంథ్రపిక్ టూల్ ఒంటరిది కాదు. హార్వే ఏఐ(Harvey AI), లెగోోరా(Legora) వంటి స్టార్టప్‌లు ఇప్పటికే పనిచేస్తున్నాయి. అయితే ఆంథ్రపిక్ తన ఏఐ మోడళ్లను తానే అభివృద్ధి చేస్తుండటం వల్ల అదే మోడళ్లపై ఆధారపడే స్టార్టప్‌లను కూడా ప్రభావతం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

క్లాడ్ కోడ్.. మే నెలలో లాంచ్ అయి నవంబర్ నాటికి $1 బిలియన్ వార్షిక రెవెన్యూ మార్క్‌కు చేరినట్లు సమాచారం. కోవర్క్ జనవరి 12న లాంచ్ అయి మూడు వారాల్లోనే ప్లగిన్లు రావడం సంస్థ వేగాన్ని చూపుతోందని వ్యాఖ్యానించారు విశ్లేషకులు.

ఇది అతిగా స్పందించడమే: ఎన్‌విడియా

ఈ అసంశంపై ఎన్‌విడియా సీఈఓ జెన్సెన్ హాంగ్ కీలకంగా స్పందించారు. ఈ అమ్మకాలను అతిగా స్పందించిన చర్యగా అభివర్ణించారు. AI ఇప్పటికే ఉన్న సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను ఉపయోగించుకుంటుందని, వాటిని పూర్తిగా భర్తీ చేయదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచక్ కూడా AIను అవకాశంగా మలచుకునే కంపెనీలకు ముందున్న రోజులు సానుకూలంగా ఉంటాయని సూచించారు.

సాఫ్ట్‌వేర్ రంగానికి ఇది సంకేతమా?

ఈ అమ్మకాలు AIపై మార్కెట్ దృష్టికోణంలో మార్పును సూచిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు AI ఉత్పాదకత పెంచే సాధనంగా చూడగా, ఇప్పుడు అదే టెక్నాలజీ వ్యాపార మోడళ్లకు సవాల్‌గా మారుతుందనే చర్చ మొదలైంది. ఈ పరిణామం తాత్కాలిక భయమా, లేక సాఫ్ట్‌వేర్ రంగంపై దీర్ఘకాల ప్రభావానికి సంకేతమా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Read More
Next Story