
భాషా ప్రేమికులకు స్వాగతం!!
సడ్లపల్లె చిదంబరరెడ్డి విజ్ఞప్తి
భాషల లేక పదజాలాల గొప్పతనం గురించి ఇక్కడ చెప్పవలసిన పనిలేదు. కాలం గడిచే కొద్దీ వివిధ ప్రాంతాల భాషల సమూహాలు కలిసిపోతూ రోజూ వ్యవహరించే పదజాలంలో మార్పులు చేర్పులూ జరుగుతూనే ఉన్నాయి. దానిని ఎవ్వరూ అరికట్టలేరు కదా!
దాని వల్ల కొన్ని ప్రాంతాల్లో అక్కడి వాతావరణము జీవన విధానము ఇతర కారణాలవల్ల సహజంగా ఆవిర్భవించిన పదజాలం కొంత అంతరించి పోయింది....పోతూ ఉన్నది కూడా. అలా జరగడం వల్ల ఒక ప్రాంతపు ఉనికి, సాంస్కృతిక వారసత్వం అంతరించి పోయినట్లే.
గతంలో ఒక పరిధిలో ప్రజలు నిత్యం వ్యవహరించే నుడులను "మాండలికం" అనేవారు. అయితే నేను దానిని ఒప్పుకోను. ఒకే జనావాసంలో కులము, మతము, వృత్తి, లింగము, వయస్సు మొదలైన వాటిని బట్టి వ్యవహారిక పదజాలం మారుతూ ఉంటుంది. దానిని నేను "స్థానిక పదజాలం" అనే అంటాను. స్థానిక పదజాలం గొప్పతనం తెలియాలంటే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన "ఏడు తరాలు" నవల చదివి ఉంటే తెలుస్తుంది. ఆఫ్రికా ఖండంలోని మారుమూల పల్లెలో వ్యవహరించే కొన్ని పనిముట్ల పేర్ల ఆధారంగా ఏడు తరాల తరువాత ఆ గ్రామం కనుక్కొనడం జరుగుతుంది.
సంస్కృతం, ఉర్దూ, ఆంగ్లముతో పాటు మొదట చదువరులయి, తాము వ్యవహరించే పదజాలంతో రచనలు చేయడం వల్ల కోస్తా ప్రాంతంలోని ఒకటిరెండు జిల్లాల తెలుగు పదజాలమే మొత్తం ఆంధ్రప్రదేశానికి విస్తరించి పోయింది. అనంతరం దానినే అందరూ నెత్తికెత్తుకొన్నారు. అది తప్పు అని భాషా సమస్యను తిరగదోడటం కాదు. అయినా దానిని సాకుగా చూపే "తెలంగాణా" ప్రాంతం ప్రతేక రాష్ట్రంగా విడిపోయిందన్నది అందరికీ తెలిసిన సంగతే! అటువంటి రాజకీయం రంగు పులమడం కాదు నా ప్రయత్నం.
కొన్ని ప్రజల నిత్య వ్యవహారిక పదాలు ఆ ప్రాంతం (పల్లె) ఉనుకిని తెలియ జేస్తాయి. అటువంటి చాలా పదాలు ఇంకా ప్రజల నాలుకల మీద కదలాడుతూ సజీవంగా ఉన్నాయి. అటువంటి వాటిని వెదికి మన రచనలలో ఉపయోగించుకోక పోతే అవి కాలంలో కలిసిపోతాయి.
అటువంటి వాటిని వెతికి ఏ ప్రాంతంలో ఏ అర్థంలో వాడుకలో ఉన్నాయో ఎవరికి వారు ఎరుక చేయడానికే ఒక సమూహాన్ని ఏర్పాటు చేస్తున్నాను. ముఖ్యంగా "రాయలసీమ ప్రాంతపు పదజాలం". అట్లని ఆ పదజాలం ప్రేమికులే కాదు ఏ ప్రాంతము వారైనా సభ్యులుగా చేరి వారి వారి ప్రాంతాల్లో ఏ యే పదాలను ఏ అర్థంలో, ఏ సందర్భంలో వాడుక చేస్తారో చెప్పవచ్చు. ఈ సందర్భంగా ఇతర నుడులను కించపరచడం కానీ, హేళన చేయడం కానీ చేయడం సభ్యత కాదు. అటువంటి వారిని సమూహం నుంచి తొలగించే అవకాశముంది.
"ప్రాంతీయ నుడులను" వెలికి తీసే నా యత్నాన్ని అందరికీ అర్థం అయ్యే రకంగా ఎంతవరకూ చెప్పినానో నాకే తెలియదు. మొదలు పెట్టిన తరువాత తప్పొప్పులను సవరించుకొంటూ ముందుకు వెళదాము. కాబట్టి భాషా ప్రేమికులందరూ సభ్యులుగా చేరగలరని మనవి.
-సడ్లపలి చిదంబరరెడ్డి
Next Story