మరుగు దొడ్డి నుండి మానవత్వ గూటికి!
x

మరుగు దొడ్డి నుండి మానవత్వ గూటికి!

చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ మరుగుదొడ్డిలోనే 13 ఏండ్లుగా బతుకుతున్న మహిళ.


కట్టుకున్న భర్త కాలం చేశాడు, ఉన్న పాత ఇల్లు నేలమట్టం అయింది.

దీనితో ఆమెకు మరుగుదొడ్డి గదే నివాసం అయింది.

దశాబ్దకాలంగా అందులోనే జీవనం సాగిస్తోంది ఆ వృద్ధురాలు.చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ ఆ గదిలోనే గత 13 ఏండ్లుగా బతుకుతోంది.

ఇదంతా చూశాడు దారిన పోయే ఒక జర్నలిస్టు.

ఫొటోలు తీసి, ఒక చిన్న వార్తగా రాశాడు.

ఆమె ధీన గాథను చూసిన ఒక సహృదయుడు ఆమెను వెతుకుతూ సిద్ధిపేట జిల్లా, జగదేవ్‌ పూర్‌ మండలం , పీర్లపల్లిలో ఆ వృద్ధురాలిని కలిశాడు.

డియర్‌ రూరల్‌ మీడియా వ్యూవర్స్‌...

ఆ తరువాత ఏం జరిగిందో చూస్తే మాయమై పోలేదమ్మా మనిషిన్న వాడు అంటారు!


రాత్రి అయ్యింది . అందరూ తమ ఇళ్ల తలుపులు మూసేసుకుని నిద్రించే సమయం.

కానీ, ఒక వృద్ధురాలు మాత్రం మరుగుదొడ్డిలోనే తన కొంగు పరచుకుని నిద్రిస్తుంది.

అవును అదే ఆమె ఇల్లు. అదే ఆమె జీవనం. అదే ఆమె ప్రపంచం.


ఎవరీ బాలమ్మ.

ఒకప్పుడు భర్తతో కలిసి కూలీ పనులు చేసుకుంటూ, చిన్న పెంకుల ఇంట్లో ఉండేది. కాలం కలిసి రాక, భర్త చనిపోయాడు. వానలకు ఉన్న ఇల్లు కూలిపోయింది.

మిగిలింది ఒక్క మరుగుదొడ్డి గది. అప్పటి నుంచి 13 ఏళ్లుగా చలిలో వణుకుతూ, ఎండలో ఎండుతూ ఆ మరుగు దొడ్డే ఆమెకు ఆశ్రయం అయింది.

ఆమెకు అదే వసతి ఆమెకు అదే వంటగది, ఆమెకు అదే జీవితం.

ఈ దేశంలో మనిషి గూడును కోల్పోవచ్చు కానీ గౌరవం మాత్రం కోల్పోకూడదు. బాలమ్మ బతుకు ఆ మాటకు నిలువెత్తు ఉదాహరణ.

బాలమ్మ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు పత్రికల్లో చిన్న వార్తగా వచ్చింది.

ఆ వార్తను హైదరాబాద్‌కి చెందిన రఘు అనే వ్యక్తి హృదయాన్ని తాకింది.

సిద్ధిపేట జిల్లా ,జగదేవ్‌పూర్‌ మండలంలోని పీర్లపల్లిలో ఉన్న ఆ వృద్ధురాలిని వెతుక్కుంటూ వెళ్లాడు . ఆమెను, ఆమె నివాసాన్ని చూశాడు. మనసు ముక్కలైంది.చిన్న గదిని చూసి కళ్లల్లో కన్నీళ్లు నిండాయి. ఆ క్షణంలోనే ‘‘బాలమ్మకు ఒక పక్కా ఇల్లు కడతాం.’’ అని నిర్ణయించారు. కొందరు దాతలను కలిసి కొంత ఫండ్‌ సేకరించాడు.

మానవత్వం గెలిచిన క్షణం!

అరికపూడి సేవా ట్రస్ట్‌ ద్వారా అదే వేగంలో నిర్మాణం ప్రారంభించి పూర్తి చేశారు.

ఇటీవలే ఆమెకు సురక్షితమైన పొదరిల్లు పూర్తయింది.

మానవత్వం మిగిలే ఉంది

‘ నా భర్త పేరు చంద్రయ్య . కూలీనాలీ చేసుకుంటూ బతికే వాళ్లం. 13 ఏళ్ల క్రితం ఆయన అనారోగ్యంతో చనిపోయిండు. పదేళ్ల క్రితం నాకున్న చిన్న ఇల్లు వానలకు కూలిపోయంది. అప్పటి నుండి మరుగుదొడ్డిలోనే నివాసం ఉంటున్నా... ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ సాయం చేయలేదు. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు.ఎంతో ప్రయత్నం చేసినా ఎందరినో కలిసినా ఇల్లు ఇవ్వలేదు.అలాగే అనాధగా ఈ చిన్న గదిలో సామన్లు పెట్టుకొని బతుకుతున్నాను. నాగురించి తెలిసి అరికపూడి రఘ అనే ఆయన కొన్ని నెలల

క్రితం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ముందుగా కొన్ని నిత్యావసర వస్తువులు కొని ఇచ్చాడు.

తరువాత చిన్న ఇల్లు పక్కాగా కట్టిండు. ఇపుడు నాకు నీడ ఉందనే ధైర్యం ఉంది.’ అని చెప్పింది ఆ వృద్దు రాలు బాలమ్మ.

మానవత్వం చాటిన అరికపూడి ట్రస్ట్‌ ! నిర్వాపకులు రఘు గారిని సంప్రదించగా ఆయన ఇలా అన్నారు.

‘ నేను బిహెచ్‌ ఎల్‌ సమీపంలో ఉంటాను, బిడిఎల్‌ పని చేసి రిటైర్‌ అయ్యాను. నిత్యం పత్రికలు చదువుతాను. వాటిల్లో సమస్యల్లో ఉన్న వారి గాథలు గుర్తించి వారికి వీలైనంత వరకు సహాయం అందిస్తుంటాను. నాతో పాటు కొందరు ఆత్మీయ మిత్రులు ఈ సేవాకార్య క్రమాలకు ఆర్ధికంగా సాయం అందిస్తున్నారు. అలా బాలమ్మ మరుగుదొడ్డిలో నివాసం ఉండటం చూసి కదిలిపోయాను. ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగడం కంటే మనమే ఎందుక సాయం చేయకూడదని కొందరు దాతలను కలిసినపుడు కొందరు ముందుకు వచ్చారు. అలా బాలమ్మకు చిన్న ఇల్లు నిర్మించాం. బాలమ్మ కొత్త ఇంటి లోకి అడుగు పెట్టిన ఆ క్షణం ఆమె జీవితంలో భద్రత అనే ఆత్మవిశ్వాసం కనిపించింది. ఇది చాలు జీవితానికి అనిపించింది.’ అన్నారు రఘు .


భారతదేశంలో ఒక అంచనా ప్రకారం మొత్తం సుమారు 17.7 లక్షలకు పైగా ప్రజలు పక్క నివాసాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు.ఎక్కువ మందికి ఆదాయం తక్కువగా ఉండటం వల్ల సొంత ఇల్లు పొందలేక పోతున్నారు.

ఉపాధి కోసం గ్రామం నుంచి నగరాలకు వచ్చిన వారికి ఉపాధి లేకపోవడం, స్థిర నివాసం లేకపోవడం వల్ల నివాస లేమి పరిస్థితి ఏర్పడుతుంది.

పరిష్కార దిశగా అడుగులు...

దేశ వ్యాప్తంగా ఉండడానికి నీడలేక పోవడానికి అనేక సమస్యలు ఉన్నప్పటికీ కొన్ని సేవాసంస్ధలు కొంత వరకు నీడను కల్పించడానికి ప్రయత్నాలు జరుపుతున్నారు.

బాలమ్మకే కాదు, రఘు గత పదేళ్లుగా కష్టాలు ,వేధనలో ఉన్న ఎందరినో ఆదుకున్నారు.

కొన్ని నెలల క్రితమే ఒడిస్సాలోని జాజ్‌పూర్‌ జిల్లా, ఉసాహి గ్రామానికి గుంధీరామ్‌ జెనా అనే దినసరి కూలీ లక్ష మొక్కలు పెంచి అడవిని అభివృద్ధి చేసినప్పటికీ సొంత ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్నాడని టీవీ ఛానెల్‌ వార్తలు చూసి రఘు ఆయన్ని వెతుక్కుంటూ ఒడిస్సా వెళ్లి ఆ కుటుంబ సమస్యలు తెలుసుకొని నాలుగు నెలల్లోను ఇంటిని నిర్మించారు.

ఇపుడు కూడా తెలంగాణలో కొందరు రైతులకు సాయ పడే పని లో నిరంతరం సేవా దృక్పథంతో అడుగులు వేస్తున్నారు .

Read More
Next Story