
ఆగస్టు నెల !
నేటి మేటి కవిత ‘గీతాంజలి’ ‘12 నెలల కవితలు’ ప్రారంభం)
ఆకు పచ్చని ఆకులన్నీ
ముదురు గోధుమ రంగులోకి మారి
రాలిపోయే ఆకు రాలు కాలం!
జూలై నెల దాకా కలలన్నీ వర్షమై కురిసిపోయాక,
ఆఖరి మేఘం కూడా వెళ్ళిపోతుంది.
*
ఇకప్పుడు ప్రతీ నెలా ఒంటరైన ఆమె,
ఇంటికొచ్చిన ఆగస్టు నెలని
ప్రేమగా హత్తుకుంటుంది.
బజారుకి వెళ్ళి
రాలిన రంగున్న ప్లాస్టిక్ ఆకుల
తోరణాలను తెచ్చుకుంటుంది.
వాకిట్లోని
వెల్కమ్ హోమ్
పూలకుండీలో శ్రద్ధగా సర్దుతుంది.
ఇంట్లోకి అడుగు పెట్టబోయే
మనుషుల పాదాల కోసం
డోర్ మాట్ మీద కూడా
కాసిన్ని రాలిన ఆకులను ఉంచుతుంది!
తలుపు కొట్టిన వాళ్ళని హృదయంలోకి
తీసుకుంటున్నట్లుగా తలుపు మీద
హృదయాకారంలో రాలిన శిశిర పత్రాలను
అపురూపంగా అలంకరిస్తుంది.
వసంతాన్ని పోగొట్టుకున్న ఆమె
శిశిరాన్ని పండగ చేసుకుంటుంది.
*
అంతేనా..ఇల్లంతటినీ
ఆమె ఆకులు రాల్చుకున్న తోటలా
మార్చేస్తుంది.
కొన్ని పూల తీగలతో సహా!
బయటి తోటల్లో కి నడవలేని ఆమె
ఇంట్లోపలి తోటలో మెల్లిగా నడుస్తూ,
రాలిన ఒక్కో ఆకు జ్ఞాపకాన్ని కవిత్వంగా రాస్తుంది!
ఒక్కో ఆకుకీ ఒక్కో పేరు
తన పిల్లల,మనవళ్ళ ,భర్త,
మరణించిన అమ్మ,నాన్నల,తాత,అమ్మమ్మల పేర్లు,
ఊరి పేర్లు,
బహుశా మరిచిపోలేని తన యవ్వన కాలపు
ప్రియుడి పేరుతో కూడా పిలుచుకుంటూ
ఆకులతో కబుర్లు చెబుతూ ఉంటుంది.
*
శిశిరం ముందు తనని వీడిపోయిన
వర్షంకోసం ఆమె వియోగ గీతాల్ని
పాడుకుంటుంది.
ఒక్కసారి వర్షాన్ని పంపమని
ఆకాశాన్ని వేడుకుంటుంది.
ఆకాశం వినదు
మేఘాల్ని తనలోపల దాచుకుని
తలుపులు మూసుకుంటుంది.
అప్పుడిక ఆమె వాకిట్లో
చెట్లు శిశిర వర్షాన్ని రాలుస్తాయి.
*
కొన్నిసార్లు వరుసగా ఆకులు రాల్చుకునే
తోటను చూడలేక ఆమె కిటికీని మూసేస్తుంది.
కానీ శిశిరంలోని ఎడారితనాన్ని
అలవాటు చేసుకోవడానికి ఆమె ఇల్లంతా
రాలిన శిశిరపు ఆకుల తీగలతో అలంకరిస్తుంది .
గోడలకి,తలుపులకి,తన రాత టేబుల్ చుట్టూ,
వంటింట్లో పుస్తకాల అలమారాల చుట్టూ
శిశిరపు ఆకుల తోరణాలు కట్టుకుంటుంది.
ఆ తరువాత మెల్లిగా నవ్వడాన్ని,
తృప్తి చెందడాన్ని సాధన చేస్తుంది.
శిశిరాన్ని తెచ్చిన ఆగస్టు నెలని
ప్రేమించడం మొదలు పెడుతుంది.
*
ఎందుకైనా మంచిదని రాబోయే
చలికాలపు నెగళ్లను, రజాయిలను,
స్వెట్టర్లను కూడా సిద్ధం చేసుకుంటుంది.
దూరాన ఉన్న మనవడో
మనవ రాలో ఫోన్ చేస్తే,
ఇంటికి వస్తే రాలిన ఆకుల మీద
బొమ్మలు ఎలా వేయాలో
నేర్పిస్తానని ఆశ పెడుతుంది!
*
ఆమెలో ఏకంగా పెద్ద ఆశ,
తలుపులు తెరుచుకుని
రాని మనుషుల కోసం,
ఇంటినే ఆకులు రాల్చుకునే
శిశిర శిబిరంలా మార్చేస్తుంది.
ఆమెకు ఋతువులు కాదు
మనుషులు ముఖ్యం.
అందుకే ఋతువులు మారినప్పుడల్లా
ఆమె కూడా మారిపోతూ
మనుషుల కోసం ఎదురు చూస్తుంటుంది!
ఆమే కాలానికొక
ఋతువుగా మారి పోతుంటుంది.
ఇల్లు సమాధిగా మారడం
ఆమెకి ఇష్టం ఉండదు.
అందుకే వాకిట్లో నిలబడి
ఎవరో ఒకరిని పిలుస్తూనే ఉంటుంది
*
మూసుకున్న పక్కింటి తలుపుల మీద,
ఇంట్లోకి బొద్దింక లొచ్చాయనో ,
వాషింగ్ మెషీన్ పని చేయట్లేదనో,
కాస్త సాయం చేయమని రాసిన
కాగితపు ముక్కలని అంటించి వెళ్ళిపోతుంది.
ఏదో ఒక రకంగా ఆమె మనుషుల్ని
పలకరించాలనుకుంటుంది,
చూడాలనుకుంటుంది.
ఇంట్లో బందీలైపోయిన మనుషులను,
గడప దాటించి
బయటకు రప్పించాలని అనుకుంటుంది.
మారిపోయే ఋతువులు మనుషుల్ని కూడా
ఎలా మారుస్తాయో, తనలా ఒంటరిని
ఎలా చేస్తాయో తెలుసుకోవడం అంటే ఆమెకి ఆశక్తి.
*
అందుకే రోజూ మాటలు రాసిన
కాగితపు ముక్కలనీ తలుపులకి
అంటిస్తూ తిరుగుతూ ఉంటుంది.
ఋతువులను ఇంట్లో బంధించి,
ఎండిన శిశిరపు ఆకుల లాంటి
మనుషుల్ని బయట పట్టుకుంటుంది.
రేపో మాపో రాలిపోయే వాళ్ళ ముఖాల్లోని
ముడుతుల్ని గుర్తు పట్టి
చేయిపట్టుకుని ఇంట్లోకి తీసుకు వెళుతుంది!
కొన్ని మాటలని వాళ్ళ దోసిట్లోకి వదులుతుంది.
వాళ్లెప్పుడూ వినని కొత్త రాగాలని కూడా!
జీవితం ఇప్పుడే మొదలైందని
వాళ్ళ చెవుల్లో గుస గుస లాడుతుంది.
ఆమె ఆగస్టు నెలలో మొదలైన
శరత్కాలపు శిశిర వసంతం మరి !