ఆటోగ్రాఫ్
x

ఆటోగ్రాఫ్

నేటి మేటి కవిత : డాక్టర్. చెంగల్వ రామలక్ష్మి


నలభై ఏళ్ల నాటి

ఆటోగ్రాఫ్ పుస్తకం ఇనప్పెట్టెలో
పాత పుస్తకాల ఆకాశంలో
తటిల్లతలా మెరిసింది

చేతిలోకి తీసుకుంటే
నన్ను చూసి ప్రేమగా నవ్వింది
నివురు కప్పిన తేజంలా
అరచేతిలో ఇమిడిపోయిన
ఆటోగ్రాఫ్ పుస్తకం పై నిండా
పరచుకున్న దుమ్ము!

తుడిచాక, అరచేతి కొలనులో
వికసించిన కమలంలా
జ్ఞాపకాల సుగంధాలను పంచింది

డిగ్రీ మూడవ సంవత్సరం చివరలో,
స్నేహితులందరి పెద్ద పెద్ద ఆర్భాటపు
ఆటోగ్రాఫ్ పుస్తకాల మధ్య
మా నాన్న కొనిచ్చిన ఐదు రూపాయల
హంగులు లేని చిన్న పుస్తకం!

పుస్తకంలో ఏముందిరా
అందులో ఉండే పెద్ద పెద్దోళ్ల
విలువైన మాటలు చూడాలి గాని,
అన్న నాన్న మాటలు
అప్పుడు రుచించలా!

పొడి సంతకాలు కొన్ని
గుండె తడి ఆరనివ్వని
మాస్టార్ల మేలు వాక్యాలు కొన్ని!

ఇంకెందరో కవుల, రచయితల,
వక్తల చేతి రాతల
నా నుదుటి గీతను దిద్దిన
జ్ఞాపకాల బుట్ట ఇది!

నా ప్రియమైన తెలుగు మేడం
రాసిన సంస్కృత శ్లోకం
నన్నింకా వెంట ఉండి
ముందుకు నడిపిస్తూనే ఉంది

నాతో కవిత్వ అక్షరాలు
దిద్దించిన మహాకవులు
తమ చేవ్రాలు గుర్తులలో
నా బాగును గమనిస్తూనే ఉన్నారు

మనసును దిగులు మేఘం
కమ్ముకున్నప్పుడల్లా
ఈ ఆటోగ్రాఫ్ పుస్తకం
నన్ను నిలబెడుతూనే ఉంది

మా నాన్న చెప్పిన
పెద్ద పెద్దోళ్ల విలువైన మాటల
విలువ ఇప్పుడు తెలిసొస్తోంది.

-డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి

Read More
Next Story