బాల కథా శిల్పులు
x

బాల కథా శిల్పులు

బాలల దినోత్సవం ( 2025 ) సందర్భంగా బాలచెలిమి నిర్వహించిన జాతీయ కథల పోటీలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి ప్రచురించిన పుస్తకం ఇది


పెద్దలు పిల్లల కొరకు రాసిన సాహిత్యం, పిల్లలే స్వయంగా రాసిన సాహిత్యం అని బాలసాహిత్యాన్ని రెండురకాలు విభజించవచ్చు. ఈనాడు రెండు తెలుగు రాష్ట్రాలలో పిల్లలు ముమ్మరంగా సాహిత్య సృష్టి చేస్తున్నారు. వాటిలో ఎక్కువగా కథా సంకలనాలు వున్నా సమీక్ష, శతకం , వ్యాసం, లేఖ లాంటి సాహిత్య ప్రక్రియల పుస్తకాలు కూడా వున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు వరకు ముప్ఫైయారు పిల్లల పుస్తకాలు వచ్చా యని ప్రఖ్యాత బాలసాహితీవేత్త గరిపెల్లి అశోక్ గారు చెప్పారు. ఇది పిల్లల రచనా వ్యాసంగం వేగాన్ని సూచిస్తుంది. పెద్దలు రాసిన పిల్లల కథలకంటే పిల్లలు తమ దృక్పథంలో నుంచి రాస్తున్న కథలే అసలైన బాల సాహిత్యపు విలువలతో వుంటున్నాయి. పిల్లలు రాసిన ఐదువందల ముఫ్పై యేడు కథల పుస్తకాలు ముద్రణలోకి వచ్చాయి. ఇది శుభపరిణామం. "అనగనగా ఒకరాజు" కథలకు కాలం చెల్లి పోయింది. పిల్లలు చిన్నతనం నుంచే తమ ఆలోచనా పరిధిని విస్తృతం చేసుకుంటున్నారు. దానికి నిదర్శనమే పిల్లలు రాసిన ఈ కథల పుస్తకం.


బాలల దినోత్సవం ( 2025 ) సందర్భంగా బాలచెలిమి నిర్వహించిన జాతీయ కథల పోటీలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి ప్రచురించిన పుస్తకం ఇది. ఏడో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న పిల్లలు రాసిన కథలు ఇవి. పర్యావరణం, విలువలు, శాస్త్రీయత ఈ కథలలో వున్న కథా వస్తువు. ఇందులో మొత్తం ఇరవై నాలుగు కథ లున్నాయి. వాటిలో పదహారు కథలు అమ్మాయిలు రాసినవి. ఆరు కథలు అబ్బాయిలు రాసినవి. ఆరుగురిలో షేక్ జాహిద్ ముస్లిం అబ్బాయి వుండడం విశేషం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు రాసిన కథలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల్లో .. ముఖ్యంగా గ్రామీణ పిల్లలో ఇంకా సృజనాత్మక శక్తి ఉందనడానికి ఇది నిదర్శనం. అన్నీ చాలా చిన్న చిన్న కథలు. రెండు కథలు పేరు లేనందువల్ల ఎవరు రాసారనేది సందేహాస్పదం. చాలా చిన్న చిన్న కథలు కానీ పిల్లలు

తీసుకున్న కథా వస్తువు మాత్రం చాలా గొప్పది. చాలా వరకు పిల్లలు తమ జీవితంలోని సంఘటలను, తాము చూసిన సంఘటలనే కథలుగా మలిచారు.

పర్యావరణం - పరిరక్షణ అనే కథను ముందే వాళ్ళ నానమ్మకు చెప్పినట్లు రాయడం విభిన్నంగా వుంది. అంటే శిల్పం రీత్యా మధ్యమ పురుషలో రాసిన కథ. ప్రకృతి సౌందర్యంలో, పక్షుల కిలకిలా రావాలతో, పాడి పంటలతో విలలిసిల్లుతున్న గ్రామానికి దగ్గరలో అభివృద్ధి పేరుతో ఫ్యాక్టరీ రావడంతో పర్యావరణానికి జరిగిన నష్టాన్ని చెపుతుంది. ఈ కథ. అక్కడితో ఆగక ' హరిత మిత్ర క్లబ్ ' ఏర్పాటు చేసి ఊళ్ళోకి వచ్చిన కాలుష్యాన్ని అరికట్టినట్లుగా సమస్య పరిష్కారాన్ని చూపింది. ' పుట్టినరోజు మొక్క ' కథలో .. పక్కపక్కనే మొలిచిన రెండు మొలకలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. ఇలా సంభాషణా రూపంలో కథచెప్పడం కథన శిల్పంలో ఒక పద్ధతి. తల్లి జబ్బు పడ్డ సంఘటన ద్వారా మొక్కలంటే ఇష్టంలేని కూతురు ఆక్సిజన్ ద్వారా ఆమె కోలుకోవడంతో మొక్కల ప్రాముఖ్యాన్ని తెలుసుకొని, నర్సరీని ఏర్పాటుచేసి, ఏకంగా పర్యావరణ అవార్డును అందుకుంటుంది. ' ఆక్సిజన్ మొక్కలు ' అనే కథలో.. ప్లాస్టిక్ మానేద్దాం, బట్టసంచి, ఒక్క ఆలోచన కథలద్వారా ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే పెను ముప్పును చెపుతారు పిల్లలు. అభివృద్ధి పేరుతో చెట్లు నరకడం వల్ల వచ్చే ప్రమాదాన్ని చర్చిస్తుంది 'సహకారం' కథ. ' మొక్కల విలువ ' కథ ప్రసాద అనుభవమే అనిపిస్తుంది. కథలో కథలో ఉన్న ప్రసాద్ ఆరేళ్ళ వాడు.

కనువిప్పు, మార్పు ఈ రెండు కథలు లింగ వివక్షను చర్చించాయి. కుటుంబంలో ఆడపిల్లల పెంపకంలో మగ పిల్లపిల్లల పెంపకంలో వుండే వ్యత్యాసాన్ని చర్చకు పెట్టి, ఇద్దరినీ సమానంగా చూసినట్లుగా కథలు ముగిసాయి. ఇది ఆడపిల్లల తీరని కోరిక. వాళ్ళకు సమానత్వం కావాలని చెప్పకనే చెప్పారు. ఇవి కూడా పిల్లలు తమ జీవితానుభవం లోనుంచి రాసినవే.. ఈనాటికీ పిల్లలపెంపకంలోముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో ఈ తేడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది.

రసాయనిక ఎరువుల వాడకం వల్ల వచ్చే ముప్పును చెపుతూ సేంద్రియ ఎరువులతో శాస్త్రీయ దృక్పధంతో వ్యవసాయం చేయడం వల్ల వచ్చే లాభాలను చెపుతుంది ' శాస్త్రీయ దృక్పధం ' అనే శోభిత రాసిన కథ. ఒక గ్రామీణ అమ్మాయి మాత్రమే ఇలాంటి కథ రాయగలదు. ఈనాడు వ్యవసాయ రంగంలో ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయ రంగంలో మహిళా రైతుల కృషి ఎన్నదగింది. అయినప్పటికీ రైతు అనే పదం నేటికీ పుoలిoగానిని మాత్రమే సూచిస్తుంది.

పిల్లల పెంపకం ఒక కళ. తల్లిదండ్రులు తమ తీరని కోరికలను పిల్లల ద్వారా తీర్చుకోవాలని చూడడం అవివేకం. పిల్లల వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ వాళ్ళ ఆశలకు , ఆశయాలకు అనుగుణంగా ఎదగడానికి నిచ్చిన మెట్ల లాగా తల్లిదండ్రులు ఉండాలని చెప్పేకథ 'నా ఆట - నా జీవితం.' పిల్లల పెంపకం మీద పరిసరాల ప్రభావాన్ని చెపుతుంది

' చిలుక పెంపకం ' కథ. బుల్లి బాబు బుడి బుడి అడుగులు వేస్తున్న చిన్న సంఘటనను పేర్కొంటూ తల్లిదండ్రుల బాధ్యతను గుర్తు చేస్తుంది ' తొలి అడుగులు ' కథ.

మానవ విలువలు మాయమైపోతున్న ఈనాటి సమాజంలో వాటిని కథావస్తువుగా తీసుకొని కథలు రాయడం చూస్తుంటే.. భవిష్యత్తు మీద భరోసా కలుగుతుంది. ఆడిన మాట తప్పరాదు, కాకి అందం, లక్ష్య సాధన, గ్రామ పెద్దల మానవత్వం, సహకారం మొదలైన కథలు ఆ కోవలోకి వస్తాయి.

' మట్టి గణపతి ' పుస్తకంలో వున్న కాస్తా పెద్ద కథ. సమాజంలో భక్తి పేరుతో సృష్టిస్తున్న ఒక గందరగోళ వాతావరణాన్ని, పర్యావరణ నష్టాన్ని చర్చిస్తుంది ఈ కథ. వినాయక చవితి ఉత్సవాలలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేసినపుడు నీటిలో కరుగక, దాని వల్ల నీటికాలుష్యం ఏర్పడుతుంది. నీటిలోని జీవరాసులు చనిపోతాయి. ఇక ఉత్సవాలలో వాడే డీజే సాండ్ సిస్టం వల్ల శబ్ద తీవ్రతతో పిల్లలకు, వృద్ధులకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ధ్వని కాలుష్యం

ఏర్పడుతుంది. కాబట్టి మట్టిగా గణపతులనే వాడాలని నొక్కి చెపుతుంది బాల రచయిత్రి.

ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలది తల్లిదండ్రులతో పాటు నిత్య జీవన పోరాటం. అలాంటి పరిస్థితులను ఎదుర్కొని చదువుకున్న పిల్లలు తమ జీవిత లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తారు అనడానికి మనకు చాలా నిదర్శనాలు కనిపిస్తాయి. ఇది నేను ముప్ఫై ఎనిమిదేళ్ళ ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తి అనుభవంతో చెపుతున్న మాట.తొమ్మిదో తరగతి విద్యార్థిని రుచిత రాసిన ' లక్ష్య సాధన ' కథ కూడా అలాంటిదే. తండ్రి తాగుబోతు. ఆమెను చదివించడానికి తల్లి పడే కష్టం.. కుటుంబంలో వాళ్ళిద్దరి గొడవలు .. ఇలాంటి కుటుంబాలు మన సమాజంలో కోకొల్లలు. చివరికి కథలో తండ్రి మార్పుతో వాళ్ళకూతురు దీవెన ఉన్నత చదువులు చదివి, కలెక్టర్ కావాలనే తన లక్ష్యాన్ని సాధించడంతో కథ ముగుస్తుంది.

తిక్కన సోమయాజి " ఆల్ఫార్థాలలో అనల్పార్థ రచన చేసినట్లు.. ఈ పిల్లలు చిన్న చిన్న కథలలో గొప్ప గొప్ప విషయాలను చెప్పారు. దాదాపు అన్ని కథలలో సమస్యలతో పాటు వాటి పరిష్కారాలను సూచించడం వల్ల " తరగతి గదిలో దేశ భవిష్యత్తు రూపు దిద్దుకుంటుంది " ఆరోగ్యoగా అనే ఆశాభావం కలుగుతోంది. ఈ సందర్భంగా వాళ్ళకు వెన్నుదన్నుగా వున్న ఉపాధ్యాయులు అభినంద నీయులు .పిల్లలందరూ నేల విడిచి సాముచేయకుండా వాస్తవ జీవితంలోని క థా వస్తువులతో కథలు రాయడం ముదావహం. దానితోపాటు పిల్లల పట్ల పెద్దలు మెలగవలసిన తీరును సూచించడం గమనార్హం. " భావి భారత పౌరుల"ను విలువలతో తీర్చిదిద్దడానికి నిరంతరం కృషిచేస్తున్న మణికొండ వేదకుమార్ గారి కృషి శ్లాఘనీయం.


(డిసెంబర్ 21 హైదరాబాద్ ఆక్స్ ఫోర్డ్ గ్రామర్ స్కూల్ ఈ పుస్తకం ఆవిష్కరణ జరుగుతుంది. ఈ వ్యాసం ఈ పుస్తకానికి రాసిన పీఠిక)


Read More
Next Story