
కొండల్లో ‘బాలబడి’ అద్భుతం.. గిరిజన పిల్లలకు అక్షరాల వెలుగు
తూర్పు ఘాట్ అడవుల్లో ‘బాలబడి’ ద్వారా గిరిజన పిల్లలకు అక్షరాల వెలుగు. 274 మంది చిన్నారులకు విద్య అందుతున్న ప్రత్యేక ప్రయత్నం.
తూర్పు ఘాట్ అడవుల్లో ఒక చిన్న పూరిపాక ఉంది.
గోడలు మట్టి, పైకప్పు గడ్డి. బెంచీలు లేవు, బ్లాక్‌బోర్డ్ కూడా చిన్నదే.
కానీ అక్కడ ఒక అద్భుతం జరుగుతోంది.
ఎప్పుడూ చెట్ల మధ్య తిరిగే చిన్నారులు ఇప్పుడు అక్షరాలు పలుకుతున్నారు.
“అ… ఆ… A… B… C…” అంటూ కొండల్లో కొత్త శబ్దం వినిపిస్తోంది.
అది ఒక పాఠశాల కాదు. అది ఒక కల. ఆ కలకు పేరు – “బాల బడి.”
అక్షరాలు తెలియని ప్రపంచం
విశాఖపట్నం నుండి పాడేరు కొండలు దాటి లోతైన మన్యం ప్రాంతాల్లోకి వెళ్లితే మరో ప్రపంచం కనిపిస్తుంది. సిల్వర్ ఓక్ చెట్లు, మిరియాల తీగలు, కాఫీ తోటల మధ్య చిన్న చిన్న గిరిజన గూడెలు విసిరేసినట్టుగా కనిపిస్తాయి.
చింతపల్లి మండలంలోని తురుబొంగులు, కోట్లగరు గ్రామాలు,
జి.మాడుగుల మండలంలోని వలసపాడు, పెదపొర్లు, కొత్త ఎస్.పెద్దబయలు, బర్సింగిమెట్ట, మూగమర్రి, తోకరాయి వంటి గూడెల్లో కోందు తెగ గిరిజనులు జీవిస్తున్నారు.
ఇవారు PVTG (Particularly Vulnerable Tribal Groups) గా గుర్తింపు పొందిన అత్యంత వెనుకబడిన తెగల్లో ఒకటి.
వారి భాష కువి. తెలుగు చాలామందికి సరిగా రాదు. లిపి లేని భాషలో జీవనం సాగుతుంది.
వారి జీవితం కూడా ప్రకృతితో ముడిపడి ఉంటుంది.
bursing metta లో ఏర్పాటు చేసిన బాలబడి
కాఫీ తోటల్లో కూలి పని, కొండ వాలుల్లో మెట్లు కట్టి వరి సాగు, నీరు లేని చోట రాగులు–సజ్జలు పండించడం వారి దైనందిన జీవనం.
కానీ పిల్లల భవిష్యత్తు మాత్రం అడవుల్లోనే చిక్కుకుపోయింది. “మా ఊర్లో బడి లేదు. పిల్లలు మా వెంట పనికి వస్తారు. రోగం వస్తే డోలిలో మోసుకెళ్లాలి. రేషన్ కోసం మైళ్ల దూరం నడవాలి,” అని ఎస్.పెద్దబయలు గ్రామ పెద్దలు చెబుతారు. అక్షరాలే తెలియని ప్రపంచం.
బాలబడుల ఆలోచన వెనుక ఉన్న ఆర్.డి.ఎస్.ఎస్ ప్రతినిధి బాలు గాడి.
ఒక యువకుడి సంకల్పం
ఈ పరిస్థితిని చూసి మార్పు తీసుకురావాలని భావించిన యువకుడు బాలు గాడి.
సోషల్ సైన్సెస్‌లో మాస్టర్స్ చేసిన బాలు, 2010లో రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ (RDSS) అనే సంస్థను ప్రారంభించాడు. గిరిజన ప్రాంతాల్లో సామాజిక అభివృద్ధి కోసం పని చేయడం అతని లక్ష్యం.
బాలబడిలో చిన్నారులకు డ్రాయింగ్ పాఠాలు చెబుతున్న జర్నలిస్టు శ్యాంమోహన్.
అనకాపల్లి అతని నివాసం.
అక్కడి నుంచి దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించి ఈ కొండ ప్రాంతాలకు చేరుకోవాలి.
రోడ్డు ఉన్నంత వరకు బైక్. అక్కడి నుంచి కాలి నడక. కొన్నిసార్లు గుర్రం.
“ఇక్కడ పిల్లలకు చదువు అంటే ఏమిటో కూడా తెలియదు. అందుకే ఏమైనా చేసి అక్షరాలు నేర్పాలని నిర్ణయించుకున్నాం,” అని బాలు చెబుతాడు.
గ్రామ పెద్దలను ఒప్పించి, స్థానిక వనరులతో చిన్న పాకలు నిర్మించి 9 గ్రామాల్లో ‘బాలబడులు’ ప్రారంభించారు.
పూరిపాకలే పాఠశాలలు
ఇవి సాధారణ పాఠశాలలు కావు. పాకల మధ్య నేలపై కూర్చుని పిల్లలు చదువుకుంటారు.
కథలు, పాటలు, ఆటలతో అక్షరాలు నేర్పిస్తారు. ఇక్కడ 3 నుండి 8 సంవత్సరాల వయస్సు పిల్లలు చదువుకుంటున్నారు.
ప్రస్తుతం 274 మంది చిన్నారులు ఈ బాలబడుల్లో విద్య పొందుతున్నారు. స్థానిక యువకులనే టీచర్లుగా నియమించారు.
పిల్లలు ప్రాథమిక విద్య నేర్చుకున్న తర్వాత సమీప ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చేర్పిస్తారు. ఇప్పటివరకు 42 మంది పిల్లలు అక్కడికి వెళ్లారు.
కువి భాషలో పుట్టిన కొత్త పాఠాలు
ఈ బాలబడుల ప్రత్యేకత సిలబస్. కువి భాషలో ప్రత్యేకంగా రూపొందించిన పాఠ్యాంశాలను విద్యావేత్త పి.డి.కె.రావు రూపొందించారు.
మొదట పిల్లలకు
కువి భాషలో అభినయ గేయాలు
తెలుగు పదాలు
ఆటల ద్వారా అక్షరాలు
అలా దశలవారీగా
తెలుగు అక్షరమాల, అంకెలు, ఇంగ్లీష్ ఆల్ఫబెట్ నేర్పిస్తారు.
టీచర్లకు ప్రతి మూడు నెలలకు శిక్షణ ఇస్తారు.
పిల్లల చదువు పురోగతిని నెలకొకసారి సమీక్షిస్తారు.
పిల్లల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ. అవసరమైతే ఆసుపత్రులకు తీసుకెళ్తారు. పోషకాహారం కూడా అందిస్తున్నారు.
గ్రామాల్లో వచ్చిన మార్పు
ముందు ఈ పిల్లలు రోజంతా వాగులు, చెట్లు, అడవుల్లో తిరిగేవారు. ఇప్పుడు మాత్రం బడి సమయం కోసం ఎదురుచూస్తున్నారు.
“మేము కూలీకి వెళ్లినప్పుడు పిల్లలు అల్లరిగా తిరిగేవారు. ఇప్పుడు రోజూ బడికి వెళ్లి అక్షరాలు నేర్చుకుంటున్నారు. మా ఊరి 17 మంది పిల్లలు ఆశ్రమ స్కూల్లో చేరారు,” అని బర్సింగిమెట్ట గ్రామస్తురాలు లత ఆనందంగా చెబుతుంది.
బాలబడి వల్ల తమ బిడ్డలకు అక్షరాలు తెలిశాయని చెబుతున్నారు barsing metta గ్రామస్తురాలు లత
సమష్టి సంకల్పం
ఈ బాలబడులు నడవడానికి స్థానిక యువకులే ప్రధాన బలం. 9 మంది యువకులు టీచర్లుగా పనిచేస్తున్నారు. వారి వేతనాలు మరియు పాఠశాల నిర్వహణకు
Confederation of Indian Industry
NTPc
వంటి సంస్థలు ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. స్థానికులు పిల్లలకు బ్యాగులు, స్టేషనరీ, ఆటవస్తువులు కూడా అందిస్తున్నారు.
చదువుతో పాటు జీవన పాఠాలు
ఈ బడులు కేవలం అక్షరాలకే పరిమితం కావు.
గ్రామస్తులకు
సేంద్రియ వ్యవసాయం
అడవుల సంరక్షణ
పండ్ల చెట్ల పెంపకం
గురించి కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఉసిరి, మామిడి వంటి చెట్లు పెంచితే స్థిరమైన ఆదాయం వస్తుందని వివరించారు.
ఇంకా ఎదురుచూస్తున్న మార్పు
ఇప్పటికీ ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ అంగన్‌వాడీ కేంద్రాలు చాలా చోట్ల లేవు.
బాలబడిలో పిల్లలు.
“ప్రభుత్వం ముందుకు వచ్చి అంగన్‌వాడీలు ఏర్పాటు చేస్తే సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది,” అని స్థానిక ఉపాధ్యాయులు నర్సింగరావు, రంగారావు చెబుతున్నారు.
కువి భాషలో ఒక సంతోషం
“మా తరం బడి చూడలేదు. ఇప్పుడు బాలబడి వల్ల మా పిల్లలు హాయిగా చదువుకుంటున్నారు,” అని కువి భాషలో ఆనందంగా చెబుతారు గ్రామస్తులు.
కొండల్లో మొదలైన భవిష్యత్తు
గోడలు లేని పాఠశాలలు. బెంచీలు లేవు.
చాలా సార్లు పైకప్పు కూడా ఉండదు. కానీ అక్కడ ఒక బలమైన శక్తి ఉంది — సంకల్పం.
పేదరికాన్ని జయించడానికి చదువే పెద్ద ఆయుధమని నమ్మిన బాలు గాడి, చిన్నారులతో కలిసి మరో రోజు బాలబడి వైపు నడుస్తున్నాడు.
కొండల్లో మొదలైన ఆ చిన్న అడుగులు .ఒక రోజు వారి జీవితాలను పూర్తిగా మార్చే మార్గంగా మారవచ్చు.

