బస్తర్  అడవిలో మహిళలు సృష్టించిన అద్భుతం
x
అడవిలో స్ధానికులతో రజియా

బస్తర్ అడవిలో మహిళలు సృష్టించిన అద్భుతం

‘బస్తర్ ఫుడ్ ఫర్మ్’ తో మార్కెట్లోకి దూకిన మహిళా శక్తి.


అడవిలో ఉదయం ఇంకా వెలుగు పూర్తిగా పరచుకోలేదు. మంచు చినుకులు ఇంకా ఆకులపై మెరిసిపోతున్నాయి. ఒక చేతిలో బుట్ట… మరో చేతిలో చిన్న కర్ర… అలా నెమ్మదిగా అడవిలోకి అడుగుపెడుతోంది ఒక గిరిజన మహిళ. ఆమెకు ముందున్న మార్గం సాధారణం కాదు. ఎక్కడో నేలలో ఉండే మందుపాతర ప్రమాదం… దూరంగా వినిపించే తుపాకుల మోత… అయినా ఆమె అడుగులు ఆగవు. ఎందుకంటే… ఆమెకు అడవి అంటే భయం కాదు. అది ఆమె బతుకుదారి.

బస్తర్ అడవుల్లో ఇప్పపూవు సేకరణలో రజియా

అడవే జీవితం

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది మావోయిస్టు ప్రభావం, భద్రతా దళాల ఆపరేషన్లు. కానీ ఆ వార్తల వెనుక ఇంకో ప్రపంచం ఉంది. అది గిరిజనుల ప్రపంచం.

ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరకు విస్తరించిన దండకారణ్య అడవుల పెద్ద భాగం ఈ ప్రాంతంలోనే ఉంది. ఇక్కడి అడవులు విలువైన ఔషధ మూలికలు, అరుదైన అటవీ ఉత్పత్తులతో నిండిపోయి ఉంటాయి.

ఆ సంపదను సేకరించేది ఎవరు?

అడవిని తమ ఇంటిలా చూసుకునే ఆదివాసీ మహిళలే.. మందుపాతరల భయం ఉన్నా…మావోయిస్టు-పోలీసుల మధ్య ఉద్రిక్తత ఉన్నా…

ఇప్పపూలు నేలపై పడకుండా చీరెలు కట్టి సేకరిస్తున్న మహిళలు

వారు ప్రతిరోజూ అడవిలోకి వెళ్లి ఇప్పపూలు, చింతపండు, తేనె, జీడిపిక్కలు సేకరిస్తుంటారు. బతుకు పోరాటం వారికి భయాన్ని మర్చిపోయేలా చేసింది.

కష్టానికి దక్కని ధర

కానీ వారి శ్రమకు తగిన గౌరవం దక్కేది కాదు.రోజంతా అడవిలో తిరిగి సేకరించిన అటవీ ఉత్పత్తులను చివరకు గ్రామానికి వచ్చే మధ్యవర్తులకు తక్కువ ధరకు అమ్మాల్సి వచ్చేది. అసలు లాభం దళారుల చేతుల్లోకి వెళ్లేది. ఆదివాసీ మహిళల కష్టం మాత్రం అలాగే మిగిలిపోయేది. అక్కడే ఒక మార్పు మొదలైంది.

మహిళలే ముందుకు వచ్చారు

కొంతమంది మహిళలు కలిసి పది మహిళా సంఘాలను ఏర్పాటు చేశారు. అడవిలో లభించే సహజ వనరులకు మార్కెట్ సృష్టించాలని నిర్ణయించారు.

అలా పుట్టింది “బస్తర్ ఫుడ్ ఫర్మ్”. ఇది కేవలం ఒక సంస్థ కాదు…అది ఒక మహిళా ఉద్యమం.

అడవిలో సేకరించిన ఇప్పపూలను ఆరబెడుతున్న మహిళలు

గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను ఈ సంస్థ నేరుగా కొనుగోలు చేస్తుంది. సరైన ధర ఇచ్చి వాటికి విలువ పెంచి మార్కెట్‌లోకి తీసుకెళ్తుంది.

అడవిలో పుట్టిన రుచులు

బస్తర్ అడవుల్లో లభించే సహజ వనరులతో ఇప్పుడు అనేక రకాల ఆహార ఉత్పత్తులు తయారవుతున్నాయి.

  • అల్లం, మిరియాలతో మసాలా బెల్లం పొడి
  • ఇప్పపూల లడ్డూలు
  • చింతపండు సాస్
  • మహువా టీ
  • ఇప్ప చాక్లెట్, బిస్కెట్లు
  • తేనెతో మిక్స్‌డ్ నట్స్

అడవిలో సేకరించిన ఉత్పత్తులను ముందుగా గ్రేడింగ్ చేసి, ల్యాబ్‌లో పరీక్షించి, పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తారు.

జగదల్‌పూర్‌లో ఏర్పాటు చేసిన తయారీ యూనిట్లలో వందమందికి పైగా మహిళలకు ఉపాధి లభిస్తోంది.

అటవీ ఉత్పత్తుల తో వివిధ రకాల ఆహార పదార్దాల తయారీ

ఇటీవల దేశంలోనే తొలిసారిగా ఇప్పపూవు టీను కూడా పరిచయం చేశారు.ఈ ఉత్పత్తులను కేంద్ర ప్రభుత్వ సంస్థ ట్రైఫెడ్ కొనుగోలు చేస్తోంది. అంతేకాదు, సీఆర్‌పీఎఫ్ దళాలు కూడా వీటిని వినియోగిస్తున్నాయి. ఇప్పుడు ఇవి ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ విజయగాథ వెనుక ఒక తెలుగు మహిళ ఈ మార్పుకు ప్రేరణగా నిలిచింది షేక్ రజియా.

గుంటూరు జిల్లాకు చెందిన ఆమె కుటుంబం చాలా సంవత్సరాల క్రితమే బస్తర్‌లోని జగదల్‌పూర్‌లో స్థిరపడింది. మైక్రోబయాలజీలో ఎమ్మెస్సీ చేసిన రజియా గిరిజన సంప్రదాయ ఆహారాలపై పరిశోధన చేశారు. ఆదివాసీ మహిళల కష్టాన్ని చూసి…వారి ఉత్పత్తులకు విలువ తీసుకురావాలని నిర్ణయించారు.

అడవి తేనె బాటిల్స్

2017లో *“బస్తర్ ఫుడ్ ఫర్మ్”*ను ప్రారంభించారు. గిరిజన మహిళలకు శిక్షణ ఇచ్చి, విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసే నైపుణ్యాన్ని నేర్పించారు. ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలు, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

సంప్రదాయం – సైన్స్ కలిసిన చోట బస్తర్ అడవుల్లోని సంప్రదాయ జ్ఞానం…ఆధునిక శాస్త్ర సాంకేతికత…

ఇప్పపూవు టీ

ఈ రెండింటి మధ్య వారధిలా బస్తర్ ఫుడ్ ఫర్మ్ ( Bastar Food Firm )పనిచేస్తోంది.. ప్రతి ఉత్పత్తిని ల్యాబ్‌లో పరీక్షించి, అందులోని పోషకాలు మరియు ఔషధ గుణాలను వినియోగదారులకు తెలియజేస్తున్నారు.కరోనా కాలంలో ఇమ్యూనిటీ పెంచే ఆహారాలపై ఆసక్తి పెరగడంతో ఈ ఉత్పత్తులకు మంచి డిమాండ్ వచ్చింది.

ప్రపంచం గుర్తించిన మహిళ

రజియా కృషికి అంతర్జాతీయ గుర్తింపూ వచ్చింది. కాలిఫోర్నియాలోని మోత్వానీ జడేజా ఫౌండేషన్ నుంచి అంతర్జాతీయ స్టార్ట్‌అప్ ఫెలోషిప్ లభించింది. అలాగే నీతి ఆయోగ్ ఎంపిక చేసిన “టాప్ 30 ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా”లో ఆమె ఒకరిగా నిలిచారు.

స్వయం సమ ద్ధి సాధించిన బస్తర్ మహిళలు

‘ ఆధునిక యంత్రాల ద్వారా తయారు చేసిన ఈ సహజ అటవీ ఉత్పత్తులను మహానగరాలలో మార్కెట్ చేసి, మహిళలకు చేయూతనివ్వడం బస్తర్ ఫుడ్స్ సాధించిన అరుదైన విజయం. చదువుకొని అవకాశాలు లేక ఇంటికే పరిమితమైన వారిని, చదువులేక ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్న వారిని కలుపుకొని వారు తయారు చేసిన ఉత్పత్తులను వి కయించడం ద్వారా వారికి సుస్ధిర ఉపాధిని కలిగించేలా ముందుకు సాగుతున్నాం. మహిళల శ్రమ శక్తికి బస్తర్ ప్రభుత్వ అధికారులు కూడా సహకరిస్తున్నారు. బస్తర్ ఫుడ్ ( Bastar Food ) ఉత్పత్తులు అన్నీ Amazon.in: Online లో అందుబాటులో ఉన్నాయి’ అన్నారు రజియా.

మహిళా దినోత్సవానికి ఒక సందేశం

బస్తర్ అడవుల్లో ఇంకా ప్రమాదాలు ఉన్నాయి.

మందుపాతరల భయం ఇంకా పూర్తిగా పోయలేదు.కానీ ఒక పెద్ద మార్పు జరిగింది.

ఒకప్పుడు అడవిలో సేకరించిన పండ్లను తక్కువ ధరకు అమ్ముకున్న మహిళలు…

ఇప్పుడు అదే ఉత్పత్తులను బ్రాండ్‌గా మార్చి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.అది కేవలం ఆర్థిక మార్పు కాదు. అది మహిళా ఆత్మగౌరవానికి సంకేతం.

అడవిలో పుట్టిన ఆ చిన్న పండు… ఇప్పుడు ప్రపంచానికి చెబుతోంది —

మహిళలకు అవకాశం ఇస్తే… వారు అడవుల మధ్య నుంచే ప్రపంచాన్ని మార్చగలరు.

Read More
Next Story