తిరుపతి సమీపాన రాక్షస గుళ్లు: మాయమౌతున్న పూర్వీకుల ఆనవాళ్లు
x

తిరుపతి సమీపాన రాక్షస గుళ్లు: మాయమౌతున్న పూర్వీకుల ఆనవాళ్లు

ప్రభుత్వం వాటిని కాపాడాలి. ప్రకృతి ప్రియులు , చరిత్ర ప్రేమికులు , ట్రెక్కర్లు ముందుకొచ్చి కాపాడుకొనక పోతే చారిత్రక ద్రోహలుగా మిగిలిపోతాం


(భూమన్)


ఇటీవల కొన్ని అద్భుతమయిన ఆదిమ మానవుడి ఆనవాళ్లు చూసినాను. అప్పటి రోజుల్లోకి తొంగిచూసి ఎన్నో స్మృతుల్లోకి కరిగిపోయినాను.




తిరుపతి -పలమనేరు గుండా కుప్పం దారిపట్టి బైరెడ్డిపల్లె నుండి చట్టిపల్లె , విరూపాక్షపురం పోతే మైళ్లకొద్దీ కొన్నివందల Dolmen Megalith లు చూసి నోరు వెళ్లబెట్టాల్సివచ్చింది. ఒకటా రెండా నేల మీద, గుట్టలమీద. కొన్ని వేలు వుండి ఉంటాయి.




ప్రస్తుతానికి శిథిలమైనవిపోగా వెయ్యి వరకు వుంటాయి. పెద్ద పెద్ద రాతిపలకలు చుట్టూరా వాటిపైన ఒక పెద్ద రాతిపలక. ఒక వైపు పెద్దరంధ్రం. ఇంతకుముందు Mosaic Adventure Commune , Sunrise Treks లో భాగంగా మిత్రుడు బాలు తాటికోన , మల్లయ్య పల్లెదగ్గర రెండింటిని చూపించినాడు.


మనకు కూతవేటంత దూరంలో వుండే వీటిని చూసి ఆశ్చర్యపోయినాను. ఎంతటి పురాతన వారసత్వం ఇది ! వాలు రాతి స్తంభాలు , ఆ స్తంభాలు ఒక్కరాయితో కాక రాళ్లు పేర్చి కట్టినవి. వాటిపైన రాతి బండ. సరాసరి 6x12 అడుగులు వుంటుంది. అంత పెద్ద బండన ఆ నాలుగు రాతి పలకలు , గుండ్రాళ్ల మధ్యన ఎట్లా పరచినారో.




ఆ Engineering techinc చూస్తే ఆశ్చర్యపోతాము. దాదాపు 3000 సంవత్సరాల క్రితం నాటివి ఇవి. ఆ పలక కింద ఆనాటి మానవుడు గీచిన బొమ్మలు , రాతలు ఉన్నాయి. చెరిగిపోయినవి పోగా మసక మసకగా కనబడే మనప్రాచీన సోదరుడి చేతి రాతను చూసి ఉబ్బి తబ్బిబ్బయి పోయినాను.




ఆ గుట్టలు కాశిరాళ్ల కోసం తొలచినాశనం చేస్తున్నారు. ఎట్లనో ఇవి రెండూ మిగిలివున్నాయి. ఎన్ని చరిత్ర గర్భంలో కలసిపోయినాయో ? మేకలు, ఆవులు మేపుకునే వాళ్ల ఆశ్రయంకోసం మిగిలినట్లున్నాయి. ఎన్ని విపత్తులు జరిగివుంటాయి. ఇనేళ్లల్లో అయినా అవి చెక్కు చెదరి పోకుండా చరిత్రకు ఆనవాలుగా, మన వారసత్వపు గుర్తులుగా మిగిలివుండటం ఎంత ఆశ్చర్యమో?




ఆ పురాతన మనిషి తమవారిలో ఎవరైనా చనిపోతే మళ్లీ బతుకు ఉంటుందని నమ్మి శవాన్ని పెద్ద కుంట తయారుచేసి అందులో పెట్టి , ఆకులు , నారలతో చుట్టి భూమిలో పాతి పెట్టే వారని పురాతత్వశాస్త్రవేత్తల అభిప్రాయం. ఆశవాన్ని ఏదీ పీక్కు తినకుండా పెద్ద పెద్ద రాళ్లను అడ్డం పెట్టేవారట. శవంతో పాటు అతను వాడిన వస్తువులు , తిండికూడ వుంచేవారట ! వీటిని పాండవగుళ్లు , రాక్షసగుళ్లు అని అంటారు.







తిరుపతి చుట్టుపక్కల ఇవి ఎక్కువ. యోగివేమన విశ్వవిద్యాలయం చరిత్ర అధ్యాపకులు వి. రామబ్రహ్మం పుస్తకం Megalithic Culture in Chittoor District చదివితే వీటి గురించిన సమాచారం చాలా తెలిసింది.




కరకంబాడి దగ్గర రాళ్ల కాల్వలో ఎక్కువగా వుండేవట. ఈ పుస్తకం చదివి కరకంబాడి దగ్గర వున్న వెంకటాపురంలో వున్న సమాధిని చూసినాను. కల్లూరు దగ్గర పాళెంగ్రామంలో వున్న ఈ కట్టడాన్ని " దేవర ఎద్దు ” అంటారు. ఇట్లాంటిదే సదుం దగ్గర బోయనపల్లెలో కూడ వొకటివుంది. వీటి గురించి ఎవరూ పట్టించుకోవపోవటం.




ప్రభుత్వాలకు చరిత్ర స్పృహలేకపోవటంవల్ల విలువైన చరిత్ర కొనసాగింపు కకావికలమై పోతున్నది. ఇట్లాంటివీ రాయచోటి దగ్గర , తెలంగాణాలో కొన్ని జిల్లాల్లో ఉన్నాయి. ఆ మధ్య లండన్ పోయినప్పుడు అక్కడి Stone Henge చూసి ఎంత ఆశ్చర్యపోయినానో. అది కూడ మన ప్రాంతాల్లో ఉన్నటువంటిదే. దానిని రోజుకు కనీసం 20,000 మంది చూడ్డానికి వస్తున్నారు. ఈ టూరిజమ్ ద్వారా కొన్ని లక్షల పౌండ్ల ఆదాయం. వేలాది మందికి ఉపాధి.


ఈ మెగాలిత్ Amesbury కి పడమర దిక్కున రెండు మైళ్లల్లో ఉంది. అసలు వాటి దగ్గరికి వెళ్లి తాకనైనా తాకటానికి వీల్లేదు. ఒక కంచె కట్టినారు. కంచెకు అవతల నుండీ చూడాలి. 13 అడుగుల ఎత్తు , ఏడడుగుల వెడల్పు కలిగి 25 టన్నుల బరునైన బండ కలయిక ఇది. ఇవన్నీ burial mounds. చరిత్ర అన్నా , పురాతత్వ శాస్త్రమన్నా , వారసత్వ స్పృహఅన్నా ఎంతటి మక్కువ వీరికి.


3000 సంవత్సరాల కిందటి ఈ stone henge ఒకానొక బ్రిటీష్ ప్రతీక icon. UNESCO వారి ప్రపంచ వారసత్వ సంపదలో వుంది. వేలాడే రాతి బండలు. ఆదిమ మనిషి సమాధులు , మనిషి చనిపోగానే భద్రంగా ఈ గుంతల్లో వుంచి , వారికి కావాల్సిన అవసరాలు , తిండి పక్కన పెట్టి పెద్ద పెద్ద బండ రాళ్లతో కప్పిపెట్టే ఈ సాంప్రదాయం అలనాటి పునర్జన్మ నమ్మిక. Stone henge ని Windows xp లో వాల్ పేపర్ గా కూడా చూడవచ్చు. దీంతో ప్రపంచానికే Stonehenge ఇంటి స్థావరమైపోయింది. ఇంతకు మించిన పురాతన మనిషి మనిషి నమ్మకాన్ని ఈజిప్టు దగ్గర గాజాలో పిరమిడ్ల రూపంలో చూసినాను.




ఎంత పెద్ద అద్భుత కట్టడాలవి. ప్రపంచ ఏడు అద్భుతాల్లో ఇవీ ఉన్నాయి. ఆనాటి ఫారోలు చనిపోతే వారిని వీటిల్లో సమాధిచేసి తిరిగి బతికొస్తారనీ నమ్మకంతో అలనాటి సమాజం ఉండేదట. ఈ పిరమిడ్లు సాంస్కృతిక గుర్తులుగా మిగిలి ప్రపంచ ప్రజల్ని ఆకర్షిస్తున్నాయి.




అంతే విలువయిన ప్రాచీన చారిత్రక వారసత్వం మనకు వుంది. ఈ విరూపాక్షపురంలో కొన్ని వందల ఎకరాల్లో వున్న ఈ కట్టడాలు అప్పటి మానవ ఉనికిని స్పష్టంగా చెబుతున్నాయి. ఆ ప్రాంతాల్లో కొన్ని లక్షల మంది జనావాసం వున్నట్టుంది. చరిత్ర , పురాతత్వ శాస్త్రవేత్తలు పూని మరింత పరిశోధనలు చేస్తే చరిత్ర గర్భాన దాగిన రహస్యాలెన్నో బయటకొస్తాయి.


చరిత్ర స్పృహలేని మన సమాజం దీనత్వం పట్ల దిగులేస్తున్నది. ప్రభుత్వాలు పూని వీటిని పరిరక్షించి కొత్త వెలుగులునింపాలి. యాత్రా స్థలాలుగా అభివృద్ధిచేసి కొన్ని వేల మందికి ఉపాధి , పదిమందికి మంచి ఆదాయాన్నిచ్చే అపురూపమయిన ఈ వనరు ఇంతట నిర్లక్ష్యానికి గురికావటం క్షమించరాని నేరం. వొకటా , రెండా కొన్నివేల సంఖ్యలో వున్న ఇవన్నీ దగ్గర దగ్గర పోలికలు కలిగి వుండటం , అన్నింటా పునర్జన్మ నమ్మిక పునాదిగా ఉండటం కొంచెం సీరియస్ గా ఆలోచించాల్సిన సంగతేకదా !




ప్రభుత్వం దారికి రాకపోతే ప్రకృతి ప్రియులు , చరిత్ర ప్రేమికులు , ట్రెక్కర్లు ముందుకొచ్చి వొక ఉద్యమ రూపాన వీటిని పరిరక్షించుకోవాలి. మన భావి తరాల చారిత్రక వారసత్వపు వారధులుగా మనం వ్యవహరించక పోతే చారిత్రక ద్రోహలుగా మిగిలిపోతాము.


(భూమన్, రచయిత, చరిత్రకారుడు, ట్రెకర్, తిరుపతి)


Read More
Next Story