తక్కువ బడ్జెట్‌లో మొబైల్ కొనాలనుకుంటే రు.12 వేలలో బెస్ట్ 5జీ ఫోన్ ఇదే!
ఒకవేళ మీ బడ్జెట్ రు.15 వేల లోపు అయితే ఐకూ కంపెనీవారి తాజా మోడల్ జెడ్ 9ఎక్స్‌ను మీరు కళ్ళు మూసుకుని కొనుక్కోవచ్చు.
5జీ నెట్‌వర్క్ విస్తృతంగా వ్యాపిస్తోంది. జియో, ఎయిర్‌టెల్ వంటి మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలు అన్‌లిమిటెడ్ 5జీ ఇంటర్నెట్‌ను అందిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగా మొబైల్ ఫోన్ తయారీ సంస్థలు కూడా 5జీతో కొత్త కొత్త మోడల్స్‌ను విడుదల చేస్తున్నాయి. ఒకవేళ మీ బడ్జెట్ రు.15 వేల లోపు అయితే ఐకూ కంపెనీవారి తాజా మోడల్ జెడ్ 9ఎక్స్‌ను మీరు కళ్ళు మూసుకుని కొనుక్కోవచ్చు.
ఐకూ, ఒప్పో, రియల్‌మి. ఒన్ ప్లస్, వివో అన్నీ చైనాకు చెందిన బీబీకే ఎలక్ట్రానిక్స్ అనే సంస్థ యొక్క వేర్వేర్ సబ్ బ్రాండ్‌లు. వీటిలో ఒన్ ప్లస్ ప్రీమియమ్ బ్రాండ్. అత్యుత్తమమైన కెమేరా ఆ బ్రాండ్ ఫోన్‌ల ప్రత్యేకత. రియల్‌మి, ఐకూ, ఒప్పో, వివో బ్రాండ్లలో, లో బడ్జెట్ నుంచి మిడ్ రేంజ్ వరకు వివిధ విభాగాలలో ఫోన్‌లు తయారు చేస్తారు.
ఐకూ జెడ్ 9ఎక్స్ ప్రత్యేకత ఏమిటంటే రు. 12 వేల అతి తక్కువ బడ్జెట్‌లోనే హైఎండ్ ఫోన్లలో ఉండే ఐపీ 64 రేటింగ్(వాటర్ రెసిస్టెన్స్, డస్ట్ రెసిస్టెన్స్), 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటి అనేక ఫీచర్‌లను ఇవ్వటం. దీనిలో 6,000 ఎంఏహెచ్‌ల అతి పెద్ద బ్యాటరీ మరొక ప్రత్యేకత. బాగా వీడియోలు చూస్తే ఒకరోజు, మామూలుగా వాడితే రెండు రోజులు తప్పకుండా వస్తుంది. దీనిలో అమర్చిన స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్ మంచి పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
ఐకూ జెడ్ 9ఎక్స్‌లో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమేరా, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉన్నాయి. కెమేరా పనితీరు గొప్పగా లేకపోయినా, ఫరవాలేదు అని చెప్పవచ్చు. డిజైన్, బిల్డ్ క్వాలిటీ బాగున్నాయి. బరువు 203 గ్రాములు. ఫోన్ గ్రీన్ మరియు గ్రే రంగులలో లభిస్తోంది. రెండు సిమ్ కార్డులుగానీ, ఒక సిమ్ కార్డ్ - ఒక మెమరీ కార్డ్ గానీ వేసుకోవచ్చు. యాండ్రాయిడ్ 14 ఓఎస్‌తో వస్తుంది. మరో రెండు యాండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఇస్తామని కంపెనీ ప్రకటించింది.
ఈ మొబైల్‌లో ప్లస్ పాయింట్లు చూసుకుంటే, పైన పేర్కొన్న హైఎండ్ ఫోన్లలో ఉండే ఫీచర్లతోపాటు, 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ల ఫాస్ట్ చార్జర్‌ను బాక్సులో కలిపి ఇవ్వటం వంటివి చెప్పుకోవచ్చు. పారదర్శక కేస్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్ కూడా ఉంది. వేడెక్కటం కూడా తక్కువే. మైనస్ పాయింట్లు చెప్పాలంటే, దీనిలో అవసరంలేని అనేక యాప్‌లు డిఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ అయిఉండటం, వాటినుంచి వచ్చే నోటిఫికేషన్లు. అయితే వాటిని అన్ఇన్‌స్టాల్ చేసుకోవచ్చనుకోండి. పెద్ద బ్యాటరీ ఇవ్వటంవలన బరువు ఎక్కువ ఉండటాన్ని మరో నెగెటివ్‌గా చెప్పుకోవచ్చు.
ఈ ఫోనులో 4 జీబీ, 6 జీబీ, 8 జీబీ వెర్షన్‌లు ఉన్నాయి. 4 జీబీ వెర్షన్ ధర రు.12 వేల దగ్గర మొదలవుతుంది. ఈ రేంజి ధరలో ఇది ఖచ్చితంగా మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ చైనా ఉత్పత్తులు కొనటం ఇష్టం లేదనుకుంటే, ఇదే రేంజిలో దొరికే శాంసంగ్ ఎఫ్ 15 తీసుకోవచ్చు. ఇది కూడా 5 జీ ఫోనే. దీని ధర కూడా రు.12 వేల దగ్గర ప్రారంభమవుతుంది. చైనాకే చెందిన మోటారోలా వారి జీ 34 కూడా రు.12 వేల రేంజిలో మంచి ఫోన్‌గా చెప్పుకోవచ్చు.