
Source: Wissam Nassar. 2015 Pulitzer Prize Finalist
భూమి చనిపోయింది…!
భూమి చనిపోయింది (The Land is Dead) తో ఇంటర్నేషనల్ ఫోటో అవార్డ్ విన్నర్ Wissam Nassar ఇన్ స్టాలో పోస్టు చేసిన ఒక రీల్ చూశాక రాసిన కవిత...
భూమి చనిపోయింది
అనే నా మాటకు
జనం నాకు పిచ్చి కావచ్చు అంటారు
భూమి చనిపోవడమేంటని
అనుకునే వాళ్ళూ ఉన్నారు
అయినా భూమి చనిపోయిందని
గట్టిగా చెప్పగలను…!
నిరంతరం చలనంలో ఉండే భూమి
చనిపోవడం ఏమిటి..?
నిత్య గమనంలో సూర్యుడి చుట్టు తిరుగుతూనే
దాని భ్రమణం ఆపనూ లేదు
అయినా గానీ
భూమి చనిపోయింది…
భూమి చనిపోయిందనే నా మాటకు
గగ్గోలు పెట్టే వాళ్ళున్నారు
నన్ను నిందించే వాళ్ళు లేకనూ పోలేదు
భూమి చనిపోయిందనే వార్తకు
కన్నీరు కార్చే వాళ్ళూ వున్నారు
నోరు పెద్దగా చేసుకొని అరిచే వాళ్ళూ వున్నారు
ఏది ఏమైనా
భూమి చనిపోయిందని
నేను గొంతెత్తి మరీ చెప్పగలను..!
సకల జీవరాశీ ఆవాసాలు చేసుకొని
జీవించేది ఈ భూమి మీదనే
ప్రతి జీవికీ ఇంకో జీవి తోడుగా
నిలిచే సహజ సిద్ధమైన ప్రకృతి బంధమిది…!
జరుగుతున్న అధర్మ యుద్ధాలతో
నేల శవాల దిబ్బగా మారుతున్న చోట
భూమి చనిపోవడం కాక మరేమిటి..?
ఈ చరాచర జగత్తులో
సకల ప్రాణులకు ఆనవాళ్లయినా
ఈ భూమిలో
నిత్యం అధిపత్య యుద్ధాల ఘర్షణలతో
నెత్తురోడుతున్న దేశాలెన్నో..
డేగ కండ్ల లాంటి డ్రోన్ లవేటలో
తప్పటడుగులు వేస్తూ వస్తున్న బాలుడిపై
గగన తలం నుంచి బాంబుల వర్షం కురిపించిన చోట
శత్రువు యెదలపై వాడు పాద ముద్రలు మోపాడు
ఎదుటి నుంచి దూసుకువస్తున్న
తుపాకి తూటాలు
నెలల పసికందుల హృదయాలను చీలుస్తున్న వేళ
నోటి వెంట అమ్మ చనుబాలకు బదులు
నెత్తురే చూపుతున్న యుద్ధం..!!
ఎన్నేండ్లు ఇంకా ఎన్నేండ్లు
నా యెదల మీద
ఈ ఆధిపత్య అధర్మ యుద్ధాలు
ఈ రక్తపు మడుగుల ఆటలతో
నా కండ్లు ఎర్ర సార్కలెక్కాయి..!!
ఈద్ నాడు మొహల్లా మొత్తం తిరిగిన
ఫాతిమాను
ఏ దిక్కున చూడగలము
అబ్బా జాన్ అంటూ పిలిచే అహ్మద్ ను
ఏ రంజాన్ నెల వంకలో చూడగలము
ఇప్పపూలు,తునికాకులు ఏరుకునే
ఆదివాసుల నెత్తురు
మోదుగు పువ్వులైన చోట
ఇప్పుడు పాలస్తీనా అయినా
లెబనాన్ అయినా
సిరియా అయినా కాశ్మీర్ అయినా
మధ్య భారత దండాకారణ్యమైనా
జరుగుతున్న తంతు ఇదే కదా
అందుకే భూమి చనిపోయింది..!!
మరమనుషులంగా బతుకులీడుస్తున్న చోట
జీవచ్ఛవాల్లా గొంతు పెకలని కాలంలోకి
ప్రయాణం అవుతున్నాం
అందుకే భూమి చనిపోయింది..!
-వంగల సంతోష్
Next Story