
భారత్ ’అప్సర’కు ప్రాణం పోసిన తెలుగు శాస్త్రవేత్తకు బయోపిక్ నివాళి
ఇసిఐఎల్ ని హైదరాబాద్ కు తెచ్చిన శాస్త్రవేత్త ఎఎస్ రావు బయోపిక్ కు అవార్డు
జీవితంలో కష్టాలు కొందర్ని భయపడేలా చేస్తాయి. ఇంకొందర్ని క్రూరంగా మారేలా చేస్తాయి. ఎక్కడో కొందరిని మాత్రం అవి వారు పుట్టినగడ్డే గర్వపడే స్థాయికి ఎదిగేలా చేస్తాయి. ఆ కొందరి అడుగులు తమ జీవితపు వాకిళ్ళకే పరిమితమవ్వక,లక్షల మంది ప్రజల ఆశల కాంతుల్లో పాదముద్రలుగా నిలిచిపోతాయి. భారతదేశ చరిత్రలో అటువంటి తారగా నిలిచిపోయినవారే ఎ.యస్.రావు గా ప్రసిద్ధులైన అయ్యగారి సాంబశివరావు (Ayyagari Sambasiva రావు). “మహా మనీషి డాక్టర్ ఏ ఎస్ రావు” డాక్యుమెంటరికి బయోపిక్ కి వైజాగ్ ఫిలిమ్ ఫెస్టివల్ వారు ఈ డిసెంబర్ 29 న ‘ఉత్తమ డాక్యుమెంటరీ ఫిలిమ్’ అవార్డు అందిస్తున్న సందర్భంలో, ఏ ఎస్ రావు గారి కృషిని, ఉన్నత వ్యక్తిత్వాన్ని స్మరించుకునేందుకే ఈ నాలుగు మాటలు. ఆయన ఆత్యున్నత విజయం భారతదేశం నిర్మించిన తొలి అణు రియాక్టర్ ‘అప్సర’ (APSRA)క్రిటికల్ స్టేజ్ కు తీసుకువచ్చింది డాక్టర్ రావు బృందమే.
ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో డాక్టర్ ఎ ఎస్ రావు
రాష్ట్రపతి వివి గిరి నుంచి 1972లో ‘పద్మవిభూషణ్’ పురస్కారం అందుకుంటున్న ఎఎస్ రావు
తన మీద అభిమానం వల్ల ఎదుటి వారు ఏమి కోల్పోకూడదని,అందుకని తను రిటైర్ అయ్యాక విజిటర్స్ ను ఎక్కువ చూడకుండా ఉంటూ; తన చావు వల్ల ఎవరికీ ఏ ఇబ్బంది రాకూడదని దానికి కూడా ముందే ఒక వీలునామా రాయడం, ఈసిఐ ఎల్ కార్మికుల సౌఖ్యం కోసం వారికి ఆ ప్రాంతంలోనే ఇళ్ళు కట్టించి ఇవ్వడం, అప్పటివరకూ కార్లలో తిరిగినా రిటైర్ అయ్యాక సిటీ బస్సులో కూడా ప్రయాణం చేయడం; వేలమందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పించి; ఎప్పటికీ జనహృదయాల్లో మరణం లేని ప్రేమను సంపాదించుకున్న ఏఎస్ రావు గారికి ఈ సందర్భంగా అక్షర నివాళి.ఈ బయోపిక్ పాఠశాల, కళాశాల విద్యార్థులకు కూడా జీవితం పట్ల, చదువు పట్ల ఎంత స్పష్టంగా ఉండాలో, నిజమైన కష్టాలు ఎలా ఉంటాయో, వాటిని అధిగమిస్తూ ఎలా నేటి యువత విద్యా-వృత్తి రంగాల్లో ఎలా అద్భుతాలు చేయొచ్చో అన్నదానికి దిక్సూచే ఈ బయోపిక్.
ఉన్నత చదువుల తర్వాత అమెరికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన ఏ. ఎస్. రావు హోమి జె. బాబాను కలవడం అన్నది భారత సాంకేతిక విప్లవ చరిత్రకు దారి తీసింది. అప్పటి నుండి హోమి జె బాబాతో కలిసి చేసిన ఆయన పయనం, తర్వాత కాస్మిక్ కిరణాల ప్రయోగాల్లో భాగం కావడం అన్ని వెంటవెంటనే జరిగిపోయాయి. భారత దేశం స్వయంగా ఎలక్ట్రానిక్ పరికరాలు ఉత్పత్తి చేయడానికి ఒక సంస్థను ఏర్పాటు చేసే ఆలోచన అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం చేసినప్పుడు, ఆ సంస్థను హైదరాబాద్ లో ఏర్పరచడంలో ఏఎస్ రావు గారి కృషి అమోఘం. ఆ సంస్తే ఈ సి ఐ ఎల్.