తొలిసారి తెలుగులోకి దోస్తయెవస్కీ ఇడియట్
x

తొలిసారి తెలుగులోకి దోస్తయెవస్కీ 'ఇడియట్'

'ఇడియట్'ని తొలిసారి తెలుగులో తెచ్చిన సాహసి వై. వేణుగోపాల్ రెడ్డి. 700 పేజీల తెలుగు అనువాదం డిసెంబర్ 18 న హైదరాబాద్ లో ఆవిష్కరిస్తున్న సందర్భంగా ...


ఒక లియో టాల్ స్టాయ్ (Leo Tolstoy), ఒక ఫ్యోదర్ దోస్తయెవస్కీ (Fyodor Dostoevsky).... ప్రపంచ సాహిత్యాకాశంలో సూర్యచంద్రుల్లా వెలుగుతూనే వుంటారు, ఇప్పటికీ, ఎప్పటికీ. మానవజాతి చేసుకున్న పుణ్యఫలం ఈ ఇద్దరు రష్యన్ మహా రచయితలు అని మనం సెంటిమెంటల్ గా అనుకోవచ్చు. మానవ స్వభావం తెలిసినవాడూ,జీవిత మర్మం ఎరిగినవాడూ, అంతులేని మానవ జీవన విషాదాన్ని అక్షరాలుగా కళ్ళముందు పరిచిన వాడూ దోస్తయెవస్కీ. 2021 నవంబర్ 11 నాటికి ఆయన పుట్టి 200 సంవత్సరాలు అయింది. నేరము శిక్ష,పేద జనం శ్వేత రాత్రులు, ఇడియట్,బ్రదర్స్ కరమజోవ్ నవలలతో ప్రపంచ సాహిత్య పునాదుల్ని పెకలించినవాడాయన.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'ఇడియట్' (Idiot) ని తొలిసారి తెలుగులోకి అనువదించిన వ్యక్తి వై.వేణుగోపాల్ రెడ్డి.

అనువాదకుడు వై వేణగోపాల్ రెడ్డి

అనువాదకుడు వై వేణగోపాల్ రెడ్డి


నిర్మాణమూ, శిల్పమూ, నేరేటివ్ టెక్నీక్ లాంటి కళానియమాల్ని పట్టించుకునే రచయిత కాదు దాస్తోవ్ స్కీ. నియమనిబంధనలూ,సాహిత్యమూ అనే వాటి కంటే జీవితమే ఉన్నతమైనదని భావించాడేమో.'ఇడియట్' చివరి పేజీ చదివి, నవల ముగించగానే ఒక పెనుతుఫాను మన గదిలోకి వచ్చి వెళ్ళిపోయినట్టుంటుంది.

తెలుగు అనువాదానికి ముందుమాట రాసిన రచయిత శ్రీనివాసమూర్తి ఇలా అన్నారు: "ఎంత ప్రఖ్యాతి గడించిందో అంత వివాదాస్పదం, విమర్శనాత్మకం అయిన ఈ నవలలో చిత్రించినది దోస్తయెవస్కీ జీవితమేనని చెబుతారు. వై. వేణుగోపాల్ రెడ్డికి ఇది తొలి అనువాదం. పైగా ఎన్నుకున్న నవలేమో అనువాదానికి సులభంగా లొంగనిది. సంక్లిష్టత, శిల్ప విలక్షణత, వున్న ఈ నవలలో రచయిత ఆత్మను పట్టుకోవడం చాలా కష్టం. సాధారణంగా రష్యన్ భాష వస్తే తప్ప మూల రచయిత ఉద్దేశం ఏదో అర్థం కాని స్థితి. అయినా ఆంగ్ల సాహిత్యంతో విస్తృత పరిచయం వున్న వేణుగోపాల్ రెడ్డి చక్కగా అనువాదం చేసాడు. తనకు అభినందనలు.

క్షణాల్లో చావు తప్పించుకున్న రచయిత :

ఫ్యోదోర్ మిఖైలోవిచ్ దొస్తోయెవ్ స్కీ 1821 అక్టోబర్ 30 న మాస్కో లో జన్మించాడు. తండ్రి పేద వారికోసం హాస్పిటల్ నడిపే డాక్టర్. కాస్త కలిగిన కుటుంబమే. స్కూలు చదువు తర్వాత ఆయన తండ్రిగారు దొస్తోయెవ్ స్కీ ని సెయింట్ పీటర్స్ బర్గ్ లో జార్ చక్రవర్తి నడిపే మిలిటరీ కాలేజ్ లో ఇంజనీరుగా చేర్పించాడు. చదువులో మనోడు ఫస్టు కానీ తండ్రి పంపే డబ్బులను విచ్చలవిడిగా పార్టీలూ , పేకాటకు తగలేసే వాడు. అతని దానగుణమే అతన్ని పాడు చేసింది. ఆర్థికంగా కోలుకోలేక దివాళా తీశాడు. 1846 లో మొదటి సారి కలం పట్టి ' పేదజనం ' రాశాడు. అది అద్భుతం గా అమ్ముడు పోయింది. తర్వాత 'ది డబుల్ ','శ్వేత రాత్రులు' బాగా విజయం సాధించాక ఆయన జబ్బున పడ్డాడు. మిత్రులంతా ఆయన మానసికంగా క్రుంగి ఉండడాన్ని హేళన చేశారు. ఆర్థికంగా చితికి పోయి క్రుంగి పోయి ఉన్న ఆయనను రాజకీయ అలజడి చుట్టుముట్టింది. జ్వాలలా ఎగసిన డిసెంబరిస్టు ఉద్యమం మేధో వర్గాన్ని కుదిపేసింది. ఆయన అరెస్టయ్యాడు, మరణశిక్ష విధించాడు జారు. శిక్ష వెంటనే అమలు జరగాలి. వరుసగా నిలబెట్టి కళ్లకు గంతలు కట్టి కాల్చేయడం మొదలు బెట్టారు. దొస్తోయెవ్ స్కీ వంతు దగ్గరికి వచ్చింది. వరుసలో మూడో వాడు పక్కన నిలబడ్డవాడు పిచ్చోడయి పోయాడు. వేగంగా గుర్రం మీద వచ్చిన ఒక భటుడు శిక్ష ఆపేయమని చక్రవర్తి ఆజ్ఞ గా వినిపించాడు. అలా ఈ ప్రపంచానికి ఒక మానవుడు మిగతా తన జాతి జనుల అంతరంగాలనన్వేషించే అద్భుత జీవి కాపాడబడ్డాడు .

The Idiot as "the most personal of all Dostoevsky's major works, the book in which he embodies his most intimate, cherished, and sacred convictions."[212] It includes descriptions of some of his most intense personal ordeals, such as epilepsy and mock execution, and explores moral, spiritual and philosophical themes consequent upon them. His primary motivation in writing the novel was to subject his own highest ideal, that of true Christian love, to the crucible of contemporary Russian society.

‘ఇడియట్’ నవల ఇదమిద్ధంగా రొమాంటిక్ ట్రాజెడీ అని చెప్పవచ్చు అదే సమయం లో ఇదొక నూతన మానవుణ్ణి అన్వేషించే తాత్విక నవలగా కూడా చెప్పొచ్చు, ఎందుకంటే దోస్తోయేవ్ స్కీ ఈ నవలను ఒక వినూత్న రీతిలో ఆవిష్కరించాడు. స్ప్లిట్ పర్సనాలిటీ , ఎపిలెప్సీ, బై పోలార్ వంటి సైకాలజికల్ సమస్యలను ప్రస్తావిస్తూ కథను డ్రమాటిక్ గా నడుపుతూ అనేక తాత్విక సమస్యలను కూడా చర్చిస్తూ పోతాడు. ఒక్క మాటలో ఈ నవల సారాంశం ఏసు క్రీస్తు( మతపరమైన అనేక చర్చలూ వాదోపవాదాలు కూడా ఈ నవల లో ఉన్నాయి ) లాంటి మంచి మానవుడు ఈ ఆధునిక ప్రపంచం లో పుడితే అతన్నీ ప్రపంచం ఇడియట్ అని ఈసడిస్తుంది.

ఒరిజినల్ నవల ప్రచురించబడింది 1867 లో. హిందీ లోకి “మూర్ఖ్” పేరుతో జనవరి 1, 2022,

తమిళం లోకి “వేగులి ది ఇడియట్” పేరుతో జనవరి 1, 2018

మలయాళం లోకి ఇడియట్ అనే పేరుతో 2013లో,

బెంగాలీ లోకి 2021 లో,

ఉర్దూ లోనయితే 1981 లోనే కాపీలన్నీ అయిపోయి మళ్లీ ఇంకొక అనువాదకుడు 1986 లో అనువాదం చేశారు.

సినిమాలుగా 'ఇడియట్ ':

1992 లో షారుక్ హీరో గా Mani Kaul దర్శకత్వం లో “అహమఖ్” (Ahamaq) పేరుతో వచ్చింది, న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమయ్యింది. ఇంటరెస్టింగ్ ఏమిటంటే షారుఖ్ తండ్రి కుమారునికి ఢిల్లీ లో రష్యన్ పుస్తక ప్రదర్శన లో నాల్గు రూపాయలకి ఇడియట్ నవల కొని కానుకగా ఇచ్చాడు. అలా అది చదివిన కొడుకు కూడా సెంటిమెంటల్ గా నటించిన సినిమా

( ఈ నవల లోని నెగటివ్ క్యారెక్టర్ ను ‘డర్’ అనే సినిమాలో వేసి ఎంత సక్సెస్ అయ్యాడో అందరికీ తెలుసు )

దోస్తోయేవ్స్కి శ్వేత రాత్రులయితే రాజకపూర్ “చలియా “ నుండి ఇటీవలి జబ్ వి మెట్ , ఆహిస్తా ఆహిస్తా వరకు వాడుకుంటూనే ఉన్నారు.

ఇడియట్ ని నానాపటేకర్, జాకీ ష్రాఫ్, మనీషా కొయిరాలలతో ‘యుగ్ పురుష్” పేరుతో తీశారు.

వేణుగోపాల్ రెడ్డి కర్నూల్ జిల్లాలో నల్లమలను ఆనుకొని ఉన్న కుగ్రామం వడ్ల రామాపురంలో పుట్టాడు. స్కూల్ ఫైనల్ వరకు తెలంగాణా లో నడిగూడెం మండలం సిరిపురం లో తర్వాత కర్నూల్ లో ఇంటర్ , డిగ్రీ మాత్రం వాళ్ళ ఊరు దగ్గర్లోనే అడవిలోనే ఉన్న S N S R కాలేజీ లో చేసి లా ఎస్ కె యూనివర్సిటీ అనంతపురం లో చేశారు. 1993 నుండి లాయరుగా ప్రాక్టీసు చేస్తున్నాడు. ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నాడు.

అనువాదకుడు వేణు మాట:

ఈ నవలను మిత్రుడు కుమార్ కూనపరాజు నాకు అప్పజెప్పింది 2021 లో. కానీ నా వృత్తి పని, నా బద్ధకం రెండూ నన్ను డామినేట్ చేసి ఆపేశాయి. తర్వాత ఇక లాభం లేదని 2024 ఫిబ్రవరి లో గట్టిగా అనుకుని అనువాద పని మీద కూర్చొని ఆగస్టు చివరికంటా పూర్తి చేశాను (మధ్యలో మే నెలంతా అమెరికా పర్యటన). అనువాదం చేయడం అంత సులభమైన పనేమీ కాదు. అసలు రచయిత ఆత్మను పట్టుకుని ఆయన వాడిన భాషను మన భాషలోకి తర్జుమా చేయడం చాలా కష్టం. ‘మీరు భలేగా అనువాదం చేశారండీ, అస్సలు అనువాదం లా అనిపించలేదు’ అని ఎవరైనా అన్నారనుకోండి, అంతే అనువాదకుడిగా మీరు విఫలమయినట్లే. ఇదే నా అభిప్రాయం. ఇడియట్ నవల చదువుతుంటే దోస్తోయేవ్ స్కీ కనబడాలి గానీ, వేణుగోపాల్ రెడ్డి కనబడకూడదు. అనువాదం చేసేప్పుడు కొన్ని చోట్ల ఒక పేజిన్నర తర్వాత గానీ ఫుల్ స్టాప్ ఉండదు, అప్పుడు నేనే దాన్ని కొన్ని పేరాలుగా విడగొట్టుకుని చేశాను. ఇక భాష అది 1864 నాటి కులీనుల రష్యన్ భాష(చాలా చోట్ల ఫ్రెంచ్ వాక్యాలూ సామెతలూ నూ) పాపం ఇంగ్లీషు అనువాదకుల తిప్పలు చూసి నవ్వొచ్చేది.అంతలోనే నేనే తెలుగు లోకి చేసేప్పుడు పీక్కున్న జుట్టు చేతిలో కనిపించేది. అలా ఏదో చేశాననిపించాను కానీ ఈ అనుభవం తో ఇప్పుడు అనువాదం బాగానే చేయగలననే ఆత్మవిశ్వాసం వచ్చింది.

Read More
Next Story