వర్డ్స్ వర్త్, రాబర్ట్ బ్రూస్ ఫూట్ లను గుర్తు చేసే భూమన్ పుస్తకం
x

వర్డ్స్ వర్త్, రాబర్ట్ బ్రూస్ ఫూట్ లను గుర్తు చేసే భూమన్ పుస్తకం

'శేషాచలం కొండకోనల్లో...' పుస్తక సమీక్ష


ఈ మధ్య కాలంలో ట్రెకింగ్ చాలా పాపులర్ అయింది. అదే సమయంలో పెద్ద బిజినెస్ కూడా అయింది. బృందాలుగా ట్రెకింగ్ కు తీసుకుపోయే సంస్థలూ వచ్చాయి. ట్రెకింగ్ వెళ్లి వచ్చిన వాళ్లు తమ అనుభవాలమీద అద్భుతమైన పుస్తకాలు రాస్తున్నారు. ఒక్కొక్క పుస్తకం ఒక్కో కోణం నుంచి ప్రకృతిని చూపిస్తుంది. ప్రతి పుస్తకం ఒక్కొసారైన ట్రెకింగ్ వెళ్లేలా చేస్తుంది. ఇలా పట్టణాలనుంచి పల్లెలవైపు, కొండల వైపు, అడవుల వైపు ట్రికింగ్ అంటూ వెళ్లే వాళ్ల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది. కొండలు, గుట్టలు, తీర్థాలు, క్షేత్రాలు ఎక్కడ చూసినా ట్రెక్కర్లే కనబడతారు. వెళ్లలేని వాళ్లకి ఈ పుస్తకాలు కొండలను, కోనలను, లోయలను, జలపాతాలను, సెలయేర్లను కళ్ల ముందు నిలపెడుతున్నాయి. అయితే, రచయిత భూమన్ రాసిన ట్రెకింగ్ అనుభవాల సంకలనం ‘శేషాచలం కొండకోనల్లో...’ వీటిలో భిన్నమైంది.


భూమన్ కథ చెప్పేతీరు గొప్పగా ఉంటుంది. ఈ పుస్తకం చదువుతున్నంత సేపు మనం ఒక నేచరల్ హిస్టరీ మ్యూజియంలో ఉన్నట్లనిపిస్తుంది. అక్కడ ప్రదర్శించిన ప్రతి విశేషాన్ని భూమన్ గైడ్ లాగా వివరిస్తున్న అనుభూతి కలుగుంది. భూమన్ కు గొప్ప పరిశీలనా శక్తి ఉంది. ఆయన చూపు పరిసరాలన్నింటిని దేనికోసమే గాలిస్తున్నట్లు ఈ పుస్తకంలో కనిపిస్తుంది.

సాధారణంగా ట్రెకింగ్ పుస్తకాల్లో అనుభూతి ఎక్కువగా ఉంటుంది. పచ్చని చెట్లు, పక్షులు కిలకిలలు, జలపాతాలు దూకే హోరు, సేలయేర్ల అందెల సవ్వడి, రాత్రి నీలాకాశంలో మిలమిలలాడే చుక్కలు, చెట్ల మధ్య భయం గొలిపే చిమ్మ చీకటి, పక్కనే వెలుగుతున్న క్యాంప్ ఫైర్ మంటల క్రీనీడలు... ఇవన్నీ మరపురాని అనుభూతి నిచ్చే అంశాలు. అందుకే ట్రెకింగ్ పుస్తకాలు ఎన్ని చదవినా దాహం తీరదు. అయితే, భూమన్ దీనికి మరొక కోణం జోడించారు. ఆయన శేషాచలం కొండల్లో ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడమే కాదు, చరిత్రను కూడా అన్వేషించారు. ఎన్నో చరిత్ర శిధిలాను అయన కనుగొన్నారు. ఆదిమ మానవుడు ఈ ప్రాంతంలో తిరుగాడిన అడుగుజాడలను కూడా అన్వేషించారు.


ఈ కొండల్లో కోనల్లో నేటి మానవుడి పూర్వీకుల ఆనవాళ్ల అన్వేషణ కూడా సాగించారని ఆయన అనేక రుజువులు చూపిస్తారు. మెగాలిత్స్, గుహ కుడ్య చిత్రాలను, చారిత్రక లిపిని ఆయన వెలికితీశారు. అందుకే, భూమన్ శేషాచలం కొండల్లో జరిపిన పాదయాత్రలను విహార, వినోదయాత్రలుగా కుదించడం కుదరుదు. అదొక అన్వేషణ. ఎక్స్ ప్లోరేషన్.

ఆయన దృష్టిలో శేషాచలం అడవులు కేవలం చెట్ల, కొండల, జలపాతాల, గుండాల గూడెం కాదు. అదొక మానవ పరిణామ చరిత్ర ఖజానా. ఈ ఖజానాను కాపాడుకునేందుకు ప్రభుత్వాలు ఏమీ చేయడంలేదన్న ఆవేదన కూడా ఆయన వ్యక్తం చేస్తారు. ఇంత అందమైన ప్రకృతి సమీపాప్నే ఉన్నా తిరుపతి వాసులకు తెలియని దౌర్భాగ్యం మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతటి ఆహ్లాదకరమయిన ప్రదేశాలకు ప్రజలు తరచూ వచ్చేలా చేస్తే వచ్చే ప్రయోజనాలను వివరించేటపుడు ఆయన ట్రెకింగ్ ల సామాజిక కోణం చూపిస్తారు.



ఈ ప్రాంతాల్లోకి పిల్లాపాపలతో కుటుంబాలు వచ్చిగడిపితే, కుటుంబ బంధం బలపడుతుంది, చిన్నానాటి నుంచే పిల్లల్లో ప్రకృతి పట్ల ఆరాధనా భావం పెరుగుతుందని చెబుతారు. ఇలాంటి వాతావరణంలో ఆలోచన రెక్కలు విచ్చుకుంటాయి. అడవులను ఎందుకు కాపాడుకోవాలో అనుభవంతో తెలుసుకుంటారు. ట్రెకింగ్ వల్ల చాలా సాంఘిక సాంస్కృతిక ప్రయోజనాలున్నాయని చెబుతారు. అది నూటికి నూరు పాళ్లు నిజం.


18వ శతాబ్దం ఉత్తరార్ధంలో బ్రిటన్ వచ్చిన రొమాంటిక్ కవిత్వ ఉద్యమం ఇలాంటి ట్రెక్స్ నుంచి వచ్చిందే. అప్పటి ట్రెక్స్ అన్నీ తిరుగుబాట్లే. భూమన్ పుస్తకం చదువుతున్నపుడు నాకు టకీమని విలియం వర్డ్స్ వర్త్ (William Wordsworth :7 April 1770 – 23 April 1850) గుర్తుకు వచ్చాడు. వర్డ్స్ వర్త్ కవిత్వం ట్రెక్ నుంచే పుట్టింది. అసలు ప్రపంచంలో వర్డ్స్ వర్త్ లాగా కొండల్లో అడవుల్లో మైదానాలలో తిరిగిన మరొక కవి లేడు. భూమన్ వయసు 75 పైగానే. ఈ వయసులో ఆయన తాడు పట్టుకుని కొండలు ఎక్కడం, లోయల్లోకి దిగడం, జారడం, ఎత్తైన కొండమీది నుంచి గుండంలోకి దూకడం, ఈదడం చూస్తే, నాకు వర్డ్స్ వర్త్ 70 యేట ఇంగ్లండ్ లేక్ డిస్ట్రిక్ట్ లోని హెల్ వలెన్ (Helvellyn) పర్వతం అధిరోహించడం గుర్తొచ్చింది. ఇంగ్లండులో ఉన్న ఎత్తయిన పర్వాతాల్లో అది మూడోది. దాన్ని వర్డ్స్ వర్త్ అధిరోహించడం సంచలనం ఆరోజుల్లో. ఆ సందర్భాన్ని కవులు కళాకారులు గొప్పగా సెలెబ్రేట్ చేసుకున్నారు. దీనికి గుర్తుగా బెంజమిన్ రాబర్డ్ హేడాన్ ఒక గొప్ప పెయింటింగ్ వేశాడు.


William Wordsworth by Benjamin Robert Haydon

వర్డ్స్ వర్త్ అనుచరుడు థామస్ డిక్వెన్సీ లెక్క ప్రకారం, వర్డ్స్ వర్త్ జీవితకాలంలో 1,75,000 మైళ్ల ట్రెక్ చేశారు. రోజుకు దాదాపు 20 మైల్లు నడిచేవాడట. సోదరి డొరొతి వర్డ్స్ వర్త్ కథనం ప్రకారం, ఆయన ఆలోచనలన్ని రెక్కలు తొడుక్కుని కవితలై ఎగిరొచ్చింది ట్రెక్స్ నుంచి. ఆయన టెక్స్ తో ప్రేరణ పొంది చాలామంది కవులు అడవుల్లో, కొండల్లో ట్రెక్ చేయడం మొదలుపెట్టారు. అందులో ప్రముఖుడు శామ్యూల్ టేలర్ కాలరిడ్జ్.

ఇక్కడొక విషయం చెప్పుకోవాలి. ఇంగ్లండులో 18 శతాబ్దంలో విపరీతంగా ట్రెకింగ్ మొదలయింది. దీన్ని రాంబ్లింగ్ లేదా హైకింగ్ అనే వాళ్లు. ఇది ఆనాటి ప్రభుత్వం తీరు మీదా, ముంచుకొస్తున్న పారిశ్రామిక విప్లవం విసిరిన సవాళ్లు మీద తిరుగుబాటు ఉద్యమమని చరిత్రకారులు చెబుతారు.

1700-1800 ఇంగ్లండ్ లో పారిశ్రామిక విప్లవం ఊపందుకుంది. పట్టణాల్లో పరిశ్రమలు రావడం, ఉపాధికోసం వలస వచ్చే వారితో జనాభా పెరగడం, పొగగొట్టాల పొగ, యంత్రాల ధ్వని పట్టణవాసుల్లో కంపరం పుట్టించాయి. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కూడా పెంచేసింది. నగరాల చుట్టూ ‘ఇది మాభూమి’ అని చెబుతూ కంచెలు వేసుకున్నారు. పట్టణాల్లో ఉన్నవాళ్లు సమీపాన ఉన్న కొండల్లోకి, అడవుల్లోని వెళ్లే దారులన్నీ మూసుకుపోయాయి. ప్రకృతిలో విహరించాలనుకునే వాళ్లంతా క్లబ్బులుగా ఏర్పడారు. హైకర్స్ క్లబ్బుల ఫెడరేషన్లు ఏర్పడ్డాయి. ఇది మెల్లిగా ‘రైటు టు రోమ్’ (Right to Roam) అనే నినాదంగా మారింది. అడువుల్లోకి, కొండల్లోకి వెళ్లే స్వేచ్ఛ కావాలి (Right to Access Natural Areas)అనే డిమాండ్ మొదలయింది. ఆందోళనలు మొదలయ్యాయి. కొన్ని చోట్ల ప్రైవైటు ఎస్టేట్ ల కంచెలను పడగట్టి బాటలు ఏర్పాటు చేసుకున్నారు.

ప్రకృతి నాశనమయిపోతోందని, పరిశ్రమలు ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాయని, ఊర్లలో ఉన్న ప్రశాంత వాతావరణం భగ్నమయిందని వాపోడం మొదలయింది. మనిషి ని ప్రకృతి వీడదీయద్దు అనే వాదన తెరపైకి వచ్చింది. అపుడపుడే వస్తున్న పారిశ్రామికీకరణ వికృతంగా కనిపించింది. పరిశ్రమల చడీ చప్పుడు లేని గ్రామాల వైపు ప్రజలు పరిగెత్తడం మొదలుపెట్టారు. గతం కాలము మేలు వచ్చు కాలం కంటెన్ అనికవులు రాయడం మొదలుపెట్టారు. ఇదే రోమాంటిక్ సాహిత్యంగా పెల్లుబుకింది. ఈ హైకింగ్ ని గ్లోరిఫై చేస్తూ పుస్తకాలు వచ్చాయి. ఏ ప్రదేశానికి ఎలా వెళ్లాలో, అక్కడి విశేషాలు ఏలా ఉన్నాయో చెబుతూ ట్రావెల్ గైడ్స్ వచ్చాయి.

భూమన్ పుస్తకం చదువుతూ ఉంటే చరిత్ర పునావృతమవుతున్నట్లు అనిపిస్తుంది. వర్డ్స్ వర్త్ సంచారాలన్నీ మొదలైంది ఈ సాంఘిక అలజడి మధ్యే. 1790లో యుక్తవయసులో ప్రారంభించిన ఆయన ట్రెక్ చనిపోయే దాకా ఆగలేదు. బ్రిటన్ లోనే కాదు, జర్మనీ,ఫాన్స్ దేశాలకు ఆయన నడక విస్తరించింది. సంచారకవి అనే పేరుతెచ్చుకున్నాడు. బ్రిటన్ వాసుల ఆందోళన ఫలితం వందేళ్ల తర్వాత కనిపించింది. 1934 లో ప్రభుత్వం ట్రెకింగ్ కు స్వేచ్ఛ కల్పిస్తూ చట్టం (National Parks and Access to the Countryside Act. 1949) తీసుకువచ్చింది.

‘కనీస వసతులు, అనుమతులు ఇస్తే, శేషాచలం కొండల్లో కూడా విహరించేందుకు ప్రజలు వస్తారు, ప్రభుత్వానికి రాబడి వస్తుంది, కొందరికి జీవనోపాధి లభిస్తుంది,’అని భూమన్ చాలా చోట్ల చెప్పారు. అన్నింటి కంటే ముఖ్యంగా ఇలాంటి యాత్రలను పనిగట్టుకుని ప్రోత్సహిస్తే ప్రజల్లో పర్యావరణ స్పృహ పెరుగుతుందని భూమన్ చెబుతున్నారు.

అసలు ట్రెక్ అనే మాట ఎపుడు మొదలయింది? మనిషి బతుకుదెరువు కోసం పాదయాత్ర చేస్తూ వలస వెళ్లడం యుగాల నుంచి వుంది. అయితే, ఆధునిక కాలంలో ఈ పాదయాత్రకు ‘ట్రెక్’ అనే పేరుపడింది ఆఫ్రికా ఖండంలో. ‘ట్రెక్’ అనేది నిజానికి డచ్ భాష నుంచి వచ్చిన మాట. దక్షిణాఫ్రికాలో మొదట గుడారాలు వేసుకున్న వాళ్లు డచ్ దేశీయులు. వాళ్లు సేద్యం మొదలుపెట్టి స్థిరపడుతున్నపుడు బ్రిటిష్ వాళ్లు వచ్చారు. డచ్ వాళ్లని తరిమేశారు. ఇలా డచ్ రైతులు మరొక సురక్షిత ప్రదేశం వెదుక్కుంటూ సెంట్రల్ ఆఫ్రికా వైపు నడక మొదలు పెట్టారు. దీనికి ‘గ్రేట్ ఆఫ్రికన్ ట్రెక్’ పేరు . పరిచయంలేని ఆఫ్రికన్ అడవుల్లో పడుతూ లేస్తూ సురక్షిత ప్రాంతం వైపు సాగిన జీవన్మరణ యాత్ర అది. ‘ట్రెక్’ అనే మాటకు పాదయాత్ర అని కాదు అర్థం, సాహసయాత్ర (Arduous Journey) అని. అప్పటి నుంచే ‘ట్రెక్’ అనే మాట ప్రాచర్యంలోకి వచ్చింది.

భూమన్ పుస్తకం చదువుతున్నపుడు గుర్తొచ్చే ఇద్దరు ట్రెకర్లు ఇండియాకు చెందిన రాబర్ట్ బ్రూస్ ఫూట్ (Robert Bruce Foote (22 September 1834 – 29 December 1912), లెఫ్టినెంబ్ కర్నల్ లాంబ్టాన్ (Lt Col Lambton 1753 – 26 January 1823). బ్రూస్ ఫూట్ ఆరోజుల్లో రాయల్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో జియాలజిస్టుగా పనిచేసేవాడు. తమిళం, తెలుగు భాషలు నేర్చుకున్నాడు. రాబర్ట్ బ్రూస్ ఫూట్ ట్రెకింగ్స్ కి తెలుగు వాళ్లకి బాగా సంబంధం ఉంది.



Robert Bruce Foote, Geologist and archaeologist

అంతేకాదు, ఆయన ట్రెకింగ్ వల్ల ఈ ప్రాంత చరిత్ర 15 లక్షల సంవత్సరాలు చరిత్రలోకి వెళ్లింది. 1863లో నాటి మద్రాసు సమీపంలోని పల్లవరం వద్ద ట్రెకింగ్ లో ఉన్నపుడు బ్రూస్ ఫూట్ కి చక్కగా చెక్కిన రాతి పెచ్చు దొరికింది. అక్కడ పడి ఉన్న మిగతా రాళ్లకంటే అది భిన్నంగా ఉంది. తీరా చూస్తే అది ఈ ప్రాంతంలో తిరిగిన ప్రాచీన మానవుడి రాతిపని ముట్టు అని తెలిసింది. దాని వయసు 15 లక్షల సంవత్సరాలు. అంతవరకు భారత ఉపఖండంలో చరిత్ర అంటే వేదకాలం మించి వూహించ లేకపోతున్నారు. అలాంటపుడు, ఒక్క సారిగా దక్షిణ భారతదేశంలో బ్రూస్ ఫూట్ కి దొరికిన ఒక చిన్న రాతి పనిముట్టుతో మనిషి చరిత్ర 15 లక్షల సంవత్సరాలు వెనక్కి చరిత్రలోకి వెళ్లిపోయింది. అక్కడ మొదలయిన బ్రూస్ పూట్ ట్రెకింగ్ కర్నూలు జిల్లా బిల్ల సర్గం దాకా సాగింది. కర్నూలు జిల్లా బేతం చర్ల సమీపంలోని బిల్ల సర్గం గుహ దగ్గిర కూడా ఆయన ప్రాచీన మానవుడి అవశేషాల అన్వేషణ మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఇటీవలి దాకా యాంత్రపాలజిస్టులు, ప్రిహిస్టారిక్ ఆర్కియాలజిస్టులు బిల్ల సర్గం దగ్గిర పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అక్కడ దొరికిన రాతి పనిముట్లతో మనిషి చరిత్ర మరొక పదిహనులక్షల సంవత్సరాలు వెనక్కు వెళ్లింది.

ఇక లెఫ్టినెంట్ కర్నల్ లాంబ్టాన్ విషయానికి వస్తే ఆయన ఒక సర్వేయర్. బ్రిటిష్ ప్రభుత్వం తరఫున గ్రేట్ ట్రిగొనామెట్రికల్ సర్వేను ప్రారంభించారు. శాస్త్రీయంగా భారత దేశం మ్యాప్ రూపొందించేందుకు ట్రెకింగ్ మొదలుపెట్టారు. 1823 జనవరిలో నాగపూర్ చేరుకోవలసి ఉంది. ఆయన 20యేళ్లలో 4.25లక్షల చ.కిమీ నడిచాడని చెబుతారు. దారిలో అనారోగ్యానికి గురయ్యాడు. నాగపూర్ చేరుకునే లోపే చనిపోయాడు.

చెప్పొచ్చేదమంటే, భూమన్ శేషాచలం కొండల్లో సాగించిన వందలాది ట్రెక్స్ భారతదేశంలో సాగిన గ్రేట్ ట్రెక్స్ కోవలకి వస్తాయి. వాటిలోనుంచి చాలా విలువైన సమాచారం వెలికి తీశాడు. శేషాచలం కొండకోనల్లో... భావుకత నిండుగా ఉంది. అదొక భావ కవిత. వర్డ్స్ వర్త్ భావుకతతో పాటు ఈ పుస్తకంలో రాబర్ట్ బ్రూస్ ఫూట్, లాంబ్టాన్ సాహసాలున్నాయి.

ఈ పుస్తకం ముద్రించిన ఫోటోల్లో ఉన్న భూమన్ చూస్తే భయం, అసూయ రెండూ కలుగుతాయి. భయమెందుకంటే, 75 సంవత్సరాల వయసులో అంతటి సాహసం చేయడం చాలా మందికి కష్టం. అసూయ ఎందుకంటే, 75 సంవత్సరాలు దాటాకా అలుపెరెగకుండా కొండలెక్కుతూ దిగుతూ దూకుతూ ఈదుతూ సాగుతుంటే... మనం చేయలేకపోయామే అని ఆసూయ కలుగుతుంది. శేషాచలం కొండల్లో మూడు వందల దాకా తీర్థాలున్నాయని వాటన్నింటని చుట్టి వస్తానని భూమన్ చెబుతున్నారు. ఈ సాహస సంచారం నిరాటంకంగా కొనసాగాలని, మరిన్ని పుస్తకాలు భూమన్ అందించాలని కోరుకుందాం. అందంగా కాఫీ టేబుల్ బుక్ లాగా వెలువడిన ఈ పుస్తకం ధర రు. 999. అమేజాన్, ఫ్లిప్ కార్ట్ లలో ఈ పుస్తం దొరుకుతుంది.


Read More
Next Story