చరిత్ర వర్తమానం కాదుకదా. వర్తమానానికి అది ఒక ఊతం. చరిత్ర ఒక వారసత్వం. ఆ కాలం ఎట్లుండేది, మనుషులు ఎట్లా బతికేవాళ్లు, వారి జీవన విధానం ఎట్టిది, స్త్రీపురుష సంబంధాలు ఎట్లావుండేవి, పరిపాలన ఎట్టివిధాన కొనసాగేది.. తెలుసుకోవాలనే కుతూహలం ఆలోచనాపరులు అందరికీ వుంటుంది. అట్టి చరిత్రను, అన్ని కాలాలను మన అందరికీ ఎంతో ఇష్టమైన ఒక ఎమోషన్‌గా, ఒక ప్యాషన్‌గా నిలిచిన హంపీ కాలం ఎట్లావుండేది? నాటి కాలమాన పరిస్థితులు ఏ తీరున కొనసాగినవి, నాటి సకల జనుల జీవన సరళి, పోరాట పటిమ, కులం, మతం, రసికత్వం, యుద్ధతంత్రం ఏలాగున ఉండేవో తెలియజెప్పటానికి బండి నారాయణస్వామి కడపటి యుద్ధం అనే ఒక మెగా నవలను రాసినాడు. అందుకు నాటి కాలాన్ని అనేక పుస్తకాలు, శాసనాలు, సాహిత్యగ్రంథాలను చరిత్ర పరిశోధనా పత్రాలను పరిశోధించినాడు. లోతైన సంగతులేవో వున్నవని పసిగట్టి, ఈ చారిత్రాత్మక నవలను బాధ్యతగా, నిబద్ధతగా రాసినాడు.
సమకాలీనంగా మతం ఎంతటి తీవ్రపాత్ర నిర్వహిస్తున్నదో తెలుసుకుంటే, అలనాటి సంగతులు కొంచెమైనా బోధపడతాయి. ఏదిక్కునో ఒక దిక్కున బిక్కుబిక్కుమంటూ బతుకులీడ్చుకొస్తున్న అధోజగత్ సహోదరుల గాథలన్నీ లోతుగా పరిశీలిస్తూ, స్వామి వారివద్దనే వుండి, నేరుగా గమనిస్తూ వారిలో ఒకడై గాఢమైన అధ్యయనంతో మనల్ని విజయనగర వీధుల్లో తిప్పుతున్నట్లుగానే వుంది.
చదువరి చిటికెన వేలు పట్టుకుని, ఆ వేశ్యావాటికలు, పూతోటలు, రాజమందిరాలు, శయనాగారాలు, దేవాలయ శిల్పాలు, ద్వంద్వయుద్ధాలు, సమస్తం కనులారా చూపించినట్లుగా నవల అల్లిన పోటుగాడు ఈ నవలారచయిత.
అళియరామరాయలు, గోలుకొండ సుల్తాను సోదరుడు అయిన ఇబ్రహీమును దుర్గాధిపతిగా నియమించి, విజయనగరంలో ఆశ్రయమిచ్చినా, మతం కోసం అళియరామరాయలపై జిహాద్ ప్రకటించటం, విగ్రహారాధనను ద్వేషించే ఆ మనస్తత్వం, చరిత్ర ఇట్లా నడిచిందా.. అని తెలుసుకుని అబ్బురపడతాం.
హిందూమతం, మనుధర్మం, బైబిల్, ఖురాన్.. ఏవీ మార్పులు చెందకుండా ఎన్నడో రాసిన కాలంనుండి చండశాసనాలుగా మనుషుల్ని ఏలుతుండటం ఎంతటి విపత్కరం? అన్ని మతాలూ మంచి చెబుతున్నట్లే, ఒక మతాన్ని మరొక మతం తుడిచిపెట్టేయాలనే యుద్ధాలు నిశ్శబ్దపు మత మార్పిడులు, చరిత్రలో కొల్లలు కదా.
స్వామి ఈ పరివేదనతో కులం, మతం సమాజాన్ని ఎట్లా విధ్వంసం చేస్తూవస్తున్నారని ఎరుకతో హంపీ రాజ్యాన్ని మచ్చుకు ఎన్నుకుని, చెప్పవలసిన సత్యాలను పటిష్టంగా చెప్పిగలిగినాడు. మతాన్ని కాదంటాము కానీ మతాన్ని సమాజం పుట్టినప్పటినుండి నమ్ముకున్న జనం వున్నారుకదా. వారికీ కొన్ని హక్కులు, దేవాలయాలకు సంబంధించి వున్నాయికదా, ఉండాలి కదా! వారిని, వాటికి దూరంచేసిన దుర్మార్గాన్ని, మత వైషమ్యాన్ని స్వామి పసిగట్టి, మతసామరస్యం కోసం, జనం మేలుకొలుపు కోసం రాసినదే ఈ అపురూపమైన కడపటి యుద్ధం.
హంపి శప్తప్రాకారాలతో పరిఢవిల్లి, ఒక్కొక్క ప్రాకారంలో , ఒక్కో సామాజిక జీవితాన్ని వెల్లివిరిసేటట్లు చేసిన కాలం అది. అళియ రామరాయలు పాలిస్తున్న రోజులు అవి. కృష్ణదేవరాయల గురించి, భువనవిజయం గురించి, హంపీ వీధుల వైభవం గురించి చాలానే వినివున్నాము. రక్కసితంగడి యుద్ధం తర్వాత హంపీ సర్వనాశనం అయిందా? ఆ తరువాత ఏమి జరిగింది? ఎలావుంది నాటి పరిస్థితి..? ఈ కోణంలో కథను ఎత్తుకోవడటంలోనే ఔచిత్యం వుంది. ముగ్గురు పాదుషాలు విజయనగరాన్ని దెబ్బతీయటానికి వ్యూహాలు పన్నుతున్న కాలం అది. అహ్మద్ నగర్, గోలుకొండ, బీజాపూర్ సుల్తానులు ఒక్కటై హంపీని ముట్టడించి, విజయనగర సైన్యంలో వున్న ముస్లిం సైనికులను తమవైపు తిప్పుకుని యుద్ధంచేసిన కాలం అది. మతసామరస్యానికి పేరుబడిన దక్కను సంస్కృతిని తోసిపుచ్చి, ఎందుకు ఈ విపరీతానికి దారితీసింది? మతం; అంతటి ద్వేషాన్ని ఎట్లా కూరింది? మత ఆధిపత్యం, అంతటి బలమైన కోరిక ఎట్లా అయింది? ఇస్లాం ఆధిపత్యాన్ని ప్రతిష్ఠాపన చేయాలనుకోవటం ఎంతటి పరిస్థితికి దారితీసింది?
హిందువుల పండగల్లో ముస్లిములు, ముస్లిముల పండగల్లో హిందువులు అలాయిబలాయిగా తిరిగిన కాలం ఏమయ్యింది? ఏమవుతున్నది? ఉత్తణ్ణ వైష్ణవ మతప్రతిష్ఠకు కంకణం కట్టుకున్న ధార్మికజీవి. పశువుల చర్మం వృత్తిగా, ఆధ్యాత్మిక జీవనం ప్రవృత్తిగా చెప్పులు కుట్టుకుంటూ బతుకు ఈడ్చుకొస్తున్న మాదిగ జాతి మనిషి. వైష్ణవాన్ని వ్యాప్తిచేయటానికి తన శక్తినంతా కూడదీసుకుని ఎందుకని శ్రమించవలసి వచ్చింది?
‘‘ఇతని కొడుకు హంపణ్ణ అమలిన శృంగారాన్ని ఆరాధించిన వీరుడు. రతిక్రీడల్లోనూ, యుద్ధతంత్రాల్లోనూ ఆరితేరిన మహాశౌర్యవంతుడు’’. పరాక్రమశాలి. నిబద్ధుడు. రెహమాన్ శిష్యుడు. అతడి దగ్గర యుద్ధవిద్యలు నేర్చినవాడు. ఇతడు, యుద్ధంలో అంతా ముగిసిన తర్వాత తన నమ్మకాలకు భిన్నంగా తన తాత రామదాసు, తండ్రి ఉత్తణ్ణల వారసత్వాన్ని శ్రీరామచంద్రుడి విగ్రహాలను బహుజాగ్రత్తగా భద్రపరిచే వైనం నవలలో అత్యంత కీలకాంశం. అందుకు రెహమాన్ దోహదపడటం ఎంత ముచ్చట గొలుపుతుందో!
లక్ష్మీపతి శెట్టి, రాఘవయ్య శెట్టి పాత్రల ద్వారా నాటి సామాజిక జీవితాన్ని కళ్లముందు పరుస్తున్నాడు స్వామి. వ్యాపారంలో ఆరితేరిన వీరుడు ఎంత విచ్చలవిడి అనుభవజ్ఞులో చదివి ఆశ్చర్యపోతాము.
నవలలో శ్రీనివాసులు రెడ్డి, అలిమేలు ప్రేమ అజరామరం. బోయ కులస్థుడైన నల్లజ్జ పాత్ర విశిష్ఠమైనది. అన్ని మానవలక్షణాలూ కలిగిన జీవి అతగాడు.
ఆ కాలపు వేశ్యావాటికల తీరు, నాటి రసికత్వం, అలనాటి స్త్రీపురుషుల వ్యక్తిత్వాలు ఎంత యదార్థంగా వున్నాయంటే స్వామి ఏమైనా ఆకాలంలో అక్కడ వుండి, స్వయంగా అందులో పాలుపంచుకుని అక్షరబద్ధం చేసినాడా.. అన్నట్లుగా.
అసలు గోలుకొండ సుల్తాను పెళ్లిచేసుకున్నదే ఒక ధనిక వేశ్య కూతురిని. ఆ తరువాత తన రాజధానిగా భాగీరథి పేరునే పెట్టుకున్నాడు. ఇంతటి విశాలత్వం మత చిచ్చుతో ఎట్లా రగిలిపోయిందో ఊహిస్తేనే గగుర్పాటుకు లోనవుతాం.
నాటి రాజ్యంలో గోవా నుండి దిగుమతి అయిన గుర్రాలతోపాటు సుఖవ్యాధులు పరివ్యాప్తి కావడం, వాటి నివారణ కోసం మేక పెంటికలలో ఔషధ శిలలు, పంది చెవి నుంచి తీసిన రక్తాన్ని నశ్యంలోకి మార్చే సంగతులు చదువుతుంటే మనకు తెలిసిన స్వామియేనా ఇంతలోతుగా అధ్యయనం చేసి రాసినది అని ఆశ్చర్యంలో ఉక్కిరిబిక్కిరి అవుతాము.
రతి రహస్యాలు కూడా గుంభనంగా తెలియజేస్తూ ఔరా బండి నారాయణస్వామీ.. అనిపించుకోవటమేకాదు, వేశ్యావృత్తి, లంజకట్నం, ఆడదాని శరీర స్వభావాలను నిశితంగా వివరిస్తూ నాటి సామాజిక జీవన సమస్తాన్నీ ఔపశనపట్టి రాయడమే కాకుండా కులం, మతం, నమ్మకాలు, వారసత్వాలు, సంప్రదాయాలు, మతమార్పిడులు, జీవితపు ఎత్తుపల్లాలు, వైష్ణవతత్వపు శిఖరాలు అన్నిటినీ అమోఘంగా చిత్రీకరించిన నవల ఇది. ఇంతమాత్రమేనా? అప్పటి యుద్ధవాతావరణం, రణతంత్రజ్ఞత, మల్లయుద్ధాలు, స్వామి ఏమన్నా అక్కడ ఒక సైనికుడిగా ఉద్యోగం వెలగబెట్టి రాసినాడా అన్నట్లుగా వుంది ఈ రచనా చమత్కృతి.
కడపటి యుద్ధం నిండా సజీవ పాత్రలే. నేను ముందు చెప్పని ఒక తెలుగుల మాధవుడు, ఒక చినపోతి, టిట్టిభశెట్టి, రత్నమాల, ఇలావతి.. ఒక్కరనికాదు. ప్రతి పాత్రనీ మన మధ్యన మసలుతున్నవారిగా చేసి, హంపీలోని మగవారి అనేకమంది భార్యలు, ఆ భార్యల ఉపపతులు లాంటి కొత్తకొత్త సంగతులను మన దరికిచేర్చిన ఒక విశిష్టమైన నవల ఇది.
‘‘మసీదు ముందు మట్టిలో తిరగాడుతూ, పాటలు పాడుకుంటూ నిర్గుణతత్వాన్ని ప్రచారం చేస్తూ, సూఫీ బాబా ఖలందర్; నారాయణుడి మూలమెరిగి శ్రీవైష్ణవాన్ని తన రక్తంలో జీర్ణించుకున్న మాదిగ ఉత్తణ్ణ’’; కాబాలోని రాయి, కాశీలోని రాయి రెండూ ఒక్కటేకదా అనే సూఫీతత్వం తోపాటుగా నాటి సమస్త రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లు చిత్రికపట్టిన మహా నవల కడపటి యుద్ధం.
అష్టదిగ్గజాల తర్వాత మన స్వామి అళియరామరాయల కాలంలో ఏదో ఒక మూలన నక్కి, జనజీవన చిత్రాన్ని పసిగట్టి రాసినట్లుగా వుంది ఈ కడపటి యుద్ధం. ప్రపంచ నవలా సాహిత్యానికి చేరువలో వున్న ఈ నవలను, స్వామిని మనసారా అభినందిస్తున్నాను.