వందేళ్ల భారతీయ కమ్యూనిస్టు ఉద్యమం: మహత్తర పాత్ర
x

వందేళ్ల భారతీయ కమ్యూనిస్టు ఉద్యమం: మహత్తర పాత్ర

ఈ పుస్తకం చదువుతుంటే చరిత్ర మన కళ్ల ముందు తిరుగుతుంది.


గత వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమాల చరిత్ర మహోన్నతమైనది. దేశ వ్యాప్తంగా ఎన్నెన్నో ఉద్యమాలు చేసారు. గ్రామీణ రైతాంగ ఉద్యమాలైతేనేమి, పట్టణ పారిశ్రామిక కార్మికుల ఉద్యమాలైతేనేమి, సింగరేణి, ఆర్టీసీ కార్మికులు , ఉపాధ్యాయ, బ్యాంకు, రైల్వే, ఆర్టీసీ , ఎలక్ట్రిసిటీ , టెలిఫోన్, ప్రభుత్వ ఉద్యోగులైతేనేమి, బీడీ కార్మికులు, పారిశుద్య కార్మికులైతేనేమి, ఇళ్ల స్థలాల ఉద్యమాలైతే నేమి , జీతాలు, కూలీలు, బోనసులు, పని పరిస్థితుల మెరుగుదల మొదలైన వన్నీ కోట్లాది ప్రజలకు అందిన మేరకు అవన్నీ కమ్యూనిస్టు ఉద్యమాల ఫలితాలే. లక్షలాది కమ్యూనిస్టు కార్యకర్తల , నాయకుల త్యాగాల ఫలితమే నేడు అమలులో ఉన్న ప్రావిడెంటు ఫండ్ , పెన్షన్, సెలవులు, 8 గంటల పని, తదితర సౌకర్యాలు. ఆదివాసీ గిరిజనులకు , పేదలకు కొన్నయినా భూములు దక్కాయంటే కమ్యూనిస్టులు, నక్సలైట్లు, మావోయిస్టులు, వేలాది మంది ప్రాణ త్యాగాలతో సాధించి పెట్టినవే. ఇంతటి మహత్తర ఉద్యమాల చరిత్ర వేల వేల పేజీలు వేలాది పుస్తకాలుగా డాక్యుమెంట్లుగా రికార్డయి వున్నాయి.

అంతటి మహత్తర వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమాల చరిత్రను

ఒక చిన్న పుస్తకంలో చెప్పడం సధ్యమా? అంటే సాధ్యమే అని రాసి చూపించారు సీనియర్ కమ్యూనిస్టు నాయకులు కందిమళ్ల ప్రతాప రెడ్డి గారు. వంద పేజీల పుస్తకంలో వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమాల చరిత్రను పరిచయం చేయడంలో రచయిత చాలా మేరకు సఫలీకృతులయ్యారు. ఇది కమ్యూనిస్టు ఉద్యమ సంక్షిప్త చరిత్ర. ప్రతి ఒక్కరు చదివి తెలుసు కోవలసిన విషయాలెన్నో ఇందులో ఉన్నాయి. కందిమళ్ల ప్రతాపరెడ్డి గారి హృదయం గొప్పది. ఈ చరిత్రకు నేడు వివిధ పార్టీలుగా , గ్రూపులుగా ఉన్న వారందరూ వారసులే అని వినయంగా పేర్కొన్నారు. దాదాపు అన్ని కమ్యూనిస్టు పార్టీలు బూర్జువా ప్రజాస్వామ్య వ్యవస్థలో, భారత రాజ్యాంగం పరిధిలో పని చేస్తున్న వారే! ... ఒక్క మావోయిస్టులు తప్ప అని చెప్తూ ! ఎవరికి వారు ఆత్మ విమర్శ చేసుకోవలసిన సమయమిది అన్నారు. రచయిత ముందుమాటలో ఇలా ప్రశలు వేసుకున్నారు. " వందేళ్ల మన చరిత్ర - త్యాగాలు, పోరాటాలు, సాధించిన విజయాలు ఏమైనాయి? ఎందుకు కమ్యూనిస్టు ఉద్యమం రోజు రోజుకు బలహీన పడుతున్నది? ప్రజలు కమ్యూనిస్టు ఉద్యమానికి దూరమయ్యారా? కమ్యూనిస్టులుగా మనం వారికి దూరమయ్యామా? "అని అంతర్మథనం చేసారు.

నా అభిప్రాయంలో ఈ రెండూ కరెక్టే! కమ్యూనిస్టుల ఐక్యత వీరి సదాశయం. పార్టీలు

నిర్మాణ రీత్యా కార్యాచరణలో ప్రజలకు దూరమవుతున్నాయి . కానీ ప్రజా బలం తగ్గలేదు. అంటున్న వీరి మాట ఎంతో వాస్తవం. 90 ఏళ్ల వయసులో 75 ఏళ్ల ఎర్రజెండా నీడన నా జీవనం సాగింది. మా తరం అంతరించి పోతున్నది. అంటూ ఆవేదనతో యవతరాన్ని ఉత్తేజితులను చేయడానికి ఈ పుస్తకానిని అందించారు. వారి తపన ఆశయం గొప్పది. మార్కెట్ ఎకానమీ ప్రపంచాన్ని అదుపు లోకి తీసుకొని ఆధిపత్యం చెలాయించడం మొదలై దశాబ్దాలు గడిచాయి. నాటి స్పూర్తి దాతలైన రష్యా విడిపోయింది. రష్యా, చైనా తదితర తమ్యూనిస్టు దేశాలు కూడా మార్కెట్ ఎకానమీలో భాగమై ముందుకు సాగుతున్నారు. అంబేద్కర్, నెహ్రూ, లోహియా , కమ్సూనిస్టులు ఎంతో ఆశలు పెట్టుకున్న నేషనలైజేషన్ స్థానంలో యూ టర్న్ తీసుకొని ప్రపంచీకరణ పేరిట ప్రయివేటీకరణ ముందుకు సాగుతున్న దశ. ఎన్నో ఉద్యమాలతో సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానం స్థానంలో తిరిగి పన్నెండు, పద్నాలుగంటల పని విధానం చాపకింది నీరులా ముందుకు వస్తున్నది. సంఘటిత శక్తుల్లో నీరసం ఆవహించింది. వందేళ్లలో ఊహించని వారెందరో ఆర్థిక వ్యవస్థలో ఎదిగి రాజకీయాలను నిర్దేశిస్తున్నారు. కార్మిక వర్గాన్ని సమిష్టి పారిశ్రామిక వర్గంగా ఎదిగించాలనే ఆలోచన చేయకపోవడం వల్ల కమ్యూనిస్టు లకు సొంత వనరులు , సొంత లాబీలు తగ్గి పోయాయి.

ఈ పుస్తకంలో ఒక ముఖ్యమైన మాట దొరికింది

ఈ పుస్తకంలో ఒక ముఖ్యమైన మాట దొరికింది. ప్రజలను రాజకీయంగా కాకుండా, సమస్య ఆధారంగా సమీకరించి ఉద్యమాలు చేయాలని ఒక తీర్నానం చేసి దాని ప్రకారం కమ్యూనిస్టులు ముందుకు సాగారని! . మావోయిస్టులతో సహా కమ్యూనిస్టులందరు నేటికీ ఇదే పంథాలో సాగుతున్నారు. మనవారి వైఫల్యానికి పునాది ఇక్కడే పడింది. సాయుధ పోరాట విరమణ తరువాత కార్యకర్తలను, అభిమానులను రాజకీయ రంగంలో, పారిశ్రామిక, యాజమాన్య రంగాలలో ఎదగాలని చెప్ప లేదు. తర్ఫీదు ఇవ్వ లేదు. దాంతో పేద వర్గాలు పని చేసుకుంటూ బతికితే కాస్త వనరులున్న వాల్లు రాజకీయాలలో తిరిగారు. వారంతా సామాజిక వర్గాలుగా అగ్రకులాల వారే కావడం సహజం.

వందేళ్లయినా అధికారం ఎందుకు రాలేదంటే...

సమస్యల వారీగా ఆర్గనైజ్ చేయడం తో అవి సామాజిక ఉద్యమాలుగా, ట్రేడ్ యూనియన్ ఉద్యమాలుగా కొనసాగుతాయి. ఓటు వేసి మనవారిని గెలిపించుకునే ప్రచారం చేయాలనే విషయం మరిచి తన వోటును కూడా ఇతర పార్టీలకు వేయడం మొదలైంది. ఇలా సమస్యల పోరాటానికి- రాజకీయాలకు మధ్య లింకు తెగిపోయింది. రాజకీయాల కోసం రాజకీయ ఉద్యమాలు చేసే తరం క్రమంగా అంతరించింది. ట్రేడ్ యూనియనిజం మిగిలింది. రాజకీయ చైతన్యం లేని ట్రేడ్ యూనిన్ ఉద్యమాల వల్ల వందేళ్లయినా రాజకీయ అధికారం రాదని నూట ఇరవై ఏళ్ల క్రితమే లెనిన్ చెప్పాడు. అది మిలిటెంట్ ట్రేడ్ యూనియనిజమే తప్ప రాజకీయ చైతన్యం కాదన్నాడు. కమ్యూనిస్టు, నక్సలైట్, మావోయిస్టులందరికీ ఈ మాట సమానంగా వర్తిస్తుంది. రాజకీయ చైతన్యం కలిగించక పోవడం వల్లనే ఉద్యమ ప్రాంతాల్లో బిజెపీ వంటి హిందూ మతతత్వ వాదులు , ప్రజా ప్రతినిధులుగా ఎమ్మెల్లేలు ఎంపీలుగా గెలువడం జరుగుతూ వస్తున్నది.

సమగ్ర సమాజ వికాసం లక్ష్యంగా శంకర్ గుహ నియోగి

కమ్యూనిస్టు ఉద్యమాలలో నాకు బాగా నచ్చిన ఉద్యమం శంకర్ గుహ నియోగి సమగ్ర సమాజ వికాస ఉద్యమం. వారు చత్తీస్ గడ్ , బిలాయ్, దల్లీ రాజ, రాజ్ నంద్ గాంలో నిర్మించిన సమగ్ర సమాజ పునర్ నిర్మాణం కోసం పూనుకున్నారు. విద్య వైద్యం అందించడానికి వారేస్కూల్లు, హాస్పటల్సు పెట్టారు. సాంస్కృతిక రాజకీయ చైతన్యం కలిగించారు. రాజకీయ చైతన్యానికి సామాజిక చైతన్యానికి మధ్య చాలా తేడా ! . రాజకీయ పార్టీ మేం ఇది చేస్తాం, అది చేస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అంటుంది ! కమ్యూనిస్టులకు ఈ భాష అలవడలేదు. కమ్యూనిస్టులు ఇది చేయండి, అది ఇవ్వండి, అది కావాలి, ఇది కావాలి అనే భాష నేర్పారు. రాజకీయ అధికారం లక్ష్యంగా ఉన్నపుడు భాష మారుతుంది. సమస్యల ఆధారంగా ఉద్యమాలు నిర్మించాలనే మలుపు తీసుకున్నపుడే రాజ్యాధికారం చేజారి పోయింది. ఇపుడు బీసీలు , మహిళలు, రాజ్యాధికారం కావాలని, అన్నిటిలో తమ వాటా తమకు కావాలని ముందుకు కదులుతున్నారు. వారిలో ఒకరుగా కలిసిపోయి ముందుకు సాగితే జనతా పార్టీ, జనతాదళ్, నాటి పునర్ లైభవంతో బహుజన నాయకత్వంలో కలిసి అధికారంలోకి వస్తారు అని ఆశించ వచ్చు.

కమ్యూనిస్టులు పేదల కోసం స్కూల్లు కాలేజీలు హాస్పటల్స్ ఒక ఉద్యమంగా నడిపి ఉంటే విద్య వైద్య రంగాలు ఇంత ఘోరంగా ప్రయివేటీకరణ , దోపిడి సాగేది కాదు. ప్రభుత్వాలే చేయాలి తప్ప తాము చేయాలను కోలేదు. శంకర్ గుహ నియోగి ఇవి చేసి చూపాడు గవక నాకు అభిమాన పాత్రుడయ్యారు।

1948లోనే శిబ్దాశ్ ఘోష్ తొలి చీలిక.

కమ్యూనిస్టు ఉద్యమంలో 1964 లో తొలి చీలికతో సిపియం ఏర్పడిందని ఇందులో రాసారు. కమ్యూనిస్టు ఉద్యమంలో 1948 నుండి చీలికలు మొగలయ్యాయి. 1948లో శిబ్దాశ్ ఘోష్ విడిపోయి వేరే పార్టీని ఉద్యమాలను నిర్మించారు. నేటికీ బలమైన ట్రేడ్ యూనియన్ గా జాతీయ స్తాయిలో కొనసాగుతున్నది. . నాయకులు వ్యక్తిగత జీవితంలో ఆఛరించేదానికి, ప్రజలకు చెప్పేదానికి మధ్య చాలా వైరుధ్యం ఉంది, తాము చెప్పేదాన్ని వ్యక్తిగత జీవితంలో ఆచరించక పోవడం వల్ల , చిత్తశుద్ది లోపించిన ద్వంద్వ స్వభావం వల్ల విడిపోతున్నానని ప్రకటించి స్వంత పార్టీ పెట్టాడు. 1948 నాటికే ఆయన ఇది గమనించడం నన్ను ఆశ్చర్య చకితుడిని చేసింది. 1967 లో చీలిపోయి నక్సలైట్ ఉద్యమం ముందుకు వచ్చింది. అందులో మరికొ ్ని చీలికలు.

కుల వ్యవస్థ ఉత్పత్తి సంబంధాలను వదిలేసినారు

కమ్యూనిస్టులు భౌతిక వాస్తవికతను వదిలేసి సిద్దాంతాన్ని పట్టుకున్నారు. వర్గాలను తయారు చేసే వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ కుల వివక్ష, పితృస్వామిక కుటుంబ వ్యవస్థ లోని మహిళల అణిచివేత , వివక్షతలను పట్టించుకోకుండా దాట వేస్తూ వచ్చారు. చాలా సందర్భాల్లో వాటిని లేవ నెత్తిన వారిని పక్కకు తోసేసారు . అలా 1978 లో శరద్ పాటిల్ బిటి రణదివేతో చర్చించి విసిగిపోయి సత్యశోధక కమ్యూనిస్టు పార్టీ పెట్టాడు. అందులో మహాత్మా జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్, బుద్దుడిని కలుపుకున్నాడు. మౌలిక వాస్తవికతను, దేశీయ చరిత్ర ప్రత్యేక పరిణామాలను పట్టించుకోకుండా క్రమంగా ప్రజలకు దూరమయ్యారు. స్వయంకృత అపరాధంతో ఇలా వందేళ్ల మహత్తర ఉద్యమాలతో అధికారంలోకి రాకుండా రోజు రోజుకు దూరం పెరగడానికి కారణాలు రాజకీయంగా ప్రజలను నడపక పోవడమే! కుల సమస్యను గుర్తించక పోవడమే!

అంబేద్కర్ చెప్పిన పరిష్కారం

వందేళ్లు లక్షలాది కార్యకర్తలు ప్రజలు చేసిన ఉద్యమాలగురించి అంబేద్కర్ మాటల్లో పరిష్కారం చెప్పాలంటే ... "భూమిని , పరిశ్రమలను జాతీయం చేయడం " అనేది రాజ్యాంగంలో చేర్చడం.రష్యా , చైనాల్లో ఇదే చేశారు. అంబేద్కర్ అంత సూటిగా చెప్పినా కమ్యూనిస్టులు వీటిని కాజకీయ చైతన్య నినాదాలుగా తీసుకోలేదు. ఎక్కడిక్కడ స్థానికంగా భూమి కోసం పోరాటాలు చేసారు. ప్రాజెక్టుల కోసం భూములు సేకరించిన విధానంలో భూములు సేకరించవచ్చు. ఒక తరం దాక యజమానులకు డెవిడెండు ఇవ్వడం ద్వారా రాజ్యాంగ బద్దంగా స్వాధీనం చేసుకోవాల్సిన చూపు ప్రసరించ లేదు. తెలంగాణ కమ్యూనిస్టు పార్టీలో సీమాంధ్ర నాయకత్వం వల్ల జరిగిన కష్టాలు నష్టాల వల్ల ఉద్యమాలు ఎలా వక్రమార్గం పట్టాయో ఇందులో రాయడం పరిధికి మించిన పని కనక రాయలేదు.

గడిచి వచ్చిన చరిత్రను చెప్పే గొప్ప పుస్తకం ఇది

ఈ పుస్తకం మనం గడిచి వచ్చిన చరిత్ర గుర్తులను తెలుపుతుంది. మహానది ఎడారిలో ఇంకినట్టుగా సాగిన క్రమం అందరినీ విషాదంలో ముంచెత్తుతుంది. ఉమ్మడి కుటుంబాలు విడి పోయాయి. పండుగలు, పెళ్లిల్లు , చావులు తదితర సందర్భాల్లో కలుసుకకుంటారు. విడి పోయిన అన్ని రకాల తమ్యూనిస్టులు మేడే, మార్క్సు, ఎంగెల్స్, లెనిన్, జయంతి వర్దంతి, , అంతర్జాతీయ మహిళా దినోత్సవం తదితర సందర్భాల్లో జేఏసీలు గా ఏర్పడి కలిసి పని చేస్తే గొప్ప స్పూర్తినిస్తుంది. బహుజన నాయకత్వం, మహిళా నాయకత్వం పెరిగే కొద్దీ ఆ సామాజిక వర్గాలు కలిసి వస్తాయి.

ఈ పుస్తకం చదువుతుంటే చరిత్ర మన కళ్ల ముందు తిరుగుతుంది. లోపాలు అటుంచి ప్రతి ఉద్యమం ఎంతటి మార్పులకు కారణమైందో తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కళ్ల కద్దుకోవాల్సిన చరిత్ర పుస్తకం. పేదలు , కార్మికులు, సమ సమాజం కోరే మేధావులు విదావంతులు , కళాకారులు, కమ్యూనిస్టులు ఏం చేసారు లే అని వ్యంగ్యంగా ఎక సక్కెంగా మాట్లాడే ఆరెసెస్ బీజేపీ హిందూ మతతత్వ వాదులు కూడా ఈ పుస్తకం చదవాలి.

చదివితే కమ్యూనిస్టులు చేసిన పోరాటాలు, సాధించిన విజయాల పట్ల వినయంగా నమస్కరిస్తారు. ప్రజల జీవన ప్రమాణాల అభివృద్ది కోసం గత వందేళ్లలో ఇందులో ఒక శాతమైనా కృషి చేయ లేకపోయామే అని బాధపడుతారు. ఈ పుస్తకం చదివి సామ్య వాదులు విషాదంగా రెండు కన్నీటి బొట్లతో త్యాగ ధనులకు నివాళి అర్పించి పిడికిలి బిగిస్తారు. ఇంత చక్కని పుస్తకం రాసి చరిత్ర వారసత్వాన్ని యవతరం చేతుల్లో పెట్టిన కామ్రేడ్ కందిమళ్ల ప్రతాప రెడ్డి గారికి హృదయ పూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ( భారత కన్యూనిస్టు పార్టీ వందేళ్ల ఉద్యమ ప్రస్థానం. కందిమళ్ల ప్రతాప రెడ్డి. వెల 80 రూపాయలు. ప్రతులకు నవ చేతన బుక్ హౌసులు. (పాత విశాలాంధ్ర). ప్రచురణ కర్తల ఫోన్ . 9618032390. )

Read More
Next Story