ఓ ఏకాంతజీవి బ్రతుకాట...
x

ఓ ఏకాంతజీవి బ్రతుకాట...

దాసరి అమరేంద్ర అనువదించిన ‘రస్కిన్ బాండ్ ఆత్మకథ’ పుస్తక సమీక్ష


నీ బిడ్డలు నీ వాళ్ళు కాదు

నీవు తొడుక్కున్నా చొక్కా నీది కాదు- రష్కిన్ బాండ్.
"ఓ ఏకాంతజీవి బ్రతుకాట" లో ఏముంది?.... స్నేహాలు, అనురాగాలు, ఊర్లు,ప్రదేశాలు, దేశాలు, మత కలహాలు, ప్రపంచ యుద్ధాలు, మనుషులు, మన తత్వాలు, స్వార్ధాలు, త్యాగాలు ఉన్నాయి. సంస్కృతుల ఘర్షణ, చరిత్ర, జీవితం, జీవన పోరాటం ఉంది. ఈ 'బ్రతికాట'ను చూసినప్పుడు విన్నప్పుడు చదివినప్పుడు రస్కిన్ బాండ్ (Ruskin Bond) మన మనిషి అవుతాడు.మనమే అవుతాడు అంటారు అనువాదకుడైన దాసరి అమరేంద్ర.
ఈ ఆత్మకథ (Lone Fox Dancing: My Autobiography) రస్కిన్ బాండ్ ఒక్కడిదే కాదు. ఆనాటి భారత దేశ చరిత్ర, ఆత్మ.మనందరి ఆత్మకథలాగా అనిపిస్తుంది.ఆబ్రే అలెగ్జాండర్ బాండ్ (Aubrey Alexander Bond), తండ్రి (రస్కిన్ తాత) 17 ఏళ్ల వయసులో తన రెజిమెంట్ తో ఇంగ్లాండ్ నుండి ఇండియాకు వచ్చాడు.కనుక జన్మతః రస్కిన్ ఇంగ్లాండియుడు.ఇండియా ఆఫ్ఘనిస్తాన్ల మధ్య డ్యూరాండ్ సరిహద్దు గీసిన డ్యూరాండ్ రస్కిన్ తల్లి ఎడిత్ డోరోతీ తాతగారు.
ఇలా భిన్న జాతులు, సంస్కృతులు, వయసులో వ్యత్యాసం, భిన్న ధ్రువాలు గల ఔ బ్రే అలెగ్జాండర్ బాండ్ ఎడిట్ డోరోతి కలహాల కాపురంలో రస్కిన్, విలియం, ఎలెన్ పుట్టిన తర్వాత విడిపోతారు. తండ్రి దగ్గర రెండేళ్లు అపార ప్రేమను పొందుతాడు.
తండ్రి మరణించడంతో 10 ఏళ్ళ వయసులో సిమ్లా నుండి డెహ్రాడూన్ లో రైలు దిగినప్పుడు ఎవరూ రాక బిక్కుబిక్కుమంటున్నప్పుడు, మా నాన్న మరణంతో అలా అనాధగా బస్సు ఎక్కిన సందర్భం గుర్తొచ్చి రస్కిన్ బాండ్ లో నన్ను నేను చూసుకున్నాను.తల్లి ఇంటి నుండి, ఇంగ్లాండ్ లోని జెర్సీలో పెద్దమ్మ ఇంటి నుండి హఠాత్తుగా బయటికి వెళ్లినట్లే, నేను రెండిళ్ల నుండి హఠాత్తుగా బయటకు వచ్చేసిన సందర్భాలు కళ్ళ నీళ్లు తెప్పిస్తాయి.
పేరు వెనక రహస్యం: ఓవెన్ రస్కిన్ బాండ్, విక్టోరియా యుగపు రచయిత చిత్రకారుడు 'జాన్ రాస్కిన్ 'లా కావాలన్నా కోరికతో మా తండ్రి పెట్టి ఉండవచ్చు అంటాడు. ఓవెన్ అంటే "వెల్ష్" భాషలో యోధుడు అని అర్థమట. యోధుడిని అయ్యే ధైర్యం లేదంటాడు రస్కిన్. అమ్మ నాన్న గొడవలు ఎవరు లేని ఒంటరితనం భద్రత రాహిత్యం ఇప్పటికి మానసిక వ్యవస్థలో ఉండిపోయింది అంటాడు.
మానవజాతి నీచమైన మనుషులకు అపారమైన అధికారాన్ని కట్టబెట్టి ప్రపంచాన్ని గడగడ లాడించమని ఎలా వదిలి పెడుతుందని ఆనాటి హిట్లర్ గురించి రాసిందాన్ని చదువుతుంటే నేటి నేతాన్యాహు, ట్రంప్ లు గుర్తుకొస్తారు.
జర్మనీ ఆక్రమణల నుండి పోలెండ్ ప్రజలు శరణు కోరినా ఎవరు అంగీకరించరు. ఆ క్లిష్ట పరిస్థితులలో జామ్ నగర్ (Jamnagar) సంస్థానాధీశుడు జామ్ సాహెబ్, పోలెంట్ ఓడలలోని వెయ్యి మంది మహిళలకు పిల్లలకు తన వేసవి విడిదికి దగ్గర్లో పునరావాసం కల్పించడమే కాక విద్యా సౌకర్యం కూడా కల్పించడం ముస్లింల దాతృత్వాన్ని తెలుపుతుంది. స్వాతంత్రం తరువాత జూనాగడ్ నవాబు పాకిస్తాన్ కు పారిపోగా, ఆల్వార్ మహారాజు నీరో చక్రవర్తిగా భావించుకునేవారు.ఇవన్నీ ఆనాటి చరిత్రగా చూడాలి.
ప్రపంచమంతా యుద్ధంతో అల్లాడుతుంటే సిమ్లా, డెహ్రాడూన్ ఆకలి అంటే ఏమిటో తెలియని విలాసాలలో ఉంటాయి. 1919 జలియన్ వాలాబాగ్ నరమేధాన్ని జరిపిన జనరల్ డయర్ సీమ్లా బిషప్ విద్యార్థి అని తెలిసి ఆశ్చర్యపోతాం.
భారతదేశం గర్వంగా చెప్పుకోదగ్గ రస్కిన్ కథలు అల్లడం ప్రాథమికంగా ఆయమ్మ నుండి, వంటమనిషి ఉస్మాన్ నుంచి వచ్చాయంటాడు. 17ఏళ్ళ వయసులో ఇంగ్లాండు వెళ్లి,అందరు స్థిరపడాలి అనుకునే ఇంగ్లాండును వదిలేయటం. 17 ఏళ్ల వయసులోనే అంతరాంతరాలలో "ఇండియన్" తప్ప మరేమీ కాలేను అని ఇండియాకు వచ్చినవాడు.అన్నింటి కంటే బాధాకరం, 86 ఏళ్ళగా ఈ దేశాన్ని ప్రేమించి,ఈ దేశవాసిగా మనసావాసా బ్రతికిన రస్కిన్ బాండును, కోణార్కలో (2016 లో కావచ్చు) విదేశీయుడివి అని అదనపు ప్రవేశ రుసుము వసూలు చేయడం.
ఈ ఆత్మకథ చదువుతుంటే నాకు గొప్ప మానవీయత కనిపిస్తుంది.సవితి తండ్రి హెచ్, రస్కిన్ తమ్ముడు చెల్లెలను ప్రేమగానే చూస్తాడు.సవితి తండ్రి మొదటి భార్య దగ్గర రస్కిన్ మూడేళ్ల పాటు ఉంటాడు.రస్కిన్ సొంత చెల్లెలు (అవిటి అమ్మాయి) ఎలెన్ 78ఏళ్ళ వయసులో చనిపోయే వరకు సవితి తండ్రి పెద్ద కూతురు చాలా గొప్పగా చూస్తుంది. వంట అతనుగా వచ్చిన 17 ఏళ్ళ ప్రేమ్ ను, ప్రేమ్ కొడుకులను, ప్రేమ్ మనవళ్లను సొంత కుటుంబoలా రస్కిన్ ఇప్పటికి బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
ఇంగ్లాండులో వు పాంగ్ తో ప్రేమ, ఆమె ఒప్పుకోనందున,ఇక్కడ సుశీలతో ప్రేమ, వివాహం కోరుకున్నప్పటికీ,ఆమె కుటుంబం ఒప్పుకోనందన జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతాడు. ఓ విధంగా రస్కిన్ చెప్పుకున్నట్లు "అప్పటి తరంతో పోలిస్తే గొప్ప విజయాలు చవిచూసినవాడు. బొత్తిగా వ్యవహార జ్ఞానం లేనివాడు" అనాలి.
ఆత్మకథ చదువుతున్నంతసేపు రెండో ప్రపంచ యుద్ధం నాటి పిల్లల బ్రతుకులు, ఇజ్రాయిల్ చేస్తున్న దాడులతో పాలస్తీనా పిల్లల బ్రతుకులు, ధరంకార సామ్రాజ్యవాద అమెరికా చేస్తున్న దాడులతో ఇరాన్ ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ సిరియా మొదలైన దేశాలలలో తల్లినో తండ్రినో లేక ఇద్దరినో కోల్పోయిన పసిపిల్లలు మన కళ్ళ ముందు "మా పరిస్థితి ఏమిటి? ఎవరు కారణం? అని అడుగుతున్నట్లుగా అనిపిస్తుంది.
ఏది ఏమైనా రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట్లు, ఓ ! ఓవెన్ రస్కిన్ బాండ్ మేము చెప్తున్నాం, చరిత్ర ఉన్నంత వరకు భారతీయుల మధ్య, ఇండియన్ గా-
"జీన్మరణాల సరిహద్దుల వద్ద
ఓ నా మిత్రమా, నీవు నిలిచి ఉంటావు"---
రవీంద్రనాథ్ ఠాగూర్.
నేను అనువదించే రచనలు నా మూల రచనల కన్నా మెరుగైనవి అన్న స్పృహతోనే, మూలానికి అమిత విధేయతగా ఉంటూ అనువాదం చేస్తున్నాను అంటారు అమరేంద్ర గారు.అనేక విషయాలలో వివరాలు ఇచ్చారు.తెలుగు రచనే అనంతగా ఈ అనువాదం ఉంది. ఈ అనువాద ప్రయత్నం అపూర్వమైన సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చిందంటారు అమరేంద్ర.
ఈ అనువాదాన్ని 2017లో ‘కథా ప్రపంచం’ బుక్స్ వారు ప్రచురించారు.376 పేజీలు.ధర రు. 500
Read More
Next Story