
ఒక మహావృక్షం నేల కొరిగింది
అనిశెట్టి రజిత కు బిఎస్ రాములు నివాళి
అనిశెట్టి రజిత ప్రముఖ కవయిత్రి, రచయిత్రి , ఆర్గనైజర్, మహిళా వాది, , బహుజన వాది. ఆమె సోమవారం 11 ఆగస్టు 2025 న సాయంత్రం గుండె నొప్పితో అమరులయ్యారు. ఒక మహావృక్షం నేల కొరిగింది.
అనిశెట్టి రజితతో 1990 నుండి 35 ఏళ్లుగా విడదీయని అనుబంధం. ఎపుడూ నిండు హృదయంతో అన్నా అనే ఆ పిలుపు ఇప్పటికీ అలా మారు మోగుతూనే ఉంది. వామ పక్ష భావ జాలంలో వికసించిన మహిళా వాది, బహుజనవాది. కార్యకర్త. నాయకురాలు , మేధావి. కవయిత్రి రచయిత్రి. సంకలనకర్త. సహృదయ సౌజన్యశీలి. సాహితీవేత్తలకు ఒక ఆదర్శ నమూనా!
అనిశెట్టి రజిత మృతితో తెలుగు సాహిత్యం గొప్ప యోధను, సాహితీ వేత్తను కోల్పోయింది. వారి మృతి పట్ల తీవ్ర సంతాపంతో జోహార్లు అర్పిస్తూ వారి కృషి గురించి నాలుగు మాటలు.
బీసి సామాజిక వర్గం నుండి ఎదిగిన వజ్రం
బీసీ ల్లోని ఉప్పరి / సగర సామాజిక వర్గం నుండి రాతి నేలను చీల్చుకొని మహావృక్షంలా ఎదిగారు అనిశెట్టి రజిత. అనిశెట్టి రజిత చరిత్ర నిర్మాత. చరిత్ర నిర్మాతగా తనదైన చరిత్ర సృష్టించుకుంది. కవితా ధారలో ప్రసంగాల్లో నవ యువత ఆవేశం , ధర్మాగ్రహం, నిత్య చైతన్యశీలి ప్రత్యేకత.
అనిశెట్టి రజిత గొప్ప యోధ. పౌరహక్కుల ఉద్యమం, మహిళలపై అత్యాచార వ్యతిరేక ఉద్యమం, విప్లవ ఉద్యమాలు ... ఒక్కటేమిటి... ఉద్యమం ఎక్కడ ఉంటే అనిశెట్టి రజిత అక్కడ ఉంటుంది. ఉద్యమంలో భాగమవుతుంది. ఉద్యమాల వెంట నడుస్తుంది. ఉద్యమాలను నిర్మిస్తుంది. ఉద్యమాలు, కవిత్వం, సాహిత్యం, రకరకాల సంకలనాలు, ఒంటరి మహిళా
గాధల సంకలనాలు ప్రచురణ, సభలు సమావేశాలు, మహిళా సాధికారికత, బీసీ ఉద్యమ నిర్మాణం తప్ప అనిశెట్టి రజితకు వ్యక్తిగత జీవితం అంటూ వేరే లేదు. పెళ్లి చేసుకోలేదు. తన జీతాన్ని జీవితాన్నిసామాజిక సాహిత్య ఉద్యమాలకు అంకితం చేసింది. ఏ మీటింగ్ కు వెళ్లినా వెంట కెమెరా తెచ్చుకొని ఆ వార్తలను అందరికి స్పూర్తి దాయకంగా అందించేది.
అనిశెట్టి రజిత విప్లవోద్యమాలకు పేరుగాంచిన కాకతీయ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్ గా పని చేసి రిటైరయ్యారు. కాత్యాయనీ విద్మహే, జ్యోతి, వంటి సాహితీవేత్తలతో సహవాసం ఆమె చైతన్యాన్ని నిత్యం ప్రజ్వరిల్ల జేసింది. క్రమంగా తానే స్పూర్తినిచ్చి కదిలించేదిగా ఎదిగింది.
అనిశెట్టి రజితతో ఎన్నో జ్ఞాపకాలు
అనిశెట్ట రజితతో ఎన్నో జ్ఞాపకాలు. 1998ఆగస్టులో జగిత్యాలలో వందలాది సాహితీ వేత్తలతో నా 50 వ జన్మదినం జరిగినప్పటినుండి ఏటా విశాల సాహితి సాహిత్య సదస్సుల్లో పాల్గొన్నారు. విశాల సాహితి సత్కారం అందుకున్నారు. తన చేతుల మీదుగా విశాల సాహితి సత్కారాలు అందజేశారు.
వరంగల్ నుండి హైదరాబాద్ వచ్చినపుడల్లా దీపక్ టాకీస్ ఎదుటగల ఆచార్య పి యశోదారెడ్డి గారింట దిగేది. . స్వంత ఇల్లుగా ఫీలయ్యేది. నేను కూడ అపుడపుడు అక్కడే కలుసుకునేది. అక్కడ అన్నీ తెలంగాణ ముచ్చట్లే. తెలంగాణ యాస భాష నుడికారం ఎంత గొప్పదో వంట అయ్యే దాకా , భోంచేసి పనిమీద బయలుదేరే దాకా తెలంగాణ ముచ్చట్లు. అనిశెట్టి రజిత తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నది. వందలాది కవుల రచయితల తలలో నాలుకలా ఆత్మీయురాలైంది. విప్లవ సంఘాలతో, పౌరహక్కుల ఉద్యమాలతో అనిశెట్టి రజిత రిటరయ్యాక కాకతీయ యూనివర్సిటీని కాజీపేట ను కలిపే 100 ఫిట్ల రోడ్ లో తనదంటూ ఇల్లు ఏర్పరుచుకున్నారు.
దరకమే ఐక్య వేదికలో రజిత ముద్ర
దశాబ్దాల స్నేహంలో ఎన్ని రంగాల్లో కలిసి పని చేశామో ఎన్ని విషయాలు, భావాలు కలిసి పంచుకున్నామో లెక్కలేదు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో కూడిన దరకమే ఐక్య వేదిక నిర్మాణంలో అనిశెట్టి రజిత చురుకుగా పాల్గొన్నారు. 1992 లో ప్రారంభమైన దరకమే ఐక్య వేదిక నిర్మాణంలో వరంగల్ జిల్లాలో పి రాములు, పి ఎన్ ప్రసంగి, శమశ్ల్రీ మల్లయ్య , స్వామి తదితరులతో కలిసి బహుజన సాహిత్య ఉద్యమ నిర్మాణంలో ఎంతో కృషి చేశారు. 1992 నుండి వ్యవస్థాపక కన్వీనర్ గా , అధ్యక్షుడిగా రాష్ట్ర నిర్మాణంలో నాకు వరంగల్ లో అంది వచ్చిన చేయి చేయూత అనిశెట్టి రజిత.
అనిశెట్టి రజిత వంటి ఉత్సాహ వంతులే సంస్థకు అవసరమని, వరంగల్ మొగిలయ్య హాల్ లో 1995 లో జరిగిన దరకమే ఐక్య వేదిక రెండు రోజుల రెండవ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులుగా ఆచార్య ననుమాస స్వామి కూడా వరంగల్ వాడే కావడం విశేషం.
దరకమే ఐక్యవేదిక తరఫున గబ్బిలం సాహిత్య పత్రిక తీసినపుడు, వెంటది వెంట రాష్ట్ర కార్య వర్గ సమావేశాలు జరపడంలో చురుకుగా పని చేశారు. బుద్దడు నుండి కబీర్ గురునానక్, , మహాత్మా జోతిరావు ఫూలే, అంబేద్కర్ , బియస్పీ కాన్సీరాం బాటలో సమస్త వర్ణ వర్గ కుల లింగ జాతి మత భాష ప్రాంత వివక్షతలను తొలగించే సాహిత్య సామాజిక సంస్కృతిక రంగాలను బలమైన శక్తిగా విర్మించడంలో అంది వచ్చిన ాయకత్వం వరంగల్ నుండి అనిశెట్టి రజిత, ప్రభంజన్ కుమార్ , వల్లంపట్ల, , ఖమ్మం నుడి జూపల్లి సత్య నారాయణ, కె. సీతారాములు, జగిత్యాల నుండి కె. రామ లక్ష్మణ్, రాజధాని నుండి మాస్టార్జీ, విజిఆర్ నారగోని, ననుమాస స్వామి, ఉ సాంబశివరావు, కె జి సత్యమూర్తి సాహిత్య తాత్విక సామాజిక ఉద్యమాలను బలోపేతం చేసింది. చరిత్రను మలుపు తిప్పింది. ఆ చరిత్ర నిర్మాణంలో పాల్లొని అనిశెట్టి రజిత, ప్రభంజన్, రామ లక్ష్మణ్ చరితార్థులయ్యారు.
మా పెద్ద కొడుకు పాణిగ్రాహి పెళ్లి హన్మకొండలో 2000 ఫిబ్రవరి లో స్టేజి మ్యారేజిగా చేసినపుడు, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ , , కాళోజీ మొదలైన వారి చేతులమీదుగా పెళ్లి జరగడంలో అందరిని ఆర్గనైజ్ చేయడంలో అనిశెట్టి రజితదే ప్రధాన పాత్ర.
సంకలనకర్తగా...
అనిశెట్టి రజిత రిటైరయ్యాక కూడా పూనుకొని ప్రతి ఒకరికి ఫోన్ చేసి రాయించి తెచ్చిన సంకలనాలు సాహిత్య ఉద్యమంలో మైలు రాళ్లుగా నిలిచి పోయాయి. నూతన తరాలను ప్రోది చేసాయి. కొంతకాలం మహిళా రచయితల సంస్థను నిర్మించి ముందుకు నడిపారు.
ఇలా నిరంతర సాహిత్య జీవిగా జీవించిన అనిశెట్టి రజిత ధన్య జీవి. యువ తరానికి ఆదర్శం. నా 75 వ జన్మదిన సందర్భంగా జీవన చారి మనోవిహారి అనే కవితాత్మక శీర్శికతో తన ఆత్మీయత న పంచుకున్నారు. వారి రచనలు అనేకం. వాటినుండికొన్ని ఏర్చి కూర్చి ఒక సంపుటి పలువరి జ్ఞాపకాల సంచికను యుతరం పూనుకొని తేవడం అవసరం.
బహుజన బీసీ , మహిళా ఉద్యమాలలో సావిత్రి బాయి ఫూలే వారసత్వాన్ని కొనసాగించిన అనిశెట్టి రజితకు జోహార్లు. నివాళి.