
మరో గ్రంథాలయోద్యమ బస్సు యాత్ర
ప్రకృతిలో పరవశించడం, చారిత్రక ప్రదేశాలలో గత స్మృతులులోకి జారిపోవడం, పుణ్య క్షేత్రాలలో భక్తి పారవశ్యంలో ఓల లాడడం, సామాజిక సమస్యలపట్ల అవగాహన పెంచడం కొరకు చేసే ప్రయాణం.. ఏదైనా పర్యటనలన్నీ వినోద,విజ్ఞానదాయకాలే.. నేను ఈ మధ్య చేసిన ఇలాంటి ప్రయాణ అనుభవాలు మీతో పంచుకుంటాను.
నేటి సాంకేతిక కాలంలో పుస్తకం కనుమరుగైంది. దాని స్థానంలో చేతిలో సెల్ ఫోన్ వచ్చి చేరింది. సెల్ ఫోన్ చేతిలో వుంటే తమ ప్రపంచం గుప్పిట్లో వున్నట్లే అని యువత భావిస్తోంది. సాంకేతికాభివృద్ధిని తప్పకుండా స్వాగతించాలి. కానీ పూర్వ పద్ధతులకు తిలోదకాలువ్యవడం సరైంది కాదు. కంప్యూటర్, సెల్ ఫోన్ లాంటి ఆధునిక పరికరాలకు పుస్తకం ప్రత్యామ్నాయం కాకూడదు. కానీ జరుగుతున్నది అదే.. పుస్తకం విలువ పుస్తకానిదే.. పుస్తకాన్ని చేతితో పట్టుకొని పేజీ పేజీ తిప్పుతూ చదివితే కలిగే అనుభూతి అనుభవంతో మాత్రమే అవగతమవుతుంది. అలాంటి పుస్తక ప్రియులు కొందరు పుస్తకపఠనాన్ని ప్రోత్సహించడం కొరకు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా మరో గ్రంథాల యోద్యమం మొదలైంది.
రెండు తెలుగు రాష్ట్రాలలో పుస్తకపఠనం పట్ల అవగాహన కలిగించడానికి మరోగ్రంథాలయోద్యమం నిరంతరం కృషిచేస్తోంది.అందులో భాగంగా ఇంటికో గ్రంథాలయం, పాఠశాలకో గ్రంథాలయం, పిల్లల్లో, పెద్దల్లో పఠనాసక్తిని పెంపొందించే దిశగా మూడు రోజుల బస్సు యాత్రను నిర్వ హించింది. ఫిబ్రవరి ఒకటో తేదీన అఫ్జల్ గంజ్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఆవరణ లో .. గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ డా. రియాజ్ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ కార్య క్రమంలో కవి యాకూబ్, వొమ్మి రమేశ్ బాబు, సామాజికవేత్త సజయ మొదలైన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తర్వాత మరోగ్రంథాయోద్యమ సభ్యులతో బస్సు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కాలేజీ వద్దకు చేరుకుంది.
అక్కడ వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్, ఈనాడు చీఫ్ ఎడిటర్ నాగేశ్వరరావు, ఏకే ప్రభాకర్ యాత్రను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్స్ పాల్ ప్రొ. కాశీం పుస్తకం ప్రాముఖ్యతను గురించి మాట్లాడి, ' జయహో పుస్తకాన్ని' ఆవిష్కరించారు. కాంతి ఫౌండేషన్ అధి నేత కందుకూరి రాము ప్రచురించిన పుస్తకం అది. ఎందరో మహా మహులు చెప్పన పుస్తక ప్రాముఖ్యాన్ని తెలిపే కొటేషన్స్ అందులో వున్నాయి.
తర్వాత బస్సుయాత్ర భువనగిరి గ్రామానికి చేరుకుంది. అక్కడ పౌర గ్రంథాలయంలో ప్రజాసంఘాలతో సమావేశం ఏర్పాటుచేసారు. ప్రచురణ కర్త మలుపు బాల్ రెడ్డి, డి టిఎఫ్ శ్రీనివాసాచార్యులు, స్థానిక నాయకులు యాత్రలో పాల్గొన్న పలువురు సభ్యులు గ్రంథాలయ ఆవశ్యక తను వివరించారు. అక్కడినుంచి మధ్యాహ్న భోజనం ముగించుకొని రామన్న పేట మండలంలోని వెల్లంకి గ్రామానికి చేరుకున్నాం.పద్మశ్రీ కూరెళ్ళ విఠలాచార్య గ్రంథాలయంలో పలువులు ప్రముఖులు స్వాగతం పలికారు. ఆ గ్రంథాలయం పలువురు ఉన్నతోద్యోగులను,పరిశోధకులను సమాజానికి అందించింది. ముఖ్యంగా కూరెళ్ళ విఠలాచార్య గారిని కలిసి ముచ్చ టించ డం అద్భుతమైన అనుభవం. 86 ఏళ్ళ వయసులో కూడా ఆయన నిలు వెత్తు పుస్తకంలాగా అగుపించారు. అక్కడినుంచి నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్శిటీకి వెళ్ళాం. తెలుగుశాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న అనిత హాస్టల్ విద్యార్థులతో స్వాగతం పలికారు. ఆ చల్లని సాయంకాలం వేళలో చెట్ల కింద యూనివర్శిటీ ప్రాంగణంలో సమావేశ మయ్యాం. తెలుగు ఎం. ఏ రెండుతరగతుల్లో కలిపి 150 పై చిలుకు విద్యార్థులుండడం నాకు ఆనందాన్నిచ్చింది. నేను హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో చదివిన అనుభవాలను రాళ్ళతో పంచుకున్నాను. వాళ్ళఉత్సాహాన్ని చూసినప్పుడు తెలుగుభాష కనుమరుగు కాదని భరోసా కలిగింది. పాటలతో, మాటలతో ఆ సాయంత్రం ఉల్లాసంగా గడిచింది. అక్కడినుంచి సాయంత్రం ఆరు గంటలకు నల్గొండ జిల్లా గ్రంథాలయంలో సమావేశమై పురజనులతో పుస్తక ప్రాధాన్యాన్ని గురించి ముచ్చ టించాము.
మూడు రోజుల బస్సు యాత్రలో భాగంగా మొదటి రోజు రాత్రి సులోచన దంపతులు ఇచ్చిన ఆతిథ్యం మరువలేనిది. అమెరికాలో స్థిరపడకుండా ఇండియాకు వచ్చి సమాజ సేవ చేయడం గొప్పవిషయం. భవిష్యత్తు బాగుండాలంటే చిన్నపిల్లలను సక్రమంగా తీర్చిదిద్దడం ఒక్కటే మార్గం. అందుకే ఆ దంపతులిద్దరూ మద్రాసు వెళ్ళి ఒక ఏడాది మాంటిసోరి విద్యావిధానంలో శిక్షణ పొంది వచ్చారట. వారి ముచ్చటలో..సమాజంలో పిల్లలు కోల్పోతున్న బాల్యం, విద్యావిధానం, సాంకేతికాభివృద్ధి వల్ల మరో వైపు చాపకింద నీరులాగా విధ్వంసమవుతున్న విలువలు మొదలైన మౌలిక అంశాలు చర్చకు వచ్చాయి.
రెండోరోజు ఉదయమే బయలుదేరి నకిరేకల్ ప్రచ్భుత్వ పాఠశాల పిల్లలతో ముచ్చటించాము. పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అతిగా సెల్ ఫోన్ వాడకం వల్ల వచ్చే అనర్థాలను మాలో కొందరు సోదాహరణంగా వివరించారు. అక్కడి నుంచి నకిరేకల్, సూర్యాపేట,కోదాడ డిగ్రీ కళాశాలల విద్యార్థులతో సంభాషించడం జరిగింది. రెండోరోజు రాత్రి తేజ రెసిడెన్షియల్ పాఠశాలలో మాకు వసతి ఏర్పాటు చేసారు. అక్కడి విధానం భిన్నంగా వుంది. అకడమిక్ చదువుతో పాటు క్రీడలు, సృజనా త్మకత పెంపొందించే విధంగా ఉండడం గమనార్హం. ఆ పిల్లలతో ముచ్చట వాళ్ళలోని సృజనాత్మక శక్తిని బహిర్గతం చేసింది. పిల్లల ఆత్మ బంధువు సీఏ ప్రసాద్ గారితో నా పరిచయం గాఢతను సంతరించుకుంది. పాఠశాల యజమాని సోమిరెడ్డి గారి సింప్లిసిటీ నన్ను బాగా ఆకట్టుకుంది. మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి పిల్లలకు నాణ్యమైన విద్యను ఆయన అందిస్తున్నారు.
మూడో రోజు ఉదయమే మేం సత్యాన్వేషణ మండలికి వెళ్ళాం. మండలి స్థాపకులు పుట్టా సురేంద్రబాబు గారితో సంభాషణ ఆయనలోని తాత్వికతను బహిర్గతం చేసింది. ఆ వయసులో కూడా ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు. క్రమశిక్షణతో కూడిన జీవన విధానమే అందుకు కారణమనిపించింది. అక్కడి నుంచి 1 1-30 లకు గుంటూరు లోని నాగార్జున విశ్వవిద్యాలయానికి మా బస్సు యాత్ర చేరుకుంది. ఆచార్య చల్లపల్లి స్వరూపరాణి నేతృత్వంలో సమావేశం ఏర్పాటైంది. అత్యాధునికమైన ఏర్పాట్లతో విశాలమైన మీటింగ్ హాల్ అది. ఇతర విద్యార్థులతోపాటు బౌద్ధ సన్యాసులు కూడా విద్యార్థులుగా ఉండడం విశేషం. అలా వాళ్ళను చూడగానే నాకు పూర్వకాలం నాటి నలంద విశ్వ విద్యాలయం మదిలో మెదిలింది. ఆచార్యులతోపాటు వైస్ ఛాన్సలర్ కూడా పాల్గొనడం వల్ల ఆ సభ ప్రత్యేకతను సంతరించుకుంది. పెద్దలందరూ మాట్లాడుతూ పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలను, గ్రంథాలయాల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. " గంగిగోవు పాలు గరిటెడైనను చాలు "అన్న చందంగా ఆ వేదికనుంచి మాట్లాడిన రెండు నిమిషాలే నాకు అపూర్వ క్షణాలు.
అక్కడే మధ్యాహ్న భోజనం ముగించుకొని బుద్ధ స్టడీస్ శాఖకు వెళ్ళాం. ఆ శాఖను ఏర్పాటుచేయడంలో చల్లపల్లి స్వరూపరాణి కృషి సాటిలేనిది. ఈ మధ్యనే గాయకుడు బాలసుబ్రమణ్యం పేరిట ఆర్ట్స్ అండ్ కల్చర్ విభాగం ఏర్పడినట్లు తెలిసింది. విశ్వవిద్యాలయంలోని గ్రంథా లయాన్ని కూడా చూసి విజయవాడలోని సర్వోత్తమ గ్రంథాలయానికి వెళ్ళాం. అది సుమారు వందయేళ్ళ నాటిది. నిర్వాహకురాలు రావి శారదగారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటైంది. రచయిత, విమర్శకుడు గుమ్మడి లక్ష్మీ నర్సయ్య, రచయిత్రి మందరపు హైమవతి, విరసం కృష్ణ మొదలైన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనే దిశగా విస్తారమైన చర్చ జరిగింది.
మూడు రోజుల మరోగ్రంథాలయ బస్సు యాత్రలో భావి తరాలైన బాలలను, యువతను, ప్రజాసంఘాలను, దిశానిర్దేశం చేసే మేధావులను, సంయమనం పాటించే తాత్వికులను, సాహితీవేత్తలను, సామాన్య ప్రజలను కలవడం అపూర్వమైన అనుభవం. ఈ యాత్రలో మరో గ్రంథాలయోద్యమాన్ని ప్రారంభించిన మంచికంటి వెంకటేశ్వర్లు, సామాజిక, విద్యావేత్త కస్తూరి ప్రభాకర్, లీడ్ గ్రంథాలయ నిర్వాహకులు కాసుల రవికుమార్ శోభ దంపతులు, కాంతి ఫౌండేషన్ అధినేత కందుకూరి రాము
రచయిత్రులు భండారు విజయ, నల్లూరి కాంతి, నేను పాల్గొన్నాం. చివరగా ప్రఖ్యాత రష్యన్ రచయిత చేకోవ్ స్కీ మాటలతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను. " పుస్తకాలు చదవడం వల్ల నేను జీవితాన్ని అధ్యయనం చేసాను. పువ్వుల సౌరభాన్ని పీల్చుకున్నాను. పుస్తకాల్లోని మధువు తాగి మత్తెక్కిపోయాను. అందమైన స్త్రీ బిగి కౌగిలిలోని పచ్చదనాన్ని నేను పుస్తకాల్లో చూసాను. పుస్తకాల్లో ప్రకృతిలోని అందమంతా నాకు అనుభవంలోకి వచ్చింది. ఎత్తైన పర్వతాలను అధిరోహించాను. సాగర ఉత్తుంగ తరంగాల ఉద్వేగాన్ని అనుభవించాను. ఆకాశంలో విహరించాను. తుఫానుల తాకిడిని అనుభ వించాను. పిడుగులని, మెరుపులని ఆహ్వానించాను. మానవ మేధో పరిమితులు నాకు అవగతమయ్యాయి."

