బురఖాలతో బుల్లెట్లని ఎదురొడ్డిన బంగ్లాదేశ్ శ్రామిక స్త్రీలు
x
బంగ్లా నిరసనోద్యమంలో మహిళలు (ఫైల్ ఫోటో)

బురఖాలతో బుల్లెట్లని ఎదురొడ్డిన బంగ్లాదేశ్ శ్రామిక స్త్రీలు

బంగ్లాదేశ్ ప్రభుత్వ వ్యతిరేక పోరు ఓ కొత్త అధ్యాయం


-ఇఫ్టూ ప్రసాద్

మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ సమరశీల శ్రామిక స్త్రీల పోరాటానికి నేడు ఒక కేంద్రమైనది. బంగ్లాదేశ్ లో మూడున్నర వేల రెడీ మేడ్ దుస్తుల తయారీ కార్ఖానాల (గార్మెంట్ ఇండస్ట్రీ) లో పని చేసే నలబై లక్షల శ్రామికవర్గం తమ జీతభత్యాల పెంపు కోసం 23-10-2023 తేదీ నుంచి సమ్మె చేస్తున్నారు. వారిలో 85 శాతం మంది శ్రామిక మహిళలే కావడం విశేషం. ఈ సందర్భంగా సాంప్రదాయ బురఖాలు ధరించిన శ్రామిక స్త్రీలు రోడ్ల పైకి వచ్చి బుల్లెట్లకి ఎదురొడ్డి నిలబడ్డారు. అది వందల్లోనో వేలల్లోనో కాదు. లక్షల సంఖ్యలో సమ్మెపోరులో పాల్గొని పోరాట చైతన్యం ప్రదర్శించడం విశేషం. ముఖ్యంగా శ్రామిక స్త్రీలు సమ్మె పోరులో ముందు పీఠిన నిలబడి ప్రభుత్వ సాయుధ బలగాలకు ఎదురొడ్డి పోరాడారు. వారి అణచివేత కోసం సాధారణ పోలీసు బలగాలు సరిపోక రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (RAB) బలగాల్ని కూడా ప్రయోగించింది. తాజా సమాచారం ప్రకారం 19,500 మంది మీద కేసుల్ని బనాయించింది. వారిలో అత్యధిక శాతం మంది స్త్రీలు కావడం విశేషం. దీన్నిబట్టి వర్తమాన ప్రపంచ కార్మికోద్యమ చరిత్రలోనే ఈ సమ్మెకి గల విశిష్టత అర్ధమౌతుంది.


లాఠీచార్జీ, బాష్పవాయు ప్రయోగాలు, కాల్పులలో గాయపడ్డ క్షతగాత్రుల సంఖ్యలో కూడా స్త్రీలు అత్యధిక శాతం మంది కావడం మరో విశేషం. నవంబర్ 8వ తేదీన దేశ రాజధాని డాకాకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోని పారిశ్రామిక పట్టణం గాజీపూర్ లో పాతిక వేల మంది కార్మికులు పాల్గొన్న ప్రదర్శనపై జరిగిన కాల్పుల్లో 23 ఏళ్ల కార్మిక యువతి అంజురా ఖాటున్ తూటా దెబ్బ తగిలి మరణించి అమరత్వం పొందింది. గత ఆదివారం (నవంబర్ 12వ తేదీ) మరణించిన వ్యక్తితో కలిపి మృతుల సంఖ్య నలుగురు చేరింది. ఏది ఏమైనా సమకాలీన ప్రపంచ శ్రామికోద్యమ చరిత్రలో బంగ్లాదేశ్ గార్మెంట్ మహిళా శ్రామికోద్యమం ఓ కొత్త అధ్యాయంగా చెప్పొచ్చు.

సాంప్రదాయంగా గానీ, చారిత్రికంగా గానీ, బంగ్లాదేశ్ పారిశ్రామిక దేశం కాదు. దేశ విభజనకి ముందు కూడా పారిశ్రామిక కేంద్రమైన కలకత్తాకు వ్యవసాయ ముడి సరుకు సరఫరా కేంద్రంగానే ఆ ప్రాంతం ఉండేది. నాడు జూట్ పరిశ్రమకి కలకత్తా కేంద్రమైతే, నేటి బంగ్లాదేశ్ ప్రాంతం జనపనార పంట దిగుబడి ప్రాంతంగా ఉండేది. కలకత్తా వంటి సాంప్రదాయ పారిశ్రామిక నగరాలు సైతం ప్రభుత్వ డీ-ఇండస్త్రీలైజేషన్ పాలసీ వల్ల క్రమంగా నేడు తమ పూర్వ వైభవాన్ని కోల్పోతున్న పరిస్థితి ఉంది. తద్భిన్నంగా నలభై లక్షల మంది కార్మికులతో కొత్తగా గార్మెంట్ పరిశ్రమ కేంద్రంగా బంగ్లాదేశ్ ఎదిగడం విస్మయం కలిగిస్తుంది. పైగా ప్రధానంగా ప్రపంచీకరణ ప్రక్రియ ఫలితం కావడం గమనార్హం!

ప్రపంచీకరణ విధానాల వల్ల అమెరికా, యూరోప్ వంటి అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాల నుండి వెనకబడ్డ దేశాలకు శ్రమాధారిత పరిశ్రమల (లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీలు) బదిలీ వేగం పెరిగింది. పడమర దేశాల పెట్టుబడి తూర్పు, దక్షిణ దేశాల చౌక శ్రమశక్తి మధ్య కొత్త రకం పొందిక ఏర్పడింది. అదనపు శ్రమశక్తి దోపిడీకి తెర లేపింది. ఈ విధంగా బదిలీ ఐన శ్రమాధారిత పరిశ్రమల్లో గార్మెంట్ రంగం ఒకటి. దీని ఫలితంగా వెనకబడ్డ తూర్పు దేశాల్లో కొత్తగా వెలిసిన పరాదీన పారిశ్రామిక కేంద్రాల్లో బంగ్లాదేశ్ ఒకటి.

సగటున వెయ్యికి పైగా కార్మికులతో పనిచేసే మూడున్నర వేల గార్మెంట్ పరిశ్రమలు రాజధాని డాకా పరిసర పట్టణ ప్రాంతాల్లో గత పాతికేళ్ళల్లో వెలిసాయి. క్రమంగా పెరిగి కార్మికుల సంఖ్య నలభై లక్షలకి చేరింది. వారిలో 35 లక్షల మంది స్త్రీలే. రెడీ మేడ్ దుస్తులు కుట్టే పనిని స్త్రీలు చేస్తారు. మొత్తం శ్రామికవర్గంలో దాదాపు తొంబై శాతం పనివాళ్ళు కుట్టుపని చేసేవాళ్లే కావడం గమనార్హం. సూయింగ్ యంత్రాల మీద రోజుకు 10 నుండి 12 గంటల చొప్పున శ్రామిక మహిళలు పనిచేస్తారు. వారు అత్యంత నాసిరకం జీతభత్యాలతో దుర్భర బ్రతుకులు గడుపుతారు.

బంగ్లాదేశ్ ఒక పేద దేశం. ప్రధానంగా వ్యవసాయ దేశం. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, నిరుద్యోగం చాలా ఎక్కువ. ఫలితంగా గార్మెంట్ కంపెనీల్లో తక్కువ జీతాలకు చేరారు. ఉద్యోగ భద్రత లేదు. పని గంటల పై నియంత్రణ లేదు. శ్రమ దోపిడీతో పాటు లైంగిక వివక్షత, హింస, పీడనలు కూడా వున్నాయి. వారు ఓవైపు శ్రమ దోపిడీతో పాటు వాటిపై కూడా పోరాడాల్సిన ఆవశ్యకత మహిళా శ్రామికవర్గానికి ఏర్పడింది.

2013 ఏప్రిల్ 24న రాణా ప్లాజా గార్మెంట్ పరిశ్రమకి చెందిన తొమ్మిది అంతస్తుల గార్మెంట్ కంపెనీ కూలి అధికారికంగా 1134 మంది మృతి చెందారు. వారిలో తొంబై శాతం మంది మహిళలే. అది అంతర్జాతీయ పారిశ్రామిక ప్రమాదాల్లోనే అతి పెద్ద ప్రమాదంగా పేరొందింది. ఐతే ఆనాటికి గార్మెంట్ శ్రామికవర్గం సంఘటితం కాలేదు. ఇటీవల కాలంలో సంఘటితపడుతూ వచ్చింది. ఫలితంగా తాజా సమరశీల సమ్మెకి దారి తీసింది.

గత ఐదేళ్ళుగా వారి జీతాల పెంపుదల లేదు. ఈ ఐదేళ్లలో ద్రవ్యోల్బణం సగటున 10 శాతం చొప్పున కొనసాగింది. గత ఏడాదిలో డాలర్ తో బంగ్లాదేశ్ కరెన్సీ టాకా విలువ 30 శాతం పడిపోయింది. ఇప్పుడు పొందే నెలకు 75 డాలర్ల జీతాలు సరిపోవడం లేదు. యాజమాన్యాలు చర్చల్లో 90 డాలర్ల వరకు వచ్చి ఆగిపొయాయి. ఈ స్థితిలో సమ్మె ప్రారంభమైనది. సమ్మె ఉధృతి తర్వాత హసీనా ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. అది 56 శాతం పెంపుతో 113 డాలర్లకి 7-11-2023 తేదీన సిఫారసు చేసింది. అది తమ ప్రస్తుత దుర్భర బ్రతుకుల్ని మార్చలేదని కార్మికవర్గం భావించింది. ఈ వెలుగులో కార్మిక సంఘాలు, కార్మికవర్గం సమ్మె కొనసాగింపుకు దృఢ నిర్ణయం తీసుకుంది. కావున నవంబర్ 8, 9 తేదీల్లో ఉధృతంగా ప్రదర్శనలు జరిగాయి. ముఖ్యంగా గార్మెంట్ పరిశ్రమకు ప్రధాన కేంద్రం గాజీపూర్ లో 25 వేల మందితో, కోనాబారిలో 15 వేల మందితో 'మహా కార్మిక ప్రదర్శనలు' జరిగాయి. వాటి పై ప్రభుత్వ సాయుధ బలగాల ప్రయోగంతో హింసాత్మకంగా మారింది. ఆ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాని హసీనా 10తేదీ పత్రికాముఖంగా ఒక హెచ్చరిక చేసింది. తాము పెంచిన జీతాలకు ఇష్టం లేకపోతే తమ తట్టబుట్టా సర్దుకొని స్వంత ఊళ్ళకి వెళ్లిపోవాల్సిందిగా శ్రామిక వర్గాన్ని బెదిరించింది. దేశ ప్రధాని స్వయంగా మహిళ అయివుండి 35 లక్షల మంది మహిళా కార్మికుల్ని ఇలా బెదిరించిన తీరు తీవ్ర విమర్శలకు గురైనది.

తొలుత 208 డాలర్ల పెంపు డిమాండ్ తో సమ్మెకు దిగారు. 113 డాలర్ల పెంపు సరిపోదని నేటికీ సమ్మెను సాగిస్తున్నారు.

బంగ్లాదేశ్ రెడీ మేడ్ దుస్తులు 18 విదేశీ గ్లోబల్ కంపెనీలకు సరఫరా అవుతాయి. వాటి లాభదాహానికి బంగ్లాదేశ్ మహిళా శ్రామికవర్గం చాలా ఘోరంగా బలై పోతున్నది. హక్కుల సంఘాలు, ప్రతిపక్షాల నుండి వారికి మద్దతు లభిస్తోంది.

బంగ్లాదేశ్ ఎగుమతుల్లో 85 శాతం గార్మెంట్ ఎగుమతులు ఉన్నాయి. దేశ జీడీపీ లో వీటి వాటా 16 శాతం ఉంది. నేడు బంగ్లాదేశ్ కార్మికుల కారుచౌక శ్రమతో తయారైన సరుకులు 18 గ్లోబల్ బహుళ జాతి సంస్థలు అత్యధిక లాభాలకు కొల్లగొడుతున్నాయనీ, పైగా పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతోన్న కాలంలో కూడా విదేశీ బహుళ జాతి సంస్థల పక్షాన హసీనా సర్కారు నగ్నంగా కొమ్ము కాస్తున్నదనీ విమర్శలు తీవ్ర స్థాయిలో నేడు వెల్లువెత్తుతున్నాయి.

ఒక మహిళా వర్కర్ రోజుకు 50 నుండి 60 టీ షర్టులు కుడుతుంది. అది హైద్రాబాద్ బట్టల దుకాణాల్లో ₹1950 ఖరీదు చేస్తుంది. యూరోప్ దేశాలలో వినిమయదార్లకు 30 నుండి 40 డాలర్ల ధర పలుకుతుంది. వారి శ్రమశక్తి విలువలో కార్మికులకు దక్కే భాగంతో పోల్చితే ఐదారు రెట్ల లాభాలను కొల్లగొడుతున్న పరిస్థితి ఉంది.

కంపూచియా, థాయ్, వియత్నాం వంటి దేశాల్లో గార్మెంట్ కార్మికులు పొందే జీతాలు కూడా తక్కువే. కానీ వాటితో పోల్చినా బంగ్లాదేశ్ వర్కర్లు 40 నుండి 60 శాతం తక్కువే పొందుతున్నారు. ఈ అత్యధిక దోపిడీకి బలౌతున్న బంగ్లా మహిళా శ్రామికవర్గం సమరశీల సమ్మెకి దిగడం బహుళ జాతి సంస్థల చేత కొల్లగొట్టబడే మూడవ ప్రపంచ దేశాల కార్మిక వర్గానికి నేడు ఉద్యమ స్ఫూర్తినిస్తుంది.

'తక్కువ జీతాలతో పని చేస్తేనే విదేశీ బహుళ జాతి సంస్థలు తమ దేశానికి ఆర్దర్లు ఇస్తాయనీ, లేని పక్షంలో అవి వాటిని ఉపసంహరిస్తాయనీ, తద్వారా దేశ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉందనీ బంగ్లా ప్రధాని హసీనా రెండు రోజుల క్రితం మరో తీవ్ర హెచ్చరిక చేసింది. దీన్నిబట్టి తమ దేశ ప్రభుత్వమే విదేశీ బహుళ జాతిసంస్థల పక్షాన నిలిచి తమ మనుగడకి ముప్పుగా మారిందనే భావం బంగ్లాదేశ్ నలభై లక్షల కార్మిక కుటుంబాల్లో బలపడుతోంది. ఇది మున్ముందు రాజకీయ ప్రభావం కలిగించే అవకాశం కూడా ఉంది.

వర్తమాన బంగ్లాదేశ్ గార్మెంట్ మహిళా శ్రామిక పోరాట ప్రభావం, పర్యవసానాలు బంగ్లాదేశ్ కి పరిమితం కావు. అంతర్జాతీయ శ్రామికవర్గం పై కూడా మున్ముందు ప్రభావం కలిగిస్తాయి. ముఖ్యంగా ఒక వెనకబడ్డ దేశంలో మిలియన్ల సంఖ్యలో శ్రామిక మహిళలు వీధుల్లోకి వచ్చి సాయుధ బలగాల్ని ఎదురొడ్డి నిలబడి పోరాడటం అసాధారణమైన పరిణామం. పైగా బురఖాలు ధరించిన శ్రామిక మహిళలు రోడ్లపై బుల్లెట్లను ఎదిరించి పోరాడటం సంచలనాత్మక, చరిత్రాత్మక పరిణామంగా చరిత్రలో నిలుస్తుంది.
(పి.ప్రసాద్, ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షులు, రాజకీయ వ్యాఖ్యాత)


Read More
Next Story