ఏమోయ్.... నా పుస్తకం కొనవూ! (ఒక ఆగ్రహ కవిత)
x
Dusting off the male gaze by Yuko Shimuzu

ఏమోయ్.... నా పుస్తకం కొనవూ! (ఒక ఆగ్రహ కవిత)

ఎదుగుతున్న రచయత్రులను అనగదొక్కడానికి వాళ్ళ లైంగికత మీద దెబ్బ వేసి కొందరు మురిసిపోతుంటారు. ఈ లైంగిక రాజకీయం ఇది అనాదిగా ఉన్నదే. ఇదిక ఎల్లకాలము కొనసాగదు





ఏమోయ్.... నా పుస్తకం కొనవూ! (ఒక ఆగ్రహ కవిత)


--గీతాంజలి


అవును, మేం అందాలు ఆరబోస్తూ పుస్తకాలు అమ్ముకుంటాం!

అందాలు ఆరబోస్తూనే వేదికల మీద కుర్చీ సంపాదిస్తాం

లేదా అవార్డులు కూడా అందుకే వస్తాయి మాకు !

రా రమ్మని సాహిత్య బడులకి పిలుపులు కూడా అందాలు ఆరబోస్తామనే మరి!

ఆఖరికి ప్రింటింగ్ ప్రెస్సులు, ప్రచురణ సంస్థలు కూడా మగవే కదా

అవి కూడా మా అందాల్ని చూస్తూనే మా పుస్తకాల మీద ఆమోద ముద్ర వేస్తాయి

మేం అందాలు ఆరబోస్తేనే మీ మగ రచయితలు మా పుస్తకాల కోసం కాదు కానీ నువ్వన్నట్లు

మమ్మల్ని చూడ్డానికే దేక్కుంటూ.. పాక్కుంటూ.. అంగలార్చుకుంటూ వచ్చేస్తారు .

పనిలో పని మా పుస్తకాలూ మేం కొనిపించేస్తాం!

సిగ్గేమైనా ఉందా...రచయతమనిషివేనా నువ్వు?

మేం ఈ అసమ సమాజం మీద రక్తం మరిగి రాసినందుకు కాదు...

మీ లైంగిక రాజకీయాలను ఎండ గట్టినందుకు కాదు...

సామాజిక న్యాయం కోసం పోరాడుతూ రాస్తున్నందుకు కాదు..

మా రచనలకు విలువ, స్థాయి, సామాజిక ప్రయోజనం ఉన్నందుకు కాదు...

అసలు మావి మేధో రచనలు అయినందుకు కాదు..కానీ నీ నిర్వచనంలో

మేం అందాలు ఆరబోస్తూన్నందుకే మా రచనలు అమ్ముడుబోతాయి..లేదా గుర్తించ బడతాయి !

ఒరేయ్, మా రచయత్రుల అందాలంటే ఏమనుకున్నావురా...పెదాలు, రొమ్ములు ,నడుము,తొడలు ..పిరుదులు ,వెజైనా ..ఇవే కదా...నీ దృష్టిలో ?

మేము తీసుకునే సీరియస్ సాహిత్య వస్తువులు లెక్క లేదు కదా నీకు !

ఆక్రోశంగా, ఆవేదనగా ,నిజాయితీగా,బాధ్యతగా రక్తం., కన్నీరు కలగలిపి రాసే కవిత్వం, కథ, నవల

ఇవిరా మా అందాలు !


నిజాయితీగా నిర్భయంగా రాయడమే మా అందంరా !

ఇవి కనపడవు నీకు, అవునులే

నువ్వో మగ రచయితవి మళ్ళీ !

కానీ నీ తోటి రచయత్రిని మాత్రం నీ కళ్ళు చూసేది రెండు కాళ్ళ మధ్య నుంచి మాత్రమే...అంత వరకే ఎదిగింది నీ దృష్టి!

అసలు మేం ఎలా రాస్తామనుకుంటున్నావు నువ్వు?

సమయం ,ఆరోగ్యం లేకపోయినా

ఉరుకులు పరుగులతో వూపిరాడని ఇంటి పని,వంటపని,

ఆఫీసు పని,సమాజపు పనులు చేసుకోగా మిగిలిన అరకొర నిమిషాల్ని దక్కించుకుని

అర్థ రాత్రుళ్ళు నిద్రకాచుకుని

మా కంటూ రాసుకోడానికి గదులే లేకపోయినా

ఇంటి ఏ మూలో మాదనుకుని

పగలంతా మెదడుని వెంటాడిన అక్షరాలను రాత్రి కాగితం మీద వె

లుతురు సిరాతో ముద్రించుకుంటాం మేం !

మీలా శాంతిలో విశ్రాంతిలో కాదు !

మా అవయవాల చుట్టూ రాజకీయాలు ఎన్నాళ్ళురా నువ్వు నడిపేది?

అవునూ నాకో ధర్మ సందేహమోచేసిందిప్పుడు !

అవునూ ఇంతకీ నువ్వెలా ఏం చేసి అమ్ముకుంటున్నావోయ్ పుస్తకాలు !

చెప్పవా ప్లీస్ !

మీకూ ఉన్నాయిగా అందమైన దేహాలు వాటికి అంగాలు ?

పండిన ద్రాక్ష పండ్ల లాంటి పెదాలు

చందమామకి మధ్యలో నల్లటి బొట్టేట్టినట్లుండే కళ్ళు

ఫోర్ పాక్..సిక్స్ పాక్ ..ఏదో ఒహటిలే .,అలాంటలాంటి ఎకరం ఛాతీ

కడ్డీల్లాంటి దృఢమైన బాహువులు

మీ కుకవులు రాస్తారే మా ఆడాళ్ళకుండే అరటి బోదల్లాంటివి కాక పోయినా

పొడవాటితాటి చెట్టుకాండం అసుంటి తొడలు !

మరి ఇవన్నీ మీరు కూడా ఆరబోసేస్తున్నారేమి ట్రా పుస్తకాలమ్మే సేసుకోడానికి...చెప్పవేంటోయ్ ?

మమ్మల్నంటే సరిపోతుందా...?

చెప్పి తీరాలి ఇక నువ్విప్పుడు పుస్తకాలు ఎలా అమ్ముకుంటున్నావో...!

***

(మగాళ్ల దేహ సౌందర్యాన్ని అంత పచ్చిగా వర్ణించినందుకు ఏమనుకోకండేహె... స్త్రీ రచయితలు కూడా ఇలా మగాళ్ల సౌందర్యాన్ని వర్ణించవచ్చు మరి మగ రచయతలకు లేని సెన్సార్ షిప్ రచయిత్రులకి ఎందుకుట ? అలాగని మేమేమి బూతు రాయం లెండి..ఇక్కడేదో అవసరార్థం , ఆగ్రహ ప్రకటనార్థం, అలా వర్ణించాల్సి వచ్చింది .తప్పులేదు/తప్పలేదు.. అమృతా ప్రీతం లాంటి గొప్ప రచయత్రిని కూడా ఒక మగ కుకవి నువ్వు అందంగా ఉన్నందుకె నీకు అవార్డు వచ్చింది. నీ రచనేమంత గొప్పది కాదు అన్నాట్ట..వర్జీనియా వూల్ఫ్, టోని మార్రిసోన్,మాయా ఏంజిలో ది అదే పరిస్థితి. ఎదుగుతున్న రచయత్రులను అనగదొక్కడానికి వాళ్ళ లైంగికత మీద దెబ్బ కొడితే చాలు. ఈ లైంగిక రాజకీయం ఇది అనాదిగా ఉంది. ఇదిక ఎల్లకాలము కొనసాగదు)


Read More
Next Story