బూతు మాట వాడి పదవికి రాజీనామా చేసిన కేంద్ర మంత్రి ఎవరు?
బూతులు తిట్టుకోవడం ఈ మధ్య రాజకీయాల్లో చాలా సాధారణమయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో రాజకీయాల్లో బూతు మాటల ప్రయోగం బాగా ఎక్కువయింది 2014 తర్వాత. అధికారంలో ఉన్న వాళ్లు, లేని వాళ్లు బూతు మాటలు, తిట్లు, శాపనార్థాలు లేకుండా ప్రజలను అకట్టుకోవడం కష్టమని నమ్ముతున్నట్లు ఉంది. ఈమధ్య తెలంగాణ రాజకీయాల్లో బాగా పాపులర్ అయిన బూతు మాట సన్యాసి. దీన్ని ఎవరెవరూ పబ్లీకున వాడుతున్నారో వేరే చెప్పనవసరం లేదు.రాజకీయాల్లో అభద్రత అసహనం ఎక్కువయ్యాయి. దీనితో ప్రత్యర్థుల మీద పట్టలేని ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. ఈ ఆగ్రహ ప్రదర్శనకు బూతు మాటను ఆయుధం చేసుకుంటున్నారు.
అయితే, ఏమీ చేయలేని పరిస్థితి వచ్చినపుడు అవతలి వాడి తలబొప్పి కట్టేలా బూతు మాట వాడటమనేది సమాజంలో ఉంది. ఇపుడున్నంత గా కాకపోయినా బూతు మాటలు వాడటం రాజకీయాల్లో కూడా ఉంది. మహానేతలు కూడా దీనికి మినహాయింపు కాదు. ఎందుకు? బూతుమాటలకు ఒక సాంఘిక ప్రయోజనం ఉంది
అసలు బూతు మాటలెందుకు వాడతారు.
దీనికి సోషియాలజిస్టులు చెప్పేకారణలు చాలాన్నాయి. బూతు, అసభ్యపదజాల ప్రయోగానికి నష్టాలున్నాయి ప్రయోజనాలున్నాయి. అందుకే బూతుమాటలు మన భాషా సంస్కృతిలో ఒక భాగమే.అయితే, వాటి ప్రయోగాల మీద కొన్ని ఆంక్షలు విధించుకున్నాం. బూతుమాటలను ఎవరూ నిషేధించలేదు. కాకపోతే పార్లమెంటులో ప్రయోగించరాదనో, వార్తలో వాడరాదనో, టివి చర్చలో వాడరాదనో ఇలా నియమాలు పెట్టుకున్నారు.
బూతు మాటలు ప్రయోగించేందుకు, వెంటనే ఆకట్టుకోవడం అంటే అవతలి వాళ్ల దృష్టిని తన వైపుకు తిప్పుకోవడం కారణమని సోషియాలజిస్టులు చెబుతారు. తిట్టును ప్రయోగిస్తూనే తిట్టిన వాడికి చాలా రిలీఫ్ ఉంటుంది. బరువు దిగిపోయినట్లుంది (Physiological Release of Energy). ఇది తిట్టు సాంఘిక ప్రయోజనం. అయితే, తిట్టుఅనేది నిషేధభాషాప్రయోగం, దానిని ప్రయోగించగానే అంతా అటువైపు చూస్తారు దీనినే షాక్ వ్యాల్యూ (Shock Value) అంటారు.ఇది తిట్టు సాంఘిక లక్ష్యం. అందుకే తిట్టులోని పదాలుచాలా వరకు లైంగికాంశాలకు సంబంధించినవే అయి ఉంటాయి. అందునా స్త్రీ సంబంధమయినవి ఎక్కువగా ఉంటాయి. తిట్టు గురించి వివరంగా తెలుసుకోవాలనుకే వాళ్లు Swearing: A Social History of Fowl Language అనే పుస్తకం చదవవచ్చు.
“The reason swearwords attract so much attention is that they involve taboos, those aspects of the society that makes us uncomfortable. These include the usual suspects- private parts, bodily functions, sex anger, dishonesty, drunkenness, madness, disease, death, dangerous animals, fear, religion and so on.”
ఇలా తిట్టుతిట్టి తాత్కాలికంతా భావోద్వేగంనుంచి బయటపడినా, దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. వీటిని రోజూనే చూస్తూనే వున్నాం. ఇలా తిట్టు తిట్టి భారతదేశ చరిత్రలో మంత్రి పదవి పొగొట్టుకున్న ఎకైక రాజకీయ నాయకుడు చౌదరి చరణ్ సింగ్.
చౌదురి చరణ్ సింగ్ చాలా గొప్ప రైతునాయకుడు. ఉత్తర ప్రదేశ్ రైతులందరిని, కులమతాలకు అతీతంగా ఏకం చేసిన నాయకుడు. రెండు సార్లు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. జవహర్ లాల్ నెహ్రూకు సన్నిహితుడు. అంతేకాదు, ఒక దశలో ఆయనే తన వారసుడని నెహ్రూ అన్నట్లు కూడా చెబుతారు. 1977లో జనతా ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్రవహించాడు. అయితే, ఒక బూతు మాట నోరు జారి జనతా ప్రభుత్వం లో హోం మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ విషయం ఈ తరానికి ఈ తెలియదు. తర్వాత అదే మొరార్జీ ప్రభుత్వంలో మళ్లీ చేరారు. అది వేరే విషయం. ఆ ప్రభుత్వం కూలిపోయేందుకు కూడా ఆయనే కారణమయ్యారు.
1977లో ఎమర్జన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఓడిపోయారు. ఎన్నికల్లో గెల్చిన ప్రతిపక్ష పార్టీలన్నీ కలసి జనతా పార్టీగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రి. చౌదరి చరణ్ సింగ్ హోం మంత్రి. జనతా క్యాబినెట్ లో ఉన్నవాళ్లంతా ఎమర్జీన్సీలో జెయిల్లో ఉన్నోళ్లే. అందుకే ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటినుంచి ఇందిరా గాంధీని అరెస్టు చేసి జైల్లో వేయాలని అవకాశం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. హోంమంత్రి చరణ్ సింగ్ మీద వత్తిడి తెస్తున్నారు. 1977 అక్టోబర్ 3న బలమయిన కారణాలేవీ లేకుండ ఇంటెలిజెన్స్ బ్యూరో తయారుచేసిన కట్టకథలతో ఎఫ్ ఐ ఆర్ నమోదుచేసి ఇందిరాగాంధీని అరెస్టు చేయాలని చరణ్ సింగ్ ఆదేశించారు.
మధ్యాహ్నం పోలీసులు ఆమె న్యూఢిల్లీ నివాసం 12, వెల్లింగ్డన్ క్రెసెంట్ కి వెళ్లారు. ఈ అరెస్టుకు దారి తీసిన కారణాలను ఒక సారి చూద్దాం.
ఎన్నికల్లొ ఓడిపోయినా, ఇందిరాగాంధీ మళ్లీ జనామోదం పొందతుందనే భయం జనతా ప్రభుత్వ మంత్రుల్లో నక్కి ఉంది. ప్రతి క్యాబినెట్ మీటింగ్ లో ఇందిరాగాంధీని అరెస్టు చేయాలనే విషయం చర్చకు వస్తూ ఉంది. అయితే, ఎలా ముందుకు సాగాలో తేలియడం లేదు. ఎమర్జన్సీనేరాల మీద విచారణ చేసిన షా కమిషన్ నేరాలు జరిగినట్లు చెప్పారు. అయితే, కమిషన్ అనేది నిజనిర్ధారణ కమిటీ మాత్రమే అందువల్ల ఎవరినీ దోషిగా నిలబెట్టదని కూడాఆయన స్పష్టం చేశారు. కాబట్టి ఈ నివేదిక ఆధారంగా ఆమెను అరెస్టు చేయడం కుదరదు. ఈ తర్జన భర్జనల మధ్య ఇందిరాగాంధీ పర్యటనలు ప్రారంభించారు. మొదట బీహార్ లో బెల్చీ అనే గ్రామాన్ని ఎంచుకున్నారు. అక్కడ భూస్వాములు కొంతమంది హరిజనులను సజీవ దహనం చేశారు. ఆగ్రామాన్ని ఆమె ఏనుగు మీద స్వారీ చేస్తూ సందర్శించారు. బాధితులను పరామర్శించారు. ఈ పర్యటన బాగా హిట్ అయింది. తర్వాత ఆమె తన నియోజకవర్గం రేబరేలీకి వెళ్లారు. అక్కడ ఆమె కోసం పెద్ద ఎత్తున జనం వచ్చారు. తర్వాత ఆమె గుజరాత్ లోని గిరిజన ప్రాంతాల పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలతో జనతా ప్రభుత్వంలో తత్తర పుట్టింది. ఆమెను ఏదో విధంగా జైల్లోకి తోయక పోతే కష్టమనే నిర్ణయానికి వచ్చారు.
అపరేషన్ అరెస్టు
జనతా ప్రభుత్వం ఇందిరాగాంధీ అరెస్టు గురించి ఒక నిర్ణయానికి రావడానికి మూనెళ్లు పట్టింది. 1977 అక్టోబర్ మూడున హోమ్ మంత్రి చరణ్ సింగ్ ఆమె అరెస్టుకు ఉత్తర్వులిచ్చారు. పోలీసులు ఆమెను అరెస్టు చేసేందుకు ఇంటికి వెళ్లారు. అమెను ఎలా అరెస్టు చేయాలనేదానిమీద స్పష్టమయిన అవగాహన లేదు. పరిశ్రమల మంత్రి జార్జిఫెర్నాండెజ్, ఆరోగ్యశాఖ మంత్రి రాజ్ నారాయణ్ ఆమెను తక్షణం అరెస్టు చేయాలని పట్టుబడుతున్నారు. ప్రధాని మొరార్జీ దేశాయ్ జాగ్రత్తగా ఉండాలంటున్నారు. న్యాయ శాఖ మంత్రి శాంతిభూషన్ ప్రధానితో ఏకీభవిస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రి అటల్ బిహారీవాజ్ పేయి, సమాచార శాఖ మంత్రి ఎల్ కె అద్వానీ ఆమెను అరెస్టు చేయాలనే చెబుతున్నారు. ఆమెను అరెస్టు చేయడం అవసరమని జనసంఘ్ నేత నానాజీ దేశ్ ముఖ్ కూడా చరణ్ సింగ్ మీద వత్తిడి తెస్తున్నారు. అయితే, చరణ్ సింగ్ అభిప్రాయం మరొకలాగా ఉంది. ఆమె మీద ఆయనకు ఎందుకో కొంచెం అభిమానం ఉంది. ప్రధానిగా11 సంవత్సరాలు పరిపాలించింది. నెహ్రూకూతురు అనే మెతక వైఖరి ఆయనలో ఉంది. ఈ మధ్యన లక్నోలో విలేకరులతో మాట్లాడుతూ ఆమె తన సోదరి అని కూడా ఆయన వర్ణించారు. అందువల్ల ఇందిరాగాంధీఅరెస్టు విషయంలోచాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఫైల్సన్నీ జాగ్రత్త అధ్యయనం చేయమన్నారు. మరొకవైపు తనను అరెస్టు చేసుకోవచ్చని ఇందిరా గాంధీకూడా సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఆపరేషన్ అరెస్టు మొదలయింది.
వీధినాటకంగా ముగిసిన టాప్ సీక్రెట్ ఆపరేషన్
అమె అరెస్టుకు రంగం సిద్దమయింది. ఎన్ కె సింగ్ ఐపిఎస్ అధికారిని టీమ్ ను లీడ్ చేసేందుకు ఎంపిక చేశారు. ప్రధానికి సమాచారం అందించారు. అంతా సవ్యంగా ఉంటే రంగంలోకి దూకండని మొరార్జీ దేశాయ్ సలహా ఇచ్చారు.అయితే, అదొక డ్రామాలా తయారయింది. రసాభాస అయింది. మొదట 1977అక్టోబర్ 1న అరెస్టు చేయాలనుకున్నారు. చరణ్ సింగ్ భార్య గాయత్రీ దేవీ శనివారం అరెస్టు చేస్తే అరిష్టాలు ఎదురవుతాయని చెప్పారు. అందువల్ల అక్టోబర్ 2 గాంధీ జయంతి తర్వాత అరెస్టు చేయాలనుకున్నారు. అపుడు అక్టోబర్ 3ను ఎంపిక చేశారు. అంతా టాప్ సీక్రెట్ జరగాలని, నార్మల్ అరెస్టు మాత్రమేనని సిబిఐ డైరెక్టర్ కు సూచనలిచ్చారు. మధ్యాహ్నం మూడుగంటలకు అధికారులు కదిలారు. ఎఫ్ ఐఆర్ సిద్ధం చేసుకున్నారు. 4.45కు సిబిఐ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఇందిరాగాంధీ సహాయలొకరు బయటకు వచ్చి విషయమేమిటని అడిగారు. అవినీతి నిరోధకచట్టం సెక్టన్ (5)2 (Section (5)2 of the Prevention of Corruption Act) ప్రకారం ఇందిరగాంధీని అరెస్టు చేస్తున్నామని అధికారులు చెప్పారు.
ఈ లోపు హోమ్ చరణ్ సింగ్ ఎఫ్ ఐఆర్ కాపి తెప్పించుకుని చూసి అవాక్కయ్యారు. ఎందుకంటే, ప్రభుత్వం భావించిన సెక్షన్లు అవికాదు. సిబిఐ అధికారులను వెనక్కి పిలవండన్నారు. అయితే వాళ్లప్పటికే ఇందిరాగాంధీతో మాట్లాడుతున్నారు. ఈ దశలో వెనక్కి పిలవడం కుదరదు. మొత్తం కథ తారుమారయింది. అరెస్టు కావడానికి ఇందిరాగాంధీ ఒక గంట సమయం అడిగారు. ఈ గంట వ్యవధిని ఆమె చాలా చాకచక్యంగా జనతా పార్టీ ప్రభుత్వ పతానికి బాట వేసేందుకుఉపయోగించుకున్నారు. ఈ అరవై నిమిషాల వ్యవధిలో, తనని అరెస్టు చేసేందుకు జనతా ప్రభుత్వం కుట్ర చేస్తునదన్న సమాచారం ఢిల్లీ మొత్తం పాకెలా చేశారు. జనం విల్లింగ్డన్ క్రెసెంట్కె రావడం మొదలుపెట్టారు. ఆమె అడ్వకేట్ ఫ్రాంక్ యాంథొని వచ్చారు. సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, మేనకగాంధీ దేశలో కాంగ్రెస్ ప్రముఖులందరికి సమాచారం చెర్వేశారు. మేనకా గాంధీ సూర్య పత్రిక ఎడిటర్ అంతర్జాతీయ మీడియాకు ఉప్పందించారు. దేశమంతా గుప్పున ఈ వార్త పొక్కింది. యూత్ కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున రోడ్లమీదవచ్చేందుకు రంగం తయారయింది.
మరొక వైపు చేతులకుసంకెళ్లు వేయండని ఇందిరా గాంధీ పోలీసులమీద వత్తిడి తెస్తున్నారు. సంకెళ్లు లేకుండా ఆమె అరెస్టకాననిచెబుతున్నారు. వారు కంగుతిన్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి, హెచ్ కెఎల్ భగత్, ఎఆర్ అంతూలే, శంకర్ దయాళ్ శర్మ, జగగీష్ టైట్లర్, మహమ్మద్ యూనస్ అంతా అక్క డే ఉన్నారు. జర్నలిస్టులొచ్చారు. రాత్రిఏడున్నర దాకా సంకెళ్ల వేయడం మీద చర్చ తెగలేదు. అంతే బయట యూత్ కాంగ్రె స్ పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించింది. నినాదాలు మొదలయ్యాయి. టాప్ సీక్రెట్ అనుకున్నది వీధినాటకమయింది. ఆమె టాప్ లేని వాహనమెక్కారు. ఆమె వెంటే లెక్కలేనన్ని కాంగ్రెస్ నేతల కార్లు బారులు తీరి కదిలాయి. ఆమెను అరెస్టు చేసింది తమిళనాడు క్యాడర్ 1951బ్యాచ్ ఐపిఎస్ అధికారి విఆర్ లక్ష్మినారాయణన్. ఆమెను ఆరోజు రాత్రి పోలీసు కస్టడీలోనే ఉంచారు. ఆమెను అరెస్టు చేసిన కేసు ‘జీప్ స్కాండల్’ గా పేరుపడింది. మరుసటి రోజు ఆమెను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆమె మీద మోపిన నేరారోపణల్లో పసలేదని మేజస్ట్రేట్ మూడంటే మూడు నిమిషాల్లో ఎఫ్ ఐఆర్ ను కొట్టేశారు. ఆమెను విడుదల చేశారు
అయితే, ఆమె అరెస్టుతో మొదట భూకంపం వచ్చింది జనతా ప్రభుత్వంలో. తన వాళ్లంతా మరొక సారి వంచించారని,మోసం జరిగిందని చరణ్ సింగ్ గగ్గోలు పెట్టారు. మరొకవైపు దేశం అల్లోకల్లోలమయింది. దీనితో జనతా పార్టీ ప్రభుత్వం బాగా అభాసు పాలయింది. ఇందిరాగాంధీకి దేశమంతా సానుభూతి వచ్చింది.
దీనితో ఒకరంటే ఒకరికి గిట్టని మొరార్జీ క్యాబినెట్ల లో విబేధాలు తీవ్రస్థాయికి వచ్చారు. ప్రభుత్వం కూలిపోతుందేమో అనే పరిస్థితి వచ్చింది. ఇలాంటపుడు హో మంత్రి చరణ్ సింగ్ 1977 జూన్ లో ప్రధాని మొరార్జీ దేశాయికి ఒక లేఖ రాశారు. ఇందులో ఆయన మొరార్జీ క్యాబినెట్ మీద బూతు మాట ప్రయోగింయారు. "Your cabinet is a collection of impotent men incapable of bringing Indira Gandhi to justice," అని రాశారు. Impotent men అనేది బూతు మాట, అసభ్యకరమమయిన మాట. అందుకే ప్రధాని మొరార్జీదేశాయ్ ఆగ్రహించారు. వెంటనే చరణ్ సింగ్ చేత రాజీనామా చేయించాలని హకుంజారీ చేశారు. లెటర్లు టైప్ చేసుకుని అధికారులు చరణ్ సింగ్ కు ఆయన హనుమద్భక్తుడు రాజ్ నారాయణ్ కు లేఖలు అందించారు. జూన్ 28 వ తేదీన హోమ్ మంత్రి పదవికి చరణ్ సింగ్, రాజీనామా చేశారు. రాష్ట్రపతి సంజీవరెడ్డి జూలై 1 వ తేదీన ఆయన రాజీనామాను అమోదించారు. ఇలా నోరు జారి బూతు మాట ప్రయోగించి పదవి పోగొట్టుకున్న ఏకైక నేత చరణ్ సింగ్ అయ్యారు.
కొసమెరుపు
అయితే, ప్రధాని మోరార్జీ, చరణ్ సింగ్ ల మధ్య చాలా మంది సయోధ్య కుదిర్చారు. 1979 జనవరిలో ఆయన ఉప ప్రధాని, ఆర్థిక మంత్రిగా క్యాబినెట్ లో చేరారు. ఈ సారి ఈ వాళ్ల మధ్య విబేధాల వల్ల ఆగస్టులో జనతా ప్రభుత్వమే కూలిపోయింది. ఇది వేరే కథ.