
లిపి లేని ఆదివాసీ కోయ భాషలో బాల సాహిత్యం విడుదల
కోయతూర్ బాట ఒక ప్రయోగం
మన బాషను మనమే రక్షించుకోవాలి, మన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, జీవన విధానం ప్రతిబింబించే విధంగా సాహిత్య రూపాలలో పలు అంశాలు పొందు పరిచి, కథలు, పాటలను,మన ఆదివాసీ సాంస్కృతిక అంశాలను మేళవించి పుస్తకాలుగా తయారు చేసి, భావి తరాలకు అందించ వలసిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలంగాణ రాష్ట్రం రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర కన్వీనర్ సిడామ్ అర్జు పేర్కొన్నారు.
మార్చి 7న ఆంధ్ర ప్రదేశ్ పోలవరం జిల్లా రామన్న పాలెం అనే మారుమూల కోయ పల్లెలో “కోయతూర్ బాట” అనే సంఘం రజితోత్సవం వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అందులో భాగంగా కోయ బాషలో రాసిన బాల సాహిత్యాన్ని ఆవిష్కరించారు.
ఇందులో డుమ్మిరి భీమమ్మ అనే ఆదివాసీ మొదటి కవయిత్రి రాసిన “ఆలిం బిలీమ్ .. కోటాయి” పిల్లల పాటల ఒక పుస్తకము, తెల్లం కృష్ణ రాసిని “గాలి గాలి .. కుక్కు..” మరొక పిల్లల పాటల పుస్తకము కూడా ఉన్నాయి. వీటితో పాటు పలువురు రచయితలు రాసిన “విజ్జ “ అనే పిల్లల పాటల సంకలము కూడా ఆరోజు విడుదలయింది. ఈ మూడు పిల్లల పాటల పుస్తకాలను ఆవిష్కరణ పండగలాగా జరిగింది.
దుమ్మిరి భీమమ్మ, మొదటి తరం ఆదివాసీ కవయిత్రి
ఈ సందర్భంగా ప్రముఖ సంపాదకులు టంకశాల అశోక్ మాట్లాడుతూ “ మాతృ భాష పెద్దలకే పరితమవుతున్నదని, పిల్లలకు దూరమై కనుమరుగు అయ్యే ప్రమాదం ఉందని , అలాంటి పరిస్తితిలో ఇలాంటి లిపి లేని భాషకు , అందుబాటులో ఉన్న తెలుగు లిపిలో బాల సాహిత్యం రావడం అరుదైన విషయమని” కొని యాడినారు.
‘సమత’ జడ్జిమెంట్ తో ప్రసిద్ది గాంచించి ‘సమత’ సంస్థ అధిపతి రెబ్బా ప్రగ్గడ రవి మాట్లాడుతూ “ రాజ్యాంగంలోని ఐదవ , ఆరవ షెడ్యూళ్లు అదివాసులను రక్షించే పటిష్ట కవచాలు. ఇవి భారత రాజ్యాంగం ప్రత్యేకంగా అదివాసుల రక్షణకు కల్పించినవి . వాటిని సవరణ చేస్తే గాని , ఆదివాసీ ప్రాంతాల్లో భారీ తరహా ప్రొజెక్టులు గాని, మల్టీ నేషనల్ కంపనీలకు , బాక్సైట్ లాంటి మైనింగుకు సాధ్యం కాదు. ఆ ఐదవ , ఆరవ షెడ్యూళ్ల సవరణ చేసే కుట్రలు ప్రభుత్వాలు చేసే అవకాశాలు చాలా ఉన్నయి. కాబట్టి అదివాసులంతా అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వం, రాజకీయ పార్టీలు సవరణ చేసే ప్రయత్నాలను ఎదుర్కొని , తిప్పి కొట్టుటకు అదివాసులంతా రాజకీయాలకు, సంఘాలకు అతీతంగా కలిసి ఏక దాటిగా నిలిచి , ఐక్య న్యాయ పోరాటాలు చేయాలి. వాటికి ఎల్లప్పుడు సంసిద్దత గా ఉండాలి," అని చెప్పారు.
ఇలాంటి వేళ ఒక ఆదివాసీ బాషలో బాల సాహిత్య పుస్తకాలు రావడం సంతోష దాయకం” అని మొదటి రచయితలను రవి అభినందించారు.
కేంద్రీయ విశ్వ విద్యాలయలం , అంత్రోపా లజీ ప్రొఫెసర్ శివ ప్రసాద్ మాట్లాడుతూ “ గత 25 ఏళ్లుగా ఇంతటి మారుమూల ప్రాంతంలో అదివాసులకు , చదువు అందించిన కోయతూర్ బాట కృషి గొప్పదని , బాష , సంస్కృతి , ఆచార్య వ్యవహారలే ఒక జాతి అస్తిత్వాన్ని నిల బెట్టి, భావితరాలకు వారసత్వ సంపద అవుతుందని కార్యక్రమ నిర్వాహకుల శ్రమను కొనియాడినారు.
బొక్కిలి నాగేశ్వర రావు. కేంద్రీయ విశ్వ విద్యాలయం లో MFA చేసి, భద్రాచలం లో బి ఎడ్ కాలేజిలో లెక్చరర్ గా పని చేస్తున్నాడు..ఆదివాసీ శిల్పి, కవి, చిత్ర కారుడు. ఇతడే బాల సాహిత్య పుస్తకాలకు బొమ్మలు వేసింది.
మామిడి పూడి వెంకట రంగయ్య ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ,తెలంగాణ రాష్ట్ర విద్యా కమిటీ సలహా సంఘం సభ్యుడు ఆర్ వెంకట రెడ్డి మాట్లాడుతూ “ గత 25 ఏండ్లుగా డ్రాప్ అవుట్ పిల్లలకు చదువు చెప్పి, వారి ఎదుగుదలకు ఎంతో కృషి చేసిందని , ఆ పిల్లలే తమ ఆదివాసీ భాషలో మొదటి తరం రచయితలు గా ఎదుగటం చాలా అరుదైన విషయమ”ని అన్నారు.
కోయతూర్ బాట వ్యవస్థాపకులు కోయ బాల సాహిత్య స్పృర్తి ప్రధాత జి యాదయ్య మాట్లాడుతూ “ మాకు పిల్లల పాటలు అసలే లేవు . అలాంటివి రాయలేము, అలాంటివి అసాధ్యం అనే స్థాయి నుండి ఎంతో చక్కని విదంగా పాటలు రాసే స్థాయికి వచ్చామని అన్నారు.
జి. యాదయ్య, koyatur Bata వ్యవస్థాపకుడు. సామాజిక వేత్త, విద్యా వేత్త.
"ఈ స్థాయికి తేవడానికి ఎన్నో వర్కు షాపులు, ఎంతో ట్రైనింగ్ అవసరమయ్యాయి. అట్టడుగు స్థాయికి వెళ్ళి ముసలి వాళ్ళతో మాట్లాడి , చర్చలు ద్వారా పదాల సేకరణ లాంటివి కూడా చేశాము. గత 25 ఏళ్లుగా శ్రమించి కవిత్వం లో మంచి పట్టు సాధించాం. ఇంకా ఎంతోమంది యువకులకు కూడా ప్రేరణ కలిగించగలిగాము. వారు మంచి, మంచి కవితలు రాస్తూ వారి భాషలోని గొప్పదనం , మాధుర్యం ఆస్వాదిస్తున్నారు. ఒకప్పుడు తమ బాషను తామే చులకగా చేసే వారు సైతం తమ బాషను , యాసను గర్వంగా , అస్తిత్వ చిహ్నంగా , ఆత్మ గౌరవానికి , ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా చూసే స్థాయికివచ్చారు. దీనికి ఈ సాహిత్యం దోహదపడింది . భావితరాలకు ఈ మూడు పుస్తకాలు , ఈ ఇరువురు మొదటి తరం రచయితలు అదర్శంగా నిలిచి , మార్గ దర్శనం చేసి చరిత్రలో నిలుస్తారు. కొంత మంది మొదటి తరం కోయ బాష రచయితలు, రచయిత్రీలు కూడా తయారు అయ్యారు. వారి రచనలు కూడా భవిష్యత్తులో పుస్తకాలుగా రావాలని కోరుకుంటున్నాను. అందుకు తోడ్పడే పనిలో నేను ఒకడిని కావడం తనకు దొరికిన ఒక మంచి అవకాశం మరియు గొప్ప అదృష్టం అని “ ఉద్వేగంగా చెప్పారు.
కోయతూర్ బాట సహా వ్యవస్థాపకునిగాను, విద్యా విభాగ ముఖ్య సమనవ్యయ కర్తగా పని చేసిన శ్రీ పాండు కామ్టేకర్ మాట్లాడుతూ “ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భాషలు కనుమరుగు అవుతున్నాయి. ముఖ్యంగా లిపి లేని ఆదివాసీ భాషలు మరీ అంతరించు దశలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా గల భాష ప్రేమికులు, హక్కుల కార్యకర్తలు, ఆదివాసీ సంఘాలు గగ్గోలు పెడుతున్నారు. ఇంకా కొందరు లిపి లేదని లిపి తయారీలో నిమగ్నం అయ్యారు. సాహిత్య రచనకు సాహిత్యాభివృద్దికి “లిపి లేకపోవడం” అనే భావన ఒక పెద్ద అడ్డంకిని అధిగమించి, అక్కడే నిలిచి పోకుండా ముందుకు సాగిపోవడం ఒక అరుదైన విషయం. అప్పటి వరకు ఆయా ప్రదేశాల్లో అప్పటికే ఉన్న, వాడుకలో ఉన్న తెలుగు లిపిని ఉపయోగించి కోయ బాష, సాహిత్య రూపాలైన కవితలు, పాటలు, కథలు లాంటివి అభివృద్ధిపరిచి గత దశాబ్ద కాలంగా కోయ భాషలో బాల సాహిత్యం అభివృద్ధికి నిరంతర చేస్తున్న కృషి ఎంతోగొప్పది. అందులో భాగంగా కోయుతూరుబాట సమత ఆధ్వర్యంలో "కోయ భాషలో బాల మరియు పూర్వ బాల సాహిత్యం(literature for childhood and early childhood) పై ఆదివాసీ పిల్లలు, యువత కలిసి రాసిన ఈ మూడు పుస్తకాలు రావడం నాకు మాత్రమే కాదు యావత్ ఆదివాసీ సమాజం కూడా సంతోషకరమయినవిషయం,’ అని అన్నారు.
ఈ ప్రయోగం ఇక్కడితో ఆగి పోకుండా ముందుకు సాగి ఇంకా చాల అనేక సాహిత్యం రావాలని, వీటిని ఆదర్శంగా తీసుకుని దేశంలో వివిధ ఆదివాసీలు ఆయా ప్రాంతాల్లో వాడుకలో గల లిపి లో తమ సాహిత్యం తేవవడానికి తీసుకురావాలని కామ్టేకర్ ఆశించారు.
"ఇలాంటి సాహిత్యం వివిధ రూపాలలో అభివృద్ది పరిచేందుకు , ఎంతో మంది ఆదివాసులు, మేధావులు, విద్యా వంతులు, ఉపాధ్యాయులు యువత ముందుకు రావాలి. తద్వారా అపారమైన సాహిత్య సంపద తయారు కావాలి. భారత రాజ్యాంగంలో 8 వ షెడ్యూల్ నందు చేర్చే ప్రయత్నానికి దోహద పడగలదని ఆశిస్తున్నాను” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, పూర్వ టీచర్లు, గ్రామ పెద్దలు సుమారు ఐదు వందల మంది హాజరైనారు.ఈ కార్యక్రమ నిర్వాహణ , వ్యయ బాధ్యతలు అన్నీ కూడా పూర్వ విద్యార్థులు భరించారు. . పూనేమ్ బాబూరావ్ , మడివి వీరయ్య , శ్రీ దేశయ్య లు సమిష్టిగా సమావేశానికి అధ్యక్షత వహించారు.

