
చిరుసందేహం... ‘మండే’ కవిత
కవి: డాక్టర్ మల్లంగి గోపీకృష్ణ
సాఫ్ట్‌వేర్‌గద్ద మధ్యతరగతి ఇళ్లలోని
కోడిపిల్లల్ని తన్నుకుపోతోంది!
అమెరికా డాలర్ దెబ్బకు
ఆప్యాయత అనురాగాల
పునాదులు కదిలిపోతున్నాయి!
రెక్కలు కత్తరించకండన్న
పిల్లలమాటలే నేడు నెగ్గుతున్నాయి..
పిల్లలులేని ఇంట్లోని దిళ్లు
ముసలి తల్లితండ్రుల
కన్నీళ్లతో తడిచిపోతున్నాయి!
డాలర్లయితే బీరువాల్లో బ్యాంకుల్లో
నిండుగానే ఉన్నాయి..
పిల్లలని దూరంచేసిన
డాలర్లను ఏంచేసుకోవాలని
తల్లితండ్రుల చూపులడుగుతున్నాయి!
గ్యారేజిలోని కారు
కదలి చాలా రోజులయ్యింది..
పిల్లలను ఎక్కించుకు తిరిగిన
స్కూటర్‌ను చూసి
అది సిగ్గుతో తలదించుకొంది!
అరవైఐదించీల సోనీ టీవీ
అలుపెరగకుండా వాగుతోంది..
అయినా ఎందుకో ఈమధ్య
పల్లెలోని ఆకాశవాణి రేడియో
మరీ మరీ మాకు గుర్తొస్తోంది!
త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాటు
మాఇద్దరి ఒంటరితనాన్ని పెంచుతోంది..
పలకరించే వాళ్లులేక
నిద్రపట్టడంలేదని ముసలావిడ
రాత్రిళ్లు నిద్రమాత్రలు మింగుతోంది!
ఫ్రిజ్జినిండా చద్దికూరలతో
ఆకలి చచ్చిపోయింది..
అందరం కలిసితిన్న ఆవకాయ గుర్తొచ్చి
లాలాజలంతో నోరేకాదు
కన్నీళ్లతో చొక్కాకూడా తడిచిపోతోంది!
గ్రీన్ కార్డు కోసం చూస్తూ
మాకళ్లు కాయలు కాస్తున్నాయి..
ఆరునెలల వీసాలు
నన్నూ మా ముసలావిడనూ
ఫుట్‌బాలు ఆడుతున్నాయి!
మొదటిసారి విమానమెక్కినప్పుడు
ఎవరెస్ట్ ఎక్కినట్టనిపించింది..
ఆర్నెల్లకు వెళ్లిపొమ్మని
వాళ్లు తోసేసినప్పుడే
పాతాళంలో పడిపోయామనిపించింది!
తల్లీబిడ్డలను విడదీసే అధికారం
వీళ్లకు ఎవరిచ్చారనిపించింది..
మాకొడుకింట్లో మేముంటే
మావాడి సొమ్ము మేంతింటూంటే
పొమ్మనడం అన్యాయమనిపించింది!
ఖరీదైన కార్లలో తిరగాలన్నకోరిక
మాకు ఏకోశానా లేదు..
కలో గంజో తాగినా
కలిసి పిల్లలతో ఉండాలన్న కోరికలో
తప్పేంటో మాకు అర్థంకావడం లేదు!
ఇండియాలోని ఇళ్లు
అన్నీ ఖాళీగూళ్లలా కనిపిస్తున్నాయి..
అమెరికా గద్ద చేసినపని
అన్యాయమనే ముసలిపక్షులగోడు
పట్టించుకోకపోవడం న్యాయంకాదు!
బలిసిన డాలరు బరువు ముందు
రూపాయి పాపాయి తేలిపోయింది..
కానీ కన్నవాళ్ల గుండె బరువు
కన్నీళ్లతో తడిసిన దిండు బరువు
కనిపించలేదనడం సరికాదనిపిస్తోంది!