
కోస్తాంధ్ర సంక్రాంతి ‘రికార్డ్ డ్యాన్సింగ్’ చిందులు... ఏందుకలా?
సారవంతమైన నేలలో మొలిచిన కలుపు మొక్కల వంటి సామాజిక రుగ్మతలపై విశ్లేషణ. గురజాడ అడుగుజాడల నుండి నేటి ‘జెన్-జడ్’ పోకడల వరకు విలువల పతనాన్ని ప్రశ్నిస్తున్న ప్రత్యేక కథనం.
కోస్తాంధ్ర భూమి సారవంతమైనది. దాన్లో మొలకలు పైకి కనిపించకపోయినా ఎన్నో విత్తనాలు అందులో నిక్షిప్తమై ఉంటాయి. అవి పైకి కనిపించకపోవడంతో, (మన) లోపల అవి ఉన్నట్టుగా మనకు తెలియదు. మనం మన అవసరం కొద్దీ భూమిమీద నాటే విత్తనాల పంట మాత్రం కోసుకుంటాము. అయితే, అందుకు రైతు చేసేది ఏంటి, కలుపు మొక్కల్ని తవ్వి ఏరి కాల్చి పారేసి, మంచి విత్తనాలతో భూమి నుంచి పంట పండిస్తాడు. అదే రైతు పొలం వైపు చూడకుండా దాన్ని అలా వదిలేస్తే, మనం జల్లిన విత్తనాల కంటే, ఏపుగా లోపలి ముళ్ళ జెముడు విత్తనాలు కలుపు మొక్కలై భూమిని చీల్చుకుని మరీ పైకి లేచి పంటను మించి ఎదిగి మరీ అవి తలలు ఎగరేస్తాయి.
ఈ శతాబ్ధి తొలి పాతికేళ్ళ తర్వాత 2026లో జరిగిన సంక్రాంతి కోస్తాంధ్రలో ఆవిష్కరించిన చిత్రమిదే. పైగా ఈ కాలంలోనే తెలుగు రాష్ట్రాలు రెండు అయ్యాయి ఏమో, ఈ ఏడాది మనం జరుపుకున్న సంక్రాంతి గురించి ‘సోషల్ మీడియా’ మనపై చేసిన దాడి కారణంగా, దేశం ‘మోరల్ కోర్టు’ బోనులో కోస్తాంధ్ర నిలువ కాళ్ళమీద నిలబడాల్సి వచ్చింది. దాంతో- దేశంలో అందరి కన్నా ముందు సామాజిక శాస్త్రాల చదువును ‘కరిక్యులం’ నుంచి తొలగించిన ఘన చరిత్రతో; ఆత్మావలోకనం అవసరం అని ఇక్కడి పౌరసమాజం అనుకుంటుందా, లేక ఎప్పటి మాదిరిగానే దాని వ్యూహాత్మక మౌనం అది పాటిస్తుందా, అనేది ఇప్పుడు ఇక కొత్త కేలండర్ నిర్ణయిస్తుంది.
నిజానికి సంక్రాంతి పండగ ‘మూడ్’ అంటే, అది చెట్టుకు పట్టిన మంచులా జనవరి రెండవ వారం వాతావరణంలో ప్రతి ఒక్కరికీ మనస్సుకు పట్టే ‘ఫీల్ గుడ్’ పండగ. ఆదుర్తి సుబ్బారావు 1968 లో కే. విశ్వనాధ్ తో తీయించిన వొక సినిమాకు దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన ‘రావమ్మా మహాలక్ష్మి..’ పాటలో ‘కడెవెడు నీళ్ళు కళ్ళాపి’, ‘ముగ్గులు’, ‘గొబ్బెళ్ళు’, ‘గడపకు పసుపు’, ‘గాదుల్లో ధాన్యం’ వంటి పదాలు వింటాము. దశాబ్ధాలు గడుస్తున్నా ఇంకా అది అలాగే ఉండాలి అని ఎవరు అనరుగాని, మనం ఎంత ఆధునికం అయినప్పటికీ, దాని ‘ఒరిజినల్’ ఆత్మ మనం పండగ చేసుకోవడంలో కనిపించాలి కదా. పండగల్లోకి కూడా చొచ్చుకువస్తున్న- ‘పొలిటికల్-ఎకానమీ’ తెచ్చే ‘యాంటీ-సోషల్’ శక్తుల్ని నిరోధించాల్సిన పౌరసమాజ శక్తులు నిర్వీర్యం అయితే ఎలా?
ఒకప్పుడు తెలంగాణ ఇప్పటికీ ఉత్తరాంధ్ర రాయలసీమలు; కృష్ణా గోదావరి జిల్లాలను అదొక ‘ప్రివిలేజడ్ రీజియన్’ అన్నట్టుగా చూస్తాయి. రాజకీయం, ఆర్ధికం, ఊసు ఇప్పుడు ఇక్కడ ఎత్తడం లేదు, ఎందుకంటే, సందర్భం పండగ కనుక. అస్సలు ఈ ప్రాంతం వారి ‘షోకేసింగ్’ చూడాలి అంటే, దాన్ని హైదరాబాద్ లోనే చూడాలి. ఎవరినయినా తేలిగ్గా చెప్పి మరి ఒప్పించేది ‘ఫుడ్’తో కనుక, గత పాతికేళ్లుగా ఈ ప్రాంతం వాళ్ళు అక్కడ అదే చేశారు. ఆ ప్రభావం ఏ స్థాయిలో పనిచేసింది అంటే, అక్కడి ‘షో’ చూసి చివరికి బెజవాడలో కూడా ‘ఆంధ్ర భోజనం’ అని ‘సెన్స్’ లేకుండా బోర్డులు పెట్టేంత స్థాయికి దాన్ని చేర్చారు!
అయినా అస్సలు తెలుగునాట ‘సర్ ప్లస్’ (మిగులు) నుంచి పుట్టే అవలక్షణాలు అర్ధం చేసుకోవాలి అంటే, అందుకు మనం మొదట గురజాడ వైపు ఆయన మనల్ని తీసుకెళ్ళే ప్రాంతాల వైపు చూడాలి. ఆధునిక తెలుగు సాహిత్యకారులు ‘బెంచ్ మార్క్’ అని భావించే రచన శ్రీ గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’.
అయితే, గురజాడ పూర్వీకులు ఎవరు? వారు కృష్ణాజిల్లా వుయ్యూరు సమీపాన పమిడిముక్కల మండలంలోని గురజాడ గ్రామం నుంచి అనకాపల్లి ప్రాంతానికి వలస వెళ్ళినవారు. విజయనగరం గజపతుల ఆస్థానంలో పనిచేసిన గురజాడ 1892లోనే ‘మధురవాణి’ వంటి పాత్రను సృష్టించారు అంటేనే, ‘సర్ ప్లస్’ ఉండే ప్రాంత ప్రభావం ఏమిటో అర్ధమవుతుంది.
ఏమిటీ ‘సర్ ప్లస్’ అన్నప్పుడు, అందులోకి కొంచెం చూడాలి. కోస్తాలో నీటిపారుదల వ్యవస్థ స్థిరీకరించబడిన తర్వాత సహజంగా జరగాల్సిన తయారీ రంగ పారిశ్రామీకరణ ఇక్కడ మందకొడిగా సాగింది. భూమిని ఒక స్థిర వనరుగా అలాగే ఉంచి, దాని ఆసరాగా ‘ఫైనాన్స్’ ‘చిట్ ఫండ్’ వ్యాపారాలు చేసి, జీవిక కోసం భూమిపై ఆధారపడే శ్రామిక వర్గాలను, వారు ‘స్కిల్డ్ లేబర్’ కాకుండా శాశ్వితంగా బలహీనులను చేయడం సాధ్యమయింది. అందువల్ల వారిని ‘గ్రూప్ వోటర్స్’గా చేయడం కూడా వీరికి రాజకీయంగా కలిసి వచ్చింది. ఇక ‘మిగులు’ అనేది ఉన్నచోట ఎంతోకొంత వినోదం అవసరం ఉంటుంది మరి. ముందుగా దాన్ని గురజాడ గుర్తించారు.
ఇప్పుడు 2025 తర్వాత ‘సర్ ప్లస్’ అంటే, ఈ ప్రాంత రాజుల మిగులు భూముల గురించి వినే భిన్నవార్తలు గురించి మనకు తెలియాలి. విషయం ఒక్కటే, కానీ గత ప్రభుత్వంలో అవి కోర్టు కేసులుగా మనకు కనిపిస్తే, ప్రభుత్వం మారి సందర్భం అంతర్జాతీయ ‘ఎయిర్ ఫోర్ట్’ అయ్యేసరికి, అవే భూముల గురించి వాటిని ‘వితరణ’ వార్తలుగా మనం చూసాము. భూమి ఒక్కటే, కానీ ఒక్కొక్క ప్రభుత్వంలో దాని స్వరూపం ఒక్కొక్క తీరుగా మనకు కనిపించింది. అదెలా? అంటే ‘మిర్రర్స్ మ్యాటర్స్’. ఎవరికి ఏది ఎలా కనిపించాలో అందుకు తగిన అద్దాలు అబద్దాల చుట్టూ అమర్చబడతాయి. ఏమి మార్చినా, ఎలా ఏమార్చినా ఒకసారి విషయం బయటకు పొక్కితే, దాన్ని ఎలా చూడాలి అనేది పూర్తిగా జనం ‘ఛాయిస్’, వాళ్ళ తూకాలు వాళ్ళకు ఎప్పుడూ ఉంటాయి.
ఇప్పుడు కూడా ఏపీ ‘సంక్రాంతి-26’ చూశాక- ‘హవ్వ ఇదేంటి?!’ అని మరీ అంతగా మనం నోరు కూడా నొక్కుకోనక్కరలేదు. ఇరవై ఏళ్ల క్రితం 2006లో ఒక సూపర్ హిట్ సినిమాలో “అప్పటికింకా నా వయస్సు నిండా పదహరే..” అంటూ ఒక క్లబ్ డ్యాన్స్ పాట పెడితే, మనకు అప్పుడు అది తప్పు అనిపించలేదు. అచ్చు ఆ పాటలో ఉన్నట్టే ఈ సంక్రాంతి సంబరాల్లో నూనూగు మీసాల కుర్రాళ్ళు తాగి ఆమె మీదికి వస్తే, అయ్యో మన ‘జెన్ జడ్’ పిల్లలు ఏమైపోతున్నారు అని ‘యూట్యూబ్’లో కొందరు గుండెలు బాదుకోవడం ఎందుకు?
కన్యాశుల్కం తో మధురవాణి ‘ఫ్యాక్టర్’ మన సంప్రదాయ కుటుంబ వ్యవస్థలో ఒక భాగం అన్నట్టుగా మన ఆధునిక సాహిత్య రూపాలు మొదలు కావడం మనం గ్రహించాల్సిన మొదటి అంశం. భీమవరం వద్ద వీరవాసరం నివాసి కాళ్లకూరి నారాయణరావు రాసిన ‘చింతామణి’ గురజాడ మధురవాణి కంటే తెలుగునాట పాపులర్! కాకినాడ సుజనరంజని ముద్రశాల దీన్ని1923లో ముద్రిస్తే, అప్పటికే అది 446 సార్లు పలుచోట్ల ప్రదర్శించబడింది. తెలుగునాట అసంఖ్యాకంగా ప్రదర్శించబడిన నాటకమిది. పైగా వేశ్యావృత్తిని ఖండించే నాటకమని దీనికి పేరు!
సరే నాటకాలు నుంచి సినిమాలు వద్దకు వచ్చాము. ఇక్కడి వివాహేతర సంబంధాలకు ఎంత గొప్ప లాలిత్యం జోడించారు. భార్య ఒక పక్క పిల్లలు సంసారంతో సతమతం అవుతుంటే, ఆమె కవి భర్త తన భావుకతకు భార్య వద్ద చోటులేదని, పడవలో ఏరు దాటి మరీ అవతల ఒడ్డున కొత్తగా వచ్చిన నర్తకి వద్దకు వెళితే- “ముందు తెలిసినా స్వామి నీ మందిర మిటులుండేనా..” అంటూ ఆమె పాడే పాటను- దేవులపల్లి కృష్ణశాస్త్రి 1982లో ఇక్కణ్ణించే రాశారు. మూలాల్లోకి చూస్తే, మిగులు భూముల ప్రాంత కులీన సమాజ స్వభావం తెలిస్తే, కాలక్రమంలో అది- “బావలు సయ్యా...” వద్ద నుండి భాస్కరభట్ల శర్మ 2006లో రాసిన “నిండా పదహరే..” పాట వరకు ఎదిగిన తీరు అర్ధం అవుతుంది.
‘ రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్’ అంశం చుట్టూ అల్లిన కధనంతో 1988లో వంశీ సినిమా‘కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ ‘ వచ్చిన తర్వాత, క్రమేణా ఊళ్ళల్లో నిజానికి రికార్డింగ్ డ్యాన్సులు క్రమగా తగ్గాయి. ఒక విధంగా ఆ చిత్రం వాటికి ఒక విలువైన ‘డాక్యుమెంట్’. అయితే ఇది పూర్తిగా గోదావరి గ్రామీణ నేపధ్య చిత్రణ. అయితే, పల్నాడు మెట్ట ప్రాంతంలో గ్రామీణుల భక్తి ఉత్సవంగా పేరొందిన కోటప్ప కొండ తిరునాళ్ళ వద్ద సంగతి ఏమిటి అని చూసినప్పుడు “గత ముప్పై ఏళ్లుగా ఇక్కడ రికార్డింగ్ డ్యాన్సులు మేము చూడలేదు” అని చెబుతున్నారు. ఒకప్పుడు రాష్ట్రమంతా ప్రసిద్ది చెందిన గుడివాడ రికార్డింగ్ డ్యాన్స్ బృందాల్లోకి కొత్తవారు రాకపోవడంతో, అవి మూతపడ్డాయి. దాంతో దీనికి ప్రాంతమా? లేక ప్రజలా? ఎవరు కారణం అనే మీమాంస మిగులుతున్నది.
అలాగని పలు రంగాల్లో దేశ కీర్తిని ఇనుమడించిన లబ్ధ ప్రతిష్టులు ఈ ప్రాంతాల నుంచి ఉన్నారు. యల్లాప్రగడ సుబ్బారావు (భీమవరం) మోహన్ కందా (కాకినాడ) దువ్వూరి సుబ్బారావు (ఏలూరు) త్రిపురనేని గోపీచంద్ (గుడివాడ) కే.ఎల్. రావు (విజయవాడ) వంటివారు దేశ స్వాతంత్ర్యం అనంతరం తమతమ రంగాల్లో దీపధారులు. అయితే, సాహితీ, కళా రంగాలు మిగతా వాటికి పూర్తిగా భిన్నమైనవి. తరాలు మారుతున్నప్పుడు ఒక ప్రాంతం సాంస్కృతిక నైతికతను మన సృజనకారుల కృషి చరిత్రను ఎలా ప్రభావితం చేసిందో గ్రహించడానికి ఇప్పుడీ ఈ సమీక్ష అవసరమయింది.
కృష్ణాజిల్లా గన్నవరం నుంచి ‘సోషల్ మీడియా’ లో క్రియాశీలంగా పనిచేసే ఒక యువ జర్నలిస్టు తన ‘యూట్యూబ్’ ఛానల్లో చేసిన వీడియోలో మాట్లాడుతూ- “ఈ సంక్రాంతికి ఒక రికార్డ్ డ్యాన్స్ వేదికపై అర్ధ నగ్నంగా డ్యాన్స్ చేస్తున్న యువతి చుట్టూ ఇంకా మీసాలు కూడా రాని ‘జెన్-జడ్’ కుర్రాళ్ళు తాగి ఆమె చుట్టూ ఎగురుతుంటే, చూసి గుండెలు పిండినట్టు అయింది” అంటూ వాపోయారు. ఒక ప్రాంతం ఒకానొక కాలంలో ఎలా ఉంది అని సాహితీ కారులు తమ సృజన సాహిత్యంలో డాక్యుమెంట్’ చేయడం వేరు, సొమ్ములు చేసుకోవడానికి దాన్ని ‘వల్గారిటీ’ చేయడం వేరు. ఇప్పుడు మనం చేరింది అక్కడికే!
‘చింతామణి’ నాటకంలో తమ వైశ్య సమాజాన్ని అగౌరపర్చే సంభాషణలు ఉన్నాయని, దాని ప్రదర్శనలపై నిషేధం విధించాలని గత వైఆర్సీపీ ప్రభుత్వంలో కొందరు డిమాండ్ చేస్తే, అప్పటి ప్రభుత్వం 2022 జనవరిలో ఫిబ్రవరిలో ఆ నాటకాన్ని నిషేధించింది. అప్పటి ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆ నాటకం నిషేధం అన్యాయమని, అందువల్ల పలువురు కళాకారులు ఉపాధి కోల్పోయారు అని కోర్టుకు వెళ్లారు. అదే ఏడు జూన్ నెలలో కోర్టు స్టే ఇవ్వడానికి కూడా నిరాకరించింది. ఈ వార్తలు పత్రికల్లో చూసి ఒకపక్క ‘కోవిడ్’తో జనం సతమతం అవుతుంటే, ఈ ప్రభుత్వానికి ఈ నాటకం గొడవ ఇప్పుడు అవసరమా? అనుకున్నవాళ్ళు అప్పట్లో ఉన్నారు.
భూమి లోపల ఉండే ‘టెర్మినేటర్ సీడ్స్’ నిర్మూలన అనేది, అదొక నిరంతర నైతిక సేద్యం. ‘రాజ్యం’ విధులు తెలిసిన ప్రభుత్వాలు ఉన్నప్పుడే, అటువంటి సేద్యం జరిగి సమాజంలో ‘ఫీల్ గుడ్’ వాతావరణం ఉంటుంది. అదే రైతు పొలం వైపు చూడకుండా దాన్ని అలా వదిలేస్తే, సారవంతమైన భూముల్లో కూడా ఇలా ముళ్ళ జెముడు మొలిచి అవి వృక్షాలై తలలు ఎగరేస్తాయి.

