
రాయలసీమ కోలా చల్లటి యాత్ర: చెంచుగూడెం నుంచి సిటీ సెంటర్ల దాకా....
నన్నారి షర్బత్ ఎలా తయారువుతుందో తెలుసా?
సూర్యోదయానికి ముందే అడవిలోకి వెళ్తారు..రాళ్లు ,పొదలు మధ్య అన్వేషిస్తారు. భూమిని తవ్వి తమకు అవసరం మేరకు మూలికలను సేకరించి సూర్యాస్తమయం లోపే తమ గూడేలకు చేరుకుంటారు. వారు తెచ్చిన అటవీ సంపద కోసం ప్రభుత్వ, కార్పొరేట్ సంస్ధలు క్యూ కడతాయి. వారికి అమ్మి ఇంటి అవసరాలు తీర్చు కుంటారు. బయట కూలీ దొరకనపుడు, డబ్బు అవసరం ఉన్నపుడు మళ్లీ అడవిలోకి వెళ్తారు.
వారికి ప్రకృతే బ్యాంక్, భూమికింద పెరిగే అరుదైన వేర్లు ఏటిఎం లు... అదెలాగో తెలుసుకోవాలంటే, రాయలసీమలో చెంచు గూడేళ్ల వైపు వెళ్లాలి.
రాయల సీమ కోలా!!
గాజుగ్లాసులో రెండు మూతల నన్నారిని పోసి,
నిమ్మకాయ పిండి.. సోడాను గ్లాసులోకి పోస్తుంటే..నురగలు కక్కుతున్న ఆ పానీయం తాగి తీరాల్సిందే... కొంచెం తీపి, కొంచెం వగరు.. మరికొంచెం పులువు కలగలిసిన ఆ రుచిని ఒక్క సారి చూస్తే వదలరు. ఇది రాయల సీమలో మాత్రమే దొరికే టేస్టీ డ్రిరక్. అడవిలో దొరికే అరుదైన నన్నారి వేర్లతో తయారుచేసే ఈ లోకల్ షర్బత్ వెనుక, అడవిబిడ్డల అంతులేని శ్రమ ఉంది.
బలంగ పెరిగిన నన్నారి వేర్లు,
అడవుల్లో ఎలా గుర్తిస్తారు?
దట్టమైన అడవుల్లో రాళ్ల మధ్య పెరిగే అరుదైన ఔషధగుణాలున్న మొక్క నన్నారి. నల్ల మల, శేషాచలం, భద్రాచలం అడవుల్లో, స్వల్ప వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. నీటి వసతి అవసరం లేదు. వాన చుక్కలు పడితే చాలు ,ఏపుగా ఎదుగుతుంది. దాని వేర్లు నేలలో రెండు మీటర్ల వరకు విస్తరిస్తాయి. వాటిని సేకరించి, ఎండబెట్టి అమ్ముకుంటారు. అటవీ ఫలసాయం మీద ఆధార పడిన గిరిజనులకు నన్నారి బతుకు తెరువుగా మారింది. గత 40 ఏళ్ల నుండి వీటిని సేకరిస్తున్నారు. అడవిలోంచి తీసుకుంటున్నారు కానీ పునరుత్పత్తి లేకపోవడం వల్ల గత పదేళ్లలో ఈ మొక్కలు క్రమంగా తగ్గిపోతూ, అంతరించిపోయే దశకు చేరుకొన్నాయి. ఈ వేర్లకు మార్కెట్‌లో డిమాండ్ ఉన్నప్పటికీ , అడవుల్లో క్రమంగా కనుమరుగవ్వసాగాయి. అలా వారి ఆదాయం కూడా తగ్గిపోసాగింది. ఇవి లేక పోతే గిరిజనులకు వలసలు తప్ప మరో దారి లేదు.
ఈ ప్రమాదం గుర్తించిన విశాఖ లోని ‘కోవెల్’ ఫౌండేషన్ ఆ మొక్కలను శాస్త్రీయంగా సేకరించి ,సాగుచేసే పద్దతులను రైతులకు నేర్పింది. అడవిలోని ఫలసాయాన్ని వ్యవసాయంలోకి మార్చి , రైతుల సొంతభూముల్లో వాటిని సాగు చేసేలా, ఒక పైలట్ ప్రాజెక్టుని కర్నూల్ జిల్లాలో మొదలు పెట్టింది. నలుగురు రైతులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి నన్నారి సాగులో నిమగ్నం చేశారు. వారు సక్సెస్ అవ్వడంతో మరో 30 మంది ముందుకు వచ్చారు. వారికి విత్తనాలు ఇచ్చి, నర్సరీలు ఏర్పాటు చేశారు. వేర్లను సేకరించే, పనిముట్లను కూడా సమకూర్చారు.
అడవిని కాపాడే దిశగా..
‘‘ ఆదివాసీల చరిత్ర, భవిష్యత్ అడవి మీద ఆధారపడి ఉంది. అటవీ పంరక్షణ పర్యావరణ సమతుల్యత ఆదివాసీల మీద ఆధారపడి ఉంది. వీటిని సమన్వయం చేయడానికి, కోవెల్ సంస్ధ పనిచేస్తోంది. గిరిజనుల జీవనాధారమైన అడవిలో ఫలసాయం తగ్గిపోయినపుడు వారి మనుగడ ప్రమాదంలో పడుతుంది. నన్నారి అంతరించి పోకుండా కాపాడి, ఫారెస్ట్ ఫామ్ గా అభివృద్ధి చేశాం. అడవి మీద ఒత్తిడి తగ్గించి, గిరిజనుల సొంతభూముల్లో వాటిని సాగు చేసేలా వారిని ప్రోత్సహిస్తున్నాం.
నన్నారితో సహా 25 రకాల అటవీ ఉత్పత్తులు సేకరించి,వాటిని మార్కెట్‌కి అనుగుణంగా తయారు చేయడానికి శిక్షణ ఇస్తున్నాం. ఇలా తెలంగాణ, ఆంధ్రా లో 15 జిల్లాల్లో పనిచేస్తున్నాం.’’ అని వివరించారు, కోవెల్ ఫౌండేషన్ సిఇఓ కృష్ణారావు.
డి.వాని పెంట పంచాయితీలోని చెంచుగూడెంలో నన్నారి నర్సరీ
2014 లో కర్నూల్ జిల్లా, ఆళ్లగడ్డ మండలం, డి.వాని పెంట పంచాయితీలోని చెంచుగూడెంలో, పైలట్ ప్రాజెక్టుగా నన్నారి విత్తనాల సేకరణ, నర్సరీల ఏర్పాటు, ప్రత్యేక పనిముట్లు అందచేసి శిక్షణ ఇవ్వడంతో ప్రస్తుతం 32 మంది మహిళా రైతులు సాగు చేస్తున్నారు. గిరిజనుల జీవనోపాధికి కోవెల్ చేస్తున్న కృషిని చూసిన జాతీయ ఔషధ మొక్కల బోర్డ్ నన్నారిని ఔషధ మొక్కగా గుర్తించి, హెక్టార్‌కి రూ. 75వేలు సబ్సిడీని కూడా ఇస్తున్నారు.
ఎకరాకు లక్షల్లో ఆదాయం
ఎకరాకు 11వేల మొక్కలు పెరుగుతాయి. పంటకాలం రెండేళ్లు. మొక్కకు 250 గ్రాముల వేర్లు వస్తాయి. పదేళ్ల వరకు పంట ఉంటుంది. వేర్లు రెండు మీటర్ల వరకు విస్తరిస్తాయి.
నన్నారిని ఏక పంటగా కాకుండా పండ్ల తోటల మధ్య అంతర పంటగా వేసుకుంటే అధనపు ఆదాయం పొందవచ్చు.
‘‘ మొక్కలు నాటిన రెండేళ్ల తరువాత వేర్లు తయారవుతాయి. ఎకరాకు రూ. 9,60,000 ఆదాయం వస్తుంది. డాబర్ ఆయుర్వేధ కంపెనీ, ఏ.పి.గిరిజన కార్పొరేషన్ సంస్ధలు కిలో రూ.350 నుండి 500 వరకు కొంటున్నారు. చెంచులక్ష్మి రైతు ఉత్పత్తిదారుల సంఘం ద్వారా అమ్మకాలు చేస్తున్నాం.’’ అంటారు నన్నారి నర్సరీ నిర్వహిస్తున్న శీలం చెంచమ్మ,నల్లు రవణమ్మ.
భూమి అడుగున బ్యాంక్‌లు
ఈ చెట్లు పైకి ఏపుగా పెరగవు. భూమిపై తీగలా పాకుతాయి. తీగ నుంచే భూమిలోకి వేర్లు వెళతాయి. ఈ వేర్లను అనుభవమున్న వారు చాకచక్యంగా కట్ చేస్తారు. పచ్చిగా వున్నప్పుడే కాదు ఎండినా కూడా సువాసన తగ్గదు. వాసనను బట్టి ఈ చెట్లను గుర్తిస్తారు. వేర్లు కట్ చేస్తే కొన్ని రోజులకే మళ్లీ పుట్టి భూమిలోపలికి చొచ్చుకెళతాయి. మిగతా పంటలతో పోలిస్తే ఈ పంటలో ఓ వైవిధ్యం ఉంది. ఈ పంట దిగుబడిని దాచుకోవడానికి కోల్డ్‌స్టోరేజీలు అవసరం లేదు. ఒకేసారి వేర్లు తీసి కొనుగోలుదారుల కోసం ఎదురు చూడక్కర్లేదు. రైతులకు డబ్బులు అవసరం ఉన్నపుడు మాత్రమే కొంత మేర తవ్వి తీసి అమ్ముకుంటారు, మిగతా వేర్లు భూమిలోనే పెరుగుతుంటాయి. ఈ పద్ధతికి ‘రూట్స్ బ్యాంక్’అనే పేరుని కోవెల్ ఫౌండేషన్ పెట్టింది. ఈ రైతులు కూడా అలాగే పిలుస్తారు.
అడవుల్లో తిరిగే శ్రమ తగ్గింది!!
‘‘ రెండు ఎకరాల మామిడి తోటలో అంతరపంటగా 8 వేల నన్నారి మొక్కలు నాటాను. నీమాస్త్రం పారించి,జీవామృతం పిచికారీ చేశాను. వేర్లు బాగా పెరిగి, 8వందల కిలోలు వచ్చాయి, కిలో రూ.400కు అమ్మగా రూ. 3,20,000 ఆదాయం పొందాను. ఆగిపోయిన చిన్న కొడుకు చదువు మొదలైంది. ఇద్దరు కూతుర్ల వివాహాలు చేశాను.’’ అంటాడు, తను పెంచిన నన్నారి వేర్లను చూపిస్తూ , డి.వాని పెంటకు చెందిన పులి శంకరయ్య.
బలంగ పెరిగిన నన్నారి వేర్లు, రైతు పులి శంకరయ్య
గతంలో ఈ రైతు వేరు శనగ,జొన్న వంటి ఆరుతడి పంటలు వేశాడు. కానీ తగిన ఆదాయం వచ్చేది కాదు.దాంతో అడవుల్లో వేర్ల కోసం తిరిగే వాడు. అవి కూడా అంతరించిపోయే పరిస్ధితి రావడంతో ‘కోవెల్ ’ సాయంతో నేడు తన భూమిలోనే నన్నారి సాగుచేస్తు ఆర్ధికంగా స్ధిరపడ్డాడు. ఈ రైతును స్ఫూర్తిగా తీసుకొని మిగతా రైతులు ముందుకు వచ్చారు.
ఆరోగ్యానికి సంజీవని
నన్నారి షర్భత్‌ని శాస్త్రీయంగా తయారు చేస్తున్న ఏకైక ప్లాంట్‌ని చిత్తూరులో ఏపీ గిరిజన కార్పొరేసన్ నిర్వహిస్తోంది. ఇక్కడ ఏడాదికి 1,20,000 బాటిల్స్(750 ఎం.ఎల్ ) తయారవుతున్నాయి. 800మంది గిరిజనుల ద్వారా అడవుల్లో సేకరించిన నన్నారిని ఇక్కడ ప్రాసెస్ చేసి , ల్యాబ్‌లో పరీక్షలు చేసిన తరువాత మార్కెట్ చేస్తున్నారు. ఈ వేర్లుకు అనేక ఔషధ గుణాలతో పాటు, నిలువ ధాన్యంలోని పురుగుపుట్రను దరిచేరనివ్వని క్రిమిసంహారక గుణాలూ ఉన్నాయి.
నన్నారి ఛాయ్
నన్నారితో షర్బత్, టీ తయారు చేసే విధానం ఇలా వివిరిస్తున్నారు ,డి.వాని పెంటకు చెందిన చెంచు మహిళలు.
నన్నారి వేర్లను శుభ్రం చేసి ఎండబెడుతున్న మహిళలు
1, ఒక కప్పు నన్నారీ షర్బత్‌కు నాలుగు కప్పుల చల్లని నీటిని కలపాలి. రుచి కి
నిమ్మకాయి పిండుకోవాలి. షర్బత్ తయారు.
2, నన్నారి వేర్లు ఆయుర్వేద షాపులలో దొరుకుతాయి.
అవి తెచ్చుకుని ఆరబెట్టి, పొడి చేసి గాలి తగలని డబ్బాలో పెట్టుకోవాలి.
నీరు మరిగించి, అందులో నన్నారి పొడి వేసి నాలుగు నిమిషాలు వుంచి ఆ తరువాత వడకట్టి తేనె లేక బెల్లం కోరు కలుపుకుంటే టీ తయారు.
ప్లాంట్‌లో తయారు చేసిన నన్నారి పానీయాన్ని బాట్లింగ్ చేస్తున్న కార్మికులు
‘‘ నన్నారిని ఆయుర్వేద ఔషధాలలో విరివిగా వాడుతున్నారు. దీనిలో కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి ఉంది. రక్తాన్ని శుద్ది పరుస్తుంది. మూత్రనాళవ్యాధులను నయం చేస్తుంది.మలబద్దకాన్ని నివారిస్తుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది.’’ అని గిరిజన కార్పొరేషన్ ప్రతినిధులు అంటున్నారు. దీనిలో రోగనిరోధక శక్తిని పెంచే ఔషధ గుణాలు అధికం. బీపీని తగ్గిస్తుంది. మొలలు వ్యాధుల నుంచి ఉపశమనం కలుగజేస్తుంది. అని ఆయుర్వేద నిపుణులంటున్నారు.
అడవిలో పెరిగే మొక్క ఎందరికో జీవనోపాధిగా మారింది.