ఐసిసి టి-20 మెన్స్ వరల్డ్ కప్ అప్ డేట్
x

ఐసిసి టి-20 మెన్స్ వరల్డ్ కప్ అప్ డేట్

వెస్టిండీస్,అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టి20 ప్రపంచ కప్ మొదటిసారి అమెరికాలో జరగడం ఒక విశేషం. మరిన్ని విశేషాలివే.


-సలీమ్ బాషా

క్రికెట్ ప్రేక్షకాభిమానులను, ప్రేమికులను నిరాశపరిచి 2023 వెళ్ళిపోయింది. వన్డే ప్రపంచ కప్ ఫైనల్ లో భారత్ ఓడిపోయింది. మరో ప్రపంచ కప్(2027) కోసం అభిమానులు నాలుగేళ్లు వేచి చూడాలి. అయితే క్రికెట్ ప్రేక్షక అభిమానులను ప్రేమికులను మరోసారి ఉత్సాహపరచడానికి మరో ఆరు నెలల్లో మరొక ప్రపంచ కప్ రాబోతుంది. అదే పురుషుల తొమ్మిదవ టి20 ప్రపంచ కప్. దాదాపు నెల రోజులు పాటు జరిగే ఈ ప్రపంచ కప్ అభిమానులకు ప్రేక్షకులకు పండగ లాంటిది. ఈ టి20 ప్రపంచ కప్ 2024 జూన్ ఒకటో తారీకు నుంచి 29వ తారీకు వరకు అందరినీ అలరించబోతోంది.. ఎనిమిది సార్లు జరిగిన ఈ కప్ ను వెస్టిండీస్, ఇంగ్లాండ్ మాత్రమే రెండుసార్లు సాధించాయి.భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ ఒకసారి విజేతగా నిలిచాయి.

వెస్టిండీస్,అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ 9వ టి20 ఈ ప్రపంచకప్ లో కొన్ని విశేషాలు ఉన్నాయి. అందులో మొదటిది ఈ టి20 ప్రపంచ కప్ మొదటిసారి అమెరికాలో జరగడం ఒక విశేషం అయితే, మొదటిసారి అమెరికా ఈ టోర్నమెంట్లో పాల్గొనడం మరో విశేషం. మొత్తం తొమ్మిది క్రికెట్ స్టేడియంల లో ఈ టోర్నమెంట్ నిర్వహించబోతున్నారు. అందులో మూడు స్టేడియంలో అమెరికాలో ఉన్నాయి. అంతే కాకుండా మొదటిసారి 20 జట్లు పాల్గొనబోతున్న టి20 ప్రపంచకప్ ఇదే. మొదటిసారి అమెరికా తో పాటు కెనడా, ఉగాండా,జట్లు ఈ టోర్నమెంట్లో ఆడడానికి అర్హత పొందాయి. 2024 జూన్ 9వ తారీకు ఆదివారం ప్రేక్షకులు, టీవీ వీక్షకులు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ను న్యూయార్క్ లో చూడబోతున్నారు!

నిబంధనలో కొన్ని మార్పులతో నెలపాటు ప్రేక్షకులను అలరించబోతున్న ఈ టి20 ప్రపంచ కప్, విశేషాలు, గతంలో ఈ కప్పు గురించిన కొన్ని విశేషాలు ఒకసారి చూద్దాం.

గత ప్రపంచ కప్ (2022) 16 జట్లతో నిర్వహించిన ఐసీసీ, ఈసారి 20 జట్లతో ఈ ప్రపంచకప్ ను నిర్వహించబోతుంది. ఆ 20 జట్లు ఇవే.

గత ప్రపంచ కప్ లో నుంచి మొదటి 8 స్థానాల్లో నిలిచిన జట్లు:

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక

2. ఈ తొమ్మిదో ప్రపంచ కప్ కు ఆతిథ్యం ఇస్తున్న రెండు జట్లు

అమెరికా, వెస్టిండీస్

3. ఐసీసీ టీ20 పురుషుల జట్టు ర్యాంకింగ్ ద్వారా ఎంపికైన రెండు జట్లు

ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్

4.ప్రాంతీయంగా జరిగిన అర్హత పోటీలలో విజేతలుగా నిలిచిన మొత్తం 8 జట్లు. యూరోప్ నుండి అర్హత సాధించిన ఐర్లాండ్, స్కాట్లాండ్;

తూర్పు ఆసియా పసిఫిక్ నుండి అర్హత సాధించిన పాపువా న్యూ గిని; అమెరికాలో జరిగిన పోటీలో అర్హత సాధించిన కెనడా, ఆసియాలో జరిగిన అర్హత పోటీలలో విజయం సాధించిన నేపాల్,

ఒమన్; ఆఫ్రికాలో జరిగిన పోటీలలో అర్హత సాధించిన నమీబియా, ఉగాండా

ఈ ప్రపంచకప్ ఫార్మాట్


ఈ ప్రపంచకప్ లో ఆడడానికి అర్హత సాధించిన 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి. ఆయా గ్రూపు లో మొదటి రెండు స్థానాల్లో వచ్చిన జట్లు సూపర్ 8 రౌండ్ లో అడుగు పెడతాయి. సూపర్ 8 రౌండ్ లో చేరిన 8 జట్లను మళ్లీ రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఇది నాకౌట్ దశ. ఈ నాకౌట్ దశలో రెండు గ్రూపులలో నుంచి మొదటి రెండు స్థానాల్లో వచ్చిన 4 జట్లు, రెండు సెమీఫైనల్స్ ఆడతాయి. సెమీఫైనల్స్ లో విజయం సాధించిన రెండు జట్లు ఫైనల్స్ ఆడతాయి.

టి20 ప్రపంచ కప్ లో ఇంతవరకు భారత జట్టు ప్రదర్శన

టి20 ప్రపంచ కప్ లో భారత్ ప్రదర్శన నిరాశ జనకంగా ఉంది. భారత జట్టు గత ఎనిమిది ప్రపంచ కప్ లలో రెండుసార్లు మాత్రమే ఫైనల్ కి వచ్చింది. 2007 లో ఒకసారి పాకిస్తాన్ పై గెలిచింది. 2 014 ఫైనల్స్ లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. మరో రెండు సార్లు సెమీఫైనల్ దశలోనే నిష్క్రమించింది. T20 ప్రపంచ కప్ లో భారత జట్టు ప్రదర్శన అంత గొప్పగా లేకపోవడం ప్రేక్షకులను, బీసీసీఐ ని కూడా నిరాశపరిచింది. అయితే ఈసారి టి20 ప్రపంచ కప్ భారత్ గెలుస్తుంది అన్న ఆశ మరోసారి ప్రేక్షకుల్లో కలగడం సహజం. అదే విధంగా బీసీసీఐ కూడా కొన్ని చర్యలు చేపట్టబోతుంది. ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టింది కూడా. 2022 టి20 వరల్డ్ కప్ లో భారత్ నిరాశ జనక ప్రదర్శన మీద బీసీసీఐ చర్చించింది. ప్రపంచకప్ తర్వాత చేతన్ శర్మ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీని బీసీసీఐ రద్దు చేసింది. కొత్త కమిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది.

మితిమీరిన క్రికెట్ వల్ల ఆటగాళ్లలో కొంత అలసట ఉండడం కూడా t20 2022 భారత్ ప్రదర్శనకు ఒక కారణంగా భావిస్తున్నారు. ప్రపంచ వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత్ ఆస్ట్రేలియాతో t20 వన్డే సిరీస్ లో యువ ఆటగాళ్లు తమ సత్తాను చాటుకున్నారు. అందుకే ఈ టి20 వరల్డ్ కప్ ఆడే భారత జట్టును యువరక్తం తో నింపాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకు సన్నద్ధం చేయడానికి దక్షిణ ఆఫ్రికా టి20 వన్డే సిరీస్ కొంత ఉపయోగపడవచ్చు. భారతదేశపు క్రికెట్ షెడ్యూల్ చూస్తే కొన్ని టి20 వన్డే మ్యాచ్ లు మాత్రమే ఉన్నాయి. . ఆ తర్వాత వచ్చే ఐపీఎల్ వన్డే మ్యాచులు భారత జట్టుకి ప్రాక్టీస్ ఉపయోగపడతాయి అని భావించవచ్చు.

టెస్ట్ మ్యాచుల పై ప్రేక్షకులు ఆసక్తి చూపకపోవడం వల్ల వన్డే మ్యాచ్ లు వచ్చాయి, వాటిని తలదన్నే విధంగా, సులువుగా 20 ఓవర్లలోనే ఫలితం ఇచ్చే పొట్టి క్రికెట్ ఈ మధ్య ప్రాచుర్యం లోకి వచ్చింది. అందుకే ప్రపంచ టి20 కప్ మీద ఇప్పటినుంచి అంచనాలు మొదలయ్యాయి. అంతకన్నా ముందు వచ్చే ఐపిఎల్, ఆ తర్వాత వచ్చే టి20 క్రికెట్ ప్రపంచ కప్ ప్రేక్షకులకు కనువిందు చేసే అవకాశం ఉంది.



Read More
Next Story