డాబా! (Sunday Poem)
ఇల్లు సీక్వెల్ 18: ఇంటి డాబా నానార్థాలను విడమర్చి చెప్పిన గీతాంజలి కవిత
నీకు తెలుసో లేదో
డాబా అంటే ఆకాశం వైపుకి తెరుచుకున్న ఇల్లు!
డాబా మొత్తం ఇంటిని మోసే మేస్త్రీ.
డాబా పొద్దున్నే నీ కాఫీ కప్పులో కవిత్వాన్ని నింపుతుంది.
ఆకాశానికి ఎర్ర రంగు పూసి అస్తమిస్తున్న సూర్యుడ్ని చూపిస్తుంది.
డాబా సాయంత్రాన్ని తోసేస్తుంది.
రాత్రిని మెల్లిగా పిలుస్తుంది.
ఆకాశానికి నక్షత్రాలను అద్దుతుంది.
చలికాలపు ఉదయం మబ్బుల్ని తప్పించుకుని వచ్చిన
సూర్యుణ్ణి డాబా అ మాంతంగా కౌగలించుకుని చలి కాగుతుంది.
సాయంత్రం అయితే చాలు..
మెట్లు నిన్ను డాబాపైకి లాక్కెళతాయి.
చందమామని నీ చేతుల్లోకి ఇచ్చి
ప్రేమలేఖనో వియోగపు వేదననో రాసుకోమంటాయి.
****
నీ ఇంటి కష్టాలను డాబా ఎంతో ఓరిమితో వింటుంది.
వర్షాకాలం లో డాబా సముద్రవుతుంది..
పిల్లలు వొదిలిన కాగితపు పడవలతో ఆడుకుంటుంది.
శీతాకాలంలో మంచు మైదానం అవుతుంది.
ఇంట్లో ముడుక్కుని పడుకున్న నిన్ను డాబా కేకేసి పిలుస్తుంది.
డాబా నీకు ఆకాశాన్ని,
అడవిని చెరువుని పశువులను చూపిస్తుంది.
మనిషి మొఖం తో తిరుగుతున్న
పశురాలను చూపిస్తుంది
డాబా నీకు లోకం తమాషాని చూపిస్తుంది.
***
ఇల్లు వేసే వేషాలను పైకప్పుగా మారి విస్తుపోతూ చూస్తుంది.
డాబా కవికి భూమ్యాకాశాల వస్తువునిస్తుంది.
డాబా నీకు తోటను.. పెరడుని చూపిస్తుంది
అక్కడ ఇంటి ముల్లు గుచ్చుకుని
దుఖిస్తున్న ఆమెలను చూపిస్తుంది.
ఇంటి ఇరుకులో
ఆ స్త్రీల దుఖాన్ని..గోడలు ,తలుపులు మూసేస్తాయి.
వాళ్ళకి ముసుగులు తొడిగి దుఃఖ మొఖాలను దాచేస్తాయి.
వాళ్ళు అందుకే డాబా పైకి వస్తారు.
గుండెల్లోని దుఃఖాన్ని డాబా మీద తోడేస్తారు.
ఆ తరువాత
నవ్వు ముసుగు వేసుకొని ఇంట్లోకి వెళ్లిపోతుంటారు.
డాబా సాక్ష్యంగా వాళ్ళది అనాది దుఖం.
***
వేసవిలో డాబా మెత్తటి పరుపై నిద్రపుచ్చుతుంది..
నిద్ర రాకపోతే చుక్కల్ని లెక్కపెట్టమంటుంది.
పేదరాసి పెద్దమ్మలా కథలు చెబుతుంది.
కొత్త జంటలకు డాబా పట్టు పరువు అవుతుంది.
*****
గోడలు కట్టని ఖాళీ గది డాబా.
వలస పక్షుల విడిది డాబా.
డాబా నీకు ఖాళీ ఆకాశాన్ని చూపిస్తుంది.
మబ్బులు ఏడవడాన్ని చూపిస్తుంది.
డాబా నీకు చంద్రుణ్ణి పలకలా చేసి ఇస్తుంది.
నీ దుఃఖాన్ని రాసుకోమని.
******
నిన్ను నువ్వు ప్రేమించుకోవడానికి..
సమీక్షించు కోవడానికి డాబా నీకు ఏకాంతాన్ని ఇస్తుంది.
నమ్మక ద్రోహుల్ని మర్చిపోవడానికి...
తనని ప్రేమించని మనుషులను క్షమించడానికి..
*****
ఎవరినో జ్ఞాపకం చేస్తున్నట్లు
డాబా పిట్ట గోడల మీద పక్షుల సంగీతానికి..
రాలి పడుతున్న వర్షపు నీటి తీగలు నృత్యం చేస్తాయి.
డాబా అప్పుడు మనిషై పోయి తానూ నాట్యం చేస్తుంది.
ఆమెల కన్నీరో వర్షపు నీరో తెలీని సందిగ్ధంలో
డాబా సిగ్గుతో తల వంచుకుంటుంది.
***
మనుషుల ఫలించని ప్రేమతో దుఃఖించడానికి
డాబా ఒక దుఃఖ మహల్ అయిపోతుంది.
డాబా మమకారంతో వారిని ఓదారుస్తుంది.
ఆమెల ఒంటిమీద గాయాలకు వెన్నెల పూతని రాస్తుంది.
****
ఇంట్లో ఏడవలేని నాన్న
పిల్లవాడి పరీక్ష ఫీజు కట్టలేని నాన్న...
డాబా మీద కుళ్లి కుళ్లి ఏడుస్తాడు
****
ఇంట్లోంచి ఒక్కక్కరుగా వెళ్లి పోతుంటే
డాబా వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది.
ఇల్లు చేసే రాజకీయాలలో
ఇల్లు కట్టిన వృద్ధ అమ్మా నాన్నలే..
ముందుగా మాయం అవుతారు
డాబా వాళ్ళమీద బెంగ పెట్టుకుంటుంది..కన్నీరు కారుస్తుంది.
పుట్టింటికి వచ్చిన ఆడపిల్ల
దుఃఖపు రహస్యాలను డాబాకె చెప్పుకుంటుంది.
****
చాలా సార్లు డాబా పిల్లల ఆటలకు మైదానం అవుతుంది.
పిల్లల కేరింతలతో డాబా పులకించి పోతుంది.
డాబా మీద తీరిగ్గా కూర్చుని పూలల్లే
నానమ్మ కనపడక డాబా దిగులు పడిపోతుంది.
మనుషులు మాయమవ్వడాన్ని
డాబా సహించలేక పోతుంది.
డాబా మీదకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళని
కుదిపి కుదిపి అడుగుతుంది నిల దీస్తుంది.
చంటి పాపలకి చందమామని చూపించి
గోరు ముధ్ధలు తినిపించే అమ్మమ్మ ఏమైంది ఎటు పోయింది ?
డాబాకి ఎవరూ సమాధానం చెప్పరు.
ఇంట్లోంచి వెల్లగొట్ట బడ్డ మనుషులు
చచ్చి పోయిన మనుషులు ఎటు పోతారో డాబాకి తెలియదు.
***
డాబా మీదకి వచ్చిన మనుషులకు
డాబా రంగస్థలంగా మారిపోతుంది
ఏ వేషాలు వేసుకుంటా రో వేసుకోమని.
ఇంట్లో తమకంటూ ఒక్క గది కూడా లేని ఆమెలకి
డాబా దుఃఖ గది గా మారిపోయి
తనితీరా ఏడ్వనిస్తుంది.
మనుషుల దుఃఖ భారాన్ని మోసే విడిది డాబా !
***
డాబా కి కూడా దుఃఖాలున్నాయి.
వెన్నెల రాత్రుళ్ళు అందని చందమామని చూస్తూ
వల వల ఏడుస్తుంది డాబా !
డాబా రోజూ ఆకాసంతో ముచ్చట్లు చెబుతుంది.
గుండెల్లో మంటను ఆర్పేయడానికి
వెన్నెల ను తాగుతుంది డాబా.
డాబా విరహ గీతాలు పాడే ఒక హార్మోనియం.
డాబా కవిత్వాన్ని రాసే కవయత్రి.
డాబా ఒక నిలువెత్తు మనిషి.
డాబా ఒక ఖాళీ పుస్తకం .
కవిత్వం,విరహం,పాట ,దుఖం
కలగలిసిన ఒక వేదిక డాబా.
ప్రేమలో పడ్డ వాళ్లకి
కాగితం,కలం ఇచ్చి ప్రేమ లేఖలు రాయిస్తుంది డాబా.
అందని ప్రేయసి జ్ఞాపకం వస్తూన్నపుడు
అతను తలుచుకుని తలుచుకుని ఏడవడానికి డాబా ఒక రహస్య స్థలం.
****
డాబా మనుషుల కలలు ఖాళీ అయిపోవడాన్ని..
మనుషులు ఖాళీ అవడాన్ని చూపిస్తుంది !
దుఃఖమైనా ఆనందమైనా ప్రేమైనా డాబా ఎద మీదే !
****
ఇప్పుడు డాబా మాయం అయిపోయింది
మనుషులు పూర్తిగా డబ్బులుగా మారిపోయాక...
డాబా మీద ప్రేమ పోయాక...
డాబా గుండెల మీద మరొక ఇల్లు లేస్తుంది.
వెక్కెక్కి ఏడ్చే డాబా దుఃఖం ఎవరికీ వినపడదు.
తనని గునపాలతో కుళ్ల పొడిచాక
చెదురు మదురైపోయింది డాబా.
చంద్రుణ్ణి,వెన్నెలను,ఆకాశాన్ని
సూర్యోదయాలను ఇచ్చిన డాబాని ప్రేమించలేని వాళ్ళు..
ఎండా వానా,తుఫాన్ల నుంచి మనుషుల్ని రక్షించిన డాబాని...
ఇంటిని ఎలా ప్రేమిస్తారు ?
వాళ్ళకి డాబా అంటే రియల్ ఎస్టేట్ మాత్రమే !
కానీ ..డాబా ఎంత స్వచ్ఛంగా ప్రేమించింది
ఈ మనుషులను ?
***
డాబా వాళ్ళ ఏకాంత స్థలం...
డాబా లేకపోతే
ఇంట్లోని మనుషులు
కరువు తీరా దుఃఖించే గదే పోయినట్లు కాదా !
ఆ కాసింత జాగా పోతుంది.
బెడ్రూంలోనో బాత్రూమ్ లోనో పెరడులోనో
దాక్కుని.. దాక్కుని దుఃఖించాలి.
డాబా ఎదని కుళ్లబొడిచి కట్టిన అంతరాల్లో
మనుషులకు ఆకాశం నేలా రెండూ దొరకవు.
తమని తాము బంధించుకునే జైలు గదులవుతాయి.
పువ్వులు పూయని ఇళ్లవుతాయి.
****
ఆమెకు డాబా కావాలి
డాబానే ఆమె నిజమైన ఇల్లు..
మనసు పాడే పాటలని ఆమే డాబా కే వినిపిస్తుంది మరి !
ఇష్టమైన ఏకాంతంలో తనలో తాను మాట్లాడుకోవడానికి..
ఆకాశానికి,నక్షత్రాలకి,మబ్బులకి తన మనోవేదన నివేదించడానికి,
స్వేచ్ఛగా శ్వాస తీసుకోవడానికి..
నవ్వు కోవడానికి చందమామని హత్తుకొని పడుకోవడానికి
ఇష్టమైన పాట గున్ గునాయించడానికి..
మరిచిపోయాననుకున్న ప్రేమని యాద్ చేసుకోవడానికి
ఆమెకు డాబా కావాలి.
అవును.... డాబాలున్నది అందుకే..
మనుషుల రంగుల్ని కడుక్కోడానికే..
డాబాలను మాయం చేయకండిరా !!