
డిసెంబర్! నువ్వొక అందమైన చలివి!
నేటి మేటి కవిత: గీతాంజలి
డిసెంబర్!
నువ్వు వెళ్ళిపోయాననుకుంటున్నావు !
కానీ జనవరి కౌగిలిలో చలికి వెచ్చగా
ముడుచుకుని ఉన్నావు చూడు!
కావలిస్తే మంచం మీద
కుప్పగా పడి ఉన్న రజాయిని అడుగు!
నువ్వు ఒంటరివి కావు
చూడెలా జనవరి నిన్ను అక్కువ చేర్చుకుందో?
*
పదకొండు నెలల బరువును మోసిన డిసెంబర్,
ఇక మోయలేక వణికి పోతున్నది.
ముగిసి పోతూ,పోతూ
గ్లాసులో మిగిలిపోయిన
చివరి ద్రాక్ష సారాయి గుక్కలా ఒంటరై ,
ప్రియురాలి అధర అన్వేషణలో మునిగిపోయింది!
*
డిసెంబర్!
నువ్వొక తాగకుండా వదిలేసిన మధు పాత్రవి!
చాలాసార్లు ఖాళీ అయిపోయిన పాత్రవి కూడా!
నీ ముందున్న పదకొండు నెలలన్నీ
తమ కాలపు కథలని నీ వొళ్ళోకి జారవిడుస్తాయి.
కలలూ,కొన్ని మోహ రాగాలూ, కన్నీళ్ళు,విన్నపాలతో సహా!
*
సంవత్సరాంత నిరీక్షణ తర్వాత కూడా
ప్రేమ దక్కని ప్రేమికులు
తమ వియోగ విషాద రాగాల్ని
డిసెంబర్ రాత్రుళ్లలోకి
రహస్య దుఃఖంగా వొంపుతారు.
*
చిక్కని,భయం గొలిపే శీతల రాత్రుళ్లల్లో
అన్నం దొరకని మనుషులు,
దుప్పట్లు లేని వాళ్ళు
ఫుట్ పాత్ ల మీద మంచు తడిసిన
ఎండుటాకుల్లా ముడుచుకు పోతారు.
*
డిసెంబర్!
కొన్ని ఎలాంటి రాత్రులు నీవి?
చూడలేనివీ,తట్టుకోలేనివీఅయిన రాత్రులు?
ఆకలి తీరని పసి పాప గుక్క పట్టి
ఏడ్చే లాంటి రాత్రులు?
కొంత మంది స్త్రీలు,
విటుల వాంఛల లావాల్లో ఉడికుడికి పోయి,
వాతలు తేలిన దేహాలతో ,
మనసులో రేగిన మంటలను
నీ శీతల స్పర్శ కి అప్ప చెప్పే కర్కశ రాత్రులు!
**
డిసెంబర్!
ఎంతకీ ముగియని గాడాంధకారం
కమ్ముతున్న రాత్రిలో.,
రోడ్డు పక్కని బండి మీద సల,సలా కాగుతున్న
ఇలాయిచీ పరిమళాల ఇరానీ చాయ్ పొగల్ని,
నిర్లక్ష్యగానో , విసుగ్గానో
గాలిలో విసిరేస్తున్న విషాదంలాంటి దానివి నువ్వు !
స్టూల్ పైన కలత బారిన మనసుతో
కూర్చున్న ఒంటరి కవి ఒకడు,
ఒక్కో చాయ్ గుక్కకీ ఒక్కో కవితా పాదాన్ని
అక్కడికక్కడే రాసేస్తుంటాడు !
నువ్వూ, నీలోని చలీ,
పొగలు కక్కే చాయ్ రాయిస్తారు కవితో!
చాయ్ వాలా కూడా కవి అయిపోతాడా క్షణాల్లో,
సన్నని వెన్నెల పరుచుకున్న పలువరుస నవ్వుతో !
అప్పుడిక కవిత్వమంతా చాయ్ పరిమళమే!
*
డిసెంబర్!
ఎంత అందమైన చలివి నువ్వు?
నీ రాత్రుళ్లలో అసలు నువ్వేమైపోతావో తెలుసా నీకు?
మంచు స్పర్శ నిండిన
శీతల గాలిలో తేలిపోయే వెన్నెలా,
నైట్ క్వీన్ సువాసనలు నిండిన అత్తరు వైపోతావు!
వీధుల్లో అటూ ఇటూ తిరిగే స్త్రీల జడల్లో
గాలికి కంపించే మల్లెల సుగంధం,
కొన్ని చోట్ల మత్తెక్కిన మనుషులు తాగుతూ,తూలుతూ
నేలను వొంపే మధువూ,
గాలిలోకి పొగరుగా వదిలే సిగరెట్టు పొగా
కలగలిసిన నిర్లక్ష్యపు రాత్రి వాసనలతో,
నీలోంచి వచ్చే,పోయే మనుషులను
అదాటున కమ్మేసి వాళ్లలో
మత్తు కలలేవో రేపుతావు!
*
రోజూ మెల్లిగా సాయంత్రంలోకి దిగే కొద్దీ
దిగులు పుట్టిస్తూ., రాత్రిలోకి కళ్ళల్లోకి
రాని నిద్రలా కలవరపరుస్తావు.
ఎక్కడి నుంచో
"హుయీ షామ్ ఉన్కీ ఖయాల్ ఆ గయా" అనే రఫీ పాటని
సమాధిలో ఉన్న ప్రేయసి కూడా
లేచి పరిగెత్తుకొచ్చేలా వినిపిస్తావు!
*
డిసెంబర్!
నువ్వు మంచువీ, నిప్పు వీ కూడా!
చల్ల బరుస్తూనే దహించేస్తావు!
నిన్ను నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోయిన
వేసవిని, వర్ష ఋతువునీ
మరిచి పోతున్నా అనుకుంటూనే,
గుర్తుకు చేసుకుంటూ ఉండే వియోగ దుఃఖితవు!
*
డిసెంబర్!
జనవరిలోకి ఆశ్రయం తీసుకున్న
నువ్వొక అసంపూర్ణ మోహ స్వప్నానివి!
ఒక పని చెయ్యి!
నువ్విక నిదురపో !
నిన్నొక పదకొండు నెలల సుదీర్ఘ సుషుప్తిలోకి పంపి,
జనవరి నీ నిద్రలోకి జరిగి,
నీ కళ్లేసుకుని కలలు కంటుంది!
*
నీనుంచి వీడిన కాలానికి ,
నీ గజళ్ళ తో,పాటలతో,కవితలతో సహా అన్నీ ,
జనవరికి ఇచ్చేసి , ఇక అల్విదా చెప్పు !
కొత్త కాలపు కనురెప్పల కింద కొత్త కలలతో జనవరి
కనులు తెరుస్తుంది!
మళ్ళీ నువ్వు నిదుర లేచే దాకా ,
తలుపు తట్టే దాకా!

