
తెలంగాణలోని కవాల్ అభయారణ్యంలో మిణుకుమిణుకుమంటూ మెరుస్తున్న మిణుగురు పురుగులు (ఫొటోలు : ఫైర్‌ఫ్లైస్ ఆసియన్ అసోసియేషన్ సౌజన్యంతో)
తెలంగాణలో అంతరిస్తున్న ‘వెలుతురు పూలు’
చీకటికి తళుకులు అద్దే మిణుగురు పురుగులు మాయమవడం పర్యావరణానికి మంచి సూచన కాదంటున్న నిపుణులు
రాత్రి చీకటిని చీల్చుకుంటూ భూమిపై చుక్కలు దిగివచ్చాయా అన్నట్లుగా మిణుకు మిణుకుమంటూ మెరిసే మిణుగురు పురుగులు(Fireflies/Glow-worms) ఒకప్పుడు మన కనువిందు చేస్తాయి.
రాత్రి పూట గ్రామాల పొలాల్లోకి వెళితే, చెట్లకు వెలుతురు పూలు పూసినట్లు కనిపించే దృశ్యం గొప్పగా ఉంటుంది. వేల సంఖ్యలో చెట్ల మీద వాలిని మిణుగుడు పురుగులు ఈ వెలుతురు పూల భ్రమ కలిగిస్తాయి.
కానీ నేడు అదే వెలుగు క్రమంగా మసకబారుతోంది. పర్యావరణ ఆరోగ్యానికి నిదర్శనాలైన ఈ చిన్న జీవులు మన నిర్లక్ష్యానికి బలై మౌనంగా అంతరించిపోతున్నాయి. ఈ పురుగు శాస్త్రీయ నామం ఫోటూరిస్ టూసీ క్రెసెన్స్ (Photuris lucicrescens).
పంటలకు నష్టం కలిగించే కీటకాలను తినే మిణుగురు పురుగులు పర్యావరణానికి మేలు చేకూరుస్తాయి. పర్యావరణ సమతౌల్యంతోపాటు జీవవైవిధ్యం ఉన్న చోట ఈ మిరుమిట్లు గొలిపే పురుగులు దర్శనమిస్తుంటాయి.పర్యావరణ ఆరోగ్యానికి కీలకమైన బయోఇండికేటర్లుగా ఇవి పనిచేస్తున్నాయి.
తెలంగాణలో ఎక్కడ ఉన్నాయంటే...
తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్, కవాల్ పులుల అభయారణ్యాలతోపాటు దండేపల్లి, పెద్దాపూర్, కిషన్ బాగ్ ప్రాంతాల్లో ఈ మిణుగురు పురుగులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించిన కాంతులు వెదజల్లే పురుగులు నేడు తగ్గుతూ అంతర్ధానమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మిణుగురు పురుగుల పరిరక్షణ కోసం ఫైర్‌ఫ్లై ఆసియన్ అసోసియేషన్ (FAA),సస్టెనబుల్ వైల్డ్ లైఫ్ బయోడైవర్శిటీ కన్జర్వేషన్ అసోసియేషన్ (SWBCA) అంతర్జాతీయ సంస్థలతో కలిసి పరిశోధనలు చేస్తుంది. 2027వ సంవత్సరంలో మిణుగురు పురుగుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్ నగరంలో నిర్వహించాలని నిర్ణయించారు.దీనిలో భాగంగా జంతుశాస్త్ర విభాగంలో అత్యంత నిష్ణాతులైన పీహెచ్‌డీ స్కాలర్లు తెలంగాణలో మిణుగురు పురుగుల పరిరక్షణ కోసం విశేష కృషి చేస్తున్నారు.
మాయమవుతున్న మిణుగురు పురుగులు
ఎల్‌ఈడీ కృత్రిమ లైటింగ్,పొలాల్లో పురుగుమందుల అధిక వినియోగం, అడవులు అంతరించి పోవడం వల్ల మిణుగురు పురుగుల సంఖ్య తగ్గడానికి కారణాలుగా పర్యావరణ వేత్తలు గుర్తించారు.తెలంగాణలోని పట్టణాలు, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో మిణుగురు పురుగులు అదృశ్యం కావడానికి కాంతి కాలుష్యం వంటి ముప్పు అని పర్యావరణవేత్తలు గుర్తించారు. దేశంలోని పలు విశ్వవిద్యాలయాల్లో జంతుశాస్త్ర విభాగానికి చెందిన పీహెచ్‌డీ స్కాలర్లు మిణుగురు పురుగుల జీవన విధానం, నివాస ప్రాంతాలు, వీటి మనుగడకు ఎదురవుతున్న ముప్పులపై లోతైన అధ్యయనం చేస్తున్నారు.తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా,జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో మిణుగురు పురుగుల పరిరక్షణకు స్కాలర్లు, ఎన్జీఓ సంఘాల ప్రతినిధులు విశేష కృషి చేస్తున్నారు.మిణుగురు పురుగుల ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని అంచనా వేయవచ్చు. నీటిలో పెరిగే లార్వా ఆ నీరు కలుషితం అయితే వీటి సంఖ్య తగ్గుతుంది.కాలుష్యం, కాంతి లేని, ఎక్కువ కాంతి ఉన్న ప్రదేశాల్లో ఇవి జీవించలేవు.నాచు, నత్తలు, చిన్న పురుగులు, కీటకాలను తిని లార్వా దశ నుంచి ఎగిరే దశకు చేరాక ఇవి పుప్పొడిని, మకరందాన్ని తింటాయి.
కాంతి సంకేతాలు ఎలా వస్తాయంటే...
ఈ పురుగులు పొట్ట భాగం నుంచి కాంతిని ఉత్పత్తి చేస్తాయి. ఫైర్ ప్లైస్ శరీరంలో జరిగే బయోల్యూమినిసెన్స్ పురుగుల నుంచి కాంతిని విడుదల చేస్తుంది. ఇది శ్వాస తీసుకున్నపుడు రసాయనాలతో కలిసి కాంతిరూపంలో కనిపిస్తుంది. చీకటి పడగానే మగ పురుగులు ఎగురుతూ కాంతి సంకేతాలను పంపిస్తుంటాయి. ఈ కాంతి సంకేతాలను ఆడ పురుగులు గుర్తించి అదే పద్ధతిలో స్పందిస్తుంటాయి. చీకటిలో అవి ఒకదానికొకటి గుర్తించి కలుస్తుంటాయి. ఈ మెరుపు ఇతర జీవాల బారి నుంచి రక్షణగా ఉపయోగపడుతుంది.
మిణుగురు పురుగుల పరిరక్షణకు చర్యలు
మిణుగురు పురుగుల పరిరక్షణకు ఫైర్‌ఫ్లైస్ ఆసియన్ అసోసియేషన్ (FAA) ప్రతినిధి పర్వేజ్ ఖాన్ చర్యలు చేపట్టారు.కోల్ కత్తా విశ్వవిద్యాలయంలోని జంతుశాస్త్ర విభాగంలో నిష్ణాతుడైన పీహెచ్‌డీ స్కాలర్ మిణుగురు పురుగుల జీవనం, వీటి మనుగడపై రాయల్ ఎంటమోలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్, ఎంటమోలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికాతో కలిసి పనిచేస్తున్నారు. ఇతను ఫైర్‌ఫ్లై ఏసియన్ స్పెషలిస్ట్ గ్రూప్‌కు ప్రాంతీయ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.దేశవ్యాప్తంగా ఫైర్‌ఫ్లైస్ ఆసియన్ అసోసియేషన్ ప్రతినిధులు మిణుగురుల పరిరక్షణకు చర్యలు చేపట్టారు.
మొట్టమొదటి అంతర్జాతీయ సెమినార్
భారతదేశంలోనే మొట్టమొదటి సారి అంతర్జాతీయ మిణుగురు పురుగుల సెమినార్ ఈ ఏడాది ఫిబ్రవరి మొదటివారంలో కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లా మన్నన్ తోడిలో విజయవంతంగా జరిగింది. ఈ సదస్సు జీవవైవిధ్య పరిశోధనలకు ప్రధాన మైలురాయిగా నిలిచింది.మిణుగురు పురుగులపై అధ్యయనాలపై ఈ సదస్సు ప్రపంచ దృష్టిని ఆకట్టుకుంది. కేరళలోని కన్నూర్ విశ్వవిద్యాలయం, ఫైర్‌ఫ్లై ఆసియన్ అసోసియేషన్ (FAA) నిర్వహించిన ఈ సెమినార్ భారతదేశంలో మిణుగురు పురుగుల వైవిధ్యాన్ని క్రమబద్ధంగా నమోదు చేయాల్సిన అవసరాన్ని గుర్తించింది. ఈ సెమినార్‌లో డాక్టర్ మతి తుమిలన్, పర్వేజ్ ఖాన్ కలిసి పాఠశాల విద్యార్థుల్లో వీటిపై అవగాహన కల్పించడానికి మిణుగురు పురుగుల ప్రదర్శన నిర్వహించారు.
స్వచ్ఛంద సంస్థల మధ్య ఒప్పందం
పంటలపై అధికంగా పురుగు మందుల వాడకాన్ని తగ్గించడంతోపాటు ఎల్ ఈడీ వీధి దీపాల సంఖ్యను తగ్గించడం, సెన్సార్ లైట్లు వాడటం, నీటి కాలుష్యం లేకుండా చూడటం, అడవులు అంతరించి పోకుండా కాపాడితే మిణుగురు పురుగులను పరిరక్షించవచ్చని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ప్రతినిధి ఫరియా ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. శ్రీలంకలోని రుహునా విశ్వవిద్యాలయం, తమిళనాడుకు చెందిన వైల్డ్ అండ్ డార్క్ ఎర్త్ రీసెర్చ్ , క్రైస్ట్ కాలేజీ, సస్టెనబుల్ వైల్డ్ లైఫ్ బయో డైవర్శిటీ కన్జర్వేషన్ అసోసియేషన్, ఫైర్ ఫ్లై ఏసియన్ అసోసియేషన్ సంస్థలు కలిసి మిణుగురు పురుగుల పరిరక్ణణకు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
అంతర్జాతీయ ఫైర్‌ఫ్లై వెబినార్
బెంగళూరులోని ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్ అండ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (EMPRI) ప్రపంచ ఫైర్‌ఫ్లై దినోత్సవాన్ని పురస్కరించుకొని 2023వ సంవత్సరంలో అంతర్జాతీయ ఫైర్‌ఫ్లై వెబినార్‌ను నిర్వహించింది.కర్ణాటక రాష్ట్రంలో జీవావరణ శాస్త్రం, వైవిధ్యం,బ్రీడింగ్ ప్రోటోకాల్‌ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఎంప్రీ మిణుగురు పురుగులపై ఒక ప్రాజెక్ట్‌ను చేపట్టింది.మిణుగురు పురుగుల సహజ ఆవాసాలను రక్షించడం ద్వారా వాటి సంరక్షించాలని నిర్ణయించారు.మిణుగురు పురుగులను చట్టం ప్రకారం రక్షిత జాతుల సమూహంగా ప్రకటించాలని, మిణుగురు పురుగుల ఆవాసాలను పరిరక్షించాలని నిర్ణయించారు.
ప్రకృతి ఒడిలో మెరిసే ఈ చిన్న దీపాలు మానవ నిర్లక్ష్యంతో మసకబారిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. మిణుగురు పురుగులను కాపాడుకోవడం అంటే భవిష్యత్ తరాలకు ఆరోగ్యమైన ప్రకృతిని అందించినట్టే.మిణుగురు పురుగుల వెలుగు ఆరిపోతే చీకటి కేవలం రాత్రికే కాదు… మన భవిష్యత్తుకూ అలముకుంటుంది. ఇప్పుడే కాపాడితేనే ఆ చిన్న వెలుగులు రేపటి ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తాయి.
Next Story

