పంచ మూర్తుల వైభవం
తిరుమల శ్రీవారి ఆలయంలో మూలమూర్తితో పాటు మరో నలుగురు మూర్తులు ఉన్నారు. ఆ ఐదుగురు మూర్తులు ఎవరో తెలుసా..
(దినేష్)
తిరుమల శ్రీవారి ఆలయంలో మూలమూర్తితో పాటు మరో నలుగురు మూర్తులు ఉన్నారు. భోగ శ్రీనివాసునికి నిత్య సేవలు, కొలువు శ్రీనివాసునికి లెక్కల అప్పగింతలు, శ్రీదేవి, భుదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక భక్తుల కోర్కెలు తీర్చే భారం మాత్రం మూలమూర్తి వెంకన్నదే.
భోగ శ్రీనివాసమూర్తి (కౌతుక బేరం)
పల్లవ యువరాణి సామవాయి ఒక వెండి శ్రీనివాసుడి విగ్రహాన్ని చేయించి, క్రీ.శ. 614లో ఆలయానికి సమర్పించినట్టు శాసనాలు చెబుతున్బాయి. ఆగమ పరిభాషలో కౌతుక బేరం పురుష బేరంగా పిలిచే ఈ మూర్తిని భోగ శ్రీనివాసుడు అంటారు. రోజువారీ దీపారాధన, నైవేద్యం, నిత్య అభిషేకం, ఏకాంత సేవలన్నీ ఈ భోగ శ్రీనివాసుడికే నిర్వహిస్తారు. ఆగమ శాస్త్రానుసారం కూడా ప్రతి ధృవ బేరానికి కౌతుక బేరం ఉంటుంది.
ఉగ్ర శ్రీనివాసుడు (స్నపన బేరం)
11వ శతాబ్దం వరకు ఉత్సవ విగ్రహంగా వ్యవహరించిన ఉగ్ర శ్రీనివాసుడి విగ్రహాన్నే సప్నన బేరం అంటారు. క్రీ.శ.1330 నాటి రోజుల్లో ఓసారి ఊరేగింపు సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో , ఈ మూర్తిని ఉగ్ర శ్రీనివాసుడిగా గుర్తించారని అంటారు. మిగిలిన విగ్రహాలకు భిన్నంగా స్నపన బేరం శ్రీదేవి, భూదేవి సమేతమై ఉంటుంది. ఏడాదికోసారి మాత్రం సూర్యోదయానికి ముందు ఈ విగ్రహాన్ని సర్వాలంకారాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లి, తిరిగి అంతరాలయానికి తీసుకొచ్చేస్తారు.
మూలమూర్తి (ధృవ బేరం)
అఖండ భక్తకోటి ఆర్తిగా దర్శించుకునేది ఎనిమిది అడుగుల సాలగ్రామ మూర్తినే. మూలవిరాట్ / మూలమూర్తి ఆగమ పరిభాషలో ధృవ బేరం అంటారు. యోగ, భోగ, విరహ రూపాల్లోకాక వీరస్థానక విధానంలో నిలబడి ఉండే ఈ ధృవ బేర విగ్రహానికి అనుబంధంగా శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు. ఇది స్థిరమై ఉంటుంది. వేకువజామున సుప్రభాతం నుండి అర్ధరాత్రి ఏకాంత సేవ వరకు భక్తులకు తన దివ్యదర్శనాన్ని ఇచ్చే ముగ్ధ మనోహర మూర్తి. విశేషమైన సేవలన్నీ ఈ స్వామి వారికే నిర్వహిస్తారు. ఉత్సవ విగ్రహాలు వేరే ఉంటాయి.
కొలువు శ్రీనివాసమూర్తి (బలి బేరం)
గర్భగుడిలో ఉండే శ్రీవారి మరో చిన్న విగ్రహాన్ని బలిబేరం లేదా కొలువు శ్రీనివాసుడు అంటారు. మూలవిరాట్‌కి తోమాలసేవ జరిగాక, కొలువు శ్రీనివాసుణ్ణి సప్నన మండపంలోని బంగారు సింహాసనంపై ఆశీనుల్ని చేస్తారు. రోజువారీ పంచాంగ శ్రవణం జరిపిస్తారు. ట్రెజరీ గుమాస్తా చేతులు జోడించి, ముందురోజు వచ్చిన హుండీ కానుకలు, ఆదాయ, వ్యయాల లెక్కలు ఈ కొలువు శ్రీనివాసుడికే అప్పగిస్తారు.
శ్రీదేవి, భూదేవి, మలయప్ప (ఉత్సవబేరం)
ఉగ్ర శ్రీనివాసుడి విగ్రహాన్ని బయట ఊరేగింపులకు తీసుకెళ్లడం మానేసిన తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి విగ్రహాన్నే అన్ని ఉత్సవ సేవల్లో ఊరేగిస్తున్నారు. మూడడుగుల ఎత్తుండే ఈ మూర్తిని ఉత్సవబేరం అంటారు. ప్రస్తుతం బ్రహ్మోత్సవ ఊరేగింపులో భక్తులు దర్శించుకునేది శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారినే.