గాలిలో వేలాడే స్తంభం ఎక్కడుందో తెలుసా?
ఎంతో నైపుణ్యంగా చెక్కిన శిల్పాలు.. పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. అవి ఎక్కడున్నాయో తెలుసుకుందాం.. రండి..
గాలిలో వేలాడే స్తంభం... నమ్మలేకపోతున్నారా? ఇది నిజం. ఇది ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షిలో ఉంది. ఎన్నో ఆశ్చర్యాలకు, వింతలకు, సైన్స్‌కు కూడా అందని నిర్మాణం ఈ ఆలయం సొంతం. చరిత్రక కట్టడంగా ఉన్న ఈ టెంపుల్‌లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అందుకే యునెస్కో తాత్కాలిక జాబితాలో ప్రపంచ వారసత్వ కట్టడంగా స్థానం దక్కించుకుంది.
వీరన్నా.. నువ్వు గ్రేటన్నా...
లేపాక్షి ఆంధ్ర ప్రదేశ్ శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాన శైవక్షేత్రం, పర్యాటక కేంద్రం. శిల్పులు చెక్కిన ఆ అందమైన ప్రాణం పోసుకున్న ఆ శిల్పాలను చూస్తూ అక్కడే ఉండాలి అని అనిపించే చారిత్రక ఆలయం లేపాక్షి. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు వున్నాయి. విజయనగర రాజుల కాలంలో అంటే 16వ శతాబ్దంలో విరూపన్నా, వీరన్న అనే సోదరులు 70 స్తంభాలతో నిర్మించిన ఈ ఆలయంలో ఒక్క స్తంభం మాత్రం నేలకు ఆనుకొని ఉండదు. గాలిలో వేలాడుతున్నట్టు అనిపించే ఈ స్తంభం కిందా నుంచి ఒక సన్నని క్లాతును ఒకవైపు నుంచి ఇంకోవైపుకు తీయొచ్చు.
ఎలా వేలాడుతుందంటే...
ఈ స్తంభం సుమారు పావు అంగుళం మేర కిందనున్న ఆధారానికి మధ్య ఖాళీ ఉంటుంది. ఇలా ఎందుకు ఉందంటే... ఏ కారణంచేతనైనా మండపం కూలిపోయే పరిస్థితి వస్తే... అంటే భూకంపం, ప్రకృతి వైపరీత్యాల వళ్ళ కలిగే ముప్పుకు స్తంభాలు కదిలితే ఆ సమయంలో ఈ వేలాడే స్తంభం కిందకు ఆని ఏ ఒక్క స్తంభం పడిపోకుండా అన్ని స్తంభాలను కట్టడి చేస్తుందంట. ఇది మనందరికీ తెలియని ఇంకో ప్రతేకత.
కదిలించాలని చూసినా ఫలితం లేకపోయింది...
స్వాతంత్య్రానికి పూర్వం ఒక ఇంజనీరు పరీక్ష పేరుతో ఈ స్తంభాన్ని పక్కకు జరపాలని ప్రయత్నించాడు. ఆ దెబ్బకు పైకప్పు కూడా కొంత కదిలింది. అలా దీనికి ఆధారం లేనప్పటికి మొత్తం మంటపానికి ఇదే ఆధారమని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక ఈ వేలాడే స్తంభమే ముఖ్య ఆకర్షణగా ఇక్కడికి వచ్చే సందర్శకులను ఆకట్టుకొంటోంది. ఇక్కడికి వచ్చిన వారందరూ ఈ అద్భుతాన్ని చూసి, వారు కూడా వేలాడే స్తంభాన్ని పరీక్షిస్తుంటారు.
నిలువెత్తున వీరభద్ర ఆలయం...
లేపాక్షిలో ఉన్న వీరభద్ర దేవాలయంలో 15 అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడువైన విగ్రహం ఉంది. లేపాక్షిలో ఉన్న ఓ తోటలో ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవీగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఓ గుట్టగా ఉన్న ఏకశిలను బసవేశ్వరునిగా తీర్చిదిద్దారు శిల్పులు. ఎంతో నైపుణ్యంగా శిల్పులు చెక్కిన ఈ అందమైన ప్రాణం... పర్యాటకులను ఆకట్టుకుంటోంది.
విజయనగర రాజుల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలోని శిల్పకళను చూడడానికి రెండు కళ్లూ చాలవని పర్యాటకులు అంటుంటారు. సీతమ్మవారిని అపహరించుకొనిపోతున్న రావణుడితో యుద్ధం చేసి జటాయువు లేపాక్షిలో పడిపోయారని చరిత్ర చెబుతోంది. శ్రీరాముల వారు జటాయువు చెప్పిన విషయమంతా విని కృతజ్ఞతతో లే..పక్షి అని మోక్షం ప్రసాదించారని స్థల పురాణం చెబుతోంది. అందువల్లనే లేపాక్షి అని పేరు వచ్చిందని అంటారు.
ఏకశిలా నందీశ్వరుడు...
ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏక శిలా నందీశ్వరుడు.. గాలిలో వేలాడే స్తంభం.. ఏడు పడగల భారీ నాగేంద్రుడు.. అడుగడుగునా భారతీయ సంస్కృతి ప్రతిబింభించే అరుదైన చిత్రాలు లేపాక్షి దేవాలయం సొంతం. ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సైన్స్ కూడా అందని వింతలు, విశేషాలకు నిలయమైన ఈ ఆలయానికి వెళ్లేందుకు పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.