తెలుగులో “దోస్తోవ్ యేస్కీ కథలు” పుస్తకం పాఠకులకు కొత్త అనుభవం
x

తెలుగులో “దోస్తోవ్ యేస్కీ కథలు” పుస్తకం పాఠకులకు కొత్త అనుభవం

దోస్తోవ్ యేస్కీ కథలు తెలుగులోకి వచ్చిన ప్రయాణం, పుస్తకంలోని 10 కథలు, రచయిత శైలి ప్రత్యేకత, పాఠకులకు కలిగే అనుభూతిపై సంక్షిప్త కథనం.


పేద జనం (poor folk) నవలికతో దోస్తోవ్ యేస్కీతో నా ప్రయాణం ప్రారంభం అయినది. గమ్మత్తుగా దోస్తోవ్ యేస్కీ మొదటి నవల ఇదే. ఆ తరువాత అతని ఇతర నవలైన తిరసృతులు (The Insulted and Injured), క్రైమ్ అండ్ పనిష్మెంట్, భార్య చాటు మనిషి(The Eternal Husband), కరమజోవ్ సోదరులు, ఈడియట్(The Idiot) నవలలు చదివాను. ఇలా ఉంటుండగా 2023లో పల్లవి పబ్లికేషన్స్ విజయవాడ నుంచి “దోస్తోవ్ యేస్కీ కథలు” పుస్తకాన్ని తెప్పించి 2024 మార్చిలో చదవడం పూర్తి చేశాను.

దోస్తోవ్ యేస్కీ 1846 నుంచి 1877 మధ్య అంటే 30 సంవత్సరాల వ్యవధిలో రాసినవి కేవలం 15 కథలు మాత్రమే. వీటిలో పది కథలు మాత్రమే అనువాదానికి నోచుకొని దోస్తోవ్ యేస్కీ కథలు అనే పుస్తకంగా తెలుగులోకి వచ్చింది. 2021 దోస్తోవ్ యేస్కీ ద్విశతజయంతి సందర్భంగా ఈ పుస్తకం వెలుగు చూసింది. ఇందులో మిష్టర్ ప్రోహార్చిన్, తొమ్మిది ఉత్తరాల కథ (A Novel in Nine Letters), ఒక క్రిష్టమస్ చెట్టు-ఒక పెళ్లి (A Christmas Tree and A Wedding), మొసలి, బోబక్ (Bobok), పోజున్కోవ్, దొంగ నిజాయితీ (The Honest Thief), పవిత్ర క్రిష్టమస్ చెట్టు (The Heavenly Christmas Tree), పాలేరు మరేయ్ (The Peasant Marei) మరియు నవ్వులపాలైన వ్యక్తి కల (Dream of Ridiculous Man) అనే పది కథలు ఉన్నాయి.

ఇతని రచనల ప్రభావం సిడ్నీ పోర్టర్ (O.Hendry), ఫ్రాంజ్ కాఫ్కా లాంటి ప్రసిద్ధ రచయతలపై ఉంది. ఆయన రచనలలోని మానసిక విశ్లేషణ తరువాతి కాలంలో సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే మనస్తత్వవేత్త శాస్త్రీయ్య మనస్తత్వ శాస్త్రానికి పునాది వేసింది. The cut above the rest అనే విశేషణానికి సరిగ్గా సరిపోయే రచయత ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క ఫ్యోదోర్ దోస్తోవ్ యేస్కీ మాత్రమేనని చెప్పవచ్చు.

దోస్తోవ్యేస్కీని చదవడం ఒక కళ, ముఖ్యంగా అతని కథలని. ఒకటి, రెండు మినహాయించి మిగిలిన అతని కథలన్నీ నైరూప్య చిత్రాలను తలపింప చేస్తాయి. పేద జనం, తిరస్కృతులు లాంటి అతని తరువాత రచనల్లో ముఖ్యంగా కథల్లో కధనము నాన్-లీనియర్ గా సాగుతూ క్లిష్టతను సంతరించుకున్నది. ఈ సంవిధానంలో చెప్పాలనుకున్న అసలు విషయం ఎక్కడో కథ మధ్యలో ప్రారంభ మౌతుంది, అంత వరకు సాగిన కధనం ఒక చిన్న మలుపుతో దారిలోకి వస్తుంది. విస్మయం చెందడం ఇక పాఠకుని వంతు. ఆరంభం నుంచే కథని చెప్పుకు పోయే ఒక క్లాసికల్ విధానానికి పూర్తి భిన్నమైన పంధా ఇది.

ఈ పంధాలో ఎక్కడా కథ చెపుతున్నట్టు ఉండదు. ప్రాకృతిక ప్రవాహ సౌందర్యం ఆ కధనాలది. చెపుతున్నది జీవితాన్నే కాని పునః సృష్టి చేస్తాడు దోస్తోవ్యేస్కీ. ఆ క్రమంలో జీవితానికి అతీతమైనదేదో కొత్త ప్రపంచాన్ని, కొత్త మానవున్ని చదువుతున్న అనుభూతికి లోనౌతాడు పాఠకుడు. ముగింపుకొచ్చాక మొత్తం కథని కొంతసేపు పునఃశ్చరణ చేసుకోక తప్పని పరిస్థితి ఎదురౌతుంది. ఆ అనుభూతి ఎట్లాంటిదంటే అర్ధం అయ్యీ కాని సందిగ్ధ పరిస్థితి.

ఇదొక ఫజిల్లా మనల్ని చాలాకాలం వెంటాడుతూనే ఉంటుంది. ఆలోచించక తప్పని పరిస్థితి కల్పిస్తుంది. వాచకాలు చదువుతున్నట్టుగా చదవాలి. జాగ్రత్తగా ఒకటికి పది సార్లు చదివితేనే నైరూప్యత వీడి నెమ్మదిగా ఒక రూపం ప్రత్యక్షమౌతుంది. ఇక దోస్తోవ్ యేస్కీ సృష్టించిన పాత్రలు వాటి అంతర్లోకాలు మనకి మరింత పని కల్పిస్తాయి. తీరం చేరాలంటే పాఠకుడు పట్టువదలని విక్రమార్కుడు కావాల్సిందే. ఆరంభంలోనే తికమక ఎదురు కావచ్చు, అర్ధం కాని వాక్యాలు బెంబేలు ఎత్తించవచ్చు. దాంతో చదవాలనే కాంక్ష ఆవిరై నిద్ర ముంచుకు రావచ్చు, కళ్ళు బరువెక్కవచ్చు, కించిత్ నెత్తి నొప్పి కూడా రావచ్చు.

కధనంలో ఎక్కడ ఏ విసురు వుంటుందో, ఏ విమర్శ ఎదురౌతుందో, ఏ కారుణ్యం ఉట్టి పడుతుందో, ఎక్కడ కన్నీటి బొట్టు రాలుతుందో అవన్నీ చివరంటా చదివిన వారికే అనుభవైక్యవేద్యం. అసలు కధనాలలోని నూతనత్వమే భీతి గొలుపుతుంది. మానవ మాత్రుడేన ఈ కథలు రాసింది అనిపిస్తుంది. ఈ కథలను అనువదించిన అరిపిరాల సత్యప్రసాద్ అన్నట్టు అధివాస్తవికత, అధిక్షేపణ, మాంత్రిక వాస్తవికతల సమ్మేళనములో పురుడు పోసుకొని వికసించిన కొత్త లోకాలు, మరో ప్రపంచపు కలలు దోస్తోవ్ యేస్కీ కథలు. ఆరంభంలో ఏంటీకథ ఇలా ఉంది అనుకుంటాం చివరంటా చదవగలిగితే ఎదో ఉంది అనుకుంటూ ఆలోచనలో పడతాం.

Read More
Next Story