అనగనగా మునగ! తింటే బలిమి, పండిస్తే కలిమి
x
మునగ సాగులో సరస్వతి స్వయం సహాయక మహిళా గ్రూప్‌ మహిళలు

అనగనగా మునగ! తింటే బలిమి, పండిస్తే కలిమి

మునగతో ఆరోగ్యమే కాదు.. ఆదాయాన్ని కూడా పొందచ్చు. అదెలా అంటే..


‘ఒక ఎకరంలో మునగసాగు చేస్తున్నాను. సాధారణంగా రైతులంతా మునగ అంటే కాయలనే ఎంచుకుంటారు. మేము మునగ ఆకులపై దృష్టిపెట్టాము. లేత ఆకులను మా మహిళాసంఘం సభ్యులంతా సేకరించి విలువ ఆధారిత ఉత్పత్తిగా మార్చి మార్కెట్‌ చేస్తున్నాం. కలుపు రాకుండా మల్చింగ్‌ షీట్‌ మీద మొక్కలను నాటి కాపాడాము. మునగ పంటకు తక్కువ నీరు సరిపోతుంది. డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా సాగు చేస్తున్నాం. లేత ఆకులను కోసి శుభ్రపరిచి, ఎలక్ట్రిక్‌ డ్రయర్‌ ద్వారా ఆరబెట్టి, పౌడర్‌గా మార్చి ప్యాకింగ్‌ చేసి విక్రయాలు చేస్తూ అద్భుతమైన ఆదాయం పొందుతున్నాం. యంత్రాలు సమకూర్చుకోవడానికి, నాబార్డ్‌ సహకరించింది. జనవికాస్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ సభ్యులు మునగ సాగులో తగు సూచనలు ఇచ్చి తోడ్పడ్డారు.’ అంటారు కరీంనగర్‌ జిల్లా, మైలారం మునగ పొలంలో ఆకులు తెంపుతున్న రజని.

కాయలకంటే మునగ ఆకులకే అధిక అదాయం అంటున్న రైతు రజని

రైతమ్మల పాలిట కల్పవృక్షం

పోషకాల గనిగా పేరున్న మునగ.. రైతమ్మల పాలిట కల్పవృక్షంగా మారింది. వినియోగదారులకు ఆరోగ్యం, పండిరచిన వారికి లాభాలు. తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడులు అందిస్తూ.. చిన్న రైతుల ఇంట సిరులు కురిపిస్తున్నది .

జనవికాస్‌ రూరల్‌ డెవలప్‌ మెంట్‌ సొసైటీ ద్వారా నాబార్డ్‌ రైతుల ఆదాయం పెంచుతోంది.

తెలంగాణ లోని కరీంనగర్‌ జిల్లా, మైలారం, గోపాల్‌పూర్‌, సుందర గిరి గ్రామాల్లో 50 మంది రైతులకు మునగ తోటల సాగులో మెరుగైన దిగుబడి సాధించడానికి మొక్కలు, మల్చింగ్‌ షీట్స్‌, ఎరువులు ఇవ్వడమేకాక, ఆదాయం పెంచడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

నేలకు హాని చేసే రసాయన ఎరువులను తగ్గించి, సేంద్రియ పద్ధతిలో ద్రవ జీవామృతం ద్వారా సాగు చేసేలా రైతులను ప్రోత్సహించారు.

వారానికి 3 వేలు ఆదాయం

‘ మాకు మునగాకు సాగు కోసం మొక్కలు ఇవ్వడమే కాక వేపపిండి, వేప నూనె ఇతర సేంద్రియ ఎరువులు ఇచ్చారు. మునగ కాయలు అమ్ముకుంటే వారానికి 3 వేల రూపాయల ఆదాయం వస్తుంది. సరస్వతి స్వయం సహాయక మహిళా గ్రూప్‌కు మునగ ఆకులు ,గింజలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇచ్చి నైపుణ్యం పెంచారు. ఇతర పంటలతో పాటు మునగాకు వల్ల అదనపు ఆదాయం పొందుతున్నాం’ అంటారు, మైలారం పక్కనే ఉన్న సుందర గిరి కి చెందిన సమ్మక్క.

మునగ వల్ల లాభాలు బాగుండటంతో సుందర గిరి, మైలారం గ్రామాల్లో మహిళలు ఐకమత్యంగా మునగ తోటలను సాగుచేయడమే కాక, లేత ఆకులను కోసి శుభ్రపరిచి, ఎలక్ట్రిక్‌ డ్రయర్‌ ద్వారా ఆరబెట్టి , పౌడర్‌గా మార్చి ప్యాకింగ్‌ చేసి విక్రయాలు చేస్తూ అద్భుతమైన ఆదాయం పొందుతున్నారు.

ఎలక్ట్రిక్‌ డ్రయర్‌ ద్వారా ఆకులను ఆరబెట్టి, పౌడర్‌గా మారుస్తున్న మహిళలు

అధిక లాభాలున్న మునగ సాగునుప్రోత్సహించడంలో భాగంగా జనవికాస సంస్ధ రైతులకు ఎక్స్‌పోజర్‌ విజిట్‌లు నిర్వహించారు. నర్సరీలు, తోటల పెంపకంలో అవగాహన కలిగించారు. తరుచూ నాబార్డు అధికారులు క్షేత్ర పర్యటనకు వచ్చి మునగ తోటలను పరిశీలించి రైతులకు తగు సలహాలు ఇచ్చి ఆత్వవిశ్వాసం కలిగించారు.

తోటల సాగులో నీటి వృధాను అరికట్టి మొక్కల వేర్లకు మాత్రమే అందేలా డ్రిప్‌ ఇరిగేషన్‌ చేశారు. పంట కోత అనంతరం కొమ్మలను కత్తిరించడం ద్వారా ఒక్కసారి నాటితే రెండేళ్ల వరకు అధిక దిగుబడులు వస్తున్నాయి.

ప్యాకింగ్‌ చేసిన మునగాకు పౌడర్‌ని విక్రయిస్తున్న మహిళలు

తక్కువ నీరు ఎక్కువ లాభాలు

ఆరోగ్యపరంగానే కాకుండా, వ్యాపారపరంగానూ మునగ సాగు రైతులకు లాభదాయకమే. ఈ పంటకు తక్కువ నీరు సరిపోతుంది. కూలీల అవసరం కూడా తక్కువే. అంతేకాకుండా, ఎరువులు, పురుగు మందులు అవసరం కూడా పెద్దగా ఉండదు. ఒక చెట్టుకు సగటున 220 చొప్పున హెక్టారుకు సుమారు 50 నుండి 60 టన్నుల మునగ కాయల దిగుబడి వస్తుంది. కాయలే కాదు, ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి గింజలను ఔషధ పరిశ్రమలలో వాడతారు కాబట్టి ఈ పంటకు మార్కెట్‌లో భారీ డిమాండ్‌.

‘ వరి పంటను తగ్గించి, కూరగాయల సాగును ప్రోత్సహించి, రైతుల ఆదాయం పెంచడానికి మునగ పంటను ప్రోత్సహిస్తున్నాం. దాని కోసమే నాబార్డ్‌ ‘ఫార్మ్‌సెక్టార్‌ ప్రమోషన్‌ ఫండ్‌’ ప్రాజెక్ట్‌ మొదలు పెట్టింది. దీనివల్ల రైతులకు ఆరోగ్యపరంగానే కాకుండా, వ్యాపారపరంగానూ లాభదాయకమే. ఈ పంటకు పెట్టుబడి తక్కువ , ఆదాయం ఎక్కువ’ అంటారు కరీంనగర్‌ జిల్లా నాబార్డ్‌ అధికారి ఎస్‌. జయప్రకాశ్‌.

ప్రాజెక్ట్‌ని అమలు చేసి రైతుల ఆదాయం పెంచిన నాబార్డ్‌ అధికారి ఎస్‌. జయప్రకాశ్‌.

రైతుల ఆదాయం పెంచడానికి మునగ సాగును ప్రోత్సహించడానికి నాబార్డ్‌ రూపొందించిన ‘ ఫార్మ్‌సెక్టార్‌ ప్రమోషన్‌ ఫండ్‌’ విజయవంతమై కరీంనగర్‌ జిల్లాలో మునగ పంట సాగు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది.

పదికిలోల ఆకులకు కిలో పౌడర్‌

‘ ‘ నాబార్డ్‌ ద్వారా 2022లో ‘ఫార్మ్‌సెక్టార్‌ ప్రమోషన్‌ ఫండ్‌’ ప్రాజెక్ట్‌ ద్వారా మునగ సాగులో సాంకేతికత, యూనిట్‌ ఏర్పాటుకు రైతులకు తోడ్పడుతున్నాం. సుందరగిరిలో 30 మంది రైతులు, గన్నేరువరం మండలంలో మైలారం, గోపాల్‌ పూర్‌ గ్రామాల్లో 20 మంది రైతులను తీసుకొని ఈ ప్రాజెక్ట్‌ అమలు చేశాం. పదికిలోల మునగ ఆకులను తీసుకొని ప్రాసెస్‌ చేస్తే ఒక కిలో పౌడర్‌ వస్తుంది. ఆ కిలోకు వెయ్యి రూపాయల ఆదాయం వస్తుంది.’ అంటారు జనవికాస ఎన్జీఓ సెక్రటరీ పి. సంపత్‌ కుమార్‌.

వరి పంటకంటే మునగలోనే ఎక్కువ రాబడి ఉందంటారు కరీంనగర్‌ జిల్లా నాబార్డ్‌ డిడిఎమ్‌ మనోహుర రెడ్డి

వరి పంటకంటే ఎక్కువ రాబడి

‘ వరి సాగు చేస్తే ఎకరానికి రెండు పంటలకు దాదాపు 50 వేలు మాత్రమే. అలా కాకుండా మునగ సాగు చేస్తే ఒక చెట్టుకే దాదాపు 15 కిలోల ఆకుల పొడి వస్తుంది. మునగాకులో ఉండే పోషకాలు దేనిలోను లేవు. కరోనా సమయంలో కూడా ఈ ఆకుకు డిమాండ్‌ పెరిగింది. అందుకే మునగాకు సాగును ప్రోత్సహిస్తున్నాం. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వరిని ఎక్కువగా సాగు చేస్తుంటారు. అలా కాకుండా పంటల మార్పిడి వల్ల భూసారం పెరుగుతుంది. గతంలో పందిరి సాగును కూడా ప్రమోట్‌ చేశాం. అది చాలా ప్రాచుర్యం పొందింది. అలాగే ఇపుడు మునగాకును సాగు చేయమని రైతులను ప్రోత్సహిస్తున్నాం. రైతులకు మొక్కలను ఇవ్వడమే కాక, సాగుబడిలో సలహాలు కూడా జనవికాస ఎన్జీఓ ద్వారా ఇస్తున్నాం.’ అని కరీంనగర్‌లో ఫెడరల్‌ తెలంగాణ ప్రతినిధితో చెప్పారు నాబార్డ్‌ డిడిఎమ్‌ మనోహర రెడ్డి.

మహిళా సంఘాలను చైతన్య పరిచి మునగసాగులో శిక్షణ ఇచ్చిన జనవికాస ఎన్జీఓ సెక్రటరీ పి. సంపత్‌ కుమార్‌, రైతులతో ఫెడరల్‌ తెలంగాణ ప్రతినిధి శ్యాంమోహన్‌.

లాభాల పంట మునగ

1, మునగ కాయల కంటే ఆకులను విలువ ఆధారిత ఉత్పత్తిగా మార్చడం ద్వారా రైతులు అధిక ఆదాయం పొందుతున్నారు.

2, మునగ సాగులో సాంకేతికత నైపుణ్యం పెంచడం వల్ల ఎకరం తోటలో మునగ ఆకుల పొడిని అమ్మడం ద్వారా నెలకు రూ.80 వేల నుండి రూ.90 వేల ఆదాయం అందుకుంటున్నారు.

3, మునగ ఆకుల పౌడర్‌ అమ్మకాల ద్వారా ఒక్క కిలోకి వెయ్యిరూపాయల ఆదాయం పొందుతున్నారు.

4, మునగ తోటలో అంతర పంటలు పండిస్తూ అదనపు

ఆదాయం కూడా పొందుతున్నారు. మునగలో లాభాలు రావడం వల్ల రైతులు వరి సాగును తగ్గించారు. నాబార్డ్‌ ఆర్ధిక సాయంతో ‘ సరస్వతి ఎస.్‌హెచ్‌.జి’ మహిళలు టెక్నాలజీని సమకూర్చుకొని విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా సుస్ధిర ఆదాయాలు పొందుతున్నారు.

మునగ సాగు వల్ల గ్రామీణ మహిళలు స్వయం సమృద్ధి సాధిస్తూ పరోక్షంగా మరి కొందరికి ఉపాధిని ఇస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారు.

Read More
Next Story