జీవితంలో గెలిచినా 98 ఏళ్ళ కామేశ్వరమ్మ క్యాన్సర్ ముందు ఓడిపోయింది.
x

జీవితంలో గెలిచినా 98 ఏళ్ళ కామేశ్వరమ్మ క్యాన్సర్ ముందు ఓడిపోయింది.

ఆరున్నర దశాబ్దాల క్రితమే కామేశ్వరమ్మ ఇంట్లో సంప్రదాయం పైన తిరుగుబాటు చేసింది...


elegyజీవితంలో ఏ ఇల్లాలూ పడనన్ని కష్టాలు పడి, పోరాడి గెలిచి, రోజూ పట్టు చీరలు కట్టుకునే స్థాయికి ఎదిగిన మా పెద్దమ్మ వేమపరపు/తుమ్మలపల్లి కామేశ్వరమ్మ తన తొంభై ఎనిమిదవ ఏట సోమవారం తెల్లవారుజామున హైదరాబాదులో కన్నుమూసింది. మా అమ్మ కంటే ఆరేళ్ళు ముందు పుట్టింది. చివరి వరకూ పాటలు పాపడుతూ, నవ్వుతూ, తుళ్ళుతూ, డ్యాన్స్ చూస్తూ గడిపే కామేశ్వరమ్మకు మనుషులంటే ఎనలేని ప్రేమ.


కామేశ్వరమ్మకు ఆరుగురు పిల్లలు పుట్టాక భర్త వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. ఒక్కతీ కష్టపడి పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. ఇద్దరు కూతుళ్ళు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నారు. కళ్ళ ముందే నలుగురు కొడుకులూ పోయినా కడుపు శోకాన్ని తట్టుకుని నిలబడింది. కానీ అన్నవాహికలో క్యాన్సర్ గడ్డను తట్టుకోలేకపోయింది. ఆస్పత్రిలో కీమో తెరఫీ చికిత్స పొందుతూ ఆదివారం అర్ధ రాత్రి, తెల్లవారితో సోమవారం అనగా ఒంటిగంటకు కన్నుమూసింది.

బందరు-గుడివాడ మధ్య ఉన్న వేమవరంలో మా అమ్మమ్మకున్న తొమ్మిది మంది సంతానంలో నాల్గవ సంతానంగా కామేశ్వరమ్మ పుట్టింది. చదవడం రాయడం వరకు నేర్చుకుంది. చిన్నతనంలోనే గుడివాడకు చెందిన తుమ్మలపల్లి రామారావుకు ఇచ్చి పెళ్ళి చేశారు. రామారావు టీకాలు ఇన్ స్పెక్టర్ గా చేసేవాడు. ఇల్లు, పొలాలు ఉన్నాయి. కోస్తా జిల్లాల్లో, ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని సంప్రదాయ కుటుంబాల్లో పైకి ఎన్ని మడిఆచారాలు ప్రదర్శించినా, మగ పిల్లలు మాత్రం వ్యసనాలకు బానిసలయ్యే వాళ్ళు.

‘పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్’ అని గురజాడ వ్యంగ్యంగా అన్నమాటను నిజమని నమ్మే వాళ్ళు. మూతి మీద మీసం రాకముందే నోట్లోకి సిగరెట్టో, చుట్టో వచ్చేసేది. పొగతాగడం మగతనానికి చిహ్నంగా భావించే వాళ్ళు. పల్లెటూర్లలోని సంప్రదాయ కుటుంబాల్లోని యువకులు తరచూ ఏదో రాచకార్యం ఉన్నట్టు మాట్లాడితే పక్కనున్న గుడివాడ, బందరు వంటి పట్టణాలకు వెళ్ళే వాళ్ళు. అక్కడే వాళ్ళకు మందుతో పాటు సకల వ్యస నాలను తీర్చుకునే వాళ్ళు. ఏమీ ఎరగనట్టు భద్రంగా లోపల జంద్యం, ముఖాన చెరగని బొట్టుతో ఇంటికి వచ్చే వాళ్ళు. ఇంట్లోకి రాగానే మళ్ళీ మడీ ఆచారాలు. సంప్రదాయ కుటుంబాల్లో ఒక తరమంతా ఇలా వ్యసనాలకు బానిసై, చితికిపోయారు. అలా చితికి పోయిన కుటుంబాల్లో కామేశ్వరమ్మ కుటుంబం ఒకటి.

కామేశ్వరమ్మ భర్త తుమ్మలపల్లి రామారావు బ్రాకెట్ అనే జూదానికి అలవాటు పడ్డాడు. మగతనానికి చిహ్నంగా నోట్లో సిగరెట్టు అయిపోగానే మరో సిగరెట్టు వచ్చేసేది. వ్యవసనాలకు చాలా మటుకు ఆస్తులు కరిగిపోయాయి. చుట్టూ అప్పులు చేశాడు. గవర్నమెంటు ఉద్యోగం, అయినా గంపెడంత సంసారం. భార్యను, పిల్లల్ని ఆమె పుట్టింట్లో ఒదిలేసి చెప్పాపెట్టకుండా ఎటో వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు.

ఈ స్థితిలో ఇంత మంది పిల్లల్ని ఎలా పోషించాలి !? అన్నది కామేశ్వరమ్మ ముందున్న ప్రశ్న. పుట్టింటి వాళ్ళు ఇంత పెద్ద సంసారాన్ని సాకే స్థితిలో లేరు. ముందు పుట్టిన ఇద్దరు కూతుళ్ళు అరవై ఐదేళ్ళ క్రితమే తమకు ఇష్టమైన కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుని వెళ్ళిపోయారు. కామేశ్వరమ్మ ఇంట్లోనే అలా సంప్రదాయం పైన తిరుగుబాటు ఆరున్నర దశాబ్దాల క్రితమే మొదలైంది. బంధువులు కాకుల్లా పొడిచారు. కామేశ్వరమ్మ లెక్క చేయలేదు.bతట్టుకుని నిలబడింది. కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న కన్న బిడ్డల్ని కాదనలేదు. తల్లి కదా, కడుపులో దాచుకుంది.

మగపిల్లల్ని చదివించే పరిస్థితి లేదు. ముగ్గురు కొడుకుల్ని హోటళ్ళలో చేర్చింది. బంధువుల ఇంట్లో వంట మనిషిగా చేరింది. వంట వరకే కాదు, ఇంట్లో సమస్త చాకిరీ చేసేది. నా వయసు వాడైన చిన్న కొడుకుని పెట్టుకుని వాళ్ళింట్లోనే ఉండిపోయింది. హోటల్ వర్కర్లుగా ఉంటూనే ఇద్దరు పెద్ద కొడుకులు వైద్యం అందక చనిపోయారు. మరొక కొడుకు హోటల్ వర్కర్ గానే పదేళ్ళ క్రితం వరకు బతికాడు. చిన్న కొడుకు వెంకటేశ్వరరావు కూడా తల్లితోపాటు ఆ ఇంట్లో గొడ్డు చాకిరీ చేసేవాడు. అంతా వెంకన్నా అని పిలిచే వెంకటేశ్వరరావును మాత్రం బీకాం వరకు చదివించింది.

వెంకటేశ్వరరావుకు బ్యాంకులో ఉద్యోగం రావడంతో, కామేశ్వరమ్మ ఆరున్నదశాబ్దాల కష్టాలనుంచి గట్టెక్కింది. పెళ్ళి చేసుకున్నా, చిన్న కొడుకు తల్లిని చాలా ప్రేమగా చూసుకున్నాడు. మెడలో నగలు పెట్టుకోవడంతోపాటు, కామేశ్వరమ్మ రోజూ జరీ అంచు పట్టు చీరలు కట్టేది. చివరి వరకు తన బట్టలు తానే ఉతుక్కునేది. వెంకటేశ్వరరావు అనేక బ్యాంకులు మారి, చివరికి ఇండస్ ఇండ్ బ్యాంక్ లో వైస్ చైర్మన్ స్థాయికి ఎదిగాడు. బ్యాంకులు రుణాలిచ్చిన పరిశ్రమలు మూతపడితే, వాటిని మళ్ళీ లాభాల బాటలోకి ఎలా తీసుకురావాలో చెప్పే నైపుణ్యంలో వెంకటేశ్వరరావు ఆరితేరాడు. బ్యాంకులకు అతను బంగారుగుడ్లు పెట్టే బాతులా తయారయ్యాడు.

ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావుపై సుజనా చౌదరి దృష్టి పడింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయించి, తన సంస్థల్లో డైరెక్టర్ గాను, కొన్నిటికి మేనేజింగ్ డైరెక్టర్ గాను చేర్చుకున్నాడు. వెంకటేశ్వరావును ఒక్కడినే కాదు, ఇలా ప్రతిభ ఉన్న అనేకమందిని తన వద్ద నమ్మకస్తులుగా చేర్చుకున్నాడు. కటిక పేదరికం నుంచి వచ్చిన వెంకటేశ్వరరావుకు లక్షల్లో జీతం, కారు, హోదా.

వెంకటేశ్వరరావు ఉరఫ్ వెంకన్న ప్రేమ ఆప్యాయతలు గల మంచి మనిషి. చాలా కష్టాలు పడి పైకి వచ్చిన వాడు. ఇద్దరం ఒక వయసు వాళ్ళం. తాను పేదరికంలో ఉన్నంత కాలం బంధువుల ఇళ్ళకు ఎప్పుడూ వెళ్ళలేదు. బెంగుళూరులోని ఒక బ్యాంకులో ఉద్యోగం వచ్చాక తొలి సారిగా తిరుపతికి మా ఇంటికి వచ్చాడు. నాతో చాలా స్నేహంగా ఉండే వాడు. నేను ‘‘వెంకన్నా’’ అంటే ‘‘ఏరా, ఒరేయ్’’ అని పిలిచేవాడు. ఇద్దరం నెలల తేడాతో పుట్టిన ఒక ఈడు వాళ్ళం. హైదరాబాదు వచ్చినప్పుడు వాళ్ళింటికి వెళ్ళకపోతే ‘‘ఏరా నిన్నేమైనా బరువులు మోయమన్నానా? వచ్చి భోజనం చేసి వెళ్ళమన్నా కానీ!’’ అంటూ నిష్ఠూరపోయేవాడు. హైదరాబాదు వెళ్ళినప్పుడల్లా మా వెంకన్న ఇంటికి వెళ్ళకుండా ఉండే వాణ్ణి కాదు.

పారిశ్రామిక వేత్తలు బ్యాంకుల నుంచి ఎలా రుణాలు తీసుకుంటారు, ఎలా ఎగవేస్తారో వెంకటేశ్వరరావుకు బాగా తెలుసు. తానూ ఒక పారిశ్రామిక వేత్త కావాలనుకుని, కంప్యూటర్ చిప్స్ తయారు చేసే ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాడు. అది సుజనాచౌదరికి నచ్చలేదు. సుజనా చౌదరి వెంకటేశ్వరరావును పిలిచి పరిశ్రమ ఆలోచన మానుకోమన్నాడు. అతను వినలేదు. తన దగ్గరే ఉద్యోగిగా ఉండాలి కానీ, తనతో సమానంగా పారిశ్రామిక వేత్త కావడం సుజనాకు నచ్చలేదు.

వెంకటేశ్వరరావు పరిశ్రమ పెట్టి పొటీలో కోలుకోలేని విధంగా నష్టపోయాడు. అదే సమయంలో క్యాన్సర్ బారిన పడ్డాడు. సుజనా చౌదరికి చెందిన ఏ ఆస్పత్రికైతే గతంలో మేనేజింగ్ డైరెక్టర్ గా చేశాడో, అదే ఆస్పత్రిలో ఏడేళ్ళ క్రితం అపస్మారక స్థితిలో చాలా రోజులు చికిత్స పొందాడు. కానీ కోలుకోలేక కన్ను మూశాడు. కామేశ్వరమ్మకు అంతకు ముందే మూడవ కొడుకు కూడా పోయాడు. ఇప్పుడు తనను కంటికి రెప్పలా కాపాడిన చిన్న కొడుకు కూడా కన్ను మూయడంతో కామేశ్వరమ్మ పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. మనవలు అమెరికాలో సాఫ్ట్ వేర్ రంగంలో స్థిర పడడం వల్ల, ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా, కడుపున పుట్టిన బిడ్డలంతా దూరమైపోయారు. కోడలు కూడా అమెరికాలో పిల్లల దగ్గరకు వెళ్ళిపోతూ కామేశ్వరమ్మను హైదరాబాదులోని ఒక ఓల్డేజ్ హోమ్ లో చేర్పించింది.

కామేశ్వరమ్మకు ఆర్థిక ఇబ్బందులేమీ లేవు. కానీ, అయిన వాళ్ళు ఒక్కరుకూడా దగ్గర లేక, ఓల్డేజ్ హోంలో బిక్కు బిక్కు మంటూ గడుపుతోంది. అక్కడ అందరితో గలగలా మాట్లాడడం, పాటలు పాడడం, డ్యాన్స్ చేయడంతో ఒంటరి తనాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేసింది. దాదాపు నెల క్రితం ఒక ఆస్పత్రిలో చికిత్స కోసం చేరింది. జీవితంతో పోరాడి గెలిచిన మా పెద్దమ్మ కామేశ్వరమ్మ క్యాన్సర్ తో పోరాడ లేక కన్నుమూసింది. ఆమె మృతితో ఒక తరం నిష్క్రమణ జరిగి పోయింది.


Read More
Next Story