అంతరించిపోతున్న పక్షి కవ్వాల్ సరస్సుల్లో మళ్లీ ప్రత్యక్షం
x
అంతరించిపోతున్న పక్షి బ్లాక్ బెల్లిడ్ టెర్న్

అంతరించిపోతున్న పక్షి కవ్వాల్ సరస్సుల్లో మళ్లీ ప్రత్యక్షం

కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో అరుదైన టర్న్ పక్షుల సందడి


తెలంగాణలో ప్రకృతి ప్రేమికులకు ఆనందాన్ని పంచే అరుదైన పక్షి వెలుగుచూసింది. తెలుపు రెక్కలు, నలుపు ఉదర భాగం, కాషాయ రంగు మొనదేలిన ముక్కుతో ప్రత్యేక ఆకర్షణ కలిగిన అంతరించిపోతున్న పక్షి బ్లాక్ బెల్లిడ్ టెర్న్( Black-bellied Tern) తాజాగా కవాల్ అభయారణ్యంలో (Kawal Tiger Reserve) కనిపించింది. గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ ప్రాంతాల్లో ఈ పక్షులు కనిపించడం పక్షి శాస్త్రవేత్తల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. అయితే పెరుగుతున్న మానవ జోక్యం మధ్య ఈ అరుదైన జాతి భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.బ్లాక్ బెల్లీడ్ టర్న్ అనే అందమైన పక్షి శాస్త్రీయ నామం స్టేర్నా అక్యుటికాడ. ఈ పక్షి భారతదేశం, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్ ప్రాంతాల్లోని నదీ పరివాహక ప్రాంతాలు, సరస్సుల వద్ద నివసిస్తుంది.


అంతరించిపోతున్న అరుదైన పక్షి

బ్లాక్ బెల్లీడ్ టర్న్ ఈ అరుదైన పక్షుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోవడంతో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయుసిఎన్) (International Union for Conservation of Nature) దీన్ని అంతరించిపోతున్న జీవుల జాబితాలోకి చేర్చింది. ఈ పక్షులు గతంలో పలు ప్రాంతాల్లో కనిపించినట్టుగా మనకు ఇంతకుముందు పరిశోధన ఫలితాల్లో వెల్లడైంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వీటి సంఖ్య అనుకున్నంతగా లేదు.



ఇసుకతిన్నెల్లో గుడ్లు పెట్టి...

బ్లాక్ బెల్లీడ్ టర్న్ పక్షులు జనవరి-ఫిబ్రవరి, మే, జూన్ వరకు ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఎందుకంటే ఈ కాలంలో నదుల్లో నీటిమట్టం తగ్గి ఇసుక తిన్నలు అందుబాటులోకి వస్తాయి. అయితే ఈ పక్షులు మిగతా పక్షుల్లాగా గూళ్ళు నిర్మించకుండా ఉంటాయి.సరస్సుల పరివాహక ప్రాంతాల్లోని ఇసుకదిన్నెల్లో నేరుగా గుడ్లు పెట్టి పిల్లల్ని పొదుగుతాయి.

కవాల్ అభయారణ్యంలో వెలుగుచూసిన పక్షులు

గతంలో వివిధ పక్షి ప్రేమికులు, పరిశోధకులు తెలంగాణలోని కాగజ్ నగర్, మెదక్ దగ్గర సిర్నాపూర్, పోచారం ప్రాంతాల్లో ఈ అరుదైన పక్షులను గుర్తించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ ఫారెస్టులో 2025 జనవరిలో జన్నారం డివిజన్ లోని కిస్టాపూర్ చెరువులో తొలిసారిగా వన్యప్రాణి పరిశోధకుడు డాక్టర్ వెంకట్ ఎనగందుల ఈ పక్షిని గుర్తించారు. గత సంవత్సరం సర్వేలో కేవలం ఒక పక్షి మాత్రమే కనబడింది. ఆ తర్వాత దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సీజన్లో టైగర్ రిజర్వ్ వ్యాప్తంగా చేపట్టిన సర్వేల్లో కిష్టాపూర్ తో పాటు కడెం రిజర్వాయర్, చిన్న క్యాంపు చెరువు, ప్రాణహిత ప్రాంతంలో ఈ అరుదైన పక్షులు కనిపించాయి.తాజాగా దండేపల్లి ప్రాంతంలోని ముత్యంపేట చెరువు వద్ద ఈ పక్షులను గుర్తించారు.

పొంచి ఉన్న ప్రమాదం

గతంతో పోలిస్తే ఈ సంవత్సరం కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో వీటి సంఖ్య పెరగడం కవ్వాల్ అభయారణ్యం పక్షుల ఆవాస అనుకూలతను తెలియజేస్తుంది. అభివృద్ధితో పాటు పెరుగుతున్న మానవ అవసరాలు నదులను,మంచినీటి చెరువులను ఆక్రమించడం వాటి నుంచి ఇసుక తీయడం, స్థాయికి మించి చేపలు పట్టడం వల్ల అరుదైన పక్షుల ఆవాసం దెబ్బతిని వీటి సంఖ్య మరింత తగ్గే ప్రమాదం ఉందని పక్షి శాస్త్రవేత్త డాక్టర్ వెంకట్ ఎనగందుల ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

కవ్వాల్ అడవుల్లో బ్లాక్ బెల్లీడ్ టర్న్‌ల పెరుగుతున్న ఆనవాళ్లు ప్రకృతి పునరుద్ధరణకు సంకేతాలిచ్చినా, ఇవి శాశ్వత భద్రతకు హామీ కావు. నదులు, చెరువులు, ఇసుక తిన్నెల వంటి సహజ ఆవాసాలను కాపాడితేనే ఈ అరుదైన పక్షులు తరతరాలకు నిలుస్తాయి. ప్రభుత్వ చర్యలతో పాటు స్థానిక ప్రజల భాగస్వామ్యం, అవగాహన, బాధ్యతాయుతమైన వినియోగమే ఈ జాతి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రకృతిని రక్షిస్తేనే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది—కవ్వాల్‌లో కనిపించిన ఈ అరుదైన పక్షులు మనకు అదే సందేశాన్ని అందిస్తున్నాయి.


Read More
Next Story