రారమ్మని పిలిచె  నీరా ’
x

రారమ్మని పిలిచె ' నీరా ’

పోలయ్య నెల్లూరు జిల్లా, వెంకటగిరి దగ్గిర డక్కిలి ( మినీ టౌన్ ) నుంచి వచ్చి ఈ ఇరవై చెట్లను పాడుకుని కల్లు వ్యాపారం చేస్తున్నాడు. మాకోసం ప్రత్యేకంగా ఈ నీరాను అందించినాడు.



ఈ దఫా ప్రేమ్ పిలుపుతో కొత్త పంథాకు దారితీసినాము. తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో కోడూరు , ఎర్రగుంటకోట మీదుగా గూండాల కోన , సలీంద్ర కోనకు పదుల సార్లు ట్రెక్ చేసి వచ్చినాము. ఎన్నడూ ఆ దారుల్లో తాటిచెట్లు ఉన్నాయని అనుకోనేలేదు.




నలభై ఏండ్ల క్రితం అనంతపురంజిల్లా , పెనుగొండలో యంగ్ ఇండియా (Young India Project) ఫామ్ కు పోయినప్పడు బేడీ భార్య ఇచ్చిన డ్రింక్ ఇప్పటికీ నా జిహ్వలో ఉంది. అంతరుచిగా ఉంది. ఏందిరా స్వామీ ఈ అమృతమనుకుంటే అది నీరా అని తెలిసింది.

ఏం మాయ చేసిందో ఏమోగాని అంత అద్భుతమయిన రుచి మళ్లీ అనుభవించలేదు. అప్పటి నుండి నీరా అంటే చాలా ఇష్టం పెంచుకున్నాను. ఎక్కడికి పోయినా శ్రీకాకుళం , ములుగు , గద్వాల్ దగ్గర తప్పని సరిగా రుచి చూసి రావటం మామూలయిపోయింది.


కల్లు తల్లి కుండ


తాటి , ఈత , కొబ్బరి చెట్లతో పాటు కర్జూర , జేరిక చెట్ల నుంచి కూడా నీరా ఉత్పత్తి అవుతుంది. ఈత నీరా తెలంగాణా లోని శంకరపల్లెలో రుచిచూసినాను. టెంకాయ నీరా తిరుపతికి దగ్గర్లోనే పాడిపేటలో చవిచూసినాను. దుబాయ్ లో కర్జూరా నీరా టేస్ట్ చేసినాను. జపాన్ నీరా అమెరికాలోని కొన్ని రెస్టారెంట్లలో తీసుకొన్నాను.


కల్లు కుండలు


నీరా ఆల్కహాలు కాని సహజసిద్ధమయిన ఆరోగ్య ద్రావణం. ఎన్నో రకాల ఔషధగుణాలున్న నీరా ఎన్నో వ్యాధులను నివారించే ఆరోగ్య ప్రదాయిని. నీరా సహజ సిద్ధమయిన హెల్త్ డ్రింక్. శక్తినిచ్చే పానీయమే కాదు జీర్ణకోశ సంబంధిత ఔషధం. అజీర్తి , గ్యాస్ , మలబద్ధకం లాంటి రుగ్మతలను దూరం చేస్తుంది. కంటి చూపును చాలా వరకు మెరుగు పరుస్తుంది.

నీరాలో ఉండే ప్రోబయాటిక్స్ ఇమ్యూనిటీనీ పెంచుతుంది. నీరాలో ఉన్న అనేక రకాలైన మినరల్స్ రక్త కణాలును మెరుగు చేస్తుంది. సహజసిద్ధమయిన చక్కెర , విటమిన్ సి , ప్రోటీన్ విలువలు కలిగిన నీరా ఐరన్ లోపాన్ని సరిచేస్తుంది. 17 రకాలయిన అమైనో ఆసిడ్స్ ఇందులో ఉన్నాయని శాస్త్రీయ పరిశోధకులు తేల్చి చెప్పినారు. ఐనోస్టిక్ ఉండే ఈ పదార్ధం ఆరోగ్య ప్రదాయిని. ఇది చెట్టు నుండి తీసే మకరందం. దీనిని పామ్ నెక్టర్ ( palm nectar )అంటారు. మనదేశంలోనే కాకుండా పాకిస్థాన్ , శ్రీలంక , ఆఫ్రికా , మలేషియా , ఇండోనేషియా , థాయిలాండ్ , బర్మా లలో లభ్యమవుతున్నది. మనదేశంలోనయితే గుజరాత్ , మహారాష్ట్రలల్లో నీరా విక్రయకేంద్రాలు విరివిగా ఉన్నాయి. ఇటీవలనే తెలంగాణలో నెక్లెస్ రోడ్లులో నీరా కెఫె తెరచినారు. కర్నాటకలో ఈడిగ , బల్లవ తెగలవారు నీరా తీస్తారు.


తాజా తాటి కల్లు


మన రాష్ట్రంలో ఈడిగల కులవృత్తి ఇది. తమిళనాడులో దీన్ని పదనీర్ అంటారు. తెలంగాణా ప్రభుత్వం నీరాను ఒక ఆరోగ్యకర పానీయంగా అధికారికంగా ఆమోదించింది. కర్నాటక రాష్ట్రం తేది. 06-10-2016 న నీరా పాలసీని ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా ప్రకటించింది. కాండం భాగంలో పూత వచ్చే చోట గాట్లు పెడితే , ఆ చోటు నుంచి చుక్క చుక్క కారుతుంది. ఆ చుక్కల్ని వొడిసిపట్టడమే ఈడిగ నైపుణ్యం.

అక్కడ కుండను కట్టి , లేదూ ధర్మల్ క్యాన్లు కట్టి సేకరిస్తారు. తాటిచెట్లు ఎక్కటమే ఒక గొప్ప నైపుణ్యం. ఇప్పడు ఎక్కేవారు కరువైపోతున్నారు. లెక్కలేనన్ని చెట్లు ఆవురావురంటున్నాయి. నీరాను తాగాలంటే ఆ చెట్టు దగ్గరికి ఉదయం సూర్యోదయానికి ముందేపోతారు.




కుండను దింపించి అప్పటికపుడు తాగితేనే అదొక అమృతం. పొద్దుపోయిందా పులిచి కల్లు అవుతుంది. పరమకంపు. ఇప్పడయితే ఎక్కడ బడితే అక్కడ నీరా దొరుకుతుంది.


తాటి కల్లు ఇలా సేవించడంలోనే మజా


ఎన్నిగంటలయినా నీరా పాడవకుండా తాజాగా ధర్మల్ క్యాన్లలో దించుతున్నారు. మద్రాసులో సంవత్సరం పొడవుతా దొరికే తావును ఈ మధ్యనే పట్టుకున్నాను. ఇక్కడయితే నీరాలో తాటి ముంజలు జిలకొట్టి ఇస్తున్నారు. అదొక మధురాతి మధురమయిన రుచి. నీరా కెఫేలో బాటిల్స్ లో లభ్యమయ్యే నీరా అదొక రమ్యమయిన రుచి. రా నీరా రుచే రుచి.




ఈ రోజు అంతదూరం పోయి చెట్టెక్కే పోలయ్యతో కలిసి కనీసం రెండు లీటర్లు లాగించి మరో రెండు లీటర్లు ఐస్ ప్యాక్ చేసి తిరుపతికి తెచ్చుకొన్నాను. పోలయ్య నెల్లూరు జిల్లా , వెంకటగిరికి సమీపంలో గల డక్కిలి ( మినీ టౌన్ ) నుంచి ఎర్రగుంట కోట వచ్చి ఇరవై చెట్లను పాడుకుని కల్లు వ్యాపారం చేస్తున్నాడు. మాకోసం ప్రత్యేకంగా ఈ నీరాను అందించినాడు. నెల్లూరు జిల్లాలో వెంకటగిరి సమీపంలోగల గ్రామీణ ప్రాంతాలలో అంతటా నీరా విరివిగా లభ్యమవుతున్నది.


ఆరు గ్లాసుల టెంకాయ నీళ్ల కన్నా అధికంగా పోషకాలు కలిగిన ఒక గ్లాసు నీరాను ప్రభుత్వం కుటీర పరిశ్రమగా ప్రోత్సహించాలి. తాటి చెట్లను విరివిగా పెంచే కార్యక్రమం చేపట్టాలి. నాకు తెలిసి అన్ని ఔషధ గుణాలు కలిగిన నీరా కరోనా లాంటి ఘోరాలను దరికి కూడ చేరనివ్వదు.


Read More
Next Story