రాబందు లచట.. రాజ్యమేలుట సైతమారంభమయ్యే..
x
ప్రతీకాత్మక చిత్రం

రాబందు లచట.. రాజ్యమేలుట సైతమారంభమయ్యే..

సమాజంలోని అన్ని రంగాలను కలుషితం చేస్తున్న రాజకీయ రంగాన్ని ప్రక్షాళన చేస్తే రుగ్మతలన్నీ తొలగిపోతాయా..



వెన్నువిరిగిన పక్షులు కన్నుతెరచి
చూచునంతలో - వనమెల్ల క్షుభితమైన
వలస వచ్చిన చెనటి రాబందు లచట
రాజ్యమేలుట సైత మారంభమయ్యె !

దేశ సౌభాగ్యమ్ము దిద్ది తీర్చెదమంచు
పెనుపారు తెల్ల టోపీలు పెట్టి
జాతి సంస్కృతి గావ జన్మించినామంచు
వ్రేలాడు పెనుకండువాలు జుట్టి

వ్యక్తి జీవనబాట బాగు చేయుదమంచు
నయమొప్ప నెర్రజండాలు పట్టి
ప్రజలకే పట్టమ్ము ప్రజలె దేవుళ్ళంచు
రమణించు పచ్చ వస్త్రాలు గట్టి

పలురకమ్ముల వర్గముల్ ప్రభుత కొరకు
తీయ తీయని బాసలు సేయుచుండ
మర్మమెరుగని పక్షులమాయకముగ
తలలు పైకెత్తి సమ్మతి తెలుపుచుండె!


ఎవరి మట్టుకు వారు నాకేల యనుచు
కలుపు మొక్కల నశ్రద్ధ సలుపు నెడల
అచిరకాలాన వనమెల్ల ఆక్రమించి
అవియె మిగులును ఫలజాతులంతరించి !


హాస్టళ్ళు గుడులు విద్యాలయమ్ములు గూడ
కులములవారిగా వెలయుచుండ

విద్యార్ధి దశనుండి భేదభావాలనే
మనడెందములలోన జొనుపుచుండ

సవతి బిడ్డలవోలె అవమానములతోడ
కొందరు మనసులో క్రుంగుచుండ

ప్రతిభకు గుర్తింపు రాణింపు లేకుండ
ఉక్కుపాదాలతో తొక్కుచుండ

ఇంక మనమధ్య ఐక్యత ఎట్లు సాగు?
సాగునెడ వారి ఆటలు సాగవనుచు
తెలిసియే వారలు మనలను కలయనీక
ఆడుచున్నారు దోబూచి స్వార్ధపరులు!


ఏపుణ్యాత్ముడు బోణి కొట్టుటనొ కాని రాజకీయమ్మిటన్
వ్యాపారమ్ముగ నిలిచిపోయినది సర్వానర్ధ సంధాయియై,
ఏ పాపమ్మొనరించిరో ప్రజలు నేడీ దుస్థితిన్ గాంచ! దం
డోపాయమ్మున గాని మారదిది లెండోయీ ! ప్రజా రక్షకుల్!


వ్యక్తులను బట్టి గెలిపింపవలయుగాని
పేరులనుబట్టి పార్టీకి వేయరాదు
ఓటు ఒక్కటే ప్రజల ఆయుధము సూవె
అదియె బ్రహ్మాస్త్రమై చెడ్డ నాపవలయు!

⁃ సమాజంలోని అన్ని రంగాలను కలుషితం చేస్తున్న రాజకీయ రంగాన్ని ప్రక్షాళన చేస్తే రుగ్మతలన్నీ తొలగిపోతాయని కవి గారి ఆకాంక్ష.
⁃ కావ్యశ్రీ అన్న కలం పేరుతో అమలాపురం వాసి యైన కీ|| శే|| గుండాబత్తుల నారాయణరావు గారు ఓ ఇరవైఏళ్ళ క్రిందట " బ్రహ్మాస్త్రాలు " అన్న పేరున సుమారు రెండువందల యాభై పద్యాలున్న లఘు కావ్యం రాశారట. అందులోని లభించిన నాలుగు పద్యాలు మీతో పంచుకుంటున్నాను .
పిచ్చుకమీద బ్రహ్మాస్త్రమా? అనేది సామెత. ఆమాట చెప్పి బలహీనుల్ని కాపాడటం లోకంలో ఉంది. కానీ పిచ్చుక తానే రచ్చనుబడి బ్రహ్మాస్త్రములు అచ్చికలేకుండ వేయ ఆపతరమ్మే?
⁃ పిచ్చుకలన్నీ ఏకమవ్వాలేగానీ ఆతిరుగుబాటును ఆపటం ఎవరితరం? ఈఆలోచనతో ఈ కావ్యం రాయటమైనది - పూర్తి పుస్తకం లభించలేదు. ఎవరివద్దైనా ఉంటే తెలుపగలరు -

సెలవు
⁃ గొర్రెపాటి రమేష్ చంద్ర బాబు


Read More
Next Story