తెలంగాణ తియ్యటి ప్రత్యేకత ‘పోత్తాడి కల్లు’
x
కల్లు కుండలు (ఫోటో కర్టసీ: వీరా ఆగ్రోఫామ్స్)

తెలంగాణ తియ్యటి ప్రత్యేకత ‘పోత్తాడి కల్లు’

పోత్తాడి కల్లు అంటే ఏమిటో తెలుసా?


చాలమందికి తెలియకపోవచ్చు కూడా. దున్నపోతు, మేకపోతు అంటాం కదా! అవి మగవి. అలాగే తాడిచెట్టు పోతు. మగదురహంకారంలా తలెత్తుకు నిలబడే మగచెట్టు. ఆ చెట్టు నుంచి తీసే కల్లు శ్రేష్టమైనది. విశిష్టమైనది. రుచి కరమైనది. ఆరోగ్యకరమైనది.లేత ముంజెలు బాగా ముదిరి, గట్టి పడి కాయలయ్యాక, ఆ గెలల్ని తొలగిస్తే చెట్టు లోపల ఒక గట్టి కర్రలా వుంటుంది.దానికి కత్తితో గాటు పెడితే చుక్కా చుక్కా ...తియ్యగా ముంత నిండుతుంది. ఈ స్వచ్చమైన కల్లుని ‘కర్ర’ అంటారు. పచ్చని తాటాకులో ఒక ముక్క చించి, చివర ఆకుతోనే చిన్న ముడి వేస్తే, ఒక దొప్ప రెడీ అవుతుంది. దాన్ని రేక అంటారు. ఒక ప్లాస్టిక్ ఫిల్టర్ అడ్డుపెట్టి ముంతలో కల్లు రేకలోకి వొంచితే...గీత కార్మికుడైన ఒక పెద్దాయన వినయంగా వొంగి, ప్రేమగా పోస్తుంటే-అదొక అందం.

ఆకు చివర పెదవుల్ని ఆనించి,నెమ్మదిగా పీలుస్తూ, ఆ కల్లు గొంతులోకి జారుతుంటే,అది కదా ఆనందం! రేకడు కల్లు తాగి,కారంపచ్చడి నాలుక మీద రాసి, జేబులో చెయ్యి ‘పెట్టి’ తీసి,సిగిరెట్ వెలిగిస్తే చుట్టూ పచ్చని చెట్లు పలకరిస్తుంటాయి. మరో రేక గొంతులోకి దిగిందా,ఆ మధ్యాహ్నం ఎండ నెమ్మదిగా కరిగి వెన్నెలై విరబూస్తుంది. “ఇంకొంచెం పొయ్యనా సార్”అనేమాట చెవుల్లో తేనె పోసినట్టే వుంటుంది. చిన్న సరదాలు, చిన్న చిన్న సంతోషాలు,అతి తక్కువ ఖర్చు. అలా తెలంగాణ ఆప్యాయత, తెలంగాణ మంచితనం, మెల్లగా, కల్లు రుచి లాగా మనల్ని కావలించుకుంటాయి.

ఇంతకీ ఇదంతా ఎక్కడ?

మంచి కారులోనో,పిచ్చి కారులోనో హైదారాబాద్ నుంచి వెళుతుంటే,చౌటుప్పల్ వస్తుంది. కొద్ది దూరంలోనే నారాయణ్ పేట,అక్కడ రైట్ కి తిరిగాం. కిలోమీటర్ దాటి వెళితే, ఓ నిండైన మనిషి మా కారెక్కాడు. పెద్దాయన హనుమంతరెడ్డికి మిత్రుడు, పేరు వీర మల్ల సత్తెయ్య గౌడ్. తెల్ల చొక్కా, ప్యాంట్ లో హుందాగా వున్నాడు. మీ ఇంటిపేరు? అని అడిగా. ‘వీరమల్ల’ అని చెప్పాడు. దిట్టంగా,బలంగా,మంచి నలుపుతో, నుదుటి మీద బొట్టుతో బావున్నాడు. తక్కువ మాటలు ....ఆచితూచి మాట్లాడుతున్నాడు. 55 ఏళ్ళ వయసు. రాజకీయాలు,వ్యాపారం రెండూ తెలిసిన వాడు. చౌటుప్పల్ సొంత వూరు. “కల్లు తాగబట్టే ఇయ్యాల ఇట్లున్నం,ఆరోగ్యంగా,కల్లు మంచిది” అన్నాడు. మా పిల్లలు తీసిన కల్లు ఇది ....బయటి వాళ్ళకు అమ్మేది వేరుగా వుంటది అని వ్యాపార రహస్యం చెప్పాడు.

వీరమల్ల సత్తెయ్య గౌడ్

నారాయణ్ పూర్ నుంచి పది కిలోమీటర్లు లోపలికి వెళ్ళాం కొన్ని కొన్ని చిన్న గ్రామాల్ని దాటుకుని. ‘సర్వేల్’అనే చరిత్ర ప్రసిద్ధి చెందిన గ్రామంలో ఆగాం. రెండు లీటర్ల తాజా కల్లు తీసుకుని మరికొంత దూరం,డొంకల్లో ,ఇరుకు మట్టి దారుల్లో వెళితే తుమ్మచెట్లు పిలిచాయి. వేప చెట్టు కింద రాళ్ల మీద సెటిలయ్యాం. ఈలోగా మరో ముంత పట్టుకుని, 58 ఏళ్ళ పెద్దాయన ఉడుగు యాదయ్య గౌడ్ వచ్చాడు. మా ముగ్గురికీ మూడు రేకలు యిచ్చాడు. కల్లు వొంచి,యాదయ్య నించునే వున్నాడు. “ఎలా వుంది సార్”అని అడిగాడు. A perfect way to paradise అంటే అర్థం కాదని, వోహ్, దుమ్ముదుమ్ముగా వుంది, అదిరింది అని చెప్పాం. ఆకుపచ్చటి రేకలో మరీ బావుంటుంది అన్నాడు.

వుడుగు యాదయ్య గౌడ్

నీరా తాగితే ఆ మజా వేరు. ఈత కల్లు ఒక రేంజ్ లో వుంటుంది. జీలుగ కల్లు నెక్స్ట్ లెవల్. కల్లు కథ చాలా పెద్దది.సర్వేల్ కి వెళుతున్నప్పుడు దారి పొడవునా ఎర్రమందారాలు వేలాడుతూ,రోడ్డుకి రెండు వైపులా మొక్కలు. చాలా చోట్ల ఎర్ర జెండాలు. రెండు అమరవీరుల స్థూపాలు. కమ్యూనిస్టు పార్టీ తుపానై వీచినపుడూ,తెలంగాణ సాయుధ పోరాటంలోనూ,1964 లో పార్టీ చీలికకు ముందు చర్చలు జరిగిన ప్రాంతంగా, సర్వేల్ కి పేరుంది. పుచ్చలపల్లి సుందరయ్య ఈ రోడ్డు మీద ఎన్నిసార్లు నడిచి వెళ్ళారో అన్నారు హనుమంతరెడ్డి.

ఇక్కడ రాచకొండ దళం తుపాకులతో తిరిగిన రోజుల్లో,గడగడ వొణికిన భూస్వాములు పుంజాలు తెంపుకుని పారిపోయింది ఈ చుట్టుపక్కల గ్రామాలనించే!ఒకనాడు గీత కార్మికులు అనేకమంది తాటి చెట్లు ఎక్కి వున్నారు. గుంపులుగుంపులుగా వచ్చి పడిన పోలీసులు ఇక్కడే నక్సలైట్ల కోసం వెతుకుతున్నారు. అన్నలు ఈ పక్కనే జొన్న చేలల్లో దాక్కుని వున్నారు. వాళ్ళూ వీళ్ళూ అందరూ కనిపిస్తున్నారు చెట్ల మీద వున్నవాళ్ళకి! పోలీసులు నక్సలైట్లు ఎక్కడ దాగి వున్నారో కనిపెట్టలేకపోయారు అని చెప్పాడు వీరమల్ల సత్తెయ్య గౌడ్.

ఆయనకి సర్వేల్ లో సొంత ఇల్లు వుంది. తండ్రి నర్సింహ గౌడ్ కల్లు గీసేవాడు. పొలం పనికి వెళ్ళేవాడు. 80 ఏళ్ళ తల్లి లక్ష్మమ్మ ఇప్పటికీ తన పనులు తానే చేసుకుంటుంది. సత్తెయ్య పెద్ద కొడుకు అఖిల్ గౌడ్ ఇక్కడ బీటెక్ పూర్తి చేసి,పై చదువులకి అమెరికా వెళ్ళాడు. రెండోవాడు కరుణ్ గౌడ్ డిగ్రీ చదువుతున్నాడు. సత్తెయ్యది ఉద్యమాలతో కలిసి నడిచిన జీవితం. చాలా ఏళ్ళు చౌటుప్పల్ లో సి.పి.ఐ నాయకునిగా మంచిపేరు తెచ్చుకున్నాడు. ప్రత్యేక తెలంగాణ పోరాటంలో ముందు వరుసలో నిలబడి, జనాన్ని ఉత్తేజితుల్ని చేశాడు. అరెస్టయ్యాడు. కేసుల్లో ఇరికించారు. సిపిఐ నుంచి టి ఆర్ ఎస్ లోకి మారాడు. సంపదతో వున్న తెలంగాణను అప్పులపాలు చేశాడని కేసి ఆర్ ని వ్యతిరేకించాడు. ప్రస్తుతం కాంగ్రెస్ లో వున్నాడు“తెలంగాణ రావడం బావుంది. కేసి ఆర్ కుటుంబం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగింది”అన్నాడు ఒకింత నిరాశతో!సర్వేల్ లో 400 దాకా గౌడ కుటుంబాలు వున్నాయి. వాళ్ళ కులంలోనే పెళ్లిళ్లు జరుగుతాయి.బైటి వాళ్ళకి పిల్లనివ్వరు. మీ ఆడపిల్లలు మాలమాదిగల్ని ప్రేమిస్తే?అని అడిగాను. “జరుగుతుంటయ్,మనం ఏం జెయ్యలేం”అన్నాడు.

నీకు మంచి భోజనం అంటే ఏంటో?

నాటుకోడి,చేపల కూర ఇష్టం, చింతపండు చారు బాగా నచ్చుతుంది అన్నాడు.

మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళు కల్లు తాగుతారా?

అస్సలు తాగరు. ఎవ్వరూ తాగరు. మా గ్రామాల్లో తాగరు. ఇతర చోట్ల కొందరు తాగుతారు అన్నాడు సత్తెయ్య.

అది కఠినమైన కట్టుబాటు. తరతరాల సంప్రదాయం. పురుషాధిపత్య సమాజం రాసిన శిలాశాసనం!మస్తుగా కల్లు తాగి ఇంటికెళ్ళే మొగాడే గౌడ్. నోర్మూసుకుని వండి, వడ్డించే అణకువైన ఆడదే పెళ్ళాం!

గౌడ కులస్తుల దేవుడు కాటమయ్య, పరమశివుని ప్రతిరూపం. ఇక్కడ కాటమయ్య గుడి వుంది. ప్రతి మే నెలలో పండగ సంబరం జరుగుతుంది. ముంజేతికి నాలుగైదు ఎర్రని తాళ్ళు కట్టుకుని వున్న,వీరమల్లు సత్తెయ్య గౌడ్ భక్తుడు. నోములు నోచుకుంటాడు.పూజలు చేస్తాడు. ఆ దేవుని దయ వల్లే ఇల్లు కొన్నాను అంటాడు.

నోములు అంటే ఏం చేస్తారు?

దీపావళి నోము వుంటది,గౌరమ్మని పూజిస్తాం.ఒక్క పొద్దు వుంటాం. బ్రాహ్మణ్ణి పిలుస్తాం. అమ్మవారి కథ చెప్పిస్తాం. పంతులుకి వెయ్యో రెండు వేలో యిస్తాం. ఇంకా, శేరుంపావు బియ్యం, పళ్ళు, పప్పులు అయ్యగారికి యిస్తాం అని అయిదో క్లాసు మాత్రమే చదివిన గౌడ్ చెప్పాడు.

నమ్మకం వాళ్ళని నడిపిస్తుంది. ఆ దుర్భేద్యమైన వెనుకబాటుతనమే వాళ్ళకి రక్ష.సంప్రదాయం,అజ్ఞానమే వాళ్ళ సంపద. ప్రతి శనివారం గుడికి వెళ్తాడు. రేణుకా ఎల్లమ్మని పూజిస్తాడు. శక్తివంతమైన ఆ గ్రామదేవత ఆశీర్వదిస్తుందని మనసా వాచా నమ్ముతాడు. కమ్యూనిస్టులని గౌరవిస్తాడు. సి.పి.ఐ,నాయకులు ధర్మభిక్షం,సురవరం సుధాకరరెడ్డి,నారాయణా బాగా తెలుసని ఆనందంగా చెబుతాడు. సర్వేల్ లో ఎన్ కౌంటర్లు జరిగాయి. దళ కమాండర్ జనార్ధన్, దళిత హీరో పప్పుల మల్లేష్ , ఈసం లింగ స్వాములను ఎన్ కౌంటర్ల పేరుతో చంపడం తెలుసని చెప్పాడు.

“నాకు కులం లేదు.ఎవ్వరితోనైనా స్నేహంగా,గౌరవంగా వుంటాను.రెడ్లు అనేకమంది నాకు మంచి దోస్తులు”అని చెప్పిన వీరమల్లు సత్తెయ్య గౌడ్,చివరి రేక కల్లు ముగించి,”పదండి వెళ్దాం “అన్నాడు.

ఉమ్మడి నల్గొండ-యాదాద్రి భువనగిరి జిల్లా,సంస్థాన్ నారాయణ్ పూర్ మండలం,సర్వేల్ గ్రామంలో ఒక శనివారం మధ్యాహ్నం కమ్మటి కల్లు కబుర్లివి! నవంబర్ 1 నుంచి పోత్తాడి కల్లు సీజన్ మొదలవుతుంది. ఈ ప్రత్యేకమైన కల్లు పండుగ మూడు,నాలుగు నెలలు మాత్రమే వుంటుంది. చలో చౌటుప్పల్....

Read More
Next Story