
తెలంగాణకు ఫాస్ట్ ఫుడ్ ముప్పు !
నగర జీవనశైలి, ఆహారపు మార్పులతో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని తాజా అధ్యయనం హెచ్చరిక.
తెలంగాణ నగరాలు ప్రమాదంలో ఉన్నాయి. విపరీతంగా ఫాస్ట్ ఫుడ్ తినేస్తూ డయాబెటీస్ ఉచ్చులో పడే ప్రమాదానికి ఆమడ దూరంలోనే ఉంది. తెలంగాణ నగరాల్లో ఆహారం కోసం ఖర్చు చేసే ప్రతి రూ.3ల్లో ఒక రూపాయి ఫాస్ట్ ఫుడ్‌కు ఖర్చు అవుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. ఇది రోజురోజుకు ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందని నిపుణులు వివరిస్తున్నారు. జీవనశైలి, బిజీ లైఫ్ ఇలా కారణాలు ఏవైనా.. ఫాస్ట్ ఫుడ్ తినే అలవాటు ప్రస్తుతం ప్రమాదకర స్థాయిలో ఉందని నిపుణులు వెల్లడించారు. ఫాస్ట్ ఫుడ్ తినే విషయంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానాల్లో ఒకటిగా నిలిచిందని తాజా అధ్యయనం స్పష్టం చేసింది.
ఈ అంశాలు ఫాస్ట్ ఫుడ్ అట్రిబ్యూటెడ్ డయాబెటీస్ ఇండెక్స్ స్టడీ (FADIS)లో వెల్లడయ్యాయి. ఈ పరిశోధనను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు చెందిన ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురించారు. మాయో క్లీనిక్, యూనివర్సిటీ ఆఫ్ అలబామాతో కలిసి ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో ఫాస్ట్ ఫుడ్ విషయంలో దక్షిణ భారత రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో ఉందని స్పష్టమైంది.
ఆహారపు అలవాట్లలో పెద్ద మార్పు
సంప్రదాయ వంటకాల నుంచి ప్రాసెస్ చేసిన, అధిక కాలరీల ఫాస్ట్ ఫుడ్ వైపు ప్రజలు వేగంగా మారుతున్నారని అధ్యయనం గుర్తించింది. ఇలాంటి ఆహారాల్లో చక్కెరలు, రిఫైన్డ్ పిండి, ప్రాసెస్ చేసిన నూనెలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరుగుతున్నాయని పేర్కొంది. అలాగే ట్రాన్స్ ఫ్యాట్స్, అధిక ఉప్పు కారణంగా ఇన్సులిన్ నిరోధకత, బరువు పెరుగుదల వంటి సమస్యలు పెరుగుతున్నాయని తెలిపింది. పెద్ద పరిమాణంలో, తరచూ ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంపై నిరంతర ఒత్తిడి పడుతోందని వివరించింది.
లైఫ్‌స్టైలే ప్రధాన కారణం
ఈ పరిస్థితికి నగర జీవనశైలే ప్రధాన కారణమని అధ్యయనం సూచించింది. వేగంగా విస్తరిస్తున్న నగరాలు, ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉద్యోగాల పెరుగుదలతో జీవనశైలి మారిందని పేర్కొంది. దీర్ఘకాల పని గంటలు, కూర్చునే జీవన విధానం, ఫుడ్ డెలివరీలపై ఆధారపడటం పెరిగినట్లు తెలిపింది. ఫాస్ట్ ఫుడ్ సులభంగా అందుబాటులో ఉండటం వల్ల సంప్రదాయ ఆహారం క్రమంగా తగ్గిపోతోందని గుర్తించింది.
మహిళల్లో ప్రమాదం ఎక్కువ
పట్టణాల్లో పురుషుల్లో సుమారు 3.8 శాతం మందికి డయాబెటిస్ ఉన్నట్లు అధ్యయనం తెలిపింది. అయితే మహిళల్లో స్థూలకాయం శాతం దీనికంటే ఎక్కువగా ఉందని గుర్తించారు. ఈ పరిస్థితి భవిష్యత్తులో డయాబెటిస్ కేసులు పెరిగే అవకాశానికి సంకేతంగా ఉందని పరిశోధకులు అభిప్రాయపడ్డట్లు వెల్లడించింది. మహిళల్లో పెరుగుతున్న బరువు, తక్కువ శారీరక చురుకుదనం భవిష్యత్ ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని సూచించింది.
గ్రామాల్లో తక్కువ
నగరాల్లో ఫాస్ట్ ఫుడ్ వినియోగం, డయాబెటిస్ మధ్య బలమైన సంబంధం కనిపించింది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఫాస్ట్ ఫుడ్, డయాబెటీస్ మధ్య సంబంధం లెక్కల ప్రకారం చాలా తక్కువగా ఉందని అధ్యయనం స్పష్టం చేసింది. అందుకు గ్రామాల్లో ఫాస్ట్ ఫుడ్ అందుబాటు తక్కువగా ఉండటం, శారీరక శ్రమ ఎక్కువగా ఉండటం, ఇంట్లో వండిన వంటకాలు ఎక్కువగా తీసుకోవడం వంటివి ప్రధాన కారణాలు కావొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
దీర్ఘకాల ప్రభావాలు
నగరాల్లో ఆహారపు అలవాట్లు ఇదే తరహాలో కొనసాగితే ఆరోగ్య వ్యవస్థపై భారం పెరిగే అవకాశం ఉందని అధ్యయనం హెచ్చరించింది. డయాబెటిస్‌తో పాటు గుండె వ్యాధులు, కిడ్నీ సమస్యలు, స్థూలకాయం వంటి అనుబంధ సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని సూచించింది. అలాగే వైద్య ఖర్చులు పెరగడం, పనితీరు తగ్గడం వంటి ఆర్థిక ప్రభావాలు కూడా ఉండవచ్చని తెలిపింది.
నిపుణులు ఏమంటున్నారంటే
ఈ అధ్యయనం ఆధారంగా నిపుణులు జీవనశైలిలో వేగంగా మార్పులు జరుగుతున్నాయని భావించినట్లు పేర్కొంది. ఆహారపు అలవాట్ల మార్పు ఆరోగ్య అవగాహన కంటే వేగంగా జరుగుతోందని వారు సూచించినట్లు తెలిపింది. ముఖ్యంగా ఆహార నియంత్రణ, జీవనశైలి మార్పులు, ముందస్తు పరీక్షలు అవసరమని వారు సూచించినట్లు అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా మహిళల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని అభిప్రాయపడినట్లు పేర్కొంది.
ఫాస్ట్ ఫుడ్ వినియోగం ఇప్పుడు అప్పుడప్పుడు కాకుండా రోజువారీ అలవాటుగా మారిందని అధ్యయనం స్పష్టం చేసింది. ఇది కేవలం ఆహారపు మార్పు కాదు, నగర జీవన విధానంలో వచ్చిన పెద్ద మార్పు అని పేర్కొంది. డయాబెటిస్ ఇప్పుడు కేవలం వారసత్వ సమస్య కాకుండా జీవనశైలి ఆధారిత వ్యాధిగా మారుతోందని ఈ పరిశోధన సూచించింది. మొత్తంగా తెలంగాణ నగరాల్లో మారుతున్న ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. భవిష్యత్తులో ఈ సమస్యను నియంత్రించేందుకు తీసుకునే చర్యలు కీలకంగా మారనున్నాయి.

