
సర్పంచ్ ఎన్నికల చిత్రం
‘‘మా తలుపు ఎవరు తట్టట్లేదు’’
ఎప్పుడైన ఏడు నుంచి పది గంటల లోపే వచ్చేవాళ్లు ఇవ్వాళ పత్తాలేరు
నిన్న రాత్రి మొత్తం ఇంటి ముందు ఎవరూ లైట్ ఆఫ్ చేయలేదు. వీధి మొత్తం కూడా టీవీ సీరియళ్ల సౌండ్ వినిపిస్తూనే ఉంది. ఎవరూ నిద్ర పోయినట్లు కనిపించడం లేదు. అంతా ఎవరైనా వస్తారని ఎదురు చూస్తున్నట్లే ఉంది.
ఎప్పుడు ఎనిమిది గంటలకల్లా నిద్రపొయ్యే లింగయ్య కూడా ఇవ్వాళ టైమ్ పదయిన కునుకు తీయట్లేదు. ఎందుకో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికి పదిహేను రోజులుగా సర్పంచ్ ఎన్నికల ప్రచారం జరుగుతోంది.
రేపే పోలింగ్. ఇన్ని రోజులు ఒక ఎత్తు.. ఈ రోజు రాత్రి ఒక ఎత్తు. వీధికో పోలీస్ పెట్టిన ఈ కార్యక్రమం ఆపలేరు. అందుకే రాత్రి పదయిన ఎవరూ పడుకోలేదు. పడుకోలేరు కూడా.
లింగయ్య ఎవరెవరికో ఫోన్ చేస్తున్నాడు. కొంతమంది ఫోన్ ఎత్తి మాట్లాడుతున్నారు మరికొంతమంది మాట్లాడట్లేదు. కానీ మధ్య ‘‘ఆ ఆ ఆ.. అంతే అంతే.. అంటున్నాడు’’
ఏ వాడకు ఎంత ఎంత ఇస్తున్నారు. పంచేది ఎవరూ? అని ఆరాలు తీస్తున్నట్లు చూచాయగా మాటలు వినిపిస్తున్నాయి. నిజంగా ఈ రాత్రి లింగయ్యకు నిద్రరాదు. పది రోజులుగా అందరు అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించాడు.
ఎవరూ పిలిచిన వెళ్లాడు. వెళ్ళినందుకు పొద్దున్న రెండు వందలు, సాయంత్రం రెండు వందలు వసూలు చేశాడు. కొన్నిసార్లు అదనంగా క్వాటర్ విత్ వాటర్ వసూలు చేశాడు. మొత్తానికి పదిరోజుల్లో పదివేల దాకా వెనకేశాడు.
వస్తారనుకున్న వాళ్లు ఎంతకి రాకపోవడంతో చికాకుగా అటు ఇటూ పచార్లు చేశాడు. చివరకు ఎటూ అర్థంకాక ఇంటి ఎదురుగా ఉన్న వార్డు మెంబర్ గా పోటీ చేస్తున్న సురేశ్ ఇంటికి వెళ్లాడు
‘‘సురేష్.. సురేష్..’’ అంటూ పిలిచాడు లింగయ్య.
‘‘ఏందీ మామయ్య’’ అంటూ బయటకు వచ్చింది సురేశ్ భార్య.
‘‘ పొద్దున్న ఓట్లు.. ఇంకా మా ఇంటికి ఎవరూ రాలేదు. ఏమైంది. సురేష్ లేడా ఇంట్లో’’ అని అడుగుతున్నాడు.
‘‘లేడు మాయయ్య. సాయంత్రం బయటకు పోయిండు. ఇంకా రాలేదు. ఫోన్ చేసిన ఎత్తుతలేడు’’ అని సురేశ్ భార్య చెప్పింది.
‘‘సరే సరే అనుకుంటూ బయటకు వచ్చాడు’’ లింగయ్య
పక్కనే ఉన్న మరో ఇల్లు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. చూస్తే వాడ మొత్తంలో వీళ్ల ఒక్క ఇంట్లోనే నిద్రపోయినట్లు కనిపిస్తోంది. తమ ఇంటికి వచ్చేవాళ్లు ఎవరూ లేరన్నట్లుగా ఉంది పరిస్థితి.
ఇద్దరు అన్నతమ్ముళ్లు బాగానే సంపాదిస్తున్నారు. ఈ మధ్యే కొత్త ఇళ్లు కట్టుకున్నారు. నెల నెలా ఈఎంఐలు కడుతూ.. నోట్లో మాట బయటకు రాకుండా బతుకుతున్నారు.
ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నా.. ఎవరి పక్షాన ప్రచారం చేయలేదు. వాళ్ల ఇంటికి వెళ్లి తలుపు తట్టాలా వద్దా అని లింగయ్య కొద్దిసేపు ఆలోచించాడు. చివరకు వాళ్ల తలుపు దగ్గరకు వెళ్లి పిలిచాడు.
‘‘రామవ్వ.. ఓ రామవ్వ.. ’’ అంటూ లింగయ్య కాస్త గట్టిగానే పిలిచాడు. ఇంట్లో ఫ్యాన్ల సౌండ్ వినిపిస్తోంది. ఎవరూ వినిపించుకున్నట్లు కనిపించలేదు. మరోసారి పిలవాలని అనుకోలేదు లింగయ్య.
తన ఇంటికి వెళ్లడానికి మెట్ల మీదుగా కిందకి దిగాడు. ఎవరికి లేని ఆరాటం తనకెందుకు? తనకు వచ్చేది ఎలాగూ వస్తుంది. వస్తేనే చిన్నబడికి వెళ్తాను. తమ వార్డు పోలింగ్ అక్కడే జరుగుతుంది. ఎవరూ తన ఇంటికి రాకపోతే నేను పోను. మనసులో అనుకున్నాడు లింగయ్య.
కొద్దిసేపు మంచంలో కూర్చొని ఆలోచించాడు. కాసేపు కునుకు తీద్దామని టైమ్ చూశాడు. రాత్రి పదకొండు అవుతోంది. అయిన వాడకు ఎవరూ రాలేదు. అసలే తమ వాడ ఊరికి అవతల ఉంది.
పక్కనే మాలపల్లే ఉంటుంది. ముందు ఊరంతా తిరిగి మా దగ్గరికి రావాలి. పడుకుంటే ఎవరైన వచ్చి పోతే.. ఎలా.. దర్వాజ దిక్కు చూసుకుంటూనే అనుకున్నాడు.
‘‘సారవ్వ.. ఓ సారవ్వ.. గా సీసా ఇటు తీసుకురావే’’ అని భార్యను గట్టిగా పిలిచాడు.
‘‘ఎందుకు అట్ల మొత్తుకుంటానవ్.. అర్థరాత్రి అయింది. ఇప్పడు తాగి ఏం చేస్తావ్’’ అంటూ గట్టిగా మందలిచ్చింది.
‘‘తేవే.. ఓ పెగ్గేసుకుంటా. కుదిరితే కొటర్ మొత్తం ఓడగొడతా.. పుక్యానికి వచ్చిందే కదా’’ పెళ్లాన్ని కసురుకున్నాడు లింగయ్య
గులుగుకుంటూనే సీస, డిస్పోజల్ గ్లాస్, చెంబులో మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది సారవ్వ.
సీస తీసుకున్న లింగయ్య, ఇంటి ముందున్న రేకుల కింద ఉన్న మంచాన్ని కిందకు జరుపుకున్నాడు. ఎదురుగా చిన్న స్టూల్ వేసుకున్నాడు. సీస మూత తీసి.. గట్టిగా ఊపి, ఎర్రటి మందును గ్లాస్ లోకి వంపుకున్నాడు.
దాంట్లోకి నీళ్లను కలుపుకుని నోట్లోకి అనించాడు. చేదుగా మందు లోపలికి వెళ్తుంటే.. శరీరంలో వేడీ పుట్టడం ప్రారంభం అయింది. వాళ్లు ఎప్పుడు వస్తారో అని బాగా తిట్టుకున్నాడు.
ఎమ్మెల్యే ఎన్నికల్లో రాత్రి పదింటి వరకే వచ్చారు. తరువాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఏడుగంటలకే వచ్చారు. అంతకుముందు జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో రాత్రి పది, పదకొండు మధ్యలో వచ్చారు. ఇప్పుడు పదకొండు దాటిని ఎవడూ రావట్లేదు.
ఎమ్మెల్యే ఎన్నికల టైంలో ఇంటిపక్కొళ్లు లేకుంటే.. వాళ్లకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు. ఈసారి తనకు అలా జరగొద్దని, లైట్ వేసి మరీ ఎదురుచూస్తున్నా.. ఎవరు రావట్లేదు. తనలో తాను ఆలోచించుకుంటూనే సీసా మొత్తం ఖాళీ చేశాడు.
అలా అనుకుంటూనే మంచంలో ఓ వైపు ఒరిగాడు. ఏదో శబ్దం కావడంతో లింగయ్య లేచి కూర్చున్నాడు. చూస్తే కడుపులో ప్రేగులు ఏదో పిలిచినట్లు అనిపించింది. త్వరగా బాత్రూం వెళ్లి వచ్చాడు. ఆలాపనగా టైం దిక్కు చూస్తే రెండు అవుతోంది.
‘‘ముండా కొడుకులు ఇంకా రాలేదు. ఏడ తిరుగుతున్నారో బిత్తిరి పొరగాళ్లు’’ మనసులో మరోసారి కసిగా తిట్టుకున్నాడు.
పక్కన ఎవరో గట్టిగా మాట్లాడినట్లు మాటలు వినిపిస్తున్నాయి. రామవ్వ పెద్ద కొడుకు మాట వినిపిస్తోంది. ఏదో వద్దంటున్నాడు. మీరు వాళ్ల వైపు ఉన్నారు కదా అని.. ఎవరో అంటున్నారు.
మొన్న మేము ఇచ్చిన మందు తీసుకోలేదు. ఇప్పుడు వీటిని కూడా వద్దంటున్నారు. కచ్చితంగా మీరు మమ్మల్ని సపోర్టు చేయట్లేదనే మాటలు వినిపిస్తున్నాయి.
తరువాత ఎవరో వెళ్లిపోతున్నట్లు బండి సౌండ్ వినిపించింది. ‘
‘వాళ్లు ఇచ్చింది తీసుకోకపోతే మనల్ని ఎవడు నమ్మటట్లు లేరే అవ్వ’’ అంటున్న మాటలు కూడా వినిపించాయి
ఈ వాడకు మొదటి ఇల్లు రామవ్వ వాళ్లదే. తరువాత తన ఇంటికి రాకుండా ఏటో వెళ్లిపోతున్నారు. లింగయ్యకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇంకొద్ది సేపు అయితే తెల్లారుతుంది. అయిన తన ఇంటికి రాలేదు. ఇంటిలోకి వెళ్లి మరో సీసా తెచ్చుకుని తాగడం పూర్తి చేశాడు.
మళ్లీ ఎంత సేపు పడుకున్నాడో తెలియదు. తెల్లవారి 5.30 నిమిషాలకు ఎవరో లింగయ్య.. లింగయ్య బాపు అని ఎవరో పిలుస్తున్నారు. అప్పుడు లేచాడు లింగయ్య. వచ్చింది వాళ్లే.. వాళ్ల జేబుల వైపు లింగయ్య చూశాడు.
‘‘తెల్లారితే సర్పంచ్ ఎన్నికలు. ముగ్గురి కలిసి ఇవి. మన గుర్తు మర్చిపోవుగా’’ వచ్చిన వాళ్లు అన్నారు.
‘‘గట్లేట్లా యాది మరుత్త’’ లింగయ్య చెప్తున్నాడు. చేతిలో వాటిని లెక్కపెడుతూ..
Next Story

