NASA (File photo)

జీవీ ఎక్కడ పుట్టడో, జీవితం ఎక్కడ ప్రారంభమైందో తేలలేదు. మనిషిని పోలిన మనిషి ఉన్నాడో లేడో.. గ్రహాంతరాలలో అన్వేషణ సాగుతూనే ఉంది. ఏమో.. ఏదో ఒకనాడు గుర్రం ఎగరావచ్చు.


కౌంట్‌డౌన్‌.. 10..9..8..7..6..5..4.. 3.. 2.. 1.. 0.. ఫైర్‌..

అంతే.. నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిరి పోతున్నాం. గంటకు 58 వేల కిలోమీటర్ల జెట్‌ స్పీడ్‌.. చెవులు చిల్లులు పడేంత మోత.. వ్యోమాగామి (ఆస్ట్రోనాట్స్‌) సీటు పక్కనున్న రాడార్‌ను కదిలించా.. భూ గ్రహాన్ని దాటాం. చంద్రుణ్ణి చుట్టాం. భూమికి చెల్లంటున్న శుక్ర (వీనస్‌) గ్రహాన్ని చేరాం.. మేమున్న మాడ్యూల్‌ ఇంకా ల్యాండ్‌ కాలేదు.. గ్రౌండ్‌ కంట్రోల్‌ సంకేతాల కోసం ఎదురుచూపులు..

ఇంతలో ’హలో. యువర్‌ టైం ఈజ్‌ అప్‌.. గెట్‌ డౌన్‌ ప్లీజ్‌’ అన్నారు వాళ్లు.

అంతరిక్షం.. అపార విజ్ఞానం.. అంతుపట్టని వ్యవహారం.. ఎక్కడేముందో తెలియదు.. కనిపెట్టాలని మానవుడు.. కలిసి రాని గ్రహస్థితులు.. రేపో మాపో మీ అంతు చూస్తాం.. మా ఊరికి పోయోచ్చినట్టే మీ దగ్గరికీ వచ్చిపోతాం.. అని మనిషి పంతం. మొత్తం మీద దేవుణ్ణి మించిన మత్తు ఖగోళానిది. అదో తీరని దాహం. అంతులేని అగాధం..

25 ఫిబ్రవరి 2021.. నాసా అంతరిక్ష కేంద్రం, హూస్టన్‌..

మనకీ మార్స్‌ (అంగారక) గ్రహానికి 31,12,20,000 కిలోమీటర్ల దూరం. ఏకంగా అక్కడికే వేస్తున్నారు నిచ్చెన్లు. ఆ సుందర దృశ్యం కోసం మానవాళి ఎదురుచూపులు.. ఈలోగా మామూలు మనుషులూ చందమామను తాకొస్తారు. అడ్వాన్స్‌ టిక్కెట్ల బుకింగూ మొదలైంది. 50 ఏళ్లు దాటినోళ్లకీ ఛాన్స్‌ లేదు. సో, నాకూ లేనట్టే..

అందుకే నాకీ రోజు ప్రత్యేకం. అమెరికా.. టెక్సాస్‌లోని హూస్టన్‌. చారిత్రాత్మక నగరం. సముద్రానికి ఎంత దగ్గరుందో అంతరిక్ష పరిశోధన, శిక్షణకు అంత అనువైన –నాసా జాన్సన్‌ స్పెస్‌ సెంటర్‌– ఉంది. 1620 ఎకరాలు, వంద భవనాలు.. సువిశాల ప్రాంగణం..

ఫిబ్రవరి 24న హూస్టన్‌ డౌన్‌టౌన్‌ చేరేపాటికి మధ్యాహ్నం 1 గంట దాటింది. 2లోపు అక్కడికి చేరాలి. చలి గాలీ, చిరుజల్లులు..వెన్నులో వణుకు. వెళ్తామో.. లేదో.. ఎక్కడో చిన్న శంక.. ఎట్టకేలకు 1.40 ప్రాంతంలో కారు పార్క్‌ చేశాం. బాటా కంపెనీ మాదిరి మనిషికి 29.95 డాలర్ల టిక్కెట్‌. 5 డాలర్ల పార్కింగ్‌ ఫీజు. సెక్యూరిటీ చెక్, కరోనా ప్రోటోకాల్‌ దాటి స్పేస్‌ సెంటర్‌ లోనికి వెళ్లాం.

నింగిలోని ఓ చుక్క కోసం..

నోట మాటొస్తే వొట్టు. థ్రిల్లింగ్‌.. వేరే లోకానికి వెళ్లిన ఫీలింగ్‌. అంతరిక్షంలో వ్యోమాగాములు తిరుగుతున్నారు. రాకెట్లు దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఐఎస్‌ఎస్‌) అటూ ఇటూ తిరుగుతోంది. జాబిల్లి నుంచి తెచ్చిన రాయి చుట్టూ సందర్శకులు, స్పేస్‌ సూట్‌ వేసుకునే హడావిడిలో కొందరు.. అపోలో రాకెట్‌ ఎక్కిన అనుభవాన్ని మూటగట్టుకునే పనిలో మరికొందరు, మార్స్‌ గ్రహంపైకి పోతే ఎలా ఉంటుందో.. కూర్చీలలో కూర్చుని తల పైనున్న కంప్యూటర్‌ స్క్రీన్‌లో చూస్తూ ఫీల్‌ అయ్యేవారు ఇంకొందరు.. అప్పటికే ప్రయోగించిన రాకెట్లు, 60 ఏళ్ల ఖగోళ యాత్రను కళ్లకు కట్టే చిత్రాలు, అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి ఆస్ట్రోనాట్‌ యూరీ గగారిన్, నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ మొదలు కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాకేష్‌ శర్మ వరకు.. ఎందరెందరో వ్యోమాగాముల ఫోటోలు.. ఆ గ్యాలరీని పిల్లలకు చూపిస్తూ.. నాన్నా, ఆస్ట్రోనాట్‌ అవుతావా, పైలెట్‌ అవుతావా అంటున్న తల్లిదండ్రులు.. ఇలా ఎన్నో..

కల్పనా చావ్లా.. కనిపించమ్మా..

నేనూ చంద్రుడి మీద రాయిని ఓసారి తాకి తన్మయత్వం పొందా. జాబిల్లి మీదకు పోయోచ్చానన్న అనుభూతి. ఆ పక్కనే మన మూలాలున్న అమ్మాయి కల్పనా చావ్లా బొమ్మ. అంతరిక్షంలో అడుగుపెట్టి.. తిరిగొస్తూ కానరాని లోకాల్లో వెతుకులాటకు వెళ్లింది. మహిళలు ఎందులోనూ ఎవ్వరికీ తీసిపోరని నిరూపించింది. అటువంటి మనిషి ఇలా వెళ్లిపోయిందేనని విచారం.. యూరీ గగారిన్, నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ పాదాలను తాకా.. నేనూ మనిషినేనన్న నల్లజాతీయుడు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ చిత్రానికి మనసులో నమస్కరించి.. డెస్టినీ థియేటర్‌లోకి వెళ్లాం.

కెన్నడీ పిలుస్తున్నాడు, పద...

పోడియం నుంచి జాన్‌ ఎఫ్‌ కెన్నడీ ’పిలుపు’. సీట్లలో కూర్చున్నాం. చందమామ మీదకు బయలుదేరామన్నాడు. ఖగోళాన్ని గాలించే పనిలో పడ్డాం. ముందెళ్లిన సోవియెట్‌ యూనియన్‌ ఏమి చేసిందో చెప్పారు. ఇక ముందు ఏమి జరగబోతుందో బొమ్మలతో సహా చూపించారు. కెన్నడీతో ఫోటో దిగాం. బయటికొచ్చాం. ఎదురుగ్గా ఐఎస్‌ఎస్‌.. కొన్ని దేశాలు కలిసి ఈ స్టేషన్ను ఏర్పాటు చేశాయి. భూమి నుంచి వెళ్లే వ్యోమాగాములు అందులో ఆరేడు నెలలుండి వస్తుంటారు. అప్పుడు వాళ్లు ఏమి చేస్తారో, ఎలా ఉంటారో చూపిస్తున్నారు. అర్థం కాలేదంటే మళ్లీ చెబుతున్నారు. ఎంతసేపని ఆకాశం వైపు తలెత్తిచూస్తారు.. పైనుంచి భూమి ఎలా ఉంటుందో చూడండని చూపిస్తున్నారు. ఇవన్నీ చూస్తూ అసలైన ట్రామ్‌ టూర్‌ను మరిచాం. ఇంతలో అనౌన్స్‌మెంట్‌.. లాస్ట్‌ ట్రిప్‌ ట్రామ్‌ టూర్‌ కోసం గేట్‌ వద్దకు రమ్మన్నారు.. (ప్రత్యేకమైన టిక్కెట్‌ ఉండదు) ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నా.. స్పేస్‌ ప్లాజా సందర్శనకు బ్రేక్‌..

ట్రామ్‌ టూరే పెద్ద ఆకర్షణ..

జనం క్యూ.. ట్రామ్‌ రైలు వచ్చింది. రెడ్‌ స్పేస్‌ ఎక్స్‌ప్లోరర్‌ బాగ్స్‌ వేసుకున్న సిబ్బంది.. మందిని బట్టి సీట్లలో కూర్చోబెట్టారు. మేం ముందున్నాం. నాసా స్పేస్‌ సెంటర్‌ మొత్తం చూడాలంటే ఇది ఎక్కాల్సిందే. ట్రామ్‌ కదిలింది. ఏడెనిమిది నిమిషాల తర్వాత ఆస్ట్రోనాట్స్‌ శిక్షణా కేంద్రానికి చేరాం. మొదటి అంతస్తుకు వెళ్లాం.

ఆస్ట్రోనాట్స్‌కు శిక్షణ ఎలా ఉందంటే..

ఇతర గ్రహాల మీదకు వెళ్లే ఆస్ట్రోనాట్స్‌కు ఎలా శిక్షణ ఇస్తారో నాసా గైడ్‌ వివరిస్తున్నాడు. గ్రహాల మీద దిగే మనుషులు వేసుకునే డ్రస్‌లు, తిరిగే వ్యోమా నౌకలు, భూమికి ఫోటోలు పంపే కెమోరాలు, ఉపగ్రహాలలో వ్యోమాగాములు కూర్చునే మాడ్యూల్, శూన్యంలో పరిస్థితి, భూమి నుంచి వెళ్లే శాటిలైట్లను అంతర్జాతీయ స్పేస్‌ సెంటర్‌తో ఎలా కలపుతారు వంటి అనేకంపై శిక్షణను చూడవచ్చు. (ఇప్పుడక్కడ మార్స్‌పైకి పంపే రోబోలకు శిక్షణ జరుగుతోంది) ఫోటోలు, వీడియోలు తీసుకున్నాం. అక్కడి నుంచి మామూలుగానైతే మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌కు తీసుకువెళతారు. కరోనాతో ఇప్పుడు సందర్శకులను రానివ్వడం లేదు. లేకుంటే పైనున్న ఉపగ్రహాలను మనిషి కింది నుంచి కంప్యూటర్‌లో ఎలా కంట్రోల్‌ చేస్తాడో తెలుసుకోవచ్చు.

అతిపెద్ద రాకెట్‌ పార్క్‌...

ట్రామ్‌ రైలు రాకెట్‌ పార్క్‌కి దారితీసింది. అక్కడ అతిపెద్ద రాకెట్‌– శాటరన్‌–5ని, చందమామపై తొలి అడుగేసిన నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ ప్రయోణించిన అపోలో ఉపగ్రహంలోని టైమ్‌ కాప్సూల్‌ను చూసి అబ్బురపడతాం. ఆకాశంలో బారెడు పొడవున కనిపించే ఒక రాకెట్‌ ప్రయోగం వెనుక ఇంత కష్టం ఉంటుందా? అని విస్తుపోతాం. అది చూసి ట్రామ్‌ ఎక్కిన చోటికి వచ్చాం. దిగి కాఫీ క్లబ్‌లోకి పోవచ్చు. కరోనా దెబ్బ కదా.. అది మూసి ఉంది. బయటకు వచ్చి షాపింగ్‌ ప్లాజాలోకి వెళ్లాం. గుర్తుగా ఓవస్తువో, టీషర్టో, నాసా గుర్తుండే కాఫీ కప్పో, బ్యాడ్జీనో కొనుక్కోవచ్చు. అక్కడో కప్పు, బ్యాటరీతో వెలిగే నాసా సెంటర్‌ గాజు బొమ్మ కొన్నాం. 4 గంటల టూర్‌ తర్వాత కారు వద్దకు చేరాం.

మానవుడే మహనీయుడు..

స్పేస్‌ సెంటర్‌ను చూసిన తర్వాత మానవుడే మహనీయుడని అనకుండా ఉండలేం. మనిషిలోని బోలెడన్ని లోపాల్ని, బలహీనతల్నీ క్షమించేస్తాం. అంతరిక్షాన్ని వదిలేసి ఉంటే ఈవేళ మనిషి ఎలా ఉండేవాడో.. డ్రైవర్‌ లేకుండా కారు నడిచేదా.. కన్నుమూసి తెరిచేలోగా కబుర్లు వచ్చేవా.. ఉపద్రవాల ముంపు సమాచారం ముందే వచ్చేదా..

ఇవన్నీ.. మనిషి నూతనావిష్కరణల్లో కొన్నే.. శాస్త్రీయ పురోగతి మన చుట్టున్న ప్రపంచంపై లోతైన అవగాహన ఇచ్చింది. అయినా ఇంకా ఎంతో మిగిలే ఉంది. జీవీ ఎక్కడ పుట్టడో, జీవితం ఎక్కడ ప్రారంభమైందో తేలలేదు. మనిషిని పోలిన మనిషి ఉన్నాడో లేడో.. గ్రహాంతరాలలో అన్వేషణ సాగుతూనే ఉంది. ఏమో.. ఏదో ఒకనాడు గుర్రం ఎగరావచ్చు.. ఈలోగా మీకెక్కడైనా స్పెస్‌ సెంటర్‌ కనిపిస్తే ఓ చుట్టేసి రండి.

’మనిషికి ఇది ఓ చిన్న అడుగే. మానవాళికి మాత్రం ఓ పెద్ద ముందడుగు’ (చంద్రుడిపై అడుగుపెట్టిన తర్వాత నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ మాట)

అమరయ్య ఆకుల


Next Story